Monday, July 30, 2012


  1. తొమ్మిది  పదుల రావిశాస్త్రి తొమ్మిది ఋక్కులు

రాచకొండ విశ్వనాధ శాస్త్రి కధన శైలికి , ఇతి వృత్తాలకి , కధన రీతికి ముగ్ధు డవని తెలుగు పాఠకులు ఉండరు. ప్రపంచం లో రెండే రకాల మనుషులుంటారు ఒకరు డబ్బున్నోళ్ళు మరొకరు డబ్బు లేనోళ్ళు అంటాడు కమ్మ్యునిసం చదువుకున్న రావి శాస్త్రి. చిన్నప్పుడే ఈ మాట భావన తన మనసులో బలంగా ముద్ర పడిన వాడు ,సాహిత్యాన్ని ప్రవృత్తిగా స్వీకరించిన నాటికే తను ఎటు  వైపు నిలబడాలో నిర్ణయించుకున్న వాడు తన మనసులోనే ఒక మానిఫెస్టో తాయారు చేసుకున్న వాడు రావి  శాస్త్రి అనడం లో ఎక్కడ సందేహం లేదు. శ్రీ శ్రీ కంటే పదమూడేళ్ళు చిన్న వాడు వయసులో రావి  శాస్త్రి. అతను అభిమానించే కవుల్లో శ్రీ శ్రీ కి ప్రధమ స్థానం ఉంది. రచయితను రచయితగానో , వ్యక్తిగానో అంచనా వెయ్యడానికి కొలమానపు  రాళ్ళు  వెదికే మనం , రచయితను  పాఠకుడిగా అంచనా వెయ్యడానికి ప్రయత్నిస్తే అతని శైలి లో, సాహిత్యం లో తను చదువుకున్న వారి శైలి లేదా ఇతివృత్తాలు, సమాజానికి ఉపయోగపడే ఇతరత్రా విషయాలు మనకి అవగత మౌతాయి. అప్పుడు ఆ రచయితని మనం ఒక సమగ్ర పరిశీలన చేసిన వారమౌతాము . రావి శాస్త్రి లో మనకు శ్రీ శ్రీ ప్రతిబింబం కనబడుతుంది. అలాగే తను చదువుకున్న మనోవైజ్ఞానిక విషయ పరిజ్ఞానము , తనని ప్రభావితం చేసిన రచనలు, రచయితలు కనబడుతూనే ఉంటారు కానీ రావిశాస్త్రి గారు తన జ్ఞానాన్ని ఆవిష్కరించిన  తీరు ప్రశంసనీయం. ఎక్కడా ఎవ్వరూ అనుకరించలేని శైలి లో ఏ అధో జగత్ సహోదరులను గూర్చి శ్రీశ్రీ రాసాడో వారి బతుకుల్లో కష్టాలని నష్టాలని ఎంతో ఒడుపుగా కధ లలో ఇమిడ్చి చెప్పిన వాడు రావి శాస్త్రి.

మహా ప్రస్థానం నాటికీ శ్రీశ్రీ మర్క్సిసం చదువుకోలేదు, ఉద్రేక పూరితమైన యువకుడిగా హంగ్రీ తర్టీస్ లో ప్రపంచం తీరు గమనించిన వాడై తన మహా ప్రస్థాన గీతాలు రచించాడు. రావి శాస్త్రి వరకు వచ్చేటప్పటికి దిశా నిర్దేసనం జరిగి పోయింది. తను సమాజం లో ఏ వర్గం వైపు వెన్నుదన్నుగా నిలబడాలో సుస్పష్టంగా ఎరిగినవాడై కధన రంగాన దూకిన వాడు రావి  శాస్త్రి. మనో విజ్ఞాన శాస్త్ర ప్రకరం చూసినా ప్రపంచం లో రెండే  రకాలైన మనుషులుంటారు. ఒకరు ముందుకు దారులు వేసే  మరొకరు వారిని అనుసరించేవారు. ఇది శాస్త్రి గారి కధల్లో మనకి బాగా విదితమౌతుంది. ఈ అధికారం , దైహిక బలం , ధన బలం ఉన్న వారు లేని వారిని ఎలా దోపిడీ చేస్తున్నారో ఆ దోపిడీకి గురైన వ్యధార్థుల కధనాలెన్నో  రావి శాస్త్రి మనకి అందించారు. ఇందుకు అతని న్యాయవాద వ్రుత్తి తోడ్పడింది. సమాజాన్ని అతి దగ్గరగా పరిశీలించే ఒక మంచి అవకాశం , గమనించిన విషయాలను అక్షరబద్ధం చేయడంలోనూ రావిశాస్త్రి ప్రతిభ తెలుస్తుంది. 

రావి శాస్త్రికి  శ్రీశ్రీ అంటే ఉన్న వీరాభిమానం చేత తన కధల్లో "ఋక్కులు" అనే తొమ్మిది కధలు శ్రీశ్రీ కవిత ని అనుసరించి రచించి ఆయనకే అంకితమిచ్చాడు.
"కుక్క పిల్ల , సబ్బు బిళ్ళ, ..." కాదేదీ కవితకనర్హం అని శ్రీశ్రీ చెప్తే దాన్ని తన కధలకు శీర్షికలుగా  పెట్టి ఆయా ఇతివ్రుత్తలకు  న్యాయం చేసిన వాడు రావి శాస్త్రి. పేదల కు పెన్నిధిగా అందరు అభిమానంగా "శాత్రి బాబు "అని పిలుచుకునే రావి శాస్త్రి కధలు ఋక్కులు గురించి నేటి తరానికి ఒక చిన్న పరిచయం కలిగించడమే ఈ వ్యాసం ఉద్దేశం.ఋక్కులు లో తొమ్మిది కధలు ఉంటాయి. వాటి పేర్లు కుక్కపిల్ల, అగ్గిపుల్ల,సబ్బుబిళ్ళ, రొట్టెముక్క, , అరటితొక్క, తలుపు గొళ్ళెం, హారతి పళ్ళెం, బల్లచెక్క, గుర్రపు కళ్ళెం . కాదేదీ కవితకనర్హమని శ్రీశ్రీ కవితలో చెప్పినదాన్ని ఒక సిద్ధాంత ప్రతిపాదనతో పేదలపట్ల ధన మదాంధుల ఘోరాలు , నిరుపేదల బ్రతుకుల కష్ట నష్టాలూ, విలువలు వదిలేసి మానవత్వాన్ని మరిచి  సంచరించే నికృష్టుల కధలుగా వీటిని మలచడం రావి శాస్త్రి కే చెల్లింది. 

ఈ కధలు తొమ్మిది టి గురించిన వివరంగా మాటాడు కోవాలంటే ఒకో కధకి ఒకో వ్యాసం రాయాల్సిందే. ఇక సంక్షిప్తంగా ఈ కధల గురించి చెప్పాలంటే ఒకో కధ ఒకో తీరున కధ కధనం కలిగి ఉంటుంది. రాసే కధలన్ని టి లో నూ  ఒకే అంతః సూత్రం కనబడినా ఏ కధకి ఆ కధే ఒక వినూత్న సృష్టిగా అనిపిస్తాయి.
ఉదాహరణకి "కుక్క పిల్ల "కధలో అసలు కధలోకి  ఎలా దిగడమో తెలీక  ఈ విధంగా దిగుతున్నందుకు  పాట్హకులు క్షమించాలి  అంటూ మొదలౌతుంది. ఇంతకీ ఈ కధ గోప్పతనమేంటంటే నేరేషన్ , శైలి , కాసి  గాడి నుండి ప్రకాష్ బాబు గా మారి పోయిన ఓ సిసలైన మోసగాడి కధ ఇది. ఇంగ్లండు , ఫ్రాన్సూ, అమెరికా, జర్మనీ , వగైరా దేశాలన్నీ తిరిగోచ్చీసి మెంటల్ గా ముదిరిపోయి భారద్దేసం  లో దిగిన ఫక్తు సిసలైన గిర్రగాడు గిరీశం , అని చెప్పడం తోనే మనకి గురజాడ కన్యాశుల్కం  లోని గిరీశం లక్షణాలన్ని కలిగి ఉండే వాడు ప్రకాశం అని తెలిసిపోతుంది. "అయితే - ఆ పాత వెధవలూ, ఈ కొత్త వెధవా కూడా ఒక్కలాటి వెధవలేనని టెస్ట్ చేసి చుపెట్టీసింది మధురవాణి", అని చెప్తూనే గిరీశం గాడి  కి అప్పటినుండే గడ్డు రోజులు మొదలైనా ఇంకా మధురవాణి రోజులు రాలేదు అంటూ రావిశాస్త్రి కన్యశుల్కం  లోని ముఖ్య పాత్రలు రెంటినీ రెండు వర్గాలకు ప్రతినిధులుగా తీసుకుని కధ నడిపిస్తాడు. ఇంకా మంచివాళ్ళకు  రోజులు కావన్న విషయం విదితమౌతుంది. 
కధలోకి ఎలా దూక డమో తెలీదని బుకాయిస్తూ, చదువరులను క్షమించ మంటూనే అదాటుగా కధలోకి మనల్ని లాక్కెళ్ళి దూకేయిస్తాడు రావి శాస్త్రి. ఇప్పటి భాష లో చెప్పాలంటే ఇదీ శాస్త్రి గారి కధల్లోని హాల్ మార్క్ . శాస్త్రి గారి స్టైలే వేరు. అందుకే ఈనాటికీ ఎవరూ ఇతని శైలి ని అనుకరించలేకపోయారు. మహా రచయితలు  మానవ సంపద అని మనసు ఫౌండేషన్ వారు రావి శాస్త్రి రచనా సాగరం ముందు మాటలో అన్నట్టు మహా రచయితల రచనలని మనం దక్కిన్చుకొవాలి. అసలు శ్రీశ్రీ ని చదవకుండా కవిత్వము, రావి శాస్త్రిని చదవకుండా మాండలికం లో కధ రాయడము ఏమంత సులువైన పని కాదు. విశాఖపట్టణం మాండలికాన్ని ఎలా  ఔపోసన పట్టేసాడో ఆ రచనా శైలి ఒక ఝరీ ప్రవాహం లా ఎవరి కొరకు రచించాడో వాళ్ళ భాషలోనే వారి గురించి వాళ్ళ  బాధలను జీవిత కధలను బయటపెట్టి వారిలో స్పృహను కలిగించేవి రావి శాస్త్రి కధలు. కుక్కపిల్ల కధ ఆఖరులో చెప్తున్నా  పెద్దమనిషి వింటున్న పెద్దమనిషి దగ్గర ఒకటి అడిగి రెండు సిగరెట్లు తీసుకోవడము , ఇంకా అగ్గిపుల్ల కధ చెప్తాను వినండి అనడం  వినరా  అయితే సరే రాసి చూపిస్తా  అని సో లాంగ్ అని ముగించడము అద్భుతంగా పండుతాయి . నడమంత్రపు సిరి వచ్చిన ప్రకాశం గురించి చెప్తూ అసలు లక్కున్డాలి అంటాడు. నిజమే ఈ రోజు మనం చూస్తున్న ఎందరో ఇలాంటి వాళ్ళు సమజంలో ఉన్నారు . దానికి జావా జీవాల్ని ఇచ్చి ఆ పాత్రల్ని సజీవం చేసిన వాడు శాస్త్రి గారు. చెడుకు చేయూత మంచికి హాని కలగని రచనలను మనకు అందించిన వాడు.
సబ్బు బిళ్ళ కధ గురించి చెప్పాలంటే వంటికి ఇంటికి మురికి అంటకుండా సబ్బు బిళ్లె సివిలైసేషణ్ అని నమ్మే లక్షి౦పతి కుహనా విలువల గురించి, స్వార్ధం గురించి భలే వివరిస్తాడు రచయిత. శీర్షిక సబ్బు బిళ్ళ ఇక ఇందులో ఏమి చెప్తాడా అనే ఉత్సాహం చదువుతున్నవారిలో కలుగుతుంది.
తనకి తన పిల్లలూ ఇల్లూ పరిశుభ్రంగా ఎల్లప్పుడూ ఉండాలని , సమాజం , పేద వర్గాలవారు ఎలా పోయినా ఆ మురికి తనకి తన వారికీ అంట కూడదని తాపత్రయ పడే లక్షి౦పతి , సబ్బు బిళ్లల చోరీ తన ఇంట్లో ఎవరూ చేస్తున్నారో కనిపెట్టిన వైనం లో చివరికి తన చిన్న కూతురే ఆ సబ్బు బిళ్ళలను తీసుకెళ్ళి మురికిగా ఉన్న పేదలకు ఇస్తోందని తెలిసినప్పుడు లక్షి౦పతి మనసులో చెలరేగిన తుఫాను. ఈ పిల్లను ఎలా కట్టు బళ్లోకి తేవడం ? అని ఆలోచిస్తాడు తన చిన్నారి కూతురు శశి గురించి. ఇంకా మాటలు కూడా సరిగా రాని పసికూన నాన్న చెప్పిన పాటాన్నేఎలా పాతిస్తుందో చూసేసరికి 
అమ్మయ్యో రేపు ఇలాంటి వారే ఏ సంఘ సేవ లోనో దిగిపోతారు, లేదా నీతీ నిజాయితీ అంటూ ఏ తిరుగుబాట్లోకో దూరి ఉరికంబమేక్కుతారు, అంటూ విపరీతమైన భయం తో వణికి పోతాడు. చివరికి ఆ పిల్లకి ఎలా చెప్పాలో ఈ విషయాలనీ అర్ధం కాక కోపంగా చూస్తాడు అమాయకంగా ఉన్న కూతురు మొహాన్ని. ఆ అమ్మాయి అలాంటి మురికివాల్లకు ఎందుకు సహాయం చేయకూడదో, అసలు మనుషులు మంచిగా ఎందుకు ఉండకూదదోచేప్పడానికి సరి అయిన  కారణాలు కనిపించవు అతనికి. దాంతో కోపం వచ్చేస్తుంది. కూతురి కళ్ళల్లో నీళ్ళు , "ఎందుకా ఏడుపు?' అంటూ గద్దించిన తండ్రికి సమాధానం చెప్పలేని నిస్సహాయత ఆ కళ్ళలో ఆ కన్నీళ్లు ఎందుకు అని చెప్తే మాత్రం ఇతనికి అర్ధమౌతుంది అంటూ కధను ముగిస్తాడు రచయిత. 

ఇక అరటితొక్క కధలో నిర్లిప్తంగా ఉన్న జగన్నాధం పడవ మునకలో మునిగిపోతున్న  ముసలమ్మను ఎలా కాపాడతాడో చివరికి తన జీవితం లో ఏమి కోల్పోయాడో అది తెలుసుకుంటాడు.అతనికి అప్పుడు కుర్ర మేష్టర్ల ఉపన్యాసాలు గుర్తుకువస్తాయి. ఏది లేక తన బతుకు అసంపూర్ణంగా ఉంది పోయిందో అప్పుడతనికి సుస్పష్టంగా బోధపడింది. ముసలామె లో ఇంకా ఈ ఉడుకు తనం ఎందుకు ఇంకా ఏమి సాధించాలని, తన బతుకులోని ఈ నడివయసులోనే ఈ చావు కోరిక ఎందుకు ఎందుకీ తేడా అని ఆలోచిస్తున్న జగన్నాధానికి జీవితం పట్ల మనిషికి ఉండవలసిన మర్యాద కోరిక తమ జీవితాన్ని ఇతరులకి ఉపయోగపడేవిధంగా ఎలా మార్చుకోవాలో , అసలు జీవన కాంక్ష అంటే ఎంతో బోధపడుతుంది. దీన్నే బెర్నార్డ్ షా "లైఫ్ ఫోర్స్ " అంటాడు తన నాటకాల్లో. జీవితానికో అర్ధం పరమార్ధం ఉండి  తీరాలి. నిస్సహాయంగా నికృష్టంగా చచ్చి పోవడానికి కాదు అన్నా విషయాన్నీ , తన పేదరికం ఆ ముసలమ్మా కష్టాల కంటే ఎక్కువ కాదన్నా ఎరుక కలుగుతుంది అతనిలోనూ, అదే సమయం లో చదువుతున్న వారి లోనూ. కధను నడిపించిన తీరు ఆసాంతమూ ఆసక్తి దాయకంగా ఉంటుంది. రావిశాస్త్రి గారి ప్రతీకల  గురించి , వర్ణనల గురించి ఇక చెప్పనవసరం లేదు. భావ వైరుధ్యం గల  రెండు పోలికలను ఎలా జక్స్టాపోస్ చేస్తారో అని ఆశ్చర్యం కలుగుతుంది. ముసలమ్మ ముగ్గుబుట్టలాంటి తల ఆ ఎండలో వజ్రాల బుట్టలా మెరిసింది, ఈ వాక్యం తో కధ ముగుస్తుంది కానీ మనలో ప్రేరణ మొదలౌతుంది. వయసుడిగిన ముసలమ్మలోని ఆశ నడి వయసులోనే ఏమీ చేయలేని అసహాయ పేద జగన్నాధం లో ఒక కనువిప్పు స్ఫూర్తిని కలిగిస్తుంది. జీవితంలో  పలాయన వాదం కూడదని చెప్పే కధ అరటితొక్క. నిజానికి ఇప్పుడు సినిమా భాష లో మొదలై జనం లో కలిసిపోయిన మాట "తొక్క" అంటే ఏమీ ప్రయోజనం లేని వాటిని ఆ తొక్కలోది అనడం బాగా అలవాటయి  పోయింది . దీనికి ఎప్పుడో అరవైయ్యిల్లోనే రాసిన ఈ కధ ప్రేరణ అనిపిస్తుంది. ఏముందీ తొక్కలో బతుకు అనుకున్నా జగన్నాధానికి జీవితపు  విలువ తెలిసొస్తుంది.
ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా మిగిలిన కధల్లో కూడా ఇలాగే జీవన ప్రతీకలుగా సజీవంగా మనకు దర్సనమిచ్చే ఎన్నో ఉదాహరణలు పాత్రల  రూపం లో కనిపిస్తాయి. నాడు శ్రీశ్రీ సంక్షిప్తంగా కవితల్లో అన్నా మాటకు అతి సరళంగా సహజంగా వస్తావ జీవితానికి అన్వయించి  ఈ తొమ్మిది కధలూ రాసేరు శాస్త్రి గారు . ఈ కదలన్నిటిలోనూ జీవితం పచ్చిగా కనిపిస్తుంది. జీవితం లో మనుషుల ఆవేదన కనబడుతుంది. 
తలుపు గొళ్ళెం కధలో ప్లీడర్ల ను గురించి వర్ణించే తీరు అపూర్వమనిపిస్తుంది. తన వృత్తిలో ఉంటూనే పేదల పట్ల అన్యాయం చేసే దొంగ ప్లీడర్లని వారి సర్కస్ ఫీట్లని ఉతికి అరేస్తారు శాస్త్రి గారు. 
తను గమనించిన సజీవ వేదనలను అంతే సజీవంగా కళ్ళకు కట్టినట్టు చూపిస్తారు. అదో జగత్ సహోదరులు అని శ్రీశ్రీ ఘోషించినా మహా ప్రస్థానం భాష సంక్లిష్టత వలన అందులోని విషయం చదువురాని పేద వాడికి ఎలా బోధ పడుతుంది ,అందుకే శాస్త్రి గారిని మనకిచ్చిందీ  సాహిత్య లోకం. మరింత వివరంగా వారి భాషలోనే వారి కష్టాలను పట్టి చూపిస్తూ  వారు ఎక్కడ ఏ అన్యాయానికి గురి అవుతున్నారో ఆ వర్గాలకు   తాను వ్రుత్తి పరంగానూ ప్రవృత్తి పరంగానూ జీవితం లోనూ సాహిత్యం లోనూ అండగా  నిలిచిన రావి శాస్త్రి మాననీయుడు. రావి శాస్త్రి గారి 90  వ జయంతి సందర్భంగా సందర్భోచితంగా  ఉంటుందని అలాగే ఈ రచనలు  నేటి తరం చదవాలనే ఆకాంక్షతో ఈ చిన్ని వ్యాసపు అద్దం లో కొండంత శాస్త్రి గారిని చూపెట్టే ప్రయత్నం చేశాను. 
.................................................................................................................................................................................జగద్ధాత్రి 30th july 2012....(published in andhrabhoomi daily "sahithi") 


Friday, July 20, 2012

అంతర్యానం



అప్పుడే ఆ క్షణం లోనే
అంతరాంతరాల్లో
భావ బీజావ్యాపన  జరిగే  
ఆ దివ్య క్షణం లోనే 
అదాటుగా  ...
అతను నా దేహాన్ని 
ఆక్రమించుకున్నాడు 
వారించానా....
తగవును వరించానన్న మాటే 
అందుకే నిశ్సబ్దంగా 
నాలోకి నేను జారుకున్నా ...

నాలో కలిగే భావ స్పందనల్ని 
అర్ధం చేసు కోలేడని నాకు తెలుసు 
చెప్పాలని ఉన్నా 
నా లోకం లో నేనున్నా 
నా మనో రోదసి లో 
వ్యోమగామినై 
మెరుస్తోన్నకవిత్వ పాలపుంతను 
ఆవాహన చేస్తున్నా
ఉరికి  దూకుతోన్న 
ఉల్కలై జారిపడుతోన్న
పద నక్షత్రాలను 
మరుపు కృష్ణ బిలం లోకి 
జారి పోకుండా నా 
అంతరంగపు జోలిలో నింపుకుంటూ   
తలుచుకుంటూ పరవశిస్తూ
నే చేసిన కూజితం 
అతని నఖ క్షత గిలిగింత 
అనుకున్నాడు  కాబోలు 
మురిసిపోతూ నవ్వుతున్నాడు 

దేహాన్ని విడిచి నేను 
ఉన్నానని తెలుసుకోలేదతను 
దేహం నాది కానట్టే  ఆవహించిన నిర్లిప్తత  
నా మది లో కైత రస ఝరీ ప్రవాహం 
నా ఎదనిండా కావ్య సాగరతరంగాలు 
ఎగసి ఎగసి పడుతూ 
నన్ను ఉద్దీప్తిస్తూ .....ఉత్తేజిస్తూ....
ఆ సమ్మోహన సమాగం లో నాకు నేనై
పలవరిస్తూ ....కలవరిస్తూ  
నా దేహ సాన్నిహిత్యం లో అతను
ఉద్విగ్నుడౌతూ....ఉద్రేక పడుతూ 
సహకరించని నా దేహాన్ని 
మైమరుపని  తలుస్తూ 

ఎవరి వారి భ్రమలో ...వారి వారి లోకం లో 
ఇరువురమూ రమిస్తూ ...
ఎగసి ఎగసి ....కెరటాలై 
మిన్నును తాకిన 
ఆ చివ్వరి లిప్త ....
అద్వైతానంద అనుభూతి లో నేను 
స్ఖలించిన మగటిమి తో తాను 
ఆనందం తో తృప్తిగా 
విడివడిన ఇరు దేహాలు  ...
భావ ప్రాప్తిలో తాను 
మేధో భావ ప్రాప్తి లో నేను 
అలసటగా వాలిపోయాడతను 
ఆనందంతో .... 
చిదానందానుభుతి తో ...నేను 
వెదికాను కాగితం, కలం కోసం 

ఇద్దరి మొహలలోనూ 
ఆనందం , తవిదీరిన సంతృప్తి 
అతనికి దైహికం 
నాకు ఆత్మికం 
ఇద్దరి వదనాలలో  విరిసిన 
చిరు నగవులు ఒకటే 
కారణాలు వేరు అంతే ....
స్రవించిన వాంఛా వాసన తనది 
ఫలించిన  రస సిద్ధి నాది ...

ఇక మౌనంగా నా అక్షర సాధన ....
ఆతని నిద్రలోని అలసిన గురక వింటూ ...
నాలోకి నేనే పయనించేందుకు 
కలం చుక్కాని పట్టి 
కాగితం పడవలో నా అంతర్యానం ..
అనంత యానం ....
మనిషిగానే  కాక ....
మనిక సార్ధకం చేసుకునేందుకు....
..................................ప్రేమతో ...జగతి 6.54pm Thursday 19th July 2012 

Saturday, July 7, 2012

వెరపు జ్ఞాపకం



ఆ క్షణాలు ...
అవేమీ అంత గొప్పవి కాకపోవచ్చు 
ఎందుకంటే అప్పుడు నా మదిలో 
దిగులు నీడల కారు మేఘాలు కమ్ముకుని ఉన్నాయ్ 
దట్టమైన దుఖపు పొర ఒకటి 
కనీసం మోమాటపు చిర్నవ్వును కూడా
పెదవులపైకి రానివ్వలేదు 
ఎక్కడో ఏదో వెలితి గుండెల్లో భారంగా 
చెప్పే వయసూ లేదు 
మనసూ ఎదగ లేదు 
ఇదే భావం నాన్న కన్నుల్లో 
చూసినప్పటినుండీ
మరింత తూఫానులా
హోరు జడి హృది నిండా
ఏదో చెయ్యాలనే ఆశ 
ఏమీ చేయలేని  నిరాశ
చేయి దాటిపోతోందన్న వగపు 
తెలుస్తూనే  ఉంది ...
ఆ క్షణాలు అందమైనవని కాదు 
అవి పటం కట్టింది 
నాలాగా మరెవ్వరూ 
నాన్న లాగా మరెవ్వరూ 
భయం తోనూ
పనికి రాని గౌరవాలతోను
జీవితాన్ని బలి పెట్టకండి 
అని చెప్దామనే నా బాధ 
చాయా చిత్రాలంటే 
నాకందుకే అంత ఇష్టం 
భావాన్ని అదే లిప్తలో 
పటం కట్టేస్తాయి 
అందుకే అమాయకమైన 
ఆ క్షణాల చిత్రాన్ని 
అపురూపంగా దాచడం
ఈ వెలసి పోయిన 
వెరపు జ్ఞాపకం .... 
నా లాంటి వారెందరికోసమో......!!!! 
......................................ప్రేమతో...జగతి 10.43pm saturday 7th july 2012 
("ఏదో చేయాలనే ఆశ ఏమీ చేయలేని నిరాశ " ఈ మాటలు నావి కావు మా నాన్నవి.... ఆయనకే ఈ కవిత లాంటి ఓ ఆరాట స్పర్శ) 



Wednesday, July 4, 2012

సంధి ...




ఓటమికీ గెలుపుకీ
తేడా లేని ఓ సందిగ్ధ స్థితిలో 
మాటకీ మౌనానికీ 
ఒకటే అర్ధమున్న 
అబేధం లో 
అంగీకార
తిరస్కార పద ముద్రలతో 
నలిగి నలిగి ఉన్న 
హృదయావరణం 
మైల పడుతూ 
గాయపడుతూ 
కూడా ఏదో చెయ్యాలనే 
ఇంగితం ....
ఇంకా చావని ఆశా పాశం 
విశ్వాసాల అపనమ్మకాల 
అసనిపాతాలలో...
కమ్ముకున్న విషవాయువులను
చీలుస్తూ ఎక్కడినుండో 
ఏ చీకటి హృది లోనో 
మేల్కాంచిన ఓ చివురు మెరుపు 
ఓ ప్రాణ భిక్ష ...
అనుబంధాలు మోసం చేసినా 
అక్షరాలూ చెయ్యవన్న 
పరిపూర్ణ విశ్వాసం తో ......
 ఓ కమ్మని తేనియల 
ప్రాణ ప్రసూనం 
అరవిరిసి అందంగా 
తనని వెతుక్కోమని 
దోబూచులాడుతూ 
కవ్విస్తూ ....బతికిస్తూ ...!!! 
......................................ప్రేమతో ....జగతి 9.40pm Wednesday 4th July 2012