Wednesday, February 29, 2012

అవును అప్పుడే……అక్కడే…..అవును అప్పుడే……అక్కడే…..

ఎప్పుడో…. ఎక్కడో….నిన్ను చూసానన్న
ఒక తీయని స్మృతి …….
ఎప్పుడూ ఎక్కడా……
అమ్మ నోటికందించిన తొలి చను బాలలోనా
నాన్న ఎత్త్తుకుని ముద్దాడిన తొలి ముద్దు లోనా…..
చూసాను మాత్రం నిన్ను …..నేడు నువ్వో అందని
పాలపుంతవి కానీ అప్పుడు నా చుట్టూ తిరిగే
మా అమ్మమ్మ తాతగార్ల మొహాలలో
నన్ను అపురూపంగా ఎత్తుకుని
బంగారు బొమ్మని చేసి ఆటాడుకున్న
పెళ్ళి కాని మా పిన్నులల వదనాలలోనా
అక్కా నా మేన కోడలే అంటూ మురిసి
పోయిన మేన మామాల గర్వంలోనా….
చూసాను మాత్రం నిన్ను …….
బాగా ఆలోచిస్తే …..మళ్ళీ నిన్నెక్కడెక్కడెక్కడ
చూసానా అని …..
ప్రతి పుట్టీన రోజు ఒక పండుగలా
జరిపే నాన్న ప్రేమ లో …..
ఎందరినో ఆ రోజు పిలిచి
రకరకాల వంటలతో విందు ఇచ్చిన
అమ్మ చేతి కమ్మదనం లోనా
ఆ అప్పుడే …..బాగా చూసినట్టుంది సుమా
నువ్వు క్లాసు ఫస్ట్ వస్తే నిన్ను సినిమాకి
తీసుకెళ్తానని పదవ రేంకునుండి
ఫస్ట్ రేంక్ కి తెచ్చిన మా రాజు మామయ్య
అవ్యాజ్య ఆత్మీయతలోనా…..
ఆ చూసాను సుమా …….అనుభూతించాను కూడా
ఫస్ట్ రేంకు వచ్చిన నాడు తన వాగ్దానం నిలబెట్టుకుని
అప్పు చేసి మరీ " బడి పంతులు" సినిమాకి తీసుకెళ్ళిన
మా మామయ్య, మాట నిలబెట్టుకున్న అతని పట్టుదల లోనా
అవునక్కడే మరి గుర్తుంది బాగా……
అలాంటి మామంచి మామయ్యకి
నన్ను కేవలం చూడాలనే ఒకే ఒక్క చిన్ని ఆశతో
రక్త సంబంధమూ లేకపోయినా
మా రాజు మామయ్యని కనీసంమంచి నీళ్ళు కూడా
ఇవ్వకుండానే అత్త గారి హుకుం వెనుక ఝడిసి దాగిపోయిన
నన్ను చూడకుండానే వెళ్ళాల్సి వచ్చినందుకు
కళ్ళల్లో నీరు తిరుగుతుండగా
గేటు దాటి వె్ళ్తోన్న తనని కిటికీలోంచి చూసిన
క్షణం లోనా ……నిజమే పిల్లలు లేని తాను
నన్నే తన పాపగా భావించిన మామయ్య
ఐదు పదులు నిండకుండానే వెన్నెముక
దెబ్బతో దేహంపని చెయ్యని నాడు
వద్దు వద్దు పాపని మాత్రం నన్ను
చూడటానికి రావద్దని చివరి శ్వాసవరకూ
మెసిలిన మామయ్య ప్రేమలోనా …..
అవును అక్కడేఅప్పుడే
మా రాజు మామయ్యని
చూడలేక పోయినా…..
అతని అనురాగం ఇప్పటికీ
కనులలోమనసు మూలల్లో
ఎక్కడో ఎప్పుడూ కనలి మెదిలిస్తూనే
ఉంటుంది …….
బూచాడమ్మ బూచాడు పాట చూసి
అలాంటిదే గౌను కొని కుట్టించిన
మా మామయ్యని ……మా రాజు మామయ్యని
గయ్యాళి భార్యతో వేగలేక
ఎప్పుడూ మా ఇంట్లోనే మాతో
ఆడుతూ పాడుతూ మా అమ్మని చెల్లెలి గా
భావిస్తూ ….
ఎంత చనువున్నానాన్నని మాత్రం
సార్ అనే వాడే మాత్రంకానీ అతి చనువు
తీసుకోని మా వెర్రి మామయ్యని
అది నన్నీ స్థితిలో చూస్తే తట్టుకో లేదమ్మా అంటూ
చివరి శ్వాస వదిలిన మామయ్య లాంటి
మానవ మూర్తి లో కదూ …..
నిన్ను చూసింది ….అవును
ప్రేమా …..నిన్నక్కడే చూసాను
అతి దగ్గరగా…..నాన్న లాగా ప్రేమించి
అమ్మలాగా లాలించి ఏ సంబంధంలేకుండానే
ఎల్లపుడూ నా క్షేమాన్ని కోరుకున్న
మామయ్య ని చివరి క్షణంలో చూడలేక పోయిన
నా అశక్తతలో …..ఎప్పుడూ మామయ్య
చిరాయువుగా చిరునవ్వుతూ
బుల్లెట్ బండి మీద నేను , తమ్ముడూ
మామయ్య వెనకాల కూర్చుని
చిన్ననాటి స్నెహితులు సినిమాకి వెళ్ళినట్టే
నిన్ననో .. మొన్ననో మేము మామయ్య
ఊరు తాడివాడలో …..తియ్యని తాటిముంజెలు
పూతరేకులు ….తింటున్నట్టే ….
ఇంకా ఎప్పుడూ నా మది లోలోపలి
మధుర స్మృతుల గనులలో …….
కదలి కనలి ……నన్ను కన్నీట
కరిగించిన ప్రతి క్షణమూ ….
మామయ్య మాతోనే ఉన్నట్టు
ఏమిటో …. ఈ తియ్యని తాటిముంజె లాంటి
జ్నాపకం……..అనునిత్యం….నాలో
వయసు మీరుతోన్న కొలదీ
మరీమరీమరీ…….మామయ్యా!!!
…………………………..ప్రేమతోజగతి ….12. 30am 29/02/2012/ మంగళవారం

Monday, February 27, 2012

సర్వామృతవర్షిణి......


సర్వామృతవర్షిణి......

అనాదిగా నీలోనే .... 
అనవరతం నీ లోనే ....
ప్రకృతి పురుషులమన్నారు 
వసుధాకాశాలన్నారు 
ఆదాము అవ్వలమన్నారు   
ధరణికి ఆది దంపతులమన్నారు 
నీవు జడురాలివన్నారు 
అయినా ప్రియతమా .....
నేనేరుగనా నిన్ను....
అర్ధ దేహం ఇచ్చినది 
నేనా.....కాదు ....
నీలో ....ఆర్ద్రంగా ..అర్ధవంతంగా....
ఒదిగే అవకాశమిచ్చిన 
నీవు నా అంతఃస్చేతనవి
పక్కటెముక నుండి పుట్టితివా 
అది నా భాగ్యము కాదా ... 
నా అస్తిత్వానికి ఆలంబనవి 
నీలో కరిగి ... లయించి ....
వీర్య బీజమై స్ఖలించిన 
నాకు ప్రాణ ప్రతిష్ట చేస్తావు 
క్షేత్రం నీవై సఖీ 
నన్ను భూమి మీదికి 
సృజియించుతావు
సకల చరాచర 
జగత్తుకు ఆదిమూలం నీవు 
నీ అనంత వాత్సల్యాంబుధి లో 
అనునిత్యం.......
తారాడే పాపాయిని 
అన్ని రూపాలలోనూ 
అన్న వేళలలోనూ....
నీకై కలవరించి ...
పలవరించే నేను .....
అసంపూర్ణుడను...
నా ప్రేమను నీలో 
ఊపిరి పోసుకునే వేళ
నా సర్వస్య శరణాగతి తో 
నీలో బీజవాపన చెందీ 
నేను పుష్పిస్తాను 
ఫలిస్తాను ..... 
నా క్షేత్రపాలినీ .... 
అనవరతము నీలోనే....
నీతోనే ......నేనంటూ లేక
నా సర్వామృతవర్షిణిలో   
ప్రణయించి ......స్ఖలియించి 
మమేక మై.....పోతాను....
సంపూర్ణ మౌతాను.........
..............................................ప్రేమతో ....జగతి ....12,40am 27/2/2012 monday (sunday night)  

Saturday, February 25, 2012

ఆందోళిస్తూనే ...........


ఆందోళిస్తూనే ...........

చేతిలో పట్టుకు మురిసిపోతున్న  
ముత్యాల హారం .....
చటుక్కున తెగి ముత్యాలు 
రాలిపడినట్లు....
రెక్కలొచ్చిన  పిట్ట
ఎగరాలని ప్రయత్నించి 
ఓడిపోయి రెక్కలు  తెగి 
పడిపోయినట్టు ....
గలగలా నవ్వుతోన్న 
పసి పిల్లలు హటాత్తుగా 
మూగపోయినట్టు...
కమ్మని కవితగా
అల్లుకున్న పదాలన్నీ
అక్షరాలుగా విడి విడి గా 
విరిగిపోయినట్టు ...
ఒక రోజు నవ్వుతూ
మాట్లాడే పిల్లలే 
మరునాడు చీత్కరించినట్లు.....
ఎంత మన రాత అని 
సరిపెట్టుకుందామన్నా ....
ఎక్కడో ఏ మూలనో 
ఏదో వెలితి ...
మెలి తిప్పేస్తూ......
ఎంత తప్పుకుందామన్నా
కన్న పేగు ...
అపరాధ భావంతో 
తలదించుకుంటోంది ....
జీవితమంటే ఆకతాయి 
అరుపులు కావని 
ఎలా చెప్పగలను ...
ఒకరి రాతలు మనవి 
కావని ...ఎవరి చేతలు 
వారివేనని తెలిసినా..
ఏమీ చెయ్యలేనని 
ఎరుక గలిగి  ఉన్నా 
ఎంతని నచ్చచెప్పను
కుమిలే హృది కీ.....
కమిలే చెక్కిళ్ళకీ ....
ఆందోళి౦చే అంతర్యానికి
ఎప్పుడూ ఏదో ఒక 
భయం వెన్నాడుతూనే 
సాగుతోన్న జీవనయానానికి.....ప్రేమతో .....జగతి 10.56pm Friday 24/02/2012

Wednesday, February 22, 2012

ముద్దు .....


ముద్దు .....

తెలి మబ్బు తునకలాంటి 
ఆమె నుదుటి పై 
తొలి ముద్దిచ్చాడతను
తమకంగా...
తన్మయించింది ఆమె 
ఉదయారుణ కిరణాల 
ఆమె సూర్య తిలకం పై 
మలి ముద్దు...
వెన్నెల లా చిర్నవ్వింది 
పరవశాన వాలిన కన్రెప్పలపై
ముచ్చటైన మూడవ ముద్దు 
మమేకతలోకి ఒరిగింది 
మెరిసే నక్షత్ర 
ముక్కు పుడక పై 
ఒక వజ్రపు ముద్దు 
మురిసింది ...ముక్కెర 
సిరి నవ్వులు విరిసే
నును చెక్కిలి పై
చిరు ముద్దు .....చిలిపిగా
చేమంతి ...మారింది 
గులాబిగా ....
శీతవేళ వణికే 
చివురుటాకుల్లాంటి
అధరాలపై ...
అనురాగ రంజిత 
అనంత అగాధాల 
అంత్య శోధనగా 
ప్రజ్వలించే 
ఆదిమ మానవ  
సహజత్వపు సరాగాల ముద్దు
జీవన లాలసని
మార్మిక  మధురిమను 
కనుగొనే చిరంతన  
యాత్రలోకి అతను ఆమె
జీవన సాంధ్య సమయాన 
పయనిస్తూ ....నిరంతరంగా 
అంతరంగాల లోకి 
అద్వైత తరంగాలలా...అనూచానంగా...!!!
.........................ప్రేతో ....జగతి 12.05 pm wednesday 22.02.2012
 
 Reply

 Reply

Tuesday, February 14, 2012

ఆర్ణవ అగాధాలలో ....


ఆర్ణవ అగాధాలలో ....

"ఎందుకా మౌనం అమ్మాయికి?"
పక్కనే వచ్చి కూర్చుంటూ ఆన్నాడు. గాలికి ఎగిరి పడుతున్న ముంగురులని కూడా సరి చేసుకోకుండా ఏదో దీర్ఘాలోచనలో ఉంది ఆమె.
"ఏంటి ధీరూ ! అంతలా ఆలోచిస్తున్నావ్ " సున్నితంగా ఆమె నుదుటి మీది ము౦గురులను  సవరిస్తూ అడిగాడు. 
అతని వంక చూసి చిర్నవ్విందే కానీ మనసెక్కడో ఉందని తెలుస్తూనే ఉంది అతనికి. "ఏయ్ అమ్మాయి నువ్వు గలగలా మాటాడుతుంటే బాగుంటుంది కానీ ఇలా బుద్ధిమంతురాలిలా క్లాస్ లో కూర్చున్నట్టు ఉంటే బాగోదు రా" అతని గొంతులోని లాలస. 
అతని వైపు పూర్తిగా తిరిగి "అంటే ఏంటీ ఎప్పుడూ నేను వాగుతూ ఉండాలా?" అంది నెమ్మదిగా 
ముడుచుకుని కూర్చున్న ఆమె కళ్ళు చాపి ఆమె వొళ్ళో పడుకుని అన్నాడతను "అవునమ్మ నువ్వు ఎఫ్ ఎం లా అలా మాటాడుతుంటేనే బాగుంటుంది.... మౌనం నీకు సూట్ కాదు రా " నవ్వాడు ఆమె నడుము మీద చక్కిలి గిలి పెడుతూ దానితో ఆమె కూడా కదిలి నవ్వింది .
"ఏదన్న చెప్పరా ...అంత దూరం నుండి  వచ్చిందీ నీ మాటలు వింటూ నీతో గడపాలనే, అవునమ్మాయ్  అసలు నీకు నేను గుర్తొస్తానా అని " 
"అసలు గుర్తు రాని సమయమంటూ ఉండదు కానీ , నిన్ను డిస్టర్బ్ చెయ్యడం నా కిష్టం ఉండదు ...అప్పటికీ తింటూనే ఉంటాగా నీ బుర్ర లోని గుజ్జు ...హహ "
"ఛా లేదురా నువ్వు మాటాడితే వినాలనిపిస్తుంది , నిజం "
"అబ్బ ఛా అంతలేదులే మన మధ్య మొహమాటం ఎందుకు ? ""
"ఏయ్ ! నిన్నొక మాట అడగనా?"
"క్విజ్ మొదలా నాకు "
"పో అయితే ఇంకేమీ మాటల్లేవు "
"అబ్బా ఇప్పటికే బోలెడంత నిశ్శబ్దాన్ని భరించి ఒక్కడినీ కాగి కాగి వచ్చాను తల్లీ నువ్వు కూడా అలిగితే అదిగో ఆ సముద్రమే గతి "
"చాల్లే ఆపు ఎం మాటలవి ! "
"షూట్ యువర్ ప్రశ్నలు మాడం"
"అదిగో మాడం అనోద్దన్నానా "
"లేదు లేదు షూట్ ధీరూ"
"నాలో నీకేంటి ఇష్టం?"
"అబ్బో చాలా క్లిష్టమైన ప్రశ్న ...సమాధనం  చెప్పడం అంత వీజీ కాదు "పకపక నవ్వాడు 
హాయిగా నవ్వుతున్న అతని చూస్తూ ఉంది పోయింది కాసేపు . 
"ఏంటోయ్ అలా చూస్తున్నావ్ ?" అడిగాడు 
"నువ్వు నవ్వుతే చాలా హాయిగా ఉంటుంది బాలూ !"
"నువ్వు నవ్వితే చాల అందంగా ఉంటుంది తెలుసా ?"
"ఆ చాలు ...నేనడిగిన ప్రశ్న "
"వామ్మో ఎలా చెప్పాను సమాధానం, నీకీ సముద్రమంటే ఎందుకిష్టమన్న చెప్పగలను కానీ నువ్వంటే ...అయినా ఇప్పుడు ఈ ప్రస్నేంటి  రా " మాట తప్పించేసాడు 
"అలా కాదు బాలు ఈ ప్రశ్న నేనెప్పుడు నిన్నడగలేదు...ఇవాళెందుకో అడగాలనిపించింది అంతే , ఇష్టం లేకుంటే చెప్పొద్దు"
"అబ్బ ఇష్టం లేక కాదు రా , కష్టం అంటున్నా, సరే చెప్తాను విను నాకు నీ....." ఆమె గుండెల వైపు చూసాడు చిలిపిగా 
" ఓయ్ ఆగాగు సారూ ! సమంగా చెప్పు "
"అబ్బ చెప్తున్నాను కదా అన్నీ పాడు  ఆలోచనలే పిల్లకి ...."నవ్వాడు 
"నాకా పాడు ఆలోచనలు నిన్నూ....." 
"నాకు నీ గుండె సవ్వడి ఇష్టం , ఇలా నీ దగ్గరగా నీ వొళ్ళో పడుకుని నీ గుండెల చప్పుడు వినాలనుంటుంది . ఒకోసారి మరీ అనిపిస్తుంది రా "అతని స్వరం లోని మార్దవం ఆమెలో చిరు వణుకు 
"అయినా నేను కవిత్వం లో చెప్పగలను కానీ ఇలా మాటల్లో వాక్యాల్లో సమాధానాలు చెప్పలేనమ్మాయ్ "
ఆమె కొంగు కింద చెయ్యి పెట్టి అల్లరి చేసాడు 
"ఇదిగో అల్లరి పనులు చేసావంటే నా ..."
"ఆ చేస్తే ఎం చేస్తావ్ " ఆమె పొట్ట మీది మడత లో ముద్దు పెట్టాడు 
"నీ చిలిపితనం , ధైర్యం , అన్నిటికీ మించి ఎద లోతుల్ని తడిమే నీ కన్నులలోని అనంతమైన భావాలూ, నీలి నీడలా మేఘచ్చాయలూ ....." తమకంగా ఆమెని తాకాడు . 
"నిజం చెప్పు నీకు ఎంత మందో పరిచయం కదా నేను నీకు గుర్తుంటానా అసలు ?"
ఆమె వడి లోంచి  లేచి కుర్చున్నాడు  .కాళ్ళు రెండు ముడుచుకుని చేతులు కాళ్ళ చుట్టూ వేసుకుని.
"ధీరూ! మనిషికి పరిచయాలు ఎన్నో ఉండచ్చు కొందరు చాల దగ్గరగా వస్తారు , జీవితం లోకి వస్తారు , దేహాన్ని కష్ట సుఖాలనీ  పంచుకుంటారు , అయినా కొందరు మాత్రమే జ్ఞాపకంగా మిగులుతారు "
"అవును రా జీవితాన్ని చొచ్చుకు వచ్చిన వారు కొంత కాలం ఉంటారు , మనస్సు చొచ్చుకు వచ్చిన వారు మరి కొంత కాలం, కానీ ఆత్మ చొచ్చుకు  వచ్చిన వారు అనవరతం ఉంటారు "
"అబ్బో అమ్మాయిగారు వినిపించేది తాత్వికతా , కవితా ?"
"నిజానికి తాత్వికుడి వి నువ్వే నేను కాదు ...."
"ఏయ్ ఛా తిట్టాలంటే  తిట్టు కానీ మరీ ఇలాగా "
"లేదు ఎందుకంటున్నానంటే నువ్వు మనిషిగా ఆలోచిస్తావు , మనిషిగా ఎన్నెన్ని బలాలు , బలహీనతలు ఉంటాయో తెలుసుకుని ఆలోచిస్తావు అందుకే ఏదన్న నీతో పంచుకోవాలనిపిస్తుంది "
"అయితే పద మరి ఇంటికి పోదాము ఇక్కడెందుకు బాగోదేమో "
"హహః ...చాల్లే అల్లరి అసలు మనస్సు ఇవ్వడం అనే కాన్సెప్ట్ నాకు నచ్చదు బాలూ. మనసివ్వడ మేంటి అదేమన్న చక్లాట్టా , ఐస్ క్రీమా ?"నవ్వింది 
"నీకో మాట చెప్పనా అసలు మనసన్నదే  లేదు ఇది మానవుడు సృష్టించిన దృగ్విషయం. నాడీ మండలాన్నే మనసంటారు"
"నిజం బాలూ సరిగ్గా యు.జి. కూడా ఇదే అన్నాడు "
"అవునా నాకు తెలియదు సుమా "
"అన్నిటికీ కారణమైనది మనస్సు దాన్ని వధించాలి అని జే.కే. అంటే అసలు మనసన్నదే  లేదంటాడు యు.జి. చిత్రంగా వీరిద్దరూ మన తెలుగు తాత్వికులు కావడం యాదృచ్చికమైన విచిత్రం కదూ"
"నిజమే అందుకే అన్నిటికీ ఒకటే సమాధానం జీవితాన్ని జీవించి తెలుసు కోవడమే "
"నాకైతే ఎవరితోమనం కంఫర్టబుల్ గా ఉండగాలుగుతామో   ఏ భేషజాలు లేకుండా మాటాడ గాలుగుతామో  అదే సత్యం ....అంటే.. నీతో ఉన్నప్పుడు స్వచ్చంగా నిన్ను ప్రేమించాగాలగాలి అదే ..నీతోనే రిలేట్ అవ్వాలి ."
"నేను చెప్తుంటా అమ్మాయిలతో మనసు గురించి మాటాడితే మీ మనసు ఎవరి కావలిస్తే వారికిచ్చుకోండి దేహం మాత్రం నాకివ్వండీ అని "
"మనసు దేహం రెండు వేరంటావా? అసలు మనసే లేదన్నావ్ ?"
"ననన్న్నాను అది అందరు నమ్మాలని లేదు గా ...."
"నావరకు దేహమివ్వడమంటే అన్నీ ఇచ్చినట్టే ...."
"నేనూ ఒప్పుకుంటాను ... నువ్వన్నావు చూడు , మనసు ముడి విప్పినంత తేలిక కాదు రవికె ముడి విప్పడం అని ....ఫన్టాస్టిక్ లైన్స్ నాకు చాల నచ్చాయి ..."
"దేహమివ్వాలంటే చాల ధైర్యం కావాలి అనుభూతించే ఆత్మ సంయమనం కావాలి , ధీరూ అందుకే నువ్వంటే నాకు ఇష్టం , మాయ మర్మం లేకుండా మాటాడుతావు "
"నేను అబద్ధాలతో ఆత్మ వంచన చేసుకోలేను బాలు...అది నా బలమో బలహీనతో పోనీ నేనిలాగే ఉంటాను ...పోతాను ..అంతే.."
"నేను నమ్మేది "ప్రేమ" అంతే ....."
"మనసనేది లేక పోవచ్చు కానీ ఎన్ని పేర్లు పెట్టినా ప్రేమ మాత్రం ఉంది అదే లేకుంటే ఇవాళ మనమిలా ఒకటవ్వము...నిజానికి అన్నిటికీ చివరికి యుద్ధాలకి కూడా ప్రేమే కారణం  అంటాడు తెలుసా ..."
"ఎవరాయన ?"
"ఎడ్ డెల్ సాప్రియో ...అని తను అతని సహచరి కలిసి రాసిన "అనకండిష నల్ లవ్ "అనే పుస్తకం లో 
"దేని పట్లైన, చివరికి మన దేశం పట్ల మనకున్న విపరీతమైన ప్రేమ వల్లే ఈ యుద్ధాలన్నీ అంటాడు...నిజమే కదూ ఈ పోసేస్సివేనేస్స్ లేక పొతే ఏ గొడవ ఉండదు కదూ"
"అసలు ఈ పోసేసివేనేస్స్ లేక పోతే మన అన్న ఫీల్ లేకపోతే ఎందుకు బతకాలి మనిషి చెప్పు ?" ప్రశ్నించాడు 
"అదేంటి అందరూ ఈ ఫీలింగ్ ని చంపుకోమనే కదా చెప్తున్నారు "ఆమె కళ్ళలో ఆశ్చర్యం
"అయ్యో పిచ్చీ అదే లేకుంటే మరి నేను నీ దగ్గరికే  ఎందుకు రావాలి నా మనిషి అనుకో బట్టే కదా , కాకుంటే ఈ ఫీలింగ్ తో అసూయ మొదలై అది చిచ్చు పెడుతున్న్దన్నది సత్యం. దాన్ని చంపుకోమంటున్నారు అంతే ...ఇది మానవాళి ఉన్నంత వరకు అసాధ్యం నా దృష్టిలో ...."సాలోచనగా అన్నాడు 
"ఏమో రా మనసు బాధ కలిగినపుడు ఏదన్న మంచి కవిత కానీ పుస్తకం కానీ చదివినపుడు నీకు చెప్పాలనిపిస్తుంది నీతో పంచుకోవాలనిపిస్తుంది ...దీన్నేమంటారో నాకు తెలియదు... ప్రేమ అనే నేననుకుంటున్నా ..."
"ఖచ్చితంగా అది ప్రేమే నమ్మడూ లేకుంటే నేనెందుకు గుర్తోస్తాను ...."
"హ్మమ్....సరే ఏదైనా నువ్వు మాత్రం ఎప్పుడూ నా హృదిలో మెదులుతుంటావు ..చాల కష్టం మీద నీకు మెసేజ్ కాని కాల్ కానీ చేయకుండా ఉంటాను....ఇదిగో ఇలా నువ్వు నా చెంత చేరినప్పుడు మాటలుగా భావాలన్నీ నీ ఒడిలో ఓంపెసుకుంటాను "
ప్రాణంగా అతని చేయి పైన మణికట్టు పైన ముద్దు పెట్టింది ..
"నాకు నీలో ఓ కవి ఓ భావుకుడు ఓ తాత్వికుడు కనిపిస్తారు ..."
"వాళ్ళందరూ ఎవరూ నా పేరు బాలు అండీ రాణి గారు ....మీరేవేవో పేర్లు పెట్టేస్తున్నారు నాకు "అల్లరిగా నవ్వుతున్నాడు 
సాయం కెంజాయలో ఆతని నవ్వు తెరలు తెరలు గా అలల  నురుగులా పైకి అగుపడుతున్నా అనంతమైన సముద్ర మధనం అతని హృదయ సంద్రం లో జరుగుతోందని తెలుసు ఆమెకి .
చల్లని చిరునవ్వుతో చిలిపిగా అల్లరి చేస్తూ తనకోసం కాచుకుని ఆరాధనగా  అన్నీ ఇచ్చేసే ఆమె లో సముద్రమంత అగాథాలున్నాయని అతనికీ తెలుసు ......!!!
ధరణి వొడిలో కురవాలనే ఆశతో వర్షమై కురుస్తుంది నింగి .....ఆవిరై ఎగసినా మరలా మేఘమై ప్రేమ ప్రయాసతో వానజల్లై కరిగి కురిసి కలిసిపోతుంది   తనకై పైకి ఎగరలేకున్నా తనని ఉన్నతంగా నిలిపే తన  ధాత్రి లో ...ఈ నిత్య  సమాగమెంతటి సుందరమో ఎన్నెన్ని యుగాల అనురాగాబంధమో ...!!!
..................................................................ప్రేమతో ...జగతి 4.22pm Tuesday (valentines day) Feb 14th 2012 

ప్రేమంటే .......ఆలోచించండి ...!


ప్రేమంటే .......ఆలోచించండి ...!


"ప్రేమ, సత్యము మాత్రమే ప్రపంచం లోని అని సమస్యలను పరిష్కారం చూపిస్తాయి" వక్లావ్ హావెల్ (ఇటీవల మరణించిన  ప్రపంచ మేధావి) 
"ప్రేమే సత్యం" మహాత్మా గాంధీ "ప్రేమే దైవం" జీసస్. 
ప్రేమంటే .....అనేవర్నైనా అడగండి ...ఒక్కొకరూ ఒక్కో నిర్వచనం ఇస్తారు. నిజానికి ప్రేమ అంటే ఏంటో మనలో ఎవరికైనా తెలుసునా? అని ప్రశ్నించుకుంటే అనిపిస్తుంది కవిత్వాన్ని , ప్రేమని , జీవితాన్ని అంత తేలికగా నిర్వచించలేము. అలాగని నిర్వచించ కుండా ఉండలేని విషయం కూడా. ఎవరి అనుభవాన్ని అనుభూతిని వారు వారి అభివ్యక్తి శక్తి మేరకు చెప్తారు. అంతే కానీ ఇది లాస్ట్ అండ్ ఫైనల్ అని చెప్పే సాహసమే చేయలేరెవరూ. నిజానికి వీటి  అర్ధం అవగతమైతే ఇక ప్రపంచం లో శోధించాల్సింది ఇంకేమీ లేదనిపిస్తుంది . 
ఇటీవల మనమందరం చిన్న పెద్దా తేడా లేకుండా జరుపుకుంటున్న దినోత్సవాల్లో ప్రేమికుల రోజు అనగా వాలెంటైన్స్ డే ఒకటి. ఇది పాశ్చాత్య సంస్కృతీ అని పిల్లల్ని తిట్టే ఎంతో మంది పెద్దలు కూడా వాలెంటైన్స్  డే ని జరుపుకోవడం నేను చూస్తున్నాను. ఏ విషయాన్నైనా అది ఏ నాగరికత నుండి వచ్చినా మంచి స్వీకరించడం  లో తప్పులేదు. ఇదిగో అతి అయితేనే ప్రమాదం. 
ఇవాళ మనం చూస్తున్న ఈ ప్రేమ అనే అంశం ఏమీ కొత్తది కాదు అనాదిగా అనూచానంగా వస్తోన్న మానవ సహజాతం. కానీ మన అవగాహనాలోపం వల్లనే మనం నిజానికి ప్రేమని విధ్వంసం చేసుకుంటున్నాము. ఏ కొందరి వైఫల్యం వల్లనో ప్రేమంటే ఒక బాధాకరమైన భావనగా భయపడుతున్నాం. అసలీ ప్రేమ అనేదే లేకుంటే సకల సృష్టి దేనికి? మనమే ప్రేమ అనే దివ్య మైన భావనని చాలా సంకుచింప చేసి వైయుక్తికంగా మార్చేసాము. ప్రేమికులకో రోజేమిటి అని కొట్టి పారేసే వాల్లెందరినో  నే చూసాను. ఇటీవల ప్రేమికుల రోజు నాడు ప్రేమికులమని చెప్పిన వాళ్ళను బలవంతంగా పెళ్ళిళ్ళు చేయడం లాంటి అఘాయిత్యాలు చూస్తున్నాము. అది నిజంగా కిరాతక  చర్యే అనిపించింది నాకు. వాళ్ళవల్ల పబ్లిక్  లో ఏదన్న అసభ్యమైన అల్లరి జరిగితే తప్ప వాళ్ళకి బలవంతంగా పెళ్లి చేయడం లాంటివి పరిష్కారాలు కావు. అన్నీ చూసి అన్నీ కుదుర్చుకుని చేసుకునే వివాహాలే మూడు రోజుల ముచ్చట అవుతోన్న ఈ కాలం లో ఇలాంటి పిచ్చి చర్యల వల్ల మరింత  యువతరం రెచ్చి పోతారు తప్ప వారిని అరికట్టేయకలమనుకోవడం మన వ్యవస్థ పడే అవస్థ. 
నేటి యువతరం చాలా తెలివిగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. జీవితాన్ని ప్రాక్టికల్ గా తీసుకుంటున్నారు. నిన్ననే ఒక ఇరవై ఏళ్ళ అమ్మాయి నా కళ్ళు తెరిపించింది నిజం !. ఒక వేళ నువు ప్రేమించే అబ్బాయి వాళ్ళ తలితండ్రులు ఒప్పుకోక పోతే ఏమి చేస్తావు అని నేనడిగితే ఒప్పుకోక పోతే ఒప్పుకోరు వాళ్ళు ఒప్పుకోవాలని నిబంధనేమీ లేదుగా అంది. మరి అప్పుడు ఆ అబ్బాయి కూడా మారి పోయి వాళ్ల అమ్మ నాన్న చెప్పిన మాట వింటే నువ్వేమౌతావు అన్నా బాధగా. ఏమౌతాను ఏమీ కాను అలాంటి కష్టమొచ్చి నప్పుడు ఎదుర్కునేందుకు సిద్ధపడి ఉండాలి కానీ పలాయన వాదమో , ఆత్మ హత్యో లాంటివి  చేయకూడదు. తన వాళ్ల ఒప్పుదలతోనే నన్ను తన జీవితం లో నిలుపుకుంటాననే అబ్బాయి మనసు బలహీనమైనదే కదా అటువంటి   అబ్బాయి తో జీవితం  ఎప్పటికైనా అపనమ్మకమే, కనుక అలాంటి ప్రమాదం తప్పినందుకు సంతోషిస్తాను అంది. బాధగా ఉండదా ? దుఃఖంగా ఉండదా? అడిగా దీనంగా. ఉంటుంది తప్పక ఉంటుంది నేనూ మనిషినేగా ఈ ఇలా చెప్పేసినంత తేలిక కాదు జీవితాన్ని ఎదుర్కోవడం అని నాకు తెలియదా కానీ అందుకు మనస్సు సంసిద్ధం చేసుకోవాలి అనే ఓ దృఢ సంకల్పం మాత్రం చెప్పుకుంటాను నాకు నేనే రోజూ , ఇదీ ఆ అమ్మాయి సమాధానం వింటూనే నా గుండెలు చెమర్చాయి. 
నిజమే ఇన్ని ఒత్తిళ్ళ మధ్య ఒక వైపు చదువు కెరీర్ ఆర్ధిక స్వావలంబన ఇన్ని ఏర్పరుచుకుని తమ అస్తిత్వాన్ని సమాజం లో గౌరవంగా నిలుపుకుంటూ ప్రేమ పెళ్లి అనే ఈ తప్పనిసరి రిస్కులు తీసుకుంటున్న యువతని మనమెంత తప్పుగా తీసుకుంటున్నాము. 
కేవలం అబ్బాయిలనే తప్పు పట్టే మనం వారు మాత్రం ఎదుర్కుంటున్న సమస్యలను పట్టించుకుంటూన్నామా ? అని ఒక్క సారి ఆలోచిస్తే అనిపించింది లేదు మనం ఏ విధంగానూ పట్టించుకోవడం లేదు. వాడో ఇంజనీర్ డాక్టర్ లేదా ఏదో ఒకటి ఐపోయి అమ్మ నాన్నకి పేరు తేవాలి అంతే ఇక వాడి మనసు , భావాలూ ఇవేవీ మనకి పట్టవు. వాదినో రోబోలా  తాయారు చేయడం లో మనం చాల గొప్ప పాత్ర పోషిస్తున్నామని అనుకుంటున్నాము , తల్లి తండ్రులుగా సమాజ హితైషులుగా. కానీ ఎంత మంది మగ పిల్లలు ప్రేమ రాహిత్యం తో ఇళ్ళకూ తమ వాళ్ళకూ దూరమై స్వచ్చమైన ఓ ప్రేమ పూరిత  పలకరింపు కోసం స్నేహం కోసం అర్రులు చాస్తున్నారో ఎవరో ఎందుకు మన పిల్లాడినే మనం అర్ధం చేసుకోలేక పోతున్నాము. వాడు ఎవర్నైనా ప్రేమించాడని చెప్పగానే విరుచుకు పడి పోతాము, తప్ప మనం వాడికి ఇవ్వలేనిదేదో  వాడు  వెతుక్కున్నాడని సరి పెట్టుకోలేము. 
మన ఆహాలకి అభిజాత్యాలకి కన్న ప్రేమ అని , సంప్రదాయమనీ, ఇలా ఏవేవో ఆత్మ వంచన చేసుకునే కుంటి సాకులు చెప్తుంటాము. 

పెద్దలు చేసిన పెళ్లి  చేసుకుని పదేళ్ళైన ఒక జంటనదిగి చూడండి ఒక వేళ మీకు ప్రేమించి పెళ్లి చేసుకోమని అవకాసమిచ్చి ఉంటే ప్రేమించి పెళ్లి చేసుకునేవారా? అని తప్పకుండా అనే సమాధానం వస్తుంది.అలాగని వాళ్ళు కాపురం బాగులేదని  కాదు ప్రేమ అనే ఆ అద్వితీయ భావన ని ఆస్వాదించి ఒకర్నొకరు అవగాహన చేసుకుని  పెళ్లి చేసుకోవడం ఎందుకిష్టముండదు ఎవరికైనా. కానీ చాల మంది పరిస్తితుల ప్రభావం వల్లనో కుటుంబ౦ వల్లనో ఎందుకులే రిస్క్ అనే ఒక భావన  వల్లనో పెద్దవాళ్ళు కుదిరిస్తే వాళ్ల సప్పోర్ట్ ఉంటుంది కదా అనే ఆలోచనతోనో ఇప్పటికీ పెద్దలు చేసే పెళ్లి నే ఇష్టపడుతున్నారు  . ఎక్కువమంది తమకి ఫలానా  వారు ఇష్టమని  చెప్పి ఒప్పించి చేసుకుంటున్నారు. సమాజం లో తలి తండ్రులు నేటి తరం లో అంటే నలభై అరవై ల మధ్య లో ఉన్నవారి లో కూడా చాల మార్పు వస్తోంది స్పష్టంగా కనిపిస్తోంది. ఎక్కడో తప్ప కాస్త చదువుకున్న తల్లితండ్రులు ఇంగితం తో నే ప్రవర్తిన్స్తున్నారు. ఎందుకంటే పెళ్లి ఒకప్పటి లాగా జరగాలంటే ఇప్పుడు కుదరదు , మన కట్టు  బొట్టు ఆచార వ్యవహారలేలా మారుతున్నాయో, అలాగే మన మనో భావాలూ   కూడా నేడు మార్పు చెందుతున్నాయి. దీన్ని సహృదయం  తో అర్ధం చేసుకున్నవారు సుఖ పడుతున్నారు లేని వారు తాము బాధ పడి పిల్లల్ని బాధ పెడుతున్నారు. 
మానవ సంబంధాలలో అతి ముఖ్యమైన స్త్రీ పురుష సంబంధం లో పెళ్లి అనేది ఒక జీవన  అవసరం. మనిషి ఒంటరి గా మనలేడు కనుక. దానికి ముఖ్య ఇంధనం ప్రేమ .
ఇది  లేని వివాహమే కాదు ఏ సంబంధము నిలవదు. బలవంతంగా తమ కిష్టం లేని పెళ్లి చేసిన  తలి తండ్రుల పట్ల వారెంత చేసినా పిల్లలికి ప్రేమ కలగదు. ఉన్న ప్రేమాభిమానాలు కూడా పోతాయి. 
వాలెంటైన్స్ డే అనగానే హోటళ్ళూ పార్కులూ ప్రేమికుల కోసం ముస్తాబై సింగారించుకుంటే . పోలీసులు, సాంప్రదాయ రక్షణ సంఘాలు( అది వారి భావన) , లాంటివి అప్రమత్తమై పోతున్నాయి. ఎక్కడ ప్రేమికులు దొరికితే లేదా ఆడా మగా దొరికితే వారిని ఆ రోజు హింసించి వారేదో సమాజ రక్షకులుగా, కొందరు నిఘా కూడా వేసి ఉంచుతున్నారు. ఇంత విద్యా  వంతమైన సమాజం లో ఇది అవసరమా చెప్పండి? అంటే కొంతవరకు అవసరమే ఎందుకంటే ఇదే పేరున జరుగుతోన్న వ్యభిచారాలు ఆడపిల్లల పట్ల అత్యాచారాలు కూడా మితి మీరుతున్నాయి. కనుక సమాజ౦ లో ఈ జాగురూకత తప్పదు. అలాగని  మరీ యువత చేసే ప్రతి పనినీ మనం హేళనగా చూడటము తప్పే. 
ఏ సంప్రదాయమైన ఆయా దేశ కాల మన మానవ స్వభావ రీత్యా ఆవిర్భవిస్తాయి. అందుకే పశ్చాత్యుల్లో డేటింగ్  అనీ ఒకరిని ఒకరు అర్ధం చేసుకుంటే కానీ పెళ్లి చేసుకోకూడదని ఒక భావన. అదేమీ ఆచారము కాదు. మనలాగా పెద్దలు కుదిర్చిందే పెళ్లి అనేది కూడా చాదస్తమే. మారుతున్న కాలం తో ఇన్ని మారగా లేనిది వివాహ   విషయం వచ్చేసరికి  వారికిచ్చిన స్వేచ్చను లాగేసుకుని పాపం పిల్లల మనసులకు తాళాలు బిగించే పెద్ద్దలూ మారాలి అలాగే, దొరికిన స్వేచ్చ్చాను దుర్వినియోగం   చేసుకోకుండా ప్రేమ పట్ల జీవితం పట్ల వివాహ వ్యవస్థ పట్ల ఒకరి నొకరు సరి అయిన అవగాహనతో యువత మెలిగిన నాడు ప్రేమికుల రోజు నిజంగా స్వర్గం లో నుండే ఆ వాలెంటైన్ తాను తన ప్రేయసికి రాసుకున్న ప్రేమ లేఖల ద్వారా ప్రపంచానికిచ్చిన సందేశం సఫల మైనందుకు ఆనందిస్తాడు. 

దేన్నైనా తీసుకోవల్సినంత మేరకు స్వీకరించగలిగితే ఎవరికీ నష్టం ఉండదు. అతి ఏవ వర్జయేత్ అని ప్రేమికుల రోజంటూ స్నేహితుల రోజంటూ పేరు చాటున అకృత్యాలు చేసే వారి పై న సమాజం చట్టం ఎప్పుడూ ఓ కన్ను వేసి ఉంచడం కూడా అవసరమే. నేను ప్రేమిస్తున్నాను అని అనుకునే వ్యక్తి తన ప్రేమ తనకు బలమా బలహీనతా అన్నది అవగాహన చేసుకుంటే చాలా నేరాలు. ఘోరాలూ. అఘాయిత్యాలూ ఆత్మ హత్యలూ ఉండవనే నా నమ్మకం. ఇటీవలే ఒక ఆత్మీయురాలు చెప్పిన మాటలతో ముగిస్తాను. తను అందిలా, "ప్రేమ అంటే ఆత్మ బలం, అది మనం ఒకరికి ఇవ్వగలగాలి ,  సంపూర్ణ సమర్పణే  కాదనను అయినా మన అస్తిత్వాన్ని స్తిరత్వాన్ని  కోల్పోకుండా మెలగాలి , అంతేగానీ మనల్ని మనం కోల్పోవడం కాదు " నిజమే అనిపించింది. ఎవరికి వారు వారి స్వీయానుభవాలు  అనుభూతులతో కాలం డైరీ లో చేసి వెళ్ళే ఒక ప్రత్యేక సంతకం ప్రేమ. ప్రేమించడం తప్పు కాదు. కానీ ఆ ప్రేమ పేరిట మనిషి రాక్షసుడిగానో , లేదా జీవితాన్ని నాశనం చేసుకునే దేవదాసు గానో కాకూడదు. "ప్రేమ " నే ఈ రెండున్నరాక్షరాల చిన్న మాట విశ్వ మంతటినీ  నడుపుతోంది. 
ప్రేమ ఉన్మాదం ఉద్రేకం కానన్నాళ్ళూ పిల్లలే కాదు అందరం ఈ ప్రేమికుల  రోజును జరుపుకుందాం సహృదయం తో సద్భావన తో మన తరవాతి తరం పట్ల మన విశ్వాసాన్నినిరూపించుకుందాం. అంతే కానీ ఇదిగో రేపు వాలెంటైన్స్ డే అని ఇల్లు కదిలావా కాల్లిరగ్గోడతాను అన్నామనుకోండి పిల్లలతో , వాళ్ళు తప్పక తిరగబడి తీరుతారు. ఇది మానవ సహజ స్వభావం. ఏదైతే వద్దంటారో అదే చెయ్యడం . ఏం నేటి తాతలూ. తండ్రులు తరం కూడా ఒకనాటి యువతరమే కదా ఒక్కసారి అక్కడికెళ్ళి ఆలోచించండి మనం మాత్రం మన అమ్మ నాన్నల్ని తిట్టు కోలేదూ. వారికీ తెలియకుండా తప్పులు చేయలేదూ? అందుకే అన్నారు పెద్దలు తింటే ఫలహారాలు పిన్నలు తింటే చిరుతిళ్ళూ అని ..దయ చేసి ఒక్కసారి తలితండ్రులూ ఒక్కసారి అలోచించి అర్ధం చేసుకుని పిల్లలికి ఒక నమ్మకాన్నివ్వండి నేటి తరానికి కావాల్సిన ఇంధనం అదే. అలాగే పిల్లలూ మీరు అలోచించి అమ్మ నాన్న మన మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోండి. ప్రేమించండి తప్పులేదు , కానీ ఆ ప్రేమ ను కాపాడుకోండి, అందుకు ఏ డేలు జరుపుకున్న మీ ఇష్టం మనసులకు 
ప్రేమకు డూమ్స్ డే మాత్రం తీసుకురాకండి. ప్రేమికులందరికీ ప్రేమాయుష్మాన్భవ !!!
..................................................................................................................జగద్ధాత్రి 

 Reply