Wednesday, September 28, 2011

ఆట విడుపు

విశ్వ శాంతి....మన చేతల్లోనే ఉంది 

అవును నిజమే 
అప్పుడప్పుడూ అట విడుపు కావాలి 
అహరహమూ ఆడుతోన్న 
అవిశ్రాంత జీవితపు ఆటనుండి ఆట విడుపు కావాలి
ఆట తప్పని సరైనా 
ఆట విడుపు లేకుంటే
అలసిపోతాము....
ప్రతిరోజూ ఓ పరికరంలా 
పని చేసే దేహాన్ని
అనుక్షణం ఆలోచనలతో 
వేడెక్కిన మేధో కర్మాగారాన్ని
మనకోసం సాగించే
మర లాంటి మనుగడనీ
అప్పుడప్పుడూ విశ్రమించనియ్యాలి 
అనుదిన ఆర్భాటాలనుండి
స్వార్ధపు సుఖాల నుండి 
ఓ అడుగు పక్కకు వేసి 
మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని కూడా గమనించాలి...
అప్పుడే....
అనంత మైన ఈ భూగోళంలో 
మనమెంత అణువులమో  తెలుస్తుంది 
మన సంకుచిత పరిధులు దాటి
మనకూ ఓ బాధ్యత ఉందన్న 
ఎరుక కలుగుతుంది 
మనదైన ఒక ముద్ర 
చరిత్ర లో మిగాల్చాలన్న 
స్పృహ కలుగుతుంది
అప్పుడు.....
ఆలోగోరే ఘోషిస్తోన్న
గ్లోబల్ వార్మింగ్ గురించి 
ఏమి చెయ్యాలో ఆలోచిస్తావు 
పాలస్తీనా లోని పాలుగారే పసిపాపల 
బుగ్గల కన్నీటి చారికలు
నిన్ను నిలువునా కదిలిస్తాయి
అంటార్క్టిక లో కరుగుతోన్న 
మంచు పర్వత శ్రేణులు
నీకు పర్యావరణ పరిరక్షణ 
కర్తవ్యాన్ని బోధిస్తాయి
భవిష్యత్ నిర్మాతలు  కావాల్సిన భావి  పౌరులు
ఆటవికతకు ఆనవాళ్ళుగా
ఎలా విజ్రుంభిస్తున్నారో  
అవలోకిస్తావు 
గుజరాత్ గుండెల్లో 
ఆరని గోద్రా  మంటలు
నందీగ్రాం, ముది గొండ ప్రేలుళ్ళతో
ప్రతిధ్వనించే తూటాల శబ్దాలు 
నీ చుట్టూ విలయ  తాండవం చేస్తోన్న 
సమస్యలేమైనా ............
అకాలంగా రాలుతోన్న 
శవాల వర్షాలు 
సమాధానాలే లేని ఇరుగు పొరుగు దేశాల
పీటముడి ప్రశ్నలు 
నీదైన మాటను 
నమోదు చేయమంటాయి 
నీదైన ప్రతిస్పందనను కోరుతాయి 
ఆటవిడుపు అంటే విశ్రాంతి కాదు 
ఆత్మావలోకనం 
నీ జీవితపు ఆట నుండి 
ఒకింత బయట పడి 
నిస్వార్ధంతో 
నీ కింకర్తవ్యాన్ని
చేపట్టగలగడానికి
సమాలోచన  చెయ్యగలిగే
సంసిద్ధతా ప్రయత్నం
ఎంత గొప్పగా ఆడినా
బతుకాటలో వృద్ధాశ్రమం
నీ చివరి పెవీలియన్ 
ఒంటరితనం మాత్రమే 
నువ్వు సాధించుకునే
అక్కరకు రాని నీ "లైఫ్ ట్రోఫి "
జీవితం ముఖ్యమే
కానీ అయువుతో ఉన్న నలుగు ఘడియలు 
సమసమాజ నిర్మాణంలో
నీవు కూడా ఓ ఇటుక వైతే 
సామాజిక సమస్యా పూరణంలో
నీవూ ఓ కరబంధమైతే 
జన్మ సార్ధకతను పొంది 
మనిషిగా మనుషుల 
మనసులలో మరుసటి
తరాలకు నిలుస్తావు !!
ప్రపంచ శాంతి సాధ్యమే....
ఆట విడుపు అంటే విరామం కాదు
విశ్వ శాంతి ప్రపంచ కప్ సాధించడానికి
మానవత్వపు జట్టు 
ఆటగాళ్లుగా మన మందరం
తర్ఫీదు పొందే 
సార్ధక సమయం....!!!

........................................ప్రేమతో  జగతి ....2.05 pm 22-04-2008 Tuesday Chennai.






Monday, September 19, 2011

జీవిత చర్య ....



నా హృదయం విప్పి నీ ముందు 
పరుద్దామని ఎంతగానో అనుకుంటాను 
ఎందుకో మరి మోమాటపు  ముడిని
విప్పలేక పోతున్నాను 
సంద్రమంటి నా అనురాగం లో నిన్ను తదిపెద్దాం  అనుకుంటాను  
ఏమిటో దోసిళ్ళతో  నైనా 
నీ పాదాల పై ఒంపలేక  పోతున్నా
నా విరహం...నా విలాపం 
నీతో చెప్పాలని వస్తాను 
నవ్వుతావేమోనని నాన్చేస్తాను 
నా కలలు, కలతలు, కల్లోలాలూ
నీతో చర్చించాలనుకుంటాను
నీ మోమున అలసట చూసి ఆగిపోతాను 
ఎన్నో చెపుదామని
ఏదో చేద్దామని నీ దాకా వచ్చీ....
మౌనంగా నీ మాటలు వింటూ ఉండి పోతాను
నా మాటలన్నీ మది మాటున దాచేసి   
చిరునవ్వుతూ  నిన్ను పలకరిస్తాను 
ఇది నా దిన చర్య కాదు
జీవిత చర్య అయి పోయింది మరి .....
..............................................ప్రేమతో ....జగతి 10.29am 26/03/03 wednesday 

(నిజమైన మౌన వేదన రోజులవి....ఊహకందనంత .....భయంతో...బెంగతో ...గడిపిన ఆ రోజుల్లో నా జీవిత చర్య ఇదే)
 

మనసు బాగోలేదు.....






ఈ రోజెందుకో ఉదయం లేచిన దగ్గరినుండి ఏంటో మనసు బాగోలేదు 
చేదు తిన్నట్టు వికారంగా ఉంది 
అస్తమానం అలా అనుకోకూడదని అనుకున్న ......నిజానికి ఎందుకో మనసు బాలేదు
పాకెట్ లోంచి ఓ సిగరెట్ తీసి వెలిగించి..గుండెనిండా గట్టిగా పీల్చా---
ఉహు కుదుట పడలేదేమీ ...
ఫ్రెండ్ దగ్గరకేల్దామని  బయల్దేరా......ఎప్పుడూ నవ్వు ముఖం తో ఉండి ఎలాంటి పరిస్థితిలోనైనా
ఎవర్నైనా నవ్విస్తాడు ఆనంద్.... తలుపు  తీసి  నన్ను చూడగానే  "రా రా , ఇంకా నేనే నీ దగ్గరికి వద్దామని అనుకుంటున్నా " అన్నాడు కళ తప్పిన మొహం తో ...
"ఎన్టీ సంగతీ?" అన్నా కూర్చుంటూ 
"ఏంటోరా ఈ రోజెందుకో మనసేమీ బాగాలేదు " అన్నాడు.
కాసేపు ఇద్దరం మనసు మనసులోలేని పిచ్చా పాటీ ఆడుకునీ తిరిగి మళ్ళీ ఇంటికి బయల్దేరా....వాడూ కారణమంటూ ఏమీ  చెప్పలేదు ...నాకై నేను అడిగేంత మరీ చనువు తీసుకోలేకపోయాను...
టీవీ సీరియల్స్ తోనో మ్యూసిక్ సిస్టం తోనో గోలగా  ఉండాల్సిన ఇల్లు చాలా నిశ్సబ్దంగా ఉంది ఇల్లంతా...
ఒక్క క్షణం పాటల  హోరు లేకుండా ఉండని  పాప ఎందుకో సోఫాలో  పడుకుంది....
"ఎరా తల్లి? అలా ఉన్నవేమి ?" అంటూ పక్కనే కుర్చుని పలకరించాను ..."అబ్బా నన్నొదిలెయ్ నాన్నా ఈ రోజెందుకో 
నా   మనసేమీ బాగాలేదు..." అంటూ అటు తిరిగి పడుకుంది....అంటే ఇక ఏమీ చెప్పదన్నమాట .....
సర్లే అనుకుని బట్టలు మార్చుకుని లుంగీ కట్టుకుని ....డైనింగ్  టేబుల్ దగ్గర కూర్చున్నా ....ఓ ముద్ద తిందామని 
ఉహూ .... మింగుడు పడలేదు ...
గుండెంత బరువుగా ఉన్నట్టు అనిపించింది....
"ప్లీజ్ ఇవాల్టి కేమీ  అనకండీ ఏదో వంట బాగా కుదరలేదు ఏంటో మనసు బాలేదు " సంజాయిషీ ఇచ్చింది నా శ్రీమతి..
ఒక్కసారిగా ఫక్కుమని నవ్వాను...
క్షమాపనలుచేప్తే ఎందుకలా నవ్వేనో అర్ధం కాకా నా కళత్రం  కళ్ళు ఆశ్చర్యంతో విచ్చుకున్నాయి ....
"పోన్లే రా పర్వాలేదు డా బజ్జుందాం..." అని తను కలిపిచ్చిన మజ్జిగ తాగి తను కూడా తాగేక బెడ్ రూమ్లోకి దరి తీసా...
పక్కనే వచ్చి  చేరబడిన ఆమెను   ముద్దుగా  దగ్గరకి  తీసుకోబోయాను ....
"ప్లీస్  ఇవాల్టికి  వదిలెయ్యండి  ....ఎందుకో మనసు బాలేదు " అంది ...అటు తిరిగి పోతూ ...
ఉహూ  ఇక లాభం  లేదనుకుని  "నీ మనసు బాగు  చేస్తాను  రా ఇలా " అంటూ బలంగా  దగ్గరికి లాక్కున్నా ....గువ్వలా ఒదిగి   పోయింది గుండెల్లో ....అప్పుడు వినిపిస్తోంది పాప గదిలోంచి  అర్ధం కాని పాటల    హోరు ........ఆమెను హృదయానికి  హత్తుకున్నా   .. ....తనూ కొంచం  సేద  తీరినట్టనిపించింది ...చిరునవ్వింది  .......ఒకో  రోజు అంతేనేమో  కారణమేమీ  లేకుండానే  ......ఇలా ఈ పెంకి   మనసు అల్లరి  చేస్తుంది ...బహుశా...ఇదంతా ఈ రొటీను జీవితాల వల్లనేమో... ఏమో ఏమిటిలే అదే....అల్లుకుపోయిన  అర్ధాంగిని  ఆత్మీయంగా  జోకోట్టాను...



...................................ప్రేమతో జగతి 6.25am 19-01-2004 monday in train 
(ఎలమంచిలి కాలేజిలో పనిచేసేటప్పుడు ఉదయాన్నే సింహాద్రి లో ప్రయాణిస్తూ రాసుకున్నది...ఉదయాన్నే మూడింటికి లేచి పనులన్నీ చేసి వంట చేసి నేను కట్టుకుని బయల్దేరి స్టేషన్ కి వెళ్లి ఆరింటికి బండెక్కి వెళ్తోంటే హాయిగా వెచ్చగా బజ్జున్నవాళ్ళను తలచుకుంటూ రాసుకున్న సరదాగా)





Wednesday, September 14, 2011

చెయ్యలేను.....




ఏదో చాలా బాధిస్తోంది
అదేమిటో చెప్పగలిగితే 
తగ్గుతుందేమో కానీ
నా వేదన ఎవరికీ పంచాలంటే 
మనసు వొప్పు కోదు
నిజమే ....ఏమి  చెప్తాము
కూలిన  స్వప్నాల  సౌధాలను గూర్చి
నిస్సహాయంగా చూస్తుండగానే
చేజారి పోయిన  అపురూప మైన
కాలం గూర్చి............
చివురు ఆశల  వురితీతలు
లేత దేహపు  బలిదానాలు  
ఊహతేలియని ఉచ్చుల్లోకి
చేసిన అమాయకపు ప్రయాణాలు
ఇవన్నీ చెప్తే......
ఇప్పటికీ చెలరేగుతున్న 
హృది హోరు  లో
ఉక్కిరి బిక్కిరౌతున్న 
ఉత్సాహాలు .....
ఏమి చెప్తాం ఎవరికైనా
చెప్పుకుంటే నా బాధ కొంత
తగ్గచ్చు నేమో
కానీ నేను ప్రేమించేవారి
మది నొప్పించనూ
వారిని కలత పెట్టి
కన్నీళ్ళతో ఎద గాయాలను 
వారి ముందు ఎలా కడుక్క్కోను 
సానుభూతినో  సహాను భూతినో  
సంపాదించి ఏమి చేసుకోను
అందుకే నిశ్సబ్దంగా
చెరగని చిరునవ్వుతో  
హాయిగా నవ్వేస్తూ......
నవ్వే నా పెదవుల వెనుక
నవ్వలేని వేదనని  దాచేస్తూ....ప్రేమతో ....జగతి