Saturday, July 13, 2013

జ్ఞాపకాల అలలు





1) నే వెళుతున్నప్పుడు
నిండిన నీ కన్నులలోని
సన్నని నీటి పొర
నీ జ్ఞాపకం

2) నిశ్చలంగా ఉండే
నీ నిండు విగ్రహం
నా చిరు స్పర్శకి
చలించిన చలి వణుకు
నీ జ్ఞాపకం

3) చెప్పేది వినడం
నేర్చుకో ముందు
అంటూ చిరుకోపం తో
నాకేసి చూపిన తర్జని
నీ జ్ఞాపకం


4) జీవితం ఇంత
శాంతిగా కూడా ఉంటుందా
అనిపించే చక్కని
మనో కుటీరం
నీ జ్ఞాపకం


5)దూరంగా ఉన్నా
నీ ఎదలోని
అలమేలుని నేనేనన్న
కించిత్ గర్వం
నీ జ్ఞాపకం


6) విడి విడిగా ఉన్నా
అనుక్షణం తీరాన్ని
స్పృశిస్తూనే ఉన్న
సంద్రం లా
కలిసి ఉన్నంత సేపూ
నన్ను తాకుతూనే ఉన్న
ప్రియ స్పర్శ
నీ జ్ఞాపకం


7) ఎప్పుడొచ్చేది మళ్ళీ
అని అడుగుతోంది కృష్ణమ్మ
అంటూ వంతెన పైన
నవ్విన నీ నవ్వు
దిగులు నీ జ్ఞాపకం



 నిను తలవగానే
మనసులోని ఎందుకీ అలజడి ?
అని మొద్దబ్బాయిలా
ప్రశ్నించే అమాయకత్వం
నీ జ్ఞాపకం




9) నువ్వున్న కాసేపే
జీవించేది
మిగిలినదంతా
బ్రతకడమే అన్న
ప్రేమ వాక్యం
నీ జ్ఞాపకం



10) అలలుగా ఎగసిపడినా
కదిలి రాలేని
కడలివి నువ్వు
అన్న వెక్కిరింత
నీ జ్ఞాపకం



11) కలసి గడపలేని
కష్టాన్ని గానీ
కాలాన్ని గానీ నిందించలేని
నా అశక్తతకేసి చూసిన
జాలి చూపు
నీ జ్ఞాపకం



12) నా విరివి నీవంటూ
గుండెలకదుముకొని
నా కళ్ళను ముద్దాడిన
మురిపం
నీ జ్ఞాపకం



13) తోటలో పూలను చూస్తుంటే
చటుక్కున దరికి లాక్కుని
ముద్దు పెట్టిన చిలిపి
తుమ్మెద వైనం
నీ జ్ఞాపకం




14) ఆవేదనను ఆసాంతం
అంతరంగాన అదిమి
తప్పక కలుస్తాం మరల
అని ఆశగా పలికే
వరం లాంటి నమ్మిక
నీ జ్ఞాపకం


................... ........................ ప్రేమతో .... జగతి 6. 22 పి .ఎమ్ 11 జూలై 2013 గురువారం

జ్ఞాపకాల అలలు





1) కమ్మని కవిత చదివినప్పుడో
చక్కని చిత్రాన్ని చూసినప్పుడో
మధురమైన గీతాన్ని అలకించినప్పుడో
ఆనందాన్ని నీతో పంచుకోలేని క్షణాన
నిస్సహాయంగా నా కనుల జారే
కన్నీటి బొట్టు నీ జ్ఞాపకం

2) నీకోసమే రచించి
స్వరపరిచిన అనురాగ గీతాన్ని
ఆలపిస్తోంటే ....
నీ విరహం లో పలికే
అపశ్రుతులను ఆపుకోలేని
అసహాయత నీ జ్ఞాపకం

3) జనన మరణ గీతకు నడుమ
నిను చేరలేక వీడలేక
నాలో చెలరేగే
నిరీహ నీ జ్ఞాపకం

4) ఇరువురము పంచుకున్న
మధుర ఘడియలను
తరచి తలచి
మురిసిపోయే ఆనంద
విహంగ వీక్షణం
నీ జ్ఞాపకం

5) నా కురులలో
నీవు విరిజాజులు తురిమిన వేళ
తగిలిన నీ వేల్కొసల
చక్కలి గిలిగింత ....
నీ జ్ఞాపకం

6) మన మధ్య నలిగి పోతాయని
అఘ్రాణించి , తలలోంచి తీసి
దిండు మీద పెట్టిన మల్లెల
అతి సున్నితమైన జాగ్రత్త
నీ జ్ఞాపకం

7) గుడికి తీసుకుపోతానంటే
నవ్వి , దరి జేరి
నా వొడిలో తల ఆన్చి పడుకుని
ఇదేగా అన్న ఆర్ద్రత .....
నీ జ్ఞాపకం 


 కలసి ఉన్న కాలం
కమ్మగా జారిపోతోంటే
ఆపలేక జాలిగా చుసిన
ఆర్తి ...నీ జ్ఞాపకం

9) హృదయానికి హత్తుకున్న
ప్రతి సారీ కరిగి కన్నీరై పోయిన
తీయని నీ ఆనంద బాష్పం
నీ జ్ఞాపకం

10) బయట కురుస్తోన్న వాన
పరవశిస్తోన్న ప్రకృతి
నీవు దరి లేవన్న
దిగులు బీటలు వారిన
బీడు ఎద ఎదురుచూపు
నీ జ్ఞాపకం

11) చినుకుల శృతి లయలలో
వినిపించే గుండియల
సందడి .....
నీ జ్ఞాపకం

12) నిలువెల్లా తడిసిన మల్లె తీగెను
నీ చేతితో కదిలిస్తే
నా పై చిలికిన పరిమళం
నీ జ్ఞాపకం

13) అద్దమే అక్కరలేదా
అని నువ్వడిగితే
నీ కనుదోయి
ఉండగా ఇంకెందుకని
చిర్నవ్విన నీ పెదవి
నీ జ్ఞాపకం

14) మరుని విరి శరముల
యుద్ధం లో ఇరువురము ఓడి
విజయ గర్వం తో
మీసం మేలెసిన
మగసిరి ... నీ జ్ఞాపకం

15) నీ స్వరం వినినంతనే
విరజాజుల్లా జలజలా
రాలే ఉలిపిరి చినుకులు
నీ స్మృతులు

....................... ...................... ప్రేమతో ..జగతి 7. 44 పి .ఎమ్ 10 జూలై 2013 బుధవారం

అలలు (మళ్ళీ చాలా రోజుల తర్వాత )




1) ప్రేమంటే అనుక్షణం
ఆరాధించడం అనుకున్నానే కానీ
నా అనురాగం అవతలి వారికి
వేధింపు అవుతుందని
నిజంగా ...తెలియలేదు ఇంతవరకు

2) కోపాలని పెంచుకుని
మాటల్లేకుండా , మొహాలు చూసుకోకుండా
ఎలా గడుపుతారీ మనుషులు
ఉన్న సమయమే ఇంత కొంచమైనప్పుడు
తగవులతో వ్యర్ధం చేసుకుంటారు ఎందుకో ?

3) ప్రతి కలయికా విడి పోవడానికే
అంటారు , నిజమే
కానీ కలసి ఉన్న ఆ కమ్మని ఘడియల్ని
హృదిలో పదిలపరుచుకోరెందుకు ?

4) ఏ పరిచయమూ యాదృచ్చికం కాదు
మన కన్నా ముందే బ్లూ ప్రింట్
వేసేసాడు ఆయన అక్కడ
దాన్ని దాటడం మన తరమా ?

5) సృష్టిలో అన్నిటినీ అందరినీ
ప్రేమించాలి సుమా అంటూ బోధించి
మరొక గురువు దగ్గరకు వెళ్ళినందుకు
తమ శిష్యులను శిక్షించే గురువులెందరో
మన ప్రపంచం లో

6) ప్రేమిస్తే విస్తరించాలి గానీ
మరింతగా స్వార్ధం తో
కుంచించుకు పోతున్నారెందుకో
తరాలుగా ఈ మనుషులు

7) ఎంత తగవులాడుకుని
ఎన్ని మాటలు పడినా
వెను వెంటనే అన్నీ మరిచి
అదే మనిషి తో మాట కలిపేస్తాను
ఇది నా బలమో? బలహీనతో ?


 నేను అందరికంటే భిన్నం
అనుకుంటాడు ప్రతి మనిషీ
అదేనేమో ఈ తగవులన్నిటికీ
మూల కారణం

9)అనురాగానికి ఆంక్షలు
ప్రేమకు పరిమితులు
మనుషుల నడుమ తారతమ్యాలు
కలిగించడం కంటే
ప్రాణాంతకమైన వైరస్
మరోటి లేదు సుమా

10) ఒకరిని ప్రేమిస్తే
మరొకరు మనసులో ఉండ కూడదా
అని ప్రశ్నిస్తే అది విశృంఖలత్వం స్త్రీకి
అదే మాట పురుషునికైతే
విశాల హృదయుడు
ఎంత మంచి ధర్మం మనువుది ?

11) ప్రేమంటే మనం ప్రేమించే మనుషులు
మనతోనే ఉండి పోవాలని
కోరుకోవడం కాదు
మనం ప్రేమించి , మనల్ని ప్రేమించే వారు
ఎక్కడున్నా ఆనందం గా ఉండాలని
ఆశపడటం , ప్రార్ధించడం

12) స్వార్ధం, కోపం , కసి
ద్వేషం , కార్పణ్యం ,కక్ష
ఆహా ఎన్నెన్ని ముక్కలుగా
కోస్తున్నామీ మనవ హృదయాన్ని
రోజుకి లక్ష బై పాసులు చేస్తూ ...

13) అనురాగ కుసుమ నైర్మల్యాన్ని
ఆత్మ వంచన పంకిలం లో
ఎంత బాగా తోసేస్తామో
మనకి మాత్రమే చెందాలనే
స్వార్ధ చింత తో

14) అనుభవిస్తోన్న కాసిన్ని క్షణాలు
అనుభూతిస్తోన్న దివ్యానుభూతులు
మది పేటికలో భద్ర పరుచుకోక
వాడి పొయిన పూలలా
పారేసుకుని దు:ఖిస్తారు కొందరు

15) జీవనపు ప్రతి క్షణమూ
ఒక అల వంటిదే
ఏ ఒక్క అలా తిరిగి రాదు
ప్రతి అలా వినూత్నమే
అనుక్షణం నిత్య నూతనమే

16) అపుడపుడూ ఎగసి పడే
ఈ అక్షర కెరటాలు
ఎద మాటున దాగిన
మానస భావ తరంగాలు
ఆటు పోట్లుగా ఒక్కోసారి
అల్ప పీడనాలుగా ఒకోసారి
ఆనంద తాండవ లయలుగా
విషాద విలయాలుగా ఇలా ....

...................................... ప్రేమతో జగతి 4.20 పి .ఎమ్ . జూలై 9 మంగళవారం 2013

భారతీయాంగ్ల రచయిత్రులు (5) అనితా దేశాయి



భారతీయాంగ్ల  సాహిత్యానికి ఒక కొత్త కోణాన్ని , ఆలోచనని , దృక్పధాన్ని కలిగించిన రచయిత్రి అనితా దేశాయి. అనిత దేశాయి పేరు వినగానే ఆమె సుపుత్రిక కిరణ్ దేశాయి గుర్తురావడం సహజం . బూకర్ ప్రైజ్ కి మూడు సార్లు షార్ట్ లిస్ట్ అయినప్పటికీ తల్లిని వరించని పురస్కారం తనయను వరించించింది. అయితే అనిత దేశాయికి చాలా పురస్కారాలు లభించాయి , సాహిత్య అకాడెమీ పురస్కారం, గార్డియన్ పురస్కారం ఇలా ఎన్నో. రూత్ ప్రవర్ జబ్వాల  నవలల్లో సామాజిక పరిస్థితుల ప్రభావాన్ని ఎక్కువగా చిత్రీస్తే, కమలా మార్కండేయ  పాత్రల సామాజిక, రాజకీయ, ఆర్ధిక , వర్గ వర్ణాల  కనుగుణంగా పాత్రాలను చిత్రీకరిస్తే , అనితా నవలలు మనిషి అంతర్మధనాన్ని, అంతరంగ చిత్రాన్ని , లోలోపలి వేదనకి అద్దం పడతాయి. ఈ విధంగా మొట్ట మొదటి సారి ఒక కొత్త కోణాన్ని పాత్రలకు , అభివ్యక్తి ని  ఇచ్చినది అనితా దేశాయి. 
అనితా దేశాయి జీవిత వివరాలు :.
అనిత ముజుందార్ జూన్ 24 నా 1937 లో ముస్సూరి లో జన్మించారు. ఆమె తల్లి టోని నైమ్ (జర్మన్ దేశీయురాలు ), తండ్రి టి.ఎన్. ముజుందార్ , బెంగాలీ , వ్యాపారస్తుడు. ఇంట్లో జర్మన్ మాటలాడుతూ పెరిగినా , బయట హింది , ఉర్దు , బెంగాలీ భాషల్లో ఆరితేరిన ప్రజ్ఞ సంపాదించుకుంది ఆమె. జర్మన్ తన మాతృ భాష అయినప్పటికి ఆమె జర్మని తన జీవితం లో చాలా కాలం తర్వాత వెళ్లింది స్కూల్  లో అభ్యసించిన ఇంగ్లిష్ ఆమె సాహిత్య భాష గా ఎంచుకుంది. ఏడేళ్ళ వయసులోనే రాయడం ప్రారంభించి తొమ్మిదేళ్ల వయసులో తన తొలి కధను ప్రచురించగలిగిన బాల సాహితీ వేత్త అనితా . 
ఢిల్లీలో క్వీన్ మేరీ హైయార్ సెకండరీ  స్కూల్ లో విద్యార్ధి గా చదివింది. బి.ఏ. ఇంగ్లిష్ సాహిత్యం లో మీరాండా హౌస్ , ఢిల్లీ విశ్వవిద్యాలయం నుండి 1957 లో పట్టా పొందింది . 
ఆ మరుసటి సంవత్సరమే అశ్విన్ దేశాయి అనే కంప్యూటర్ సాఫ్ట్ వేర్ కంపనీ డైరెక్టర్ ని వివాహం చేసుకుంది . అశ్విన్ దేశాయి “ బిట్వీన్ ఏటేర్నిటీస్: ఐడియాస్, లైఫ్ అండ్ డ కోస్మోస్” అనే పుస్తక రచయిత కూడా. వారికి నలుగురు సంతానం. అందులో ఒకరే కిరణ్ దేశాయి.
ప్రతి వారాంతమూ పిల్లల్ని థల్(ఆలీబాఘ్, దగ్గర), తీసుకు వెళ్ళడం అలవాటు ఆ దంపతులకి. అదే ప్రదేశాన్ని తన నవల “ డ విల్లెజ్ బై ద సీ “ లో ఆమె రాసింది. ఆ నవలకు ఆమెకు గార్డియన్ చిల్డ్రెంస్ ఫిక్షన్ ప్రైజ్” 1983 లో లభించింది. 
దేశాయి తన మొదటి నవల “ క్రై, ద పీకాక్” 1963 లో ప్రచురించింది. క్లియర్ లైట్ ఆఫ్ డే” (1980) వచ్చిన తన రచన తన జీవితానికి దగ్గరగా , ఎక్కువగా వైయుక్తికమైన జీవితని గురించి , తను పెరిగిన పరిసరాలను గూర్చి ఉంటుందని తానే పేర్కొంది. 1984 లో “ ఇన్ కస్టడీ” అనే నవల ప్రచురించింది. ఈ నవలను ఇస్మాయిల్ మెర్చంట్ సినిమా గా కూడా మలిచారు.  ఈ నవల ఒక ఉర్దు కవి తన జీవన పతన దశలో ఉన్నప్పటి పరిస్థితుల విషయాంశం కలిగి ఉంటుంది. ఈ నవల అప్పుడు బూకర్ ప్రైజ్ కి షార్ట్ లిస్ట్ అయింది. 1993 లో మాసచ్యుటేశ్  ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ లో సృజనాత్మక రచనా విధానాన్ని బోధించే ఉపాధ్యాయురాలిగా ఉద్యోగాన్ని మొదలుపెట్టింది. ఆమె నవల ద జిగ్ జాగ్ వే “ 20 వ శతాబ్దపు మెక్సికో ప్రదేశంగా రాయబడింది. ఆమె తన ఆఖరి కధా సంపుటి ద ఆర్టిస్ట్ ఆఫ్ డిసప్పియరెన్స్” 2011 లో ప్రచురించబడింది.  75 వత్సరాల అనితా దేశాయి , తన  కుమార్త్ర్ కిరణ్ దేశాయి బూకర్ ప్రైజ్ సాధించిన వైనాన్ని చాలా ఆనందంగా గౌరవంగా భావిస్తుంది. 
అనిత దేశాయి సాహిత్యం లో ముఖ్యమైనది క్రై, ద పీకాక్” 1963 లో ప్రచురించ బడిన ఈ నవలకి ఈ 2013 కి 50  వత్సరాలు పూర్తవుతాయి. ఈ నవల ఆమెకు ఆర్జించిన కీర్తి ప్రతిష్టా  ఆమెను ఒక విభిన్న మైన రచయిత్రిగా , విశిష్టంగా నిలబెట్టింది భారతీయాంగ్ల సాహిత్యం లో . 
ఇంతగా మనం చెప్పుకుంటున్న ఆమె నవల గురించి కొంచం మాటాడుకుందాం.
క్రై, ద , పీకాక్” (1963) అనిత దేశాయి మొదటి నవల :
ఈ కధ లో ని నాయిక పాత్ర పేరు మాయ. ఈ కధాంతా ఆమె గౌతమ అనే తన భర్తతోటి వైవాహిక జీవితాన్ని గురించే  ఉంటుంది. ముఖ్యంగా ఎక్కువగా గత స్మృతులే ఈ కధానిండా ఉంటాయి. మాయా మనసులోని అంతర్మధనం, ఆమె ఆలోచనా ధోరణి ఇవన్నీ చిత్రీకరిస్తుంది రచయిత్రి. ఇది ఆ రోజుల్లోని చాలా పేరు సంపాదించిన నవల. ఇప్పటికీ అనితా దేశాయి పేరు చెప్పగానే ఈ నవల పేరు వెనువెంటనే గుర్తు రావడమ్ పరిపాటి. 
తన లోకి తాను చూసుకోవడం, తన జీవితాన్ని తాను గా అంచనా వేసుకోవడానికి ప్రయత్నించడం , తనలోని సంఘర్షణలని విశ్లేషించుకోవడమే మాయ పాత్రలో కనిపిస్తుంది. కధా ప్రదేశం ఢిల్లీ లోనే అయినప్పటికి , ఎక్కడో కొన్ని చోట్ల తప్ప ఆ విషయాలు కనబడవు. ఇది కేవలం ఒక స్త్రీ అంతర్వేదన కు సంబంధించిన ఇతివృత్తం. 
తన భర్త గౌతమ ఒక పేరొందిన లాయర్ , ఎప్పుడూ తీరిక లేకుండా గడిపే వ్యక్తి. కధ మొదలవడం మాయా ఇష్టమైన కుక్క పిల్ల చనిపోవడం తో మొదలౌతుంది. తను పెంచుకున్న కుక్క మరణం మాయా లో ధు:ఖాన్ని , ఒక విధమైన భయాన్ని సృష్టిస్తుంది. 
తనకీ భార్యకీ ఉన్న వయసు ఎక్కువ వ్యత్యాసం చేతనో , మరేమో గౌతమ తన భార్యని అంతగా పట్టించుకున్నట్టు ఉండడు. భార్య భర్తల మధ్య ఎక్కువ వయో బేధం ఉండడం వారి దాంపత్యం లో ఒక పెద్ద లోటుగా ఉంటుంది. అది పూడ్చలేని అగాధం లా ఉంటుంది మాయాకి . ఇంటిలోని నిశ్శబ్దం భయంకరంగా అనిపిస్తుంది. దానికి తోడు చనిపోయిన కుక్క పిల్ల జ్ఞాపకాలతో పాటు ఇంకా తన బాల్యం యవ్వనం గతం లోకి వెళ్ళి పోతుంది మాయా . 
ఎప్పుడో చిన్నప్పుడు తన ఆయా తో కలిసి ఒక జ్యోతిష్కుని దగ్గరకు వెళ్ళడం ,అతను పెళ్లై నాలుగేళ్లకు నీకు గానీ , నీ  భర్తకు  గానీ మృత్యువు తప్పదు అని చెప్పడం , ఇవన్నీ గుర్తొస్తాయి మాయాకి. ఇప్పుడు సరిగ్గా పెళ్ళయి నాలుగేళ్లైంది అంటే ఆ జ్యోతిష్కుడు చెప్పింది నిజమౌతుందా , అయితే ఎవరు మరణించేది ? తానా , గౌతమా? ఇలాంటి ప్రశ్నలన్నీ వేధిస్తుంటాయి. 
తన కన్నా బాగా దాదాపు తండ్రి వయసు ఉన్న భర్త తనని పట్టించుకోకపోవడం, ఎక్కువగా తన పని లేదా అధ్యాత్మిక రచనలు భగవద్గీత చదవడం వంటి వాటిలో నిమగ్నమై ఉండటం మాయా ను కలవర పరుస్తుంది. తీవ్రమైన లైంగిక అసంతృప్తికి గూడ గురి చేస్తుంది. ఆ బాధలో తన తండ్రితో గడిపిన జీవితమే బాగా అనిపిస్తుంది. ఒక నాడు గౌతమా అంటాడు నీకు తండ్రి ప్రేమ (ఎలెక్ట్రా కాంప్లెక్స్) అంటే తండ్రితో లైంగికపరమై ఆలోచనలు కలిగి ఉండటం (ఫ్రాయిడ్ ప్రకారం ) కలిగి ఉన్నావు కనుకనే నీ తండ్రి  వయసు వాడిని  పెళ్లి చేసుకున్నావు అని. కానీ మాయ ది కేవలం అదొక్కటే సమస్య కాదు , చిన్నప్పుడు విన్న బొల్లి మచ్చల జ్యోతిష్కుడు చెప్పిన చావు గురించి , ఇప్పుడు తన జీవితం గురించి , గౌతమా నిర్లక్ష్యం గురించి , తన గత జీవితపు జ్ఞాపకాల గురించి వీటన్నిటినీ కలగలిపి ఆమె హృదయాన్ని అతలాకుతలం చేసి హిస్టీరికల్ గా మారుస్తాయి. 
నెమళ్లు ప్రేమించుకునే ముందు ఒకనికొకటి చంపుకుంటాయట, ఒంటి బాధ భరించలేక చచ్చిపోతాయట , ఇలాంటి భ్రమలూ బాధలూ అన్నీ ఆమె మనసు ఆవరించి , వంటి మీద  తేళ్లూ, జెర్రులూ, బల్లులూ, పాకుతున్నట్టు అసలు నిద్ర పోవడమే పాపమైనట్టు బాధ పడుతుంది. తన అత్తగారు , ఆడపడుచు వచ్చినప్పుడు వారితో కాస్త సమయం హాయిగా గడుస్తుంది మాయాకి . మళ్ళీ వాళ్ళు వెళ్ళగానే ఒంటరి తనం . ఇది ఆ నాటి చదువుకున్న , నగరం లో  కాపురానికెళ్లిన స్త్రీ మానసిక ఒంటరితనానికి ప్రతీకగా చూపిస్తుంది అనిత. పుట్టింటి అలవాటైన వాతావరణాన్ని కోల్పోయి ఎక్కడో భర్త ఇంటిలో ఒక అనామకురాలిగా ఎవరూ పట్టించుకోని జీవితం గడపటం మాయా ధు:ఖమంతా . దీనికి తోడు తన భయాలను కూడా కలుపుకుని బాధ పడుతుంది. 
పెళ్ళైన నాలుగేళ్ళకి తనో లేక భార్తో చనిపోతారు అన్నాడు కదా ఆ బొల్లి మచ్చల జ్యోతిష్కుడు , అయితే ఆ చచ్చిపోయేది తానే ఎందుకు కావాలి , తనాకింకా బతకాలని ఆ ఉంది , జీవన కాంక్ష ఉంది , గౌతమా కి అదేమీ  లేదు , ఎప్పుడూ అధ్యాత్మికంగా ఉంటాడు. మరి ఆ చావు తనకే వస్తే అన్న ఆలోచన ఆమె మెదడుని దొలిచేస్తుంది . మళ్ళీ అలా ఆలోచించినందుకు గిల్టీ గా అనిపిస్తుంది. ఇలాంటి సందర్భం లో ఒక రోజు గాలి ఇసుక తుఫాను రేగి మధ్యాహ్నం సాయంకాలానికి చల్లా బడుతుంది . ఇదేమీ గమనించని గౌతమా తన పనిలో నిమగ్నమై ఉంటాడు . డాబా మీదకి వెళ్ళి చల్లా గాలి పీల్చుకుందామని అతన్ని తీసుకెళుతుంది మాయా . అక్కడ తనకి చంద్రుడు కనబడకుండా అడ్డుగా ఉన్నాడని డాబా అంచున నిలబడిన గౌతమ ని కిందికి తనకి తెలియకుండానే తోసేస్తుంది. ఇది ఈమె మానసిక ప్రవృత్తికి పరాకాష్ట. 
మూడు రోజుల తర్వాత ఆమె అత్తగారు ఆడపడుచు ఆమెను  పుట్టింట్లో లక్నో లో దిగా బెడతారు. ఖచ్చితంగా ఇక ఆమెను మానసిక చికిత్సాలయం  లో చేర్చాలన్న నిర్ణయం జరుగుతుంది. 
అయితే ఇక్కడ ఒక విషయం ఏమిటంటే మాయా పాత్ర ద్వారా గానీ ఈ నవల ద్వారా గానీ అనిత చెప్పదలచుకున్నదేమిటిఒంటరితనం , నగరీకరణ , పరాయీకరణ లో బాధ పడే ఒక స్త్రీ మానసిక స్థితిని వివరించడమే అనిపిస్తుంది. స్త్రీ కి కూడా మెదడు ఉంటుంది , దానికి జ్ఞానం కావాలి , శరీరం ఉంటుంది దానికి వ్యాయామం కావాలి , లైంగికత ఉంటుంది అని స్త్రీని కూడా గౌరవించమని చలం పెట్టిన ఘోష అంతా ఈ నవలలో మాయా పాత్రలో కనిపిస్తుంది. అవేవీ దొరకని స్త్రీ ఎమౌతుందన్నది కనిపిస్తుంది. ఇది భారతీయాంగ్ల సాహిత్యం లో మొట్ట మొదటి మనోవైజ్ఞానిక  నవల గా పేర్కొనబడింది. 
ఈ నవల మీద జరిగిన ఎన్నో పరిశీలనలు , విశ్లేషణలు చదివిన మీదట అర్ధమయ్యేదేమిటంటే ,  కేవలం , తిండి , బట్ట , నగలు , హోదా ఇవి మాత్రమే కాదు స్త్రీ కోరుకునేది . తనని మనిషి గా ప్రేమించే భర్త , అతని సాహచర్యం. అవి లేని ఒంటరి తనం లో మానసికంగా స్త్రీ పైగా కాస్త బలహీన మనస్కురాలైన స్త్రీ , పైగా పెళ్ళయి నాలుగేళ్లైనా బిడ్డలు కూడా లేని స్త్రీ మనో చిత్రణ ఈ నవల. చలం మైదానం లా ,భారత సాహిత్యం లో అత్యంత చర్చించబడిన నవల ఇది. 
అనితా దేశాయిని మన తెలుగు రచయిత్రి తెన్నేటి హేమలత తో పోల్చవచ్చు . స్త్రీ అంతరంగ చిత్రణ ఆ నాడే చేసిన లత సాహిత్యం లోని అంశాలెన్నో మనకు అనిత లో కూడా కనిపిస్తాయి. “ ప్రేమ రాహిత్యం లో స్త్రీ” లత నవల  ఇదే ఇతివృత్తం తో ఉంటుంది. లత కేవలం తెలుగు సాహిత్యానికి పరిమితమవ్వ బట్టీ ఆమెకు అనిత కు వచ్చినంత అంతర్జాతీయ కీర్తి లభించలేదు. 
అనితా దేశాయి సాహిత్య ఇతివృత్తలన్నీ ఇలా అంతర్లోక, బహిర్ లోక మానసిక యుద్ధాలే. "వోయిసెస్ ఆఫ్ ద సిటీ"  నవల లో కూడా ఇదే మనిషి మానసిక ప్రవృత్తి , తాను ఎలా సంయమనం సాధించుకోగలుగుతాడు అనే విషయం పైనే ఆధార పడి ఉంటుంది . 
ఆమెకు సాహిత్య అకాడెమీ అవార్డ్ తెచ్చిన “ ద ఫైర్ ఆన్ ద మౌంటెన్” దీనిని “ కొండమీది మంట” అనే పేరుతో సాహిత్య అకాడెమీ వారు తెలుగు లో కి అనువదించి ప్రచురించారు. 
వైస్ చాంసెలర్ అయిన తన భర్త పోయిన తర్వాత నందా కౌల్ , తన శేష జీవితాన్ని ఒంటరిగా , మౌనంగా కొండలలో గడపాలని కౌశలి అనే హిల్ స్టేషన్ లో వెళ్ళి ఉంటుంది. కానీ ఒక నాడు అనుకోకుండా ఈమె ఏకాంతాన్ని భగ్నం చేస్తూ రాకా , ఆమె జీవితం  లోకి వస్తుంది.  ఎందానక వాననక తిరిగే రాకా లో నందా తనని , తన బాల్యాన్ని చూసుకుంటుంది. ఏమీ అడగని రాకా , ఎప్పుడూ కొండలూ గుట్టలమ్మట తిరగడం. తన ఏకాంతాన్ని భగ్నం చేయకుండా ఉండటం . ఇవన్నీ నందా ని రాకా వైపు ఆకర్షిస్తాయి . ఇలా సాగుతుండగా నందా స్నేహితురాలు ఇలా దాస్ అనే సామాజిక కార్యకర్త వారి జీవితల్లోకి వస్తుంది. ఆమె చా లా హడావిడి మనిషి కావడం నందా కి రాకాకి ఇద్దరికీ నచ్చదు . అనుకోని కొన్ని పరిస్థితుల వలన ఇలా దాస్ అనే స్త్రీ దారుణంగా రేప్ చేయబడి మరణించడం , అదే సమయానికి రాకా వచ్చి " నానీ కొండంతా మంట చూడు " అని చెప్పడం తో విషాదాంతంగా ముగుస్తుంది ఈ కధ. ముందుగా తన ఏకాంతాన్ని భగ్న  పరిచేది గా భావించినా  రాకా ప్రవర్తన నందా లో మార్పు తీసుకొస్తుంది.  ఈ నవలలో అనితా దేశాయి చాలా విషయాలను  సమర్ధవంతంగా పొందుపరుస్తుంది. ఇద్దరు పెద్ద వారైన, స్త్రీలు ఒకరు నందా , రెండు ఇలా దాస్, చిన్న పిల్ల రాకా ముఖ్య పాత్రలైనా ఇందులో , ఏకాంతం కోరుకోవడం, మానవ సంబంధాలు , మనుషుల్ని అంచనా వెయ్యడం (ఎందుకంటే ముందు రాకా రావడం అస్సలు ఇష్టం ఉండదు నందా కి) ఇలా ఎన్నో సున్నిత మైన భావాలు , తన వంట మనిశిమ్ రాము రాకా తో చక్కగా కలిసి పోవడం తాను కలవలేక పోవడం నందా లో ఈర్ష్య ని కూడా కలిగిస్తాయి. ఇలా మానవ సహజ భావాలు ఉద్వేగాలు ఉద్విగ్నతలు అన్నిటినీ ఈ నవల లో మనకి అందిస్తుంది అనితా. మొదటి నుండి చివరి పేజీ వరకు ఆగా కుండా చదివించే గుణం అందులో మమేకం అయి పోయే లక్షణం కలిగి ఉంటాయి అనితా కధా కధనాలు. 
1980 లో ఆమె కు పేరు ప్రఖ్యాతి బాగా తెచ్చ్చిపెట్టిన నవల " ద క్లియర్ లైట్ ఆఫ్ ద డే ". ఇందులో అనితా వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఎన్నో విషయాలు మనకి ద్యోతకమౌతాయి .  పాత ఢిల్లీ లో ఒక మధ్య తరగతి కుటుంబం , దేశ విభజన సమయం ఈ కధ కి నేపధ్యం. ఇందులో ప్రధాన పాత్ర బిమ్(బిమలా), ఆమె తన మానసిక వికలాంగుడైన సోదరుడు, బాబా తో నివసిస్తూ ఉంటుంది. ఆమె అక్క తార , అన్నయ్య వారి స్వార్ధానికి వారు తమ జీవితాలు , కుటుంబాలు చూసుకుంటూ ఈ బాబా బాధ్యతనంతా బిమాలా పైన  పడవేసి వెళ్ళి పోతారు . ఆ కష్ట నష్టాలనీ బిమలా ఒక్కర్తీ ఎలా ఈదుకొస్తుందన్నది నవల ఇతివృత్తం. ఇది అనితా జీవితానికి చాలా దగ్గర గా ఉందని తానే ఒక సారి చెప్పుకుంది. ఇది ఒక ఆ పాత జ్ఞాపకాల దొంతర అంటుంది ఈ కధ గురించి అనితా. 
ఆమె మరొక ముఖ్యమైన నవల " వేర్ షల్ వే గో దిస్ సమ్మర్?" , " గేమ్స్ ఎట్ ట్విలైట్", " వీల్లేజ్ బై  ద సీ" , ఇంకా కధలు, మరెన్నో , బుక్కర్ ప్రైజ్ కి నామినేట్ అయిన "ఫాస్టింగ్, ఫీస్టింగ్" ఆమెకు మంచి పేరు తెచ్చి పెట్టిన నవలలు. 
ఎన్నో ముఖ్య సాహిత్య సంస్థల్లో ప్రముఖ పాత్ర వహించే అనితా , ద రాయల్ సొసైటీ ఆఫ్ లిటరేచర్ , లండన్ , అమెరికన్ అకాడెమీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ లెటర్స్ లో చాలా ముఖ్యురాలు . 
అనితా దేశాయి నవలల్లో నాకు అర్ధమైనంత వరకు స్త్రీ మనో  వేదన , అంతరంగ చిత్రణ ఎక్కువగా కనిపిస్తాయి. అనితా పైన  వర్జీనియా వూల్ఫ్ , లారెన్స్, ఫ్రాయిడ్ , ఇలా కొందరి ప్రభావం బాగా ఉందన్నది వాస్తవం. 
1963 లో క్రై ద పీకాక్ కన్నా ముందే మనకి ఇక్కడ , మనిషి అంతరంగ వేదన గురించి బుచ్చిబాబు , లతా వంటి వారు రాసినా ఆమె ఆంగ్లం లో రాయడం వలన ఆనాటికి ఈనాటికీ మనోవైజ్ఞానిక నవలల్లో భారతీయ సాహిత్యం లో  ప్రధమంగా నిలిచింది ఆమె నవల. 
చదివించే ఇతి వృత్తాలు , కదలనివ్వని , పుస్తకం పట్టుకుంటే వదలనివ్వని పట్టు బిగువు ఉన్న శైలి అనితా దేశాయి నవలల్లో కనిపిస్తుంది. ఏడేళ్ళ వయసుకే  తన తొలి కధను రాశి తొమ్మిదేళ్లకే అచ్చు వేసిన బాల మేధావి అనితా. ఆమె సాహిత్యానికి నేటికీ కేవలం భారత దేశం లోనే కాక అంతర్జాతీయంగా ఎంతో గుర్తింపు ఉంది అనడం లో అతిశయోక్తి లేదు. 
ఏడున్నర పదుల వయసులో ఇంకా సృజనాత్మకంగా రచనలు ఎలా చెయ్యాలో పాఠాలు చెప్పగలిగే అనితా దేశాయి మన భారత దేశానికి గర్వకారణమైన మరో మహిళా రత్నం. 
ఎన్నో ఎవార్డులూ రివార్డులూ గెలుచుకున్న ఆరు పదుల పైన నే ఉన్న సాహిత్య ప్రస్థానం ఆమెది . ఆమెను గూర్చి కొన్ని మాటలు చెప్పుకోవడానికి అవకాశం దొరికినందుకు సంతోషిస్తూ ఆమెకు శుభాభినందనలు తెలుపుతూ ముగిస్తున్నాను.
.............................................................................................................జగద్ధాత్రి 

జులై 2013 విశాలాక్షి లో నా ఫీచర్