Monday, December 2, 2013

అన్నీ మరణించాల్సిందే
ఆంగ్ల  మూలం : ఆల్ఫ్రెడ్ లార్డ్ టెన్నిసన్ 

తెలుగు సేత : జగద్ధాత్రి


అన్నీ మరణించాల్సిందే 

స్పష్టంగా నీలి నది సాగుతూ మొగుతోంది
నా కంటి కింద ;
వెచ్చగా , వెడల్పుగా దక్షిణ గాలులు వీస్తున్నాయి

అటు ఆకాశం లో
తెల్లని మబ్బులు ఒక దాని తర్వాత ఒకటి వరుసగా కదులుతున్నాయి ;
ఈ మే మాసపు ఉదయాన ప్రతి హృదయం ఆనందం తో స్పందిస్తోంది
పూర్తిగా ఆనందంతో ;
అయినా అన్నీ మరణించక తప్పదు.
సాగే వాగు ఆగిపోతుంది ;
తేలే మబ్బులు నిలిచిపోతాయి ;
హృదయ స్పందన ఆగిపోతుంది ;
ఎందుకంటే అన్నీ మరణించాల్సిందే ;
అన్నీ మరణించాలి
రాదిక వసంతం మరి రానే రాదు .

ఓ , అహమా !
మృత్యువు ద్వారం వద్ద వేచి ఉంది సుమా
చూడండి! మన మిత్రులందరూ పిలుస్తున్నారు
తాగి ఆనందంతో చిందులేసేందుకు .
మనల్ని పిలిచారు --- మనం వెళ్ళాలి తప్పక .
దిగువగా , బాగా కిందన
చీకటిలో మనం వాలాలి .
సంతోషపు కేరింతలన్నీ ఆగిపోయాయి
పికము కల కూజితం
ఇక వినబడనే బడదు ,
గాలీ కొండా కూడా నిశ్శబ్దమే ఇక.

ఓ ధు:ఖమా !
ఆలకించు ! మృత్యువు పిలుస్తోంది
నీతో మాటాడుతుంటే
నా దవడ జారిపోతోంది ,
ఎర్రని బుగ్గ పాలిపోతోంది
బలమైన ఎముకలు పడి పోతున్నాయి
వెచ్చని నెత్తురుతో మంచు కలసి పోతోంది
కను పాపలు నిలిచిపోతున్నాయి
తొమ్మిది సార్లు మోగుతోంది సాగే మృత్యు ఘంటిక ;
ఆనంద మనస్కులారా , ఇక వీడ్కోలంటూ .

పురాతన ధాత్రి
ఒకనాడు జన్మించింది
అందరికీ తెలిసినట్టుగానే ,
చాలా కాలం క్రితం
ఈ పురాతన ధరణి మరణించాల్సిందే .
కనుక వేడి గాలులను రేగనివ్వండి ,
నీలి కెరటాలను తీరం తాకనివ్వండి ;
ఎందుకంటే ప్రతి ఇరు సంధ్యలూ
ఇక నీవు చూడలేవు
శాశ్వతంగా.
అన్నీ జన్మించినవే
ఏవీ తిరిగి రావు మరల
ఎందుకంటే జన్మించినవన్నీతప్పక మరణించాల్సిందే

Monday, October 21, 2013

జగమంత కుటుంబం 2 వివేకానంద విషాదం my feature in CHINUKU MONTHLY october 2013


సాఫ్ట్ వేర్ ఇంజనీరుగా పని చేస్తున్న నా మేనల్లుడు  ఆదిత్య ఒక మాట అన్నాడు . నాకు ఎవరివైనా జీవిత చరిత్రలే చదవాలనిపిస్తుంది అత్తా , ఈ కల్పితాలు కాల్పనిక  రచనలు నేను చదవను . జీవిత చరిత్రలు చదవడం లో స్ఫూర్తిని పొందుతాము ఎన్నో విషయాలు  తెలుసుకుంటాము , పైగా అవి నిజంగా జీవించిన వారి గురించి కనుక ఆసక్తిని కలుగ చేస్తాయి అని . పాతికేళ్లు కూడా లేని పిల్లాడు , ఈ రోజుల్లోని అబ్బాయి ,అలా అనడం ఆశ్చర్యమనిపించింది నాకు . ఆలోచించి చూస్తే నిజమే కదా అనిపించింది . అలాంటి ఒక మనమెరిగిన మనిషి ,  లోకం ఎరుగని చరిత్ర  గురించి ఈ సారి కాసేపు మాటాడుకుందాం .
అవేక్ ! అరైస్ ! స్టాప్ నాట్ అంటిల్ ద గోల్ ఈస్ రీచ్డ్” మేలుకో! లే! గమ్యం చేరేవరకు ఆగకు ! ఈ సందేశం ఎవరిచ్చారో జగమంతా , ఈనాటికీ  మాటలు వింటే ఎంత ప్రభావితమౌతామో మీ అందరికీ చెప్పక్కర్లేదు . మనందరికీ తెలిసిన ఆ స్వామి వివేకానందుడు , అతి చిన్న వయసులోనే అంటే 39 వ ఏటనే ఎందుకు మరణించాడు ? ఆ చిన్న వయసులోనే దాదాపు 30 వ్యాధులకు పైగా గురై అన్నది ఆశ్చర్యంగా లేదూ. 
సన్యాసం శూన్యం నాదీ అనుకుంటూ అతి చిన్న వయసులోనే రామ కృష్ణుని శిష్యరికం చేసిన నరేంద్రుడు ఆ పై వివేకాభివృద్ధి చెంది వివేకానందుడై , కేవలం భారత దేశాన్నే కాక , విదేశాలలోనూ మన భారతీయ సంస్కృతిని చాటి చెప్పిన విశ్వ కుటుంబీకుడు వివేకానందుడు . వివేకానందుడి 150 జయంతోత్సవాలు జరుపుకుంటున్న ఈ తరుణం లో యోగిగా , నిష్టా గరిష్టునిగా , నిర్మలమైన దరహాసం తో మనకి దర్శన  మిచ్చే స్వామి, చేతులు కట్టుకుని విప్పారిత జ్ఞాన నేత్రాలతో చూస్తోన్న కాషాయం లో ఉన్న ఒక స్ఫూర్తిని పెంపొందించే మూర్తి మన కనుల ముందు కదలాడుతుంది వివేకానందుని తలచుకోగానే . కానీ మిత్రులారా దీపం  కింది చీకటిలా వివేకానందుడు అతి చిన్న జీవితం లోనే ఎన్నెన్ని అనుభవాలు , కష్టాల కావిళ్లెత్త వలసి వచ్చిందో తెలుసుకుంటే  గుండె  చెరువై పోతుంది . నిజం అతని అంతర్గత జీవనాన్ని , కేవలం , ఒక యోగి గా కాక ఒక మనిషిగా  అతని జీవనాన్ని పరిశీలించి రాసిన ఒక పుస్తకం చదవడం తటస్థించింది. ఆ పుస్తకం " ద మంక్ ఏస్ మేన్ , ద అన్నోన్ లైఫ్ ఆఫ్ స్వామి వివేకానంద" , ఈ పుస్తకం రచయిత "శంకర్ " మణి శంకర్ ముఖర్జి అనబడే  ఈ రచయిత బెంగాలీ లో చాలా విస్తృతంగా  చదవబడుతున్న నవలాకారుడు. ఇతను రాసిన నవలలు "సీమ బద్ధ ", "జన అరణ్య " ప్రపంచ ప్రఖ్యాత దర్శకుడు సత్యజిత్ రే వెండి తెర చిత్రాలుగా మలచాడు . 
నవలలే కాక వివేకానందుని పై శంకర్ పరిశోధనాత్మక రచనలు వ్యాసాలు చాలా పేరు తెచ్చాయి. అతి చిన్న వయసులో తండ్రిని పోగొట్టుకుని , బ్రిటిష్ పాలన లో గుమాస్తా ఉద్యోగం లో చేరాడు శంకర్. అతని హెడ్ మాస్టర్ అతనికి పదకొండవ సంవత్సరం లోనే వివేకానందుని సాహిత్యం పై మక్కువ కలిగించారు. నీవు సత్యమైనది  చదువు ఎప్పటికీ దారి తప్పవు అంటూ భరోసా ఇచ్చారు. ఇక అప్పటినుండీ మొదలైన సాహితీ సృజన , పరిశోధనాత్మక రచనా రెండూ ఇప్పటికీ అపలేదు శంకర్. ఈయన ఇప్పుడు కొల్కోత లో ఉంటున్నారు . ఇదంతా ఎందుకు చెప్పానంటే ఒక పుస్తకాన్ని ముఖ్యంగా చరిత్రని కానీ ఒక జీవితాన్ని గూర్చి గానీ రాసేవారిని బట్టీ ఆ పుస్తకం పట్ల ఆ వివరాల పట్ల మనకు గౌరవం నమ్మకం కలుగుతాయి కదా అందుకు. వివేకానందుని  జీవితం గురించి శంకర్ చాలా రాసినప్పటికీ ఇంకా అతను మరణించి 110  వత్సరాలు దాటుతున్నా ఇంకా అతని జీవితం లో చెప్పాల్సిన విషయాలు చాలా ఉన్నాయని భావించారు , అందుకే దాదాపు 200 పుస్తకాలకు పైగా వివేకానందుని గురించి వచ్చినవి కాక , తన పరిశోధనతో , వివేచనతో , జరిగిన  విషయాలను కూలంకషంగా పరిశీలించి రాసిన పుస్తకం ఇది . ఇందులో వివేకానందుడు మనకు దర్శన మిచ్చేది ఒక యోగి గా మాత్రమే కాదు ఒక మామూలు మానవునిగా ఎన్నెన్ని కష్టాలు బాధలు శారీరిక మానసిక ఆర్ధిక ఇబ్బందులను ఎదుర్కున్నాడో చదివితే హృది చెమరించక మానదు ఎవరికైనా . 
ఇంతగా కదిలించిన ఈ సత్యా లను మీతో పంచుకుందాం అన్నదే నా చిరు ప్రయత్నం.
తన కన్నా తన బిడ్డలు ముందరే వెళ్ళి పోవడం ఏ తల్లీ సహించలేని బాధ . వివేకానందుని తల్లి భువనేశ్వరి దేవి భరించింది . తన ముందరే ఒక కూతురు , ఇద్దరు కొడుకుల మరణాన్ని చూసి నిస్సహాయంగా జీవించింది . అంతకన్నా ఆశ్చర్యం ఆమె తల్లికి ఈమె ఒక్కతే కూతురు కావడం వలన ఈమెతోనే చివరి వరకూ ఉండి , భువనేశ్వరి దేవి మరణించిన రెండవ రోజు ఆమె మరణించడం విచిత్రం కానీ ఇది నిజంగా జరిగిన సత్యం .
"నా పుత్రుడు 24 ఏళ్లకే  సన్యాసం స్వీకరించాడు  " అని మెరుస్తున్న కనులతో ఆమె చెప్పిన వైనం ఇప్పటికీ చరిత్ర లో ఉంది . ఆమె తో వివేకానందునికి ఉన్న అనుబంధం జీవితాంతం వివేకానందుని  వేధిస్తూనే ఉంది . తన తల్లి కోసం ఏమీ చెయ్య లేక పోయాననే ఒక ఆవేదన ఎల్లప్పుడూ వివేకానందుడి మనసులో  ఉంది  .  తల్లికి పెద్ద కొడుకు కాదు వివేకానందుడు ఎందుకంటే ఆమెకు తొలి కాన్పు కొడుకు చిన్న వయసులోనే చని పోయాడు . నరేంద్రుడు అప్పటినుండీ ఇంటికి తానే పెద్ద కొడుకు గా అన్ని బాధ్యతలనూ స్వీకరించాడు . ఎంతో గొప్ప ఇంటిలో పుట్టిన వాడైనా , తండ్రిని చిన్న వయసులో కోల్పోవడం, ఆ పైనా తన సన్యాస స్వీకరణ , మిగిలిన తమ్ములు , అక్క  చెల్లెళ్ళు  అందరి బాధ్యత ల నుండి బయట పడటం చాలా కష్టమైన పని. అది కేవలం తల్లి ఆశీర్వాదం తోనే చెయ్యగలిగాను అన్న అతని భావన అతని మాతృ భక్తికి నిదర్శనం . 
వివేకానందుడు  సన్యాస జీవితానికి , కుటుంబ బాధ్యతలకి నడుమ ఉన్న నిరంతర సందిగ్దం , విడిచి పెట్టి సంపూర్ణంగా రామకృష్ణుని మఠానికి తన జీవితాన్ని అంకితం చేయడం లోనే స్వామి వివేకానందుని  గొప్పతనమంతా ఉంది. అయితే ఎంత యోగి అయినా సన్యాసి అయినా మానవుడు మానవుడే కదా , సహజమైన మాతృ ప్రేమ ను కాదన  గలిగే వాడు కాదు కదా . అందుకే వివేకానందుని తల్లితో అనుబంధం శంకరాచార్యుని తో పోల్చ బడింది . శంకరాచార్యులు అంతటి యోగి అయినప్పటికి అతని కి తల్లి పై ఉన్న ప్రేమ అపార మయినది . ఒక సన్యాసి పితృ కర్మ చేయకూడదని తెలిసినా తల్లికి మాటిచ్చినట్టు గా ఆమె మరణించిన తర్వాత ఆమె అంత్య క్రియలు చేసేడు శంకరుడు. కానీ వివేకానందుడికి ఆ అదృష్టమూ లేదు , అతని తల్లికి ఆ ప్రాప్తమూ లేదు . 
చాలా మందికి తెలియదు వివేకానందునికి తొమ్మిది మంది అన్నదమ్ములూ  అక్కచెల్లెళ్లూ ఉన్నారని . భువనేశ్వరి కి ఐదవ కానుపు లో  కలిగిన ఆడపిల్ల అరెళ్ళుకే చనిపోయింది. మరొక అమ్మాయి తన అత్తవారింటిలో ఉరేసుకుని తన పద్దెనిమిదవ  ఏట చనిపోయింది. మహేంద్రనాథ్ , భూపేంద్రనాథ్ వివేకానందుని తమ్ములు. చాలా మటుకు అతని జీవిత విశేషాలు  వారికి రాసిన ఉత్తరాల వలన లోకానికి తెలిసింది . వివేకానందుని జీవితం లో జరిగిన అతని అక్కల చెల్లెళ్ల మరణాలు ఎక్కడా అతని జీవిత చరిత్ర రాసిన వారు నమోదు చేయలేదు . 
స్వామి వివేకానందుని గా మన ఎంతో ఆరాధించే ఈ నరేంద్రుడు నిజానికి ఒక  ఆకతాయి అమ్మ కూచి. అమ్మమ్మ దగ్గరా, అమ్మ దగ్గరా ఎంతో గారంగా ఉండేవాడు. తండ్రిని హఠాత్తుగా పోగొట్టుకున్న వారి సంసారం ఒక్క సారి వీధిన పడింది. నెలకు వెయ్యి రూపాయల ఖర్చుతో ఇల్లు నడిపే తల్లి ముప్పై రూపాయలతో నడపడానికి ఎంతో శ్రమించేది . 
ఒకోసారి పొద్దున్న లేవగానే తినడానికి ఏమీ ఉండేది కాదు , అది గమనించి తల్లి బాధ పడుతుందని ఎవరో తనకు భోజనం చెప్పారని ఇంటినుండి బయటపడేవాడుట వివేకానందుడు. కటిక ఉపవాసాలూ , సరి అయిన భోజనం లేక అతి చిన్న వయసులోనే రోగ నిరోధక శక్తి ని కోల్పోయి ఎన్నో వ్యాధులకు గురయ్యింది అతని దేహం. అయినా మొక్కవోని పట్టుదల , తీవ్రమైన దీక్షా వ్రతుడు కావడం వలన తను సాధించవలసిన పనులన్నీ సాధించి ఆ పైనే మరణించాడు . పోయే ముందు కూడా అందరి అప్పులూ తీర్చి వేసానని , మఠం కోసం వచ్చిన  నిధులనుండి కనీసం ఒక పైసా కూడా తీసుకోకుండా , తన ప్రసంగాలవలన వచ్చిన సొమ్ముతో కొంత తమ్ముడిని  ఇంగ్లండ్ పంపి చదివించాడు. తల్లికి ఉండటానికి ఒక చిన్న ఇల్లు కొనివ్వగలిగాడు.  
తన తండ్రి బ్రతికున్న రోజుల్లో సంపాదన లో కొంత మొత్తం తన మేనమామ కిచ్చి తన భార్య భువనేశ్వరి దేవి పేర ఆస్తి కొనమంటే . ఆయన  కొన్న ఇల్లు , ఆస్తీ అన్నీ ఆయన పోయాక , మేన మామ పోయాక , మేనత్త  ఆ ఆస్తి ఇల్లు తనవేనని కోర్టులో దావా వెయ్యడం  ఆ వ్యాజ్యం ఎన్నో ఏళ్ళు సాగడం తో ఆర్ధికంగా ఎన్నో కష్టాలు పడ్డారు వివేకానందుని కుటుంబం. ఎన్ని పనుల్లో ఉన్నా ఎంత సతమత మై పోతున్నా , అనారోగ్యంగా  ఉన్నాఇటు మఠం పనులు అటు సంసార బాధ్యతనూ కావిడి కుండల్లా చివరి వరకూ మోస్తూనే ఉన్నాడు వివేకానందుడు. 
చివరికి భువనేశ్వరి దేవి ఇల్లు ఆమె అన్నయ్య తన బావగారిచ్చిన సొమ్ముతోనే కొన్నట్టు రుజువవడం తో తల్లికి ఇల్లు దక్కింది. ఇంత బాధా వీరిని పెట్టిన మేనత్త చివరి  రోజుల్లో మళ్ళీ వివేకానందుడి వద్దనే ఉంది . ఎటువంటి ద్వేషమూ లేని యోగి కనుక ఆమె యోగ క్షేమాన్ని కూడా చూశాడు వివేకానందుడు. 
వివేకానందుడి జీవితం లో కొన్ని సంఘటనలు మనల్ని కలచి వేస్తాయి. ఒక సారి తాను ఇంటికి వచ్చేటప్పటికి తల్లి అమ్మమ్మ భోజనం చేస్తున్నారట , వివేకానందుడికి తల్లి కంచం లోంచి తినాలనిపించిందట , తీరా చూస్తే ఆమె అప్పటికే భోజనం పూర్తి చేసిందట ఏదో ఒక ఆకు కూర కాడ ముక్క మిగిలి ఉంటే దానినే తిన్నాడట. అతనికి తల్లి పై ఉన్న మమకారం , సంసారం కోసం శ్రమిస్తూనే తనకు సన్యాసం స్వీకరించడానికి మనస్ఫూర్తిగా  అనుమతిచ్చిన తల్లి అంటే  హిమాలయమంత గౌరవం అతనికి. 
వివేకానందుడు చాలా బాగా వంట చేసేవాడట. ఈ విషయం మనకి సిస్టర్ నివేదితా ఉత్తరాలలో  లో తెలుస్తుంది నా కోసం స్వామి వంట చేసి పెట్టారని అది జన్మంతా మరవలేనిదని ఆమె కూడా రాసుకుంది. తన సహ మిత్రులైన సన్యాసులకోసం  కూడా వంట చేసేవారట స్వామి. మా బెంగాలీ వారం బహు భోజన ప్రియులమ్ అని హాస్యమాడేవారట . 
అందరికీ వండి పెట్టి తాను మాత్రం ఏమీ తినకుండా ఉండాల్సి వచ్చేదట అనారోగ్యం మూలాన , అయినా అందరికీ వండి పెట్టడం లో తాను చాలా ఆనంద పడేవారట . 
అమెరికా నుండి తిరిగి వచ్చాక వివేకానందుడికి ఆరోగ్యం పాడై వొంట్లోంచి వేడి ఆవిరులు వచ్చేసేవట . మంచం మీద పడుకోలేక . నేల మీద పడుకోలేక చాలా బాధ పడేవారట . ఎప్పుడూ తాను వేగం వెళ్ళి పోతానని బేలూరు మఠం పనులు చేస్తున్నప్పుడు తన మిత్రులతో చెప్పేవారట. ఆస్త్మా   వస్తే తట్టుకునే శక్తి దైహికంగా ఉండేది కాదట. అదేమీ చిత్రమో కలకత్తా చేరుతూనే ఆస్త్మా  ఉధృతం అయ్యేదట . 
1898 లో అమెరికా యాత్రలో ఒకసారి ఆయనకి గుండె పోటు వచ్చిందని మహేంద్ర నాథ్ రాసిన వాటిలో తెలుస్తుంది. భోజనం చేసి కూర్చున్న మనిషి ఒక్క మారుగా చాలా బాధకు గురయ్యారని ఆ తర్వాత సర్దుకున్నారు అని రాస్తాడు అయన. అయినా ఆయనలోని ఆ హాస్య స్పోరకత , పట్టుదల ఏమీ తక్కువ కాలేదు. ఎన్నో యాత్రలు చేసేరు వివేకానందుడు , చివరి సారిగా తల్లిని తీసుకుని గయా యాత్ర కూడా చేశారు. కానీ అనారోగ్యం అతన్ని ఒక్క రోజు కూడా కుదురుగా ఉండనివ్వలేదు . 
విపరీతమైన తల నొప్పి ,(మైగ్రేన్)టాన్సిలిటీస్ ,డిఫ్తీరియా / ఫ్లూ /దగ్గు , ఆస్త్మా, మలేరియా , టైఫాయిడ్ ,  ఏవో రకాల విష జ్వరాలు , కాలేయ వ్యాధి అజీర్తి , గేస్ట్రో ఎంట్రీటిస్ పొట్టలో నీరు చేరడం ,డిసెంట్రీ , డయేరియా  ఆకలి లేక పోవడం పొత్తి  కడుపు నొప్పి, గాల్ బ్లాడర్ స్టొన్స్ ,లుంబాగో (నడుము చివర నొప్పి ) మెడ నొప్పి  బ్రైట్స్ డీసీస్  కిడ్నీవ్యాధులు  డ్రాప్సీ ,అల్బుమినూరియా , రక్తంచిందే కనులు  , కుడి కన్ను దృష్టిని కోల్పోవడం , నిదుర లేమి  ,తల గెడ్డం చిన్న వయసులోనే నెరిసి పోవడం , న్యూరెస్తెనియ,  భోజనం కాగానే వొళ్ళు వేడెక్కి పోవడం  వేడి తట్టుకోలేక పోవడం  ఎక్కువగా అలసట  సముద్ర ప్రయాణం లో బాధ సన్ స్ట్రోక్  డయబెటిస్  గుండె సంబంధించిన వ్యాధులు  ఇన్ని వ్యాధులతో బాధ పడేవారని వైద్యులు ఒక పట్టిక తయారు చేసేరు . 
ఎవరైనా  తనని ప్రసంగానికి పిలిస్తే దయచేసి రైలులో రెండవ తరగతి టిక్కెట్ కొనమని బతిమిలాడుకునేవారట . ఎందుకంటే ఆ రోజుల్లో థర్డ్ క్లాస్ లో బాత్రూమ్స్ ఉండేవి కావుట . 
తన ఉత్తరాల్లో ఎవరికైనా రాసేటప్పుడు ఈ విషయాలను తన ఆరోగ్యాన్ని ప్రస్తావించేవారట వివేకానందుడు. ఇన్ని వ్యాధులు బాధలు ఉన్నా  దైహికంగా,చెదరని సడలని  మనో నిబ్బరం అతన్ని ఎప్పుడూ నిర్మల హాసితునిగానే  ఉంచేవి . చిన్న చిన్న బాధలకే చతికిలబడి పోయే మనం ఇది చూసి ఎంత నేర్చుకోవాలి. ఆత్మ శక్తి ముందు ఏదీ నిలవలేదని నిరూపించిన నిరుపమాన మూర్తి వివేకానందుడు. అసలు అతన్ని సంసార బాధ్యతలుండగా నీకు సన్యాస మెందుకు  నీ కుటుంబానికి నీ అవసరం ఉంది అని చెప్పారట రామ కృష్ణుల వారు అయినా వివేకానందుడు సన్యాసం వైపే మొగ్గు చూపి స్వీకరించాడు. ఒక సారి ఒక ఆయుర్వేద వైద్యుని సలహా తో 21 రోజులు మంచినీరు తాగకుండా ఉన్నారట . అంతటి పట్టుదల ఆయనది. అతనికి వైద్యం చేసిన డాక్టర్ల వలన ఆయన విషయాలు కొన్ని ఆయన పోయాక గానీ తెలియలేదు. ఇంత బాధ లోనూ న్యూ యార్క్ లో ఉన్న మేరీ హేల్ అనే ఆమెకి జూన్ 23 వ తేదీన "మీ ఉత్తరం అరిగించుకోలేక పోయాను అజీర్తి బాధితుడ్ని కదా " అంటూ హస్యంగా రాశారట. నిరంతరం రాస్తూనే ఉండే ఆయనకి చివరి దశ లో పెన్ను పట్టుకోవడమే కష్టమై పోయింది. పైగా కను దృష్టి కూడా పోయింది. 
ఆ రోజు అంటే జూలై 4 ,1902  ఆ మహాభి నిష్క్రమణ దినం నాటికి ముప్పై తొమ్మిదేళ్ల , ఐదు నెలల, ఇరవై నాలుగు రోజులు అతని వయసు. ఆరోజు పొద్దుటినుండీ ఏమి జరిగిందో వివరంగా ఇచ్చారు ఈ పుస్తకం లో. దాదాపు 9 -9.30 ప్రాంతం లో రాత్రి బరువుగా ఊపిరి వస్తుంటే డాక్టర్ ని పిలుచుకొచ్చారు . ఆ రాత్రి 10.30 ఆ ప్రాంతం లో వివేకానందుడు ఈ పాంచ భౌతిక  దేహాన్ని వదిలి వెళ్లిపోయాడు. ఈ వార్త అతని తల్లికి ఆమె చిన్న కొడుకు చెప్పగానే ఆమె ఎలా పోయాడు అని అడిగిందట . అచ్చం నాన్న గారి  లాగే సాయంకాలం గుండె నొప్పి వచ్చింది  వెంటనే పోయారు అని చెప్పాడట. కొడుకు దేహాన్ని చూస్తూ ఏడుస్తున్న తల్లిని తిరిగి పంపి వేసాము కాసేపు ఉన్నాక అని సిస్టర్ నివేదితా తన జీవిత చరిత్ర లో రాసుకున్నారు. సన్యాస ఆశ్రమ ప్రకారమే అతనికి అంత్య క్రియలు చేసేరు. 
అతని సమాధి వద్ద ఒక చిన్న గుడి కూడా 1907 జనవరి వరకు నిర్మించలేదట.ఆ పని 1924 జనవరి 24 న పూర్తి చేశారట . అలాగే అతని డెత్ సెర్టిఫికేట్ కూడా ఎవ్వరూ చూడలేదట ఇప్పటివరకు  
ఇందరి హృదయాలను మన్ననలను చూరగొన్న స్వామి వివేకానందుని జీవితం అలా ముగిసి పోయింది . రామ కృష్ణ మఠం వారు కనుక  ప్రచురించక పోతే ఆయన రాసినవన్నీ పోయేవి అంటారు శంకర్. 
ఈ పుస్తకం లో మొదటి  చాప్టర్ ఏ మంక్ అండ్ హిస్ మదర్, రెండవది ,ఎంపేరర్, మంక్ , అండ్ కుక్ ఇన్ వన్ , మూడవది ద మంక్ హూ లవ్డ్ టీ, నాల్గవది , స్వామీజీస్ హెల్త్ , అయిదవది ఆఖరిది థర్టీ నైన్ ఈయర్స్ ,ఫైవ్ మంత్స్ , అండ్ ట్వెంటీ ఫోర్ డేస్ గా రాసేరు. 
ఇంతకీ ఈ విషయాలు మనం ఇక్కడ ఎందుకు చెప్పుకున్నాం అని ప్రశ్నిస్తారు మీరు . ఎందుకంటే అతి పిన్న వయసులోనే ఎన్నో బాధలకు అన్నీ రకాలుగా గుయినా కూడా మొక్కవోని  సంకల్ప బలం తో బేలూరు మఠాన్ని తన చేతుల మీదుగా కట్టిన మహనీయుడు , రామకృష్ణుని ప్రియ శిష్యుడు వివేకానందుడు. అందుకే నాకనిపిస్తుంది ఎప్పుడూ గురువులను వెదుక్కుంటూ శిష్యులు వెళ్లక్కర్లేదు ఆ గురువే శిష్యుని అన్వేషిస్తూ వస్తాడు. అలా తన జీవితం లోకి వచ్చిన తనని ప్రభావితం చేసిన రామకృష్ణుని బోధలు మఠం ఏవీ వివేకానందుడు లేకుంటే ఉండేవి కావు . 
మనమందరం గుర్తు పెట్టుకునే స్వామి వివేకానందుడి ఫోటో కూడా తీసేటప్పుడు తాను అనారోగ్యంగానే  ఉన్నాడు . కాస్త ఒళ్ళు కూడా ఉబ్బరంగానే ఉంది . అతనిది అంతా తల్లి పోలిక ఆ విశాలమైన కనులు తల్లి నుండి వచ్చాయి అతనికి.  ఎందరో  రాసిన పుస్తకాలు అతనితో సాక్షాత్తూ జీవితం గడిపిన వ్యక్తుల కధనాలు అన్నీ పరశీలించి , పరిశోధించి శంకర్ ఒక మంచి పుస్తకాన్ని రాసేరు అనడం లేదు నేను. వివేకానందుడి బతుకు పుస్తకాన్ని తెరిచి మనకి అతని పట్టుదల , అప్రమేయమైన , అవ్యాజ్యమైన అతని అనురాగాన్ని మనకు అందించారు . ఇవన్నీ తెలియని ఎందరో వివేకానందుని ఎంతో ఆరోగ్య వంతుడనుకుంటారు . అయితే ఈ విషయాలు తెలుసుకున్నాక స్వామి వివేకానందుడి పట్ల మనకి మరింత ప్రేమ  పెరుగుతుంది , ఎంతటి శ్రమ కోర్చి లోకం కోసం తన జ్ఞానాన్ని పంచి ఇచ్చాడు అని ఒక భక్తి భావన కలుగుఃతుంది . దైవం మానుష రూపేణ అని ఏ దైవమో  ఇలా ఈ జన్మ  లో ఉన్న అతి కొద్ది యేళ్లలో సముద్రమంతటి జ్ఞానాన్ని మనందరికీ పంచి ఇచ్చాడు అనిపిస్తుంది. ఈ పుస్తకం చదువుతున్నంత సేపూ తెలియకుండానే కనులు చెమరించుతూనే ఉన్నాయి . 
ఈ పుస్తకం దొరికితే చదవగలిగితే చదవండి మిత్రులారా , నాకు ఉన్న ఈ కొద్ది పరిమితి లో నా జ్ఞాన పరిమితిలో మీతో ఈ విషయాలను పంచుకున్నాను . ఒక పాటగుర్తొస్తోంది బహుశా తాతమ్మ కల సినిమాలో భానుమతి పాటనుకుంటా ,"ఎవరనుకున్నారు ఎవరు కల గన్నారు, ఎవరెంుకు పుడతారో , ఏ పని సాధిస్తారో ?  ఏడవ కొడుకుగ గాంధీ పుడతాడనుకున్నారా పుట్టి స్వరాజ్యాన్ని తెచ్చి పెడతారనుకున్నారా ?" నిజమే కదూ స్వామి వివేకానందుని లాంటి  వారు కారణ జన్ములు.  వారు చేయాల్సిన కార్యం పూర్తవగానే వారు వెడలిపోతారు శంకరాచార్యులు , క్రీస్తు ఎవరు చూశారు నలభై. నేను నలభై చూడను అనేవారట వివేకానందుడు ఆ యనకి తెలిసి పోయిందేమో  తన ఆయు ప్రమాణము అని కూడా అనిపిస్తుంది. వివేకానందుని ప్రేక్టికల్ వేదాంత ఇప్పటికీ ఎప్పటికీ ప్రపంచమంతటికీ శిరోధార్యం కాదా ! 
జగమంత కుటుంబం కాదు జగమే కుటుంబం తనకి , సన్యాసం శూన్యం కాదు సన్యసించినా జ్ఞానామృతాన్ని మనకి పంచి ఇచ్చిన ఆ మహనీయునికి ఇదే వందనం !!!
.........................................................................జగద్ధాత్రి 

Wednesday, October 9, 2013

అపరిచిత చెలిమిఉండుండీ ఎందుకో హఠాత్తుగా
మనసు  మూగ బోతుంది
నీ మనసును అర్ధం చేసుకోవడం లో
మునిగిపోతుంది ...
నా అంచనాలకు దొరక్కుండా
ఒక అద్భుత హఠాత్ పరిణామం లా
ఆవిష్కరింపబడాలని నీ ఆలోచన
అందుకే మన మధ్య
ఉల్లి పొర లాంటి  యవనిక వేస్తావు
చిరునవ్వుతోనో , లేక చిరు కోపం తోనో ...
అప్పుడే నీ హృదయ భావం అంది
నేను భావోద్విగ్నతతో కదిలి పోతాను
అబద్ధమాడకుండా , నిజం చెప్పకుండా నీవు
నిజం అర్ధమైన అయోమయం లో నేను
ఎక్కడో చెలిమి శిఖరాగ్రం వద్ద
ఇద్దరు అపరిచితుల్లా కలుసుకుంటాము
దాచలేని మమతతో నేను
మమత దాచే యత్నం లో నీవు
ఎప్పుడూ ఇలా ,విడి, కలిసి , విడి ,కలిసిపోతుంటాం
విడి విడిగా ఏకమై
ఏకం లో మమేకమై ఎప్పటికీ ....!!!
.............................................................జగద్ధాత్రి 09/10/2013 1.11పి.ఏం బుధవారంThursday, October 3, 2013

ద లాస్ట్ గేమ్ (ఒడిపోయిన ఆట ) published in Chithra monthly October 2013


" హలో " ఇండియా నుండి బాచి ఫోన్ 
" హలో బాచీ , ఏంటి ఇంత పొద్దున్నే కాల్ " నవ్వుతూ పలకరించబోయా . మాకిక్కడ పొద్దున్న గానీ వాళ్ళకి సాయంత్రం కదా మరిచిపోయాను. 
" హలో ... హరీ ... " బాచీ ఏదో కంగారుగా ఉన్నాడు అని తెలుస్తోంది . ఒక్క సారి గుండె జారి పోయింది నాకు. అమ్మ కేమైనా అయిందా ఓహ్ నో 
" బాచీ ... ఏంట్రా చెప్పు " 
" హరీ ఒక గంటైంది అమ్మకి , అమ్మకి ఇక్కడ బాంబ్ బ్లాస్ట్ లో బాగా దెబ్బలు తగిలాయి ..." చెప్పలేక పోతున్నాడు వాడు 
మ్రాన్పడి పోయాను . బాంబ్ బ్లాస్టా ? అందులో అమ్మ చిక్కుకోవడం ఏమిటి ? ఏమిటో మెదడు మొద్దు బారి పోయింది . 

" అమ్మ ఈరోజు భీష్మ ఏకాదశి కదా , పైగా గురువారం అందుకని , అమ్మ బాబా గుడి కి వెళ్ళింది. దారిలో నడుస్తోంటే సరిగా మన ఇంటికి ఒక కిలోమీటర్ దూరం లో బాంబ్ బ్లాస్ట్ అయింది ...రెండు పేలుళ్ళు ఒకేసారి , దాంతో చాలా మంది ...." 
" అమ్మకి ....ఎలా ఉంది ..." 
" దెబ్బలు తగిలాయి , నాకు తెలిసి అక్కడికి చేరుకున్నా , ఒక్క పావుగంటలో , అమ్మని అప్పటికే పోలీసులు హా్స్పిటల్ ఆంబులెనస్ ఎక్కిస్తున్నారు. నేను వెంటనే ఇక్కడ కార్పొరేట్ హాస్పిటల్ కి తీసుకొచ్చి జాయిన్ చేసాను. " ఊపిరి తీసుకుందికి అన్నట్టు పాపం ఆగాడు భాస్కర్ . 
" ఎక్కడ ఎలా ... దెబ్బలు ..."
ఇంతలో అక్కడికి శ్రీ వచ్చింది కంగారుగా " హరీ...హైదరాబాద్ లో..." ఏదో చెప్పబోయి న ముఖం చూసి ఆగిపోయింది 
ఇక మాటాడలేక ఫోన్ ఆమెకే ఇచ్చాను .
స్పీకర్ ఆన్ చేసింది శ్రీ.
అవతలినుండి భాస్కర్ గొంతు వినబడుతోంది .
" వదినా... అమ్మకి తలకి బాంబ్ లో ఉన్న స్ప్లింటర్స్ గుచ్చుకుని దెబ్బలు తగిలాయి. కుడి చెయ్యికి బాగా దెబ్బ తగిలింది . ఇప్పుడే ఆపరేషన్ థియేటర్ లోకి తీసుకెళ్ళారు. స్పృహ లేదు. సుజి , నేను ఇక్కడే ఉన్నాం. హరి ని కంగారు పడొద్దని చెప్పు .. కాసేపయ్యాక మళ్ళీ కాల్ చేస్తా..." ఇక మాటాడలేనట్లున్నాడు ప్హో్న్్ కట్ అయింది.
శ్రీ ఫోన్ పట్టుకుని అలాగే కూర్చుండి పోయింది. 
ఒక పది నిమిషాలు భయంకరమైన నిశ్శబ్దం గా గడిచాయి. 

నెమ్మదిగా లేచి నా దగ్గరికి వచ్చింది శ్రీ, నా తల మీద చెయ్యి వేసి అంది " హరీ.. ప్లీస్ , కంట్రోల్ ..." అంది. నాకు తెలియకుండా కన్నీళ్ళు కారిపోతున్నాయని శ్రీ నా కళ్ళు తుడుస్తోంటే తెలిసింది. ఇద్దరం మౌనంగా కూర్చున్నాము. 
ఆలోచనలు పరిపరివిధాలా పోయాయి. అమ్మ అమ్మా ... ఎంత చెప్పినా హైదరాబాద్ ని ఆ ఇంటిని వదిలి రాదు కదా. ఏమన్న అంటే అది నేను ఎంతో ఇష్తపడి కట్టించుకున్నా రా అంటుంది. ఆ ఇంటి పై అంత మమకారం ఏంటో తనకి. పైగా నాన్న పోయినా ఆ ఇల్లు వదిలి రాలేదు. ఒంటరిగా ఉంటావా వద్దు అని ఎంత చెప్పినా వినలేదు. 

అమ్మ సహజంగా ఎప్పుడైనా ఒక నిర్ణయం తీసుకుంటే ముందరే ఆలోచించి తీసుకుంటుంది. ఇక మనమేమీ మార్చ లేము. మీ అమ్మ ఒక్క సారి చెప్పితే వందసార్లు చెప్పినట్లే రా అని నాన్న కూడా నవ్వేవారు. 
అమ్మ దంతా ఒక పద్దతి . పొద్దున్న వాకింగ్ , యోగా, ధ్యానం , పూజ అన్నీ పద్దతిగా చేసుకుంటుంది. దగ్గరలో నే ఉన్న షిరిడీ బాబా గుడికొక్కటే వెళుతుంది. ఇంకే గుళ్లకీ గోపురాలకీ తిరగదు. అక్కడికే వెళ్లడానికి కూడా రెండు కారణాలున్నాయ్ ఒకటి బాబా అంటే అమ్మకి ఇష్టం , రెండు ఆ కోవెలకి తన చిన్న నాటి మితృరాలు జానకి వస్తుందని. చిన్న నాటి స్నేహితులిద్దరికీ ప్రతి గురువారం పండుగే . తనివి తీరా కబుర్లు చెప్పుకుంటారిద్దరూ .జానకి అత్తకి ఎవరూ లేరు. తనూ అమ్మ లాగే ఒంటరి. అందుకే అమ్మ ప్రతి గురువారం ఆ గుడి కి వెళ్ళి తీరుతుంది. నేను శ్రీ తనని అమెరికా రమ్మన్నప్పుడు కూడా అదే అంది. నిజమే అక్కడ అమ్మకి జానకి అత్త లాంటి స్నేహితురాలుంది. ఇక్కడికొస్తే ఏముంది? ఎవరూ మాటాడరు . శ్రీ లాగే అమ్మ కూడా ఒంటరి అయిపోతుంది.

" లేదు లేరా నేను హైదరాబాద్ ని వదిలి ఉండలేను ..." మృదువుగా తిరస్కరిస్తోంటే నేను ఉక్రోషంగా అన్నాను 
" అదేమీ కాదులే నీకు జానకి అత్త మీద ఉన్నంత ప్రేమ మా పైన కొంచం కూడా లేదు , అందుకే రానంటున్నావు 
" నిజమేరా, అడవి లాంటి ఈ నగరం లో జానకే లేక పోతే నేను మీ నాన్న పోయాక అస్సలు బతక లేక పోయేదాన్ని... నువ్వు ఇలా పోల్చి మాటాడితే నేనేమీ చెప్పలేను గానీ జానకి నాకు ప్రాణం రా ..." నిష్కల్మషంగా అమ్మ చెప్పిన మాటలు వింటూ ఇక శ్రీ , నేను ఏమీ అన లేక పోయాను. 

గత నాలుగేళ్ళుగా ఇదే దిన చర్య అమ్మకి. గురువారం కదా అందుకే అమ్మ గుడికి వెళ్ళింది. ఓహ్ గాడ్ !
అమెరికాలో ఉండి దాదాపు ఇరవైయ్యేళ్ళుగా, మంచి ఇల్లు కట్టుకున్నా, ఉహు అమ్మ కి ఇవేమీ పట్టదుఅనిపిస్తుంది. రెండు నెల్లల క్రితమే తను శ్రీ హైద్రాబాద్ వెళ్ళేరు. అప్పుడు కూడా అమ్మ అదే అంది రమ్మంటే. 
" ఏంటి అత్తమ్మా. పోనీ మన ఇల్లు చూడటానికైనా రావచ్చు కదా , మాకూ ఉంటుంది కదా మీరు చూడాలని, గత ఏడాది అమ్మ నాన్న, వచ్చి వెళ్ళేరు . మీరే ఎప్పుడూ రాననేస్తారు .." శ్రీ కాస్త నిష్టూరంగానే అంది .
" లేదమ్మా , శ్రీ అలా అనుకోవద్దు , మీ ఇల్లు అన్నీ కామ్ లో చూసాను గా. ఎందుకో ఈ రొటీన్ డిస్టర్బ్ చేసుకుని ఉండలేను రా ప్లీస్ ట్రై టూ అండర్స్టాండ్ మా .." అమ్మ మాటలోని అనునయం ఎంత గొప్పగా ఉంటుందంటే ఎవరం ఏమీ చెప్పలేము తిరిగి. 
.....................................

ఒక రెండు గంటలు గడిచాయి. మళ్ళీ ఫోన్ భాస్కర్ నుండి. మా అదృష్టం కొద్దీ నా మేనమామ కూతురు సుజన , తన భర్త భాస్కర్ , తను నాకూ మితృడే కావడం అమ్మని వాళ్ళు ఏదన్న కావాలంటే చూసుకుంటారు. ఐనా అమ్మ ఎపుడూ ఏదీ అడగదు. తన పనులన్నీ తనే చేసుకుంటుంది. 
నేను ఫోన్ తియ్యకపోవడం ఏదొ ఆలోచనలో ఉన్నట్తు చూసిందేమొ శ్రీ వచ్చి ఫోన్ తీసింది. 
మాటలు వినిపిస్తున్నాయి నాకు .
" హలో ...బాచీ .. ఓహ్ సుజీ నువ్వా , ఎలా ఉందిరా అత్తయ్యకు ?" 
" అక్కా, కంగారు పడద్దు ప్రాణానికి ప్రమాదం లేదు అని చెప్పారు డాక్టర్లు.... కానీ ..." నా గుండెల్లో రైళ్ళు పరిగెడుతున్నాయి 
" మరి .. ఏమిటి సుజీ ప్లీస్ చెప్పు ఇక్కడ మీ బావకీ నాకు కంగారుగా ఉంది "
" అది మరీ... కుడి చెయ్యి బాగా దెబ్బ తిన్నది అక్కా అందుకని ...." అవతల ఏడుస్తోంది సుజీ
" సుజీ ఇదిగో మీ బావకిస్తున్నా ...." అనేసి ఫోన్ నా చేతిలో పెట్టేసి వెళ్ళి సోఫాలో కూర్చుండిపోయింది శ్రీ తనకసలే విపరీతమైన బి.పి. దాంతో ఇలాంటి వేవైనా విన లేదు తట్టుకోలేదు. 
" సుజీ..." నా గొంతు నాకే వినబడలేదు 
" బావా..." ఏడుస్తోంది సుజీ 
" చెప్పు సుజీ ... " ఏదన్నా వినాల్సిందే తప్పదుగా 
" బావా అత్తయ్యకి కుడిచెయ్యి మోచెయ్యి వరకు బాగా దెబ్బ తింది అందుకు అంతవరకు ....ఆంప్యూటేట్ ..." 
" ఓహ్ ! అవునా ... భగవంతుడా !! ఏమి దారుణం ఇది ..."
" తప్పదు బావా .. భాస్కర్ అగ్రీమెంట్ మీద...సైన్ చేస్తున్నాడు ... ఆపరేషన్ థియేటర్ దగ్గరే ఉన్నాడు. ."
కాసేపు నిశ్శబ్దం ఇద్దరి మధ్యా 
" సరే సుజీ , ప్రాణానికి ఏమీ పర్వాలేదన్నారు కదా ..." గొంతు పూడుకుపోతోంది నాకు 
" లేదు బావా కాసేపట్లో అపరేషన్ చేస్తారు .. భాస్కర్ మాటాడుతాడు ..." 
" నేను రాలేని పరిస్థితీ , శ్రీ వస్తానంటొంది పంపనా సుజీ..."
" వద్దు బావా మీరు వెళ్ళి రెండు నెలలేగా అయింది. నాకు తెలియదా మీకు సెలవు దొరకదు. అక్కకి అసలే బాలేదు వద్దు బావా , మేమున్నాం గా చూసుకుంటాము." 
మనసంతా సుజీ పట్ల కృత్జ్న్యతతో నిండి పోయింది.
...................................................

పది రోజులయ్యింది. ఒక గోకుల్ చాట్ , లుంబినీ పార్క్ , ఇప్పుడు దిల్ సుఖ్ నగర్ అసలీ నగరాల్లో ఈ భయమేంటో. సామాన్యులను అమాయకులను చంపే ఈ మారణ కాండ ఎప్పటికి ఆగుతుందో. ఆలోచనల్లో మునిగి పోయి ఉన్న నాకు ఫోన్ రింగ్ ఎక్కడో దూరం నుండి వినిపించినట్టయింది. 
ఫోన్ తీసా ఓహ్ అమ్మ 
" అమ్మా ...." 
" హలో హరీ....." అమ్మ గొంతు చాలా నీరసంగా 
" అమ్మా ఎలా ఉన్నావమ్మా ?" 
" బాగానే ఉన్నాను నాన్నా, నువ్వూ , శ్రీ ఎలా ఉన్నారు ? , బాబు బాగున్నాడా?" అదే ఆత్మీయమైన పలకరింపు అమ్మ.
" మేము సరే నువ్వెలా ఉన్నావమ్మా ..." 
ఇంతలో శ్రీ వచ్చి కూర్చుంది నా పక్కన . స్పీకర్ ఆన్ చేసా. 
" నాకేమి బగానె ఉన్నాను నాన్నా..." 
" అత్తయ్యా.... ఎలా ఉన్నారు ?" పలకరించింది శ్రీ
" బాగున్నానురా తల్లీ...."
" నాన్నా హరీ ... ఎందుకురా మౌనంగా ఉన్నావు ...మాటాడు ..." 
ఏమి మాటాడను . ఒకోసారి నా మీద నాకే చికాకు పుడుతుంది. ఛ ... అమ్మకి అంత ప్రమాదం జరిగితే మంచి హాస్పిటలూ ఖరీదైన మందులూ ఇవ్వగలను గానీ వెళ్ళి కళ్ళారా చూసుకునే ప్రాప్తం లేదు కదా. 

" హరీ ... ఏంట్రా మాటాడవ్ ... నాకు ఇప్పుడు బాగానే ఉంది , నిజంగా సుజీ బాచి ఎంత బాగా చూసుకుంటున్నారో రా, జానకత్త ఐతే ఈ పది ్రోజులనుండి నా దగ్గరే హాస్పిటల్ లోనే ఉంది . నాకేమీ పర్వాలేదు నాన్నా...." అంత ప్రమాదం జరిగి చెయ్యి పోగొట్టుకుని నన్ను ఓదారుస్తోంది అమ్మ .
" అమ్మా మరి ....."
" నాకు తెలుసు రా నీ భయమేంటో ... నా చెయ్యి గురించే కదా....ఏమి చెయ్యమంటావ్ రా బాబా కి న చెయ్యి కావాలనిపించినట్టుంది ..." నవ్వడానికి ప్రయత్నించింది అమ్మ 
" అమ్మా..." నాకు ఏడుపు ఆగటం లేదు . అమ్మ ముందు నాలుగున్నర పదుల వయసు ఏమీ కాదు కదూ అనిపించింది . 
" అమ్మా . ఇప్పటికైనా మ దగ్గరికి వచ్చెయ్ ..."
" వద్దు నాన్నా... అలా బాధపడకు. భగవంతుడు నా చెయ్యి తీసుకెళ్ళిపోతే నేను దణ్ణం పెట్తుకోలేను అనుకుంటున్నాడు. ్నాకు కేవలం చెయ్యి మాత్రమే పోయింది. కానీ అక్కడ ఎందరో కళ్ళెదురుగా అమాయకులు బలై పోతూ ఉంటే నా మనసు ఎంత కొట్టుకులాడిందో ... నాన్నా... ఒక అబ్బాయిని లేవ దీద్దామని వెళ్ళాను ఇంతలో మళ్ళీ ఇంకో పేలుడు. ఏంటి నాన్నా ఈ దారుణం ... " ఆయాసంగా అనిపించినట్టుంది అమ్మ మాటలాపింది . 
" అమ్మా...ఏమి దేముడమ్మా , ఈ పూజలూ వ్రతాలూ గుళ్ళూ గోపురాలు ఎంత దైవ సేవ చేసే నీకు ఏంటమ్మా ఇది ...."
" తప్పు నాన్నా... దైవాన్ని ఎందుకు నిందిస్తావ్. దేముడు అనేది ఒక భావన, మతం అనేది మనకి మనశ్శాంతి నిచ్చే మార్గం. అది ఉన్మాదమై పోతే మనమేం చెయ్యగలం. "

" అమ్మా... నేను వచ్చే నెల ఢిల్లీ వస్తున్నాను వచ్హ్చెయ్ అమ్మా ్నాతో . టికట్ బుక్ చేస్తాను ..." నా మాట పూర్తి కాక ముందే అంది అమ్మ 
" వద్దు నాన్నా, ఇక్కడ నాకేమీ పర్వాలేదు. పిచ్చి వాళ్ళు మనసుల్లో భయం పెడితే, ఉగ్రవాదం తో ఉన్మాదం సృష్టిస్తే మనం దైవాన్ని వదిలేస్తామా? నమస్కారం పెట్టుకొవడానికి ఒక చెయ్యి లేదేమొ కానీ , ధైర్యంగా ఇక్కడే బతికే మనసుంది రా నాకు. "
" అమ్మా...నువ్వు ఇక్కడికి వచ్చేస్తే నేను శ్రీ..."
" మీరు చూసుకోరని కాదు నాన్నా, ఎక్కడికని పరుగెత్తి దాక్కుంటాము చెప్పు. వెళిపోవాల్సిన నాడు వెళిపోవడమే. కాకుంటే అమాయకులు బలై పోతున్నారనే బాధ ఎక్కువగా ఉంది నాన్నా.... "
" పొనీలే అమ్మా, ఇక ఆ గుడికి వెళ్ళకు ..."
" తప్పు నాన్నా, అలా అనకు గుడికి వెళ్ళేదీ మనం మన స్వార్ధం తో నే రా . మనశ్శాంతి కోసం , అదీ గాక జానకిని వదిలి రాలేను నాన్నా ..తను ఒంటరిదయి పోతుంది ." 
అంతే ఇంక నా నోట మరో మాటలేదు. అమ్మ దృఢ సంకల్పం నాకు చిన్నప్ప టినుండీ అలవాటేగా మరి. 

బాంబులు పేల్చండి , మనుషులను చంపండి , అల్లకల్లోలం చెయ్యండి మతోన్మాదం తో , ఉగ్రవాదం తో , కానీ మనుషుల్లోని ఆత్మ విశ్వాసాన్ని మాత్రం చంపలేరు మీరు. 
" ఓహ్ టెర్రరిస్ట్స్ యూ హావ్ లాస్ట్ ద వైల్డ్ గేమ్...." ఎక్కడో మనసు మూలల నుండి ఈ మాటలు వచ్చాయి .

అటునుండి అమ్మ నవ్వుతోంది. నిజం ఆ క్షణాన ఈ ఉన్మాద విధ్వంసాన్ని చూసి రత్న గర్భ అయిన తనని తన పిల్లలినీ ఏమీ చెయ్యలేరనే భరత మాత నవ్వుతోన్నట్టు అనిపించింది .

.............................................జగధ్ధాత్రి 5.25pm 22.02.2013 శుక్రవారం 

( నన్ను అమ్మా అని పిలిచే బిడ్డ వెంపల్లి షెరిఫ్ కి ఈ కథ ...ఈ కథకి ప్రేరణ " జుమ్మా" )


Sunday, August 18, 2013

మదిరాక్షరాలుమూడు ఝాములు దాటినా 
ఏనాడూ కనికరించని నిద్రను 
మరి కొంచం రోజూ కన్నా ....

మరికాస్త ఎక్కువ మత్తునిచ్చే లా 
మాత్రలు వేసుకుంటానా 

మరింత మత్తులో మునగాలని 
మరి కాస్త మధువును సేవిస్తానా 

మనసు కి మరుపు లేకున్నా 
దేహాన్ని కాసింత సేపు 
అచలనం చేద్దామని 
ప్రయత్నిస్తానా ......

అదిగో సరిగ్గా అప్పుడే ఆ క్షణాన ....
వస్తాడు నా కవితా ప్రియుడు 

ఉద్విగ్నతల  నఖ క్షతాలు చేసి 
ఉద్దీపిస్తాడు నాలోని తన అక్షర ప్రియవాసిని 

ఎక్కడో ఓ మూల చీకట్లో 
ఎవరికీ అందక ఉందామని 
దాక్కున్న భావనా లలామను 
రెచ్చ గొట్టి  వస పరుచుకుంటాడు 

ఆగలేని మైమరపుతోనో 
ఆపుకోలేని ధు:ఖం తోనో 
అక్షరాలు కన్నీళ్లై ......
ఆగకుండా జాలువారుతాయి 

రాద్దామనుకుంటానా ....చెయ్యి కదలదు
మననం లో ఉంచు కుందామంటే 
మరుపు ముసుగు పడిపోతుంది 
పొద్దున్న కల్లా ...అని నాకు తెలుసు 

ఈ కాసిన్ని క్షణాలైనా 
ఈ దేహాన్ని విశ్రమించనీయవూ 
అని వేడుకుంటాను నా ప్రియుని 
కలవర పడే ఎదను అదుపులో ఉంచుకోలేను 

చిత్రమేంటంటే...తాను అలగడు
విసుగు చూపడు 
కనీసం నిట్టూర్పు విడువడు 
నా ఎద లోనే తిష్ట వేసుకు కూర్చుంటాడు 

నీరసించిన దేహంతో కసురుకుంటాను
నిశ్శబ్దంగా నవ్వుతాడు 

మోహరించిన మత్తులో జోగుతుంటాను 
మౌనంగా నిరీక్షిస్తాడు 

కృత్రిమంగా దేహాన్ని నిద్ర లోకం లోకి 
పంపి మనసు తో కలలు కంటూ 
హఠాత్తుగా మేలుకుంటాను ....

ఎదురుగా తానే ... చిరునవ్వుతూ ...

నిన్ను పదాలలో పదిలపరచలేను 
వాక్యాలలో బంధించలేను 
నన్ను బాధించకు ....
వేడుకోబోతాను .....

ఒక్క మాటా వాతెర దాటదు 
అనువణువూ అక్షరాల అనురాగం తో 
పరవశించి పలవరించి పోతాను 

నాలో రేగే భావనలతో  
నా కవితా ప్రియునికి  
అక్షర స్వాధీనపతిక నౌతాను 

నాలోని సప్త వర్ణాలనూ 
మరపు రాక ముందే 
అక్షరాల నలుపులోకి 
అనువదిస్తాను 

ఆర్తిగా నా బాధను పరికిస్తూ తాను 
దాహార్తితో లిఖిస్తూ నేను 
ఇరువురమూ ఏకమై 
కవితా లోకమై ....

అలసిన సంతృప్తితో 
అలవోకగా సుషుప్తిలోకి 
జారుకుంటాము ...

ఎన్ని మార్లు చెప్పినా 
అదే రహస్య వేళకు 
వస్తాడు తాను మళ్ళీ 
ఎదలోతుల్లోంచి పెల్లుబికి

నన్ను అక్షరాల ఆరాధనలో 
అనుబంధించేందుకు .....

...............................................................................ప్రేమతో...జగతి 5.12 పి .ఏం 18/08/2013 ఆదివారం