ఆతని మేధో గగనంలో
సృజనావేశపు మెరుపు మెరిసినపుడు
అతని కన్నుల్లో ప్రజ్వలించే
కాంతిని చూసి మైమరచి పోతాను
తన ముని వేళ్ళ స్పర్శతో
నన్ను పునీతురాలిని చేసే
ఆ మధుర క్షణం కోసం
నిలువెల్లా కనులై నిరీక్షిస్తాను
తన స్పర్శా మాత్రంతో నాలోనికి ప్రవహించే
ఉద్విగ్నతనూ, ఉత్తేజాన్నీ
అనుభూతిస్తూ......
అక్షయ భావ లహరి నౌతాను
అనుభూతులను, ఆవేదనలను
అక్షరీకరించడానికి ఆలవాలమౌతూ
ఆనంద మథన మౌతాను
అభిప్రాయాన్నో, అభిమతాన్నో, అభిశంసనో
సమాజానికి సందేశాన్నో
తాను వెలువరిస్తున్నపుడు
పదాల వెల్లువనై పరవశించి పోతాను
కాగితపు దేహాలను
సిరా పుష్పాలతో అలంకరించి
అలసి సొలసి
నా అక్షర బ్రహ్మ నిదురిస్తే
మరో జీవన సాఫల్య క్షణం కోసం
ఎదురు చూస్తూ ....
ఆతని గుండెల ఫై
సేద తీరుతాను
సంత్రుప్తనై !!!
....................ప్రేమతో...జగతి ("చినుకు"జన్మ దిన ప్రత్యేక సంచికలో ప్రచురితమైనది 2008 ఏప్రిల్ లో)
కలాన్ని నేను ఆ కవి చేతుల్లో .... |
ooooooooooooooooooooooooo...........no words for appreciation....every word is drenched in love and admiration....greattttttttt
ReplyDeleteఅక్షరాలని యానిమేట్ చేసి మళ్ళి అవెక్కడికీ పారిపోకుండా ఫ్రేమ్ కట్టేసి, పర్శనిఫికేషన్‌ని ఇంత బాగా తెలుగులో వాడటమంటే ఇదే.....లిటరేచర్ సిలబస్‌లో పెట్టాల్సిన కవిత......మీ వాసుదేవ్
ReplyDelete