Thursday, May 26, 2011

నువ్వు , నేను , సముద్రం ....







నువ్వు, నేనూ, సముద్రం,....మరి చంద్రుడో....?
"నాకు సముద్రమంటే చాల ఇష్టం...అస్సలు పిచ్చి అనుకో.." అతనన్నాడు ఎదురుగా నురుగులు కక్కుతోన్న నీలి సంద్రాన్ని చూస్తూ పరవశంగా
"ఆహా అలాగేం అయితే ఆ సముద్రంతోనే ఉండు నే పోతా "..అల్లరిగా ఆమె 
"అలా ఆ నీలి కెరటాల్లోంచి ఆ లోతుల్లోకి నడిచి వెళ్లి పోవాలనిపిస్తుంది  నిజం ..." 
"స్వామీ మీరు అలా వెళ్ళండి నేనిలా లోకంలోకి వెళ్తాను , నా చెయ్యి వదలండి నాకింకా బోలెడు పనులున్నాయి " నవ్వింది 
"ధీరూ...ప్లీజ్ అలా అనకు నువ్వు లేకుండానా నేనిక్కడ....?" అతని గొంతులో ఏదో జీర పలికింది
"మరేమీ చేయను తమరు నాతొ గడుపుతానని వెన్నెల్లో సముద్రం చూద్దామని వచ్చానన్నారు కానీ సముద్రం నాకంటే ఎక్కువ గా మిమ్మల్ని ఆకట్టుకుందిగా కాసేపు పరవసించండి మరి"
"అంటే ఇప్పుడు నువ్వు నన్నొదిలి వెళ్ళిపోతావా ?" జాలిగా అన్నాడు అతని చూపులు  మాత్రం సాగరాన్ని వదిలి రావడం లేదు. ఆ నీలి అనంతం లో తనూ ఓ కెరటమై పోవాలని ఆ సాగరంలో కలసి పోవాలని అప్పుడప్పుడూ తేలి వచ్చి తీరాన్ని  పలకరించి మళ్ళీ  వెనెక్కి వెళ్లి పోవాలని ఏవేవో ఆలోచనలు ఊహలు ఆశలు కమ్మేస్తున్నాయి అతన్ని.
"ఎక్కడికి పోతాను బాలూ ! నిన్నిలా వదిలి ఇక్కడే వదిలేస్తే అమ్మో ఏ గంగ పుత్రితోనో సెటిల్ అయిపోవూ" గంభీరంగా అనబోయిన ఆమె గొంతులో ఏదో చిలిపితనం దాగలేదు
గాలికి ఒక్కసారి ఆమె తెల్లని సిల్క్ చీర కొంగు అతని ముఖాన్ని కప్పేసింది 
"అయ్యో నీకు నీ సంద్రానికీ మధ్య నా కొంగు అడ్డం ఎందుకులే స్వామీ...." అంటూ కొంగు తీసుకో  బోయింది
"ధీరూ! ఇలా రా నా పక్కన కూర్చో " ఆమె చెయ్యి పట్టుకుని తన పక్కనే కూర్చోబెట్టుకున్నాడు 
ఆతను అడగకుండానే  ఆమె వడిలో తల  పెట్టుకునేలా కాళ్ళు చాచి తన వొళ్లోకి లాక్కుంది అతన్ని...
"మ్మ్! ఇప్పుడు చెప్పమ్మా ఏంటీ బాలు గారి బాధ ? " అతని జుట్టు సవరిస్తూ లాలనగా అడిగింది
నిశ్శబ్దం.............చాల సేపు............ఇద్ద్దరూ మౌనంగా సంద్రం కెరటాల చప్పుడు వింటూ తమ  గుండె లయలతో  ఐక్యం చేస్తూ అలా ........పున్నమి చంద్రుడు ...మౌనంగా వెలుగుతున్నాడు 
"ధీరూ!..." నెమ్మదిగా పిల్చాడతను.. ".."ఊ...ఏంటి " మంద్ర స్వరంలో పలికింది ఆమె
"దీన్నే మంటారు ప్రేమేనంటావా?"
"ఎందుకు కాదు?"
"ఇద్దరం కలిసి ఉండేది ఈ కాసేపే కదా?"
"అవును ఆ కాస్సేపూ మరో ఆలోచన దేనికి?"
"అదికాదు..."
"ష్....సముద్రం చూడు నీతో ఏదో చెప్తోంది..గుండె రిక్కించి విను ...అలల సందే శాన్నిస్తోంది .." ప్రేమగా అతని  నుదుటి పై ముద్దిచ్చింది ఆమె.
"ఉహు నాకు వినిపించడం లేదు ...నీ  హృదయ లయే వినిపిస్తోంది " తీయగా మత్తుగా అన్నాడు.
"బాలూ...విను ఏదో అంటోంది ...." అతని తల నిమురుతూ అంది
"నువ్వూ, నేనూ, సముద్రం .....ఇంకేమీ అక్కరలేదనిపిస్తోంది....ఎంత దివ్య క్షణాలివి ధీరూ...!!"
"మరి వెన్నెలో, చంద్రుడో పాపం ఆయన్ని వదిలేసావెం...?" నవ్వింది 
తటాలున అతని మీదకి వంగి   అతని తలని గుండెకు హత్తుకుంది బలంగా
వెన్నెల సాగరం సాక్షిగా ఇద్దరూ అల్లుకు పోయారు....
"అబ్బ ఈ క్షణాలు శాస్వ తమైపోతే..".పలవరించాడతాను 
"అవ్వవు కూడదు కూడా ..." నవ్వింది 
"ఏమి ఎందుకని మనం కలిసే ఉంటె ఎందుకు కావు....?"
"ఎందుకు కలిసే ఉంటాము ఎలాగ కలిసే ఉంటాము ....అయినా ఎప్పుడూ కలిసే ఎందుకుండాలి ?"
"అబ్బో చలం ఊర్వశిలా నాకు ప్రేమ తత్త్వం బోధిస్తావా  ఏంటీ?" నవ్వాడు 
"లేదులే ....అవేవీ సాధ్యం కావు ఉన్న కొన్ని క్షణాలు , జీవితంలో దొరికే అపురూపమైన క్షణాలను గుండె అల్మరః లో భద్రంగా దాచేసు కోవాలి నీ ఫోటోల్లా..... నువ్వు తీసే ఫోటోలు చూడు ఆ క్షణాన్ని బంధిస్తాయి నీ కెమెరాలో అలాగే జీవితంలో కొన్ని మధుర క్షణాలను కూడా మన ఆర్కైవ్స్ లో ఉంచుకోవాలి మనకి మాత్రమే అవి సొంతం...అప్పుడప్పుడు క్లిక్ చేసి చూసుకుని ఆ అనుభూతిని మళ్ళీ అనుభవించి ఉత్తెజితమవ్వడానికి ...." 
"చాల మాటాడేసాను  కానీ పద వెళ్దాం...."...లేచి నుంచుంది 
ఆమె నడుం చుట్టూ చేతులు వేసి దగ్గరగా హత్తుకున్నాడు.
ఆమె స్పర్శలో వేడి లేదు ఆవేశం లేదు చాలా శాంతంగా ఉంది ఆమె కౌగిలి.
"నువ్వు రామ్మనక  పొతే  నేను నిన్నూ మిస్ అయ్యేవాడిని ...."
"నేను రమ్మందీ  సముద్రం అంటే నీకిష్టం కదా అని "....నవ్వింది
"అందుకేగా తమరు వచ్చింది కుడా "
"కాదు ....ముందు వచ్చింది సముద్రం కోసమే కనీ ఇప్పుడొచ్చింది నీ కోసం"
"నా కోసం కూడా అను "
"కాదు..కాదు ..." ఏదో చెప్పబోయాడు 
"అయిన సముద్రం నాకు పోటీ అయింది నీకు దాని పైనే ధ్యాసంతా...."
నవ్వాడు .....
"నేనో మాట చెప్పనా....నువ్వూ సముద్రమూ రెండూ వేరుగా అనిపించలేదు నాకు....నా కోసం ఈ దివ్య క్షణాలు ఉంటాయని ఊహించనే లేదు 
"సాగరం నుండి అలల అందియలు , దీరు నుండి ఈ వలపు సవ్వడులు గుండె నిండా నింపుకున్నా .....థాంక్ యు ..!"
" కొన్ని మన చేతుల్లో ఉండవు , మన తార్కికతకి  అందవు అందుకే వాటిని అనుభూతించాలి తప్ప విశ్లేషణ చెయ్యకూడదు...."
"ఆహా అలాగా! పంతులమ్మగారు మంచి పాటాలే చెప్పారు ...ధన్యవాదములు " ఆమె బుగ్గ పై ముద్దు పెట్టుకున్నాడు 
"మరే ప్రేమ రుచి మర్చిపోయిన మీ లాంటి వాళ్ళకి అప్పుడప్పుడూ ఇలా రేఫ్రేషేర్  కోర్సు ఒకటి పెట్టాలి మరి....లేకపోతే
అన్నీ మర్చిపోయి శిలాజాలై పోతారు ".....గలగలా నవ్వింది 
తనలో కలవడానికి గోదారి వచ్చిందా అని సాగరుడు ఒక్కసారి ఉలిక్కిపడి చూసాడు..
ఇద్దరూ చేయి చేయిగా సాగర తీరం నుండి మళ్ళీ జీవన సాగరంలోకి నడిచారు. ఇద్దరి వదనాలపైన ప్రేమ వెన్నెల వెలుగు మరకలు నిండుగా వెలుగుతూ......
......................................ప్రేమతో....జగతి 12.35pm thursday 








జ్ఞాపకాల అలలతో మళ్ళీ జీవన సాగరంలోకి ..........




1 comment:

  1. మీ బ్లాగు ఇదే చూడటం! బాగా వ్రాస్తున్నారు!

    ReplyDelete