Tuesday, February 14, 2012

ప్రేమంటే .......ఆలోచించండి ...!


ప్రేమంటే .......ఆలోచించండి ...!


"ప్రేమ, సత్యము మాత్రమే ప్రపంచం లోని అని సమస్యలను పరిష్కారం చూపిస్తాయి" వక్లావ్ హావెల్ (ఇటీవల మరణించిన  ప్రపంచ మేధావి) 
"ప్రేమే సత్యం" మహాత్మా గాంధీ "ప్రేమే దైవం" జీసస్. 
ప్రేమంటే .....అనేవర్నైనా అడగండి ...ఒక్కొకరూ ఒక్కో నిర్వచనం ఇస్తారు. నిజానికి ప్రేమ అంటే ఏంటో మనలో ఎవరికైనా తెలుసునా? అని ప్రశ్నించుకుంటే అనిపిస్తుంది కవిత్వాన్ని , ప్రేమని , జీవితాన్ని అంత తేలికగా నిర్వచించలేము. అలాగని నిర్వచించ కుండా ఉండలేని విషయం కూడా. ఎవరి అనుభవాన్ని అనుభూతిని వారు వారి అభివ్యక్తి శక్తి మేరకు చెప్తారు. అంతే కానీ ఇది లాస్ట్ అండ్ ఫైనల్ అని చెప్పే సాహసమే చేయలేరెవరూ. నిజానికి వీటి  అర్ధం అవగతమైతే ఇక ప్రపంచం లో శోధించాల్సింది ఇంకేమీ లేదనిపిస్తుంది . 
ఇటీవల మనమందరం చిన్న పెద్దా తేడా లేకుండా జరుపుకుంటున్న దినోత్సవాల్లో ప్రేమికుల రోజు అనగా వాలెంటైన్స్ డే ఒకటి. ఇది పాశ్చాత్య సంస్కృతీ అని పిల్లల్ని తిట్టే ఎంతో మంది పెద్దలు కూడా వాలెంటైన్స్  డే ని జరుపుకోవడం నేను చూస్తున్నాను. ఏ విషయాన్నైనా అది ఏ నాగరికత నుండి వచ్చినా మంచి స్వీకరించడం  లో తప్పులేదు. ఇదిగో అతి అయితేనే ప్రమాదం. 
ఇవాళ మనం చూస్తున్న ఈ ప్రేమ అనే అంశం ఏమీ కొత్తది కాదు అనాదిగా అనూచానంగా వస్తోన్న మానవ సహజాతం. కానీ మన అవగాహనాలోపం వల్లనే మనం నిజానికి ప్రేమని విధ్వంసం చేసుకుంటున్నాము. ఏ కొందరి వైఫల్యం వల్లనో ప్రేమంటే ఒక బాధాకరమైన భావనగా భయపడుతున్నాం. అసలీ ప్రేమ అనేదే లేకుంటే సకల సృష్టి దేనికి? మనమే ప్రేమ అనే దివ్య మైన భావనని చాలా సంకుచింప చేసి వైయుక్తికంగా మార్చేసాము. ప్రేమికులకో రోజేమిటి అని కొట్టి పారేసే వాల్లెందరినో  నే చూసాను. ఇటీవల ప్రేమికుల రోజు నాడు ప్రేమికులమని చెప్పిన వాళ్ళను బలవంతంగా పెళ్ళిళ్ళు చేయడం లాంటి అఘాయిత్యాలు చూస్తున్నాము. అది నిజంగా కిరాతక  చర్యే అనిపించింది నాకు. వాళ్ళవల్ల పబ్లిక్  లో ఏదన్న అసభ్యమైన అల్లరి జరిగితే తప్ప వాళ్ళకి బలవంతంగా పెళ్లి చేయడం లాంటివి పరిష్కారాలు కావు. అన్నీ చూసి అన్నీ కుదుర్చుకుని చేసుకునే వివాహాలే మూడు రోజుల ముచ్చట అవుతోన్న ఈ కాలం లో ఇలాంటి పిచ్చి చర్యల వల్ల మరింత  యువతరం రెచ్చి పోతారు తప్ప వారిని అరికట్టేయకలమనుకోవడం మన వ్యవస్థ పడే అవస్థ. 
నేటి యువతరం చాలా తెలివిగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. జీవితాన్ని ప్రాక్టికల్ గా తీసుకుంటున్నారు. నిన్ననే ఒక ఇరవై ఏళ్ళ అమ్మాయి నా కళ్ళు తెరిపించింది నిజం !. ఒక వేళ నువు ప్రేమించే అబ్బాయి వాళ్ళ తలితండ్రులు ఒప్పుకోక పోతే ఏమి చేస్తావు అని నేనడిగితే ఒప్పుకోక పోతే ఒప్పుకోరు వాళ్ళు ఒప్పుకోవాలని నిబంధనేమీ లేదుగా అంది. మరి అప్పుడు ఆ అబ్బాయి కూడా మారి పోయి వాళ్ల అమ్మ నాన్న చెప్పిన మాట వింటే నువ్వేమౌతావు అన్నా బాధగా. ఏమౌతాను ఏమీ కాను అలాంటి కష్టమొచ్చి నప్పుడు ఎదుర్కునేందుకు సిద్ధపడి ఉండాలి కానీ పలాయన వాదమో , ఆత్మ హత్యో లాంటివి  చేయకూడదు. తన వాళ్ల ఒప్పుదలతోనే నన్ను తన జీవితం లో నిలుపుకుంటాననే అబ్బాయి మనసు బలహీనమైనదే కదా అటువంటి   అబ్బాయి తో జీవితం  ఎప్పటికైనా అపనమ్మకమే, కనుక అలాంటి ప్రమాదం తప్పినందుకు సంతోషిస్తాను అంది. బాధగా ఉండదా ? దుఃఖంగా ఉండదా? అడిగా దీనంగా. ఉంటుంది తప్పక ఉంటుంది నేనూ మనిషినేగా ఈ ఇలా చెప్పేసినంత తేలిక కాదు జీవితాన్ని ఎదుర్కోవడం అని నాకు తెలియదా కానీ అందుకు మనస్సు సంసిద్ధం చేసుకోవాలి అనే ఓ దృఢ సంకల్పం మాత్రం చెప్పుకుంటాను నాకు నేనే రోజూ , ఇదీ ఆ అమ్మాయి సమాధానం వింటూనే నా గుండెలు చెమర్చాయి. 
నిజమే ఇన్ని ఒత్తిళ్ళ మధ్య ఒక వైపు చదువు కెరీర్ ఆర్ధిక స్వావలంబన ఇన్ని ఏర్పరుచుకుని తమ అస్తిత్వాన్ని సమాజం లో గౌరవంగా నిలుపుకుంటూ ప్రేమ పెళ్లి అనే ఈ తప్పనిసరి రిస్కులు తీసుకుంటున్న యువతని మనమెంత తప్పుగా తీసుకుంటున్నాము. 
కేవలం అబ్బాయిలనే తప్పు పట్టే మనం వారు మాత్రం ఎదుర్కుంటున్న సమస్యలను పట్టించుకుంటూన్నామా ? అని ఒక్క సారి ఆలోచిస్తే అనిపించింది లేదు మనం ఏ విధంగానూ పట్టించుకోవడం లేదు. వాడో ఇంజనీర్ డాక్టర్ లేదా ఏదో ఒకటి ఐపోయి అమ్మ నాన్నకి పేరు తేవాలి అంతే ఇక వాడి మనసు , భావాలూ ఇవేవీ మనకి పట్టవు. వాదినో రోబోలా  తాయారు చేయడం లో మనం చాల గొప్ప పాత్ర పోషిస్తున్నామని అనుకుంటున్నాము , తల్లి తండ్రులుగా సమాజ హితైషులుగా. కానీ ఎంత మంది మగ పిల్లలు ప్రేమ రాహిత్యం తో ఇళ్ళకూ తమ వాళ్ళకూ దూరమై స్వచ్చమైన ఓ ప్రేమ పూరిత  పలకరింపు కోసం స్నేహం కోసం అర్రులు చాస్తున్నారో ఎవరో ఎందుకు మన పిల్లాడినే మనం అర్ధం చేసుకోలేక పోతున్నాము. వాడు ఎవర్నైనా ప్రేమించాడని చెప్పగానే విరుచుకు పడి పోతాము, తప్ప మనం వాడికి ఇవ్వలేనిదేదో  వాడు  వెతుక్కున్నాడని సరి పెట్టుకోలేము. 
మన ఆహాలకి అభిజాత్యాలకి కన్న ప్రేమ అని , సంప్రదాయమనీ, ఇలా ఏవేవో ఆత్మ వంచన చేసుకునే కుంటి సాకులు చెప్తుంటాము. 

పెద్దలు చేసిన పెళ్లి  చేసుకుని పదేళ్ళైన ఒక జంటనదిగి చూడండి ఒక వేళ మీకు ప్రేమించి పెళ్లి చేసుకోమని అవకాసమిచ్చి ఉంటే ప్రేమించి పెళ్లి చేసుకునేవారా? అని తప్పకుండా అనే సమాధానం వస్తుంది.అలాగని వాళ్ళు కాపురం బాగులేదని  కాదు ప్రేమ అనే ఆ అద్వితీయ భావన ని ఆస్వాదించి ఒకర్నొకరు అవగాహన చేసుకుని  పెళ్లి చేసుకోవడం ఎందుకిష్టముండదు ఎవరికైనా. కానీ చాల మంది పరిస్తితుల ప్రభావం వల్లనో కుటుంబ౦ వల్లనో ఎందుకులే రిస్క్ అనే ఒక భావన  వల్లనో పెద్దవాళ్ళు కుదిరిస్తే వాళ్ల సప్పోర్ట్ ఉంటుంది కదా అనే ఆలోచనతోనో ఇప్పటికీ పెద్దలు చేసే పెళ్లి నే ఇష్టపడుతున్నారు  . ఎక్కువమంది తమకి ఫలానా  వారు ఇష్టమని  చెప్పి ఒప్పించి చేసుకుంటున్నారు. సమాజం లో తలి తండ్రులు నేటి తరం లో అంటే నలభై అరవై ల మధ్య లో ఉన్నవారి లో కూడా చాల మార్పు వస్తోంది స్పష్టంగా కనిపిస్తోంది. ఎక్కడో తప్ప కాస్త చదువుకున్న తల్లితండ్రులు ఇంగితం తో నే ప్రవర్తిన్స్తున్నారు. ఎందుకంటే పెళ్లి ఒకప్పటి లాగా జరగాలంటే ఇప్పుడు కుదరదు , మన కట్టు  బొట్టు ఆచార వ్యవహారలేలా మారుతున్నాయో, అలాగే మన మనో భావాలూ   కూడా నేడు మార్పు చెందుతున్నాయి. దీన్ని సహృదయం  తో అర్ధం చేసుకున్నవారు సుఖ పడుతున్నారు లేని వారు తాము బాధ పడి పిల్లల్ని బాధ పెడుతున్నారు. 
మానవ సంబంధాలలో అతి ముఖ్యమైన స్త్రీ పురుష సంబంధం లో పెళ్లి అనేది ఒక జీవన  అవసరం. మనిషి ఒంటరి గా మనలేడు కనుక. దానికి ముఖ్య ఇంధనం ప్రేమ .
ఇది  లేని వివాహమే కాదు ఏ సంబంధము నిలవదు. బలవంతంగా తమ కిష్టం లేని పెళ్లి చేసిన  తలి తండ్రుల పట్ల వారెంత చేసినా పిల్లలికి ప్రేమ కలగదు. ఉన్న ప్రేమాభిమానాలు కూడా పోతాయి. 
వాలెంటైన్స్ డే అనగానే హోటళ్ళూ పార్కులూ ప్రేమికుల కోసం ముస్తాబై సింగారించుకుంటే . పోలీసులు, సాంప్రదాయ రక్షణ సంఘాలు( అది వారి భావన) , లాంటివి అప్రమత్తమై పోతున్నాయి. ఎక్కడ ప్రేమికులు దొరికితే లేదా ఆడా మగా దొరికితే వారిని ఆ రోజు హింసించి వారేదో సమాజ రక్షకులుగా, కొందరు నిఘా కూడా వేసి ఉంచుతున్నారు. ఇంత విద్యా  వంతమైన సమాజం లో ఇది అవసరమా చెప్పండి? అంటే కొంతవరకు అవసరమే ఎందుకంటే ఇదే పేరున జరుగుతోన్న వ్యభిచారాలు ఆడపిల్లల పట్ల అత్యాచారాలు కూడా మితి మీరుతున్నాయి. కనుక సమాజ౦ లో ఈ జాగురూకత తప్పదు. అలాగని  మరీ యువత చేసే ప్రతి పనినీ మనం హేళనగా చూడటము తప్పే. 
ఏ సంప్రదాయమైన ఆయా దేశ కాల మన మానవ స్వభావ రీత్యా ఆవిర్భవిస్తాయి. అందుకే పశ్చాత్యుల్లో డేటింగ్  అనీ ఒకరిని ఒకరు అర్ధం చేసుకుంటే కానీ పెళ్లి చేసుకోకూడదని ఒక భావన. అదేమీ ఆచారము కాదు. మనలాగా పెద్దలు కుదిర్చిందే పెళ్లి అనేది కూడా చాదస్తమే. మారుతున్న కాలం తో ఇన్ని మారగా లేనిది వివాహ   విషయం వచ్చేసరికి  వారికిచ్చిన స్వేచ్చను లాగేసుకుని పాపం పిల్లల మనసులకు తాళాలు బిగించే పెద్ద్దలూ మారాలి అలాగే, దొరికిన స్వేచ్చ్చాను దుర్వినియోగం   చేసుకోకుండా ప్రేమ పట్ల జీవితం పట్ల వివాహ వ్యవస్థ పట్ల ఒకరి నొకరు సరి అయిన అవగాహనతో యువత మెలిగిన నాడు ప్రేమికుల రోజు నిజంగా స్వర్గం లో నుండే ఆ వాలెంటైన్ తాను తన ప్రేయసికి రాసుకున్న ప్రేమ లేఖల ద్వారా ప్రపంచానికిచ్చిన సందేశం సఫల మైనందుకు ఆనందిస్తాడు. 

దేన్నైనా తీసుకోవల్సినంత మేరకు స్వీకరించగలిగితే ఎవరికీ నష్టం ఉండదు. అతి ఏవ వర్జయేత్ అని ప్రేమికుల రోజంటూ స్నేహితుల రోజంటూ పేరు చాటున అకృత్యాలు చేసే వారి పై న సమాజం చట్టం ఎప్పుడూ ఓ కన్ను వేసి ఉంచడం కూడా అవసరమే. నేను ప్రేమిస్తున్నాను అని అనుకునే వ్యక్తి తన ప్రేమ తనకు బలమా బలహీనతా అన్నది అవగాహన చేసుకుంటే చాలా నేరాలు. ఘోరాలూ. అఘాయిత్యాలూ ఆత్మ హత్యలూ ఉండవనే నా నమ్మకం. ఇటీవలే ఒక ఆత్మీయురాలు చెప్పిన మాటలతో ముగిస్తాను. తను అందిలా, "ప్రేమ అంటే ఆత్మ బలం, అది మనం ఒకరికి ఇవ్వగలగాలి ,  సంపూర్ణ సమర్పణే  కాదనను అయినా మన అస్తిత్వాన్ని స్తిరత్వాన్ని  కోల్పోకుండా మెలగాలి , అంతేగానీ మనల్ని మనం కోల్పోవడం కాదు " నిజమే అనిపించింది. ఎవరికి వారు వారి స్వీయానుభవాలు  అనుభూతులతో కాలం డైరీ లో చేసి వెళ్ళే ఒక ప్రత్యేక సంతకం ప్రేమ. ప్రేమించడం తప్పు కాదు. కానీ ఆ ప్రేమ పేరిట మనిషి రాక్షసుడిగానో , లేదా జీవితాన్ని నాశనం చేసుకునే దేవదాసు గానో కాకూడదు. "ప్రేమ " నే ఈ రెండున్నరాక్షరాల చిన్న మాట విశ్వ మంతటినీ  నడుపుతోంది. 
ప్రేమ ఉన్మాదం ఉద్రేకం కానన్నాళ్ళూ పిల్లలే కాదు అందరం ఈ ప్రేమికుల  రోజును జరుపుకుందాం సహృదయం తో సద్భావన తో మన తరవాతి తరం పట్ల మన విశ్వాసాన్నినిరూపించుకుందాం. అంతే కానీ ఇదిగో రేపు వాలెంటైన్స్ డే అని ఇల్లు కదిలావా కాల్లిరగ్గోడతాను అన్నామనుకోండి పిల్లలతో , వాళ్ళు తప్పక తిరగబడి తీరుతారు. ఇది మానవ సహజ స్వభావం. ఏదైతే వద్దంటారో అదే చెయ్యడం . ఏం నేటి తాతలూ. తండ్రులు తరం కూడా ఒకనాటి యువతరమే కదా ఒక్కసారి అక్కడికెళ్ళి ఆలోచించండి మనం మాత్రం మన అమ్మ నాన్నల్ని తిట్టు కోలేదూ. వారికీ తెలియకుండా తప్పులు చేయలేదూ? అందుకే అన్నారు పెద్దలు తింటే ఫలహారాలు పిన్నలు తింటే చిరుతిళ్ళూ అని ..దయ చేసి ఒక్కసారి తలితండ్రులూ ఒక్కసారి అలోచించి అర్ధం చేసుకుని పిల్లలికి ఒక నమ్మకాన్నివ్వండి నేటి తరానికి కావాల్సిన ఇంధనం అదే. అలాగే పిల్లలూ మీరు అలోచించి అమ్మ నాన్న మన మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోండి. ప్రేమించండి తప్పులేదు , కానీ ఆ ప్రేమ ను కాపాడుకోండి, అందుకు ఏ డేలు జరుపుకున్న మీ ఇష్టం మనసులకు 
ప్రేమకు డూమ్స్ డే మాత్రం తీసుకురాకండి. ప్రేమికులందరికీ ప్రేమాయుష్మాన్భవ !!!
..................................................................................................................జగద్ధాత్రి 

 Reply

No comments:

Post a Comment