Wednesday, February 29, 2012

అవును అప్పుడే……అక్కడే…..



అవును అప్పుడే……అక్కడే…..

ఎప్పుడో…. ఎక్కడో….నిన్ను చూసానన్న
ఒక తీయని స్మృతి …….
ఎప్పుడూ ఎక్కడా……
అమ్మ నోటికందించిన తొలి చను బాలలోనా
నాన్న ఎత్త్తుకుని ముద్దాడిన తొలి ముద్దు లోనా…..
చూసాను మాత్రం నిన్ను …..నేడు నువ్వో అందని
పాలపుంతవి కానీ అప్పుడు నా చుట్టూ తిరిగే
మా అమ్మమ్మ తాతగార్ల మొహాలలో
నన్ను అపురూపంగా ఎత్తుకుని
బంగారు బొమ్మని చేసి ఆటాడుకున్న
పెళ్ళి కాని మా పిన్నులల వదనాలలోనా
అక్కా నా మేన కోడలే అంటూ మురిసి
పోయిన మేన మామాల గర్వంలోనా….
చూసాను మాత్రం నిన్ను …….
బాగా ఆలోచిస్తే …..మళ్ళీ నిన్నెక్కడెక్కడెక్కడ
చూసానా అని …..
ప్రతి పుట్టీన రోజు ఒక పండుగలా
జరిపే నాన్న ప్రేమ లో …..
ఎందరినో ఆ రోజు పిలిచి
రకరకాల వంటలతో విందు ఇచ్చిన
అమ్మ చేతి కమ్మదనం లోనా
ఆ అప్పుడే …..బాగా చూసినట్టుంది సుమా
నువ్వు క్లాసు ఫస్ట్ వస్తే నిన్ను సినిమాకి
తీసుకెళ్తానని పదవ రేంకునుండి
ఫస్ట్ రేంక్ కి తెచ్చిన మా రాజు మామయ్య
అవ్యాజ్య ఆత్మీయతలోనా…..
ఆ చూసాను సుమా …….అనుభూతించాను కూడా
ఫస్ట్ రేంకు వచ్చిన నాడు తన వాగ్దానం నిలబెట్టుకుని
అప్పు చేసి మరీ " బడి పంతులు" సినిమాకి తీసుకెళ్ళిన
మా మామయ్య, మాట నిలబెట్టుకున్న అతని పట్టుదల లోనా
అవునక్కడే మరి గుర్తుంది బాగా……
అలాంటి మామంచి మామయ్యకి
నన్ను కేవలం చూడాలనే ఒకే ఒక్క చిన్ని ఆశతో
రక్త సంబంధమూ లేకపోయినా
మా రాజు మామయ్యని కనీసంమంచి నీళ్ళు కూడా
ఇవ్వకుండానే అత్త గారి హుకుం వెనుక ఝడిసి దాగిపోయిన
నన్ను చూడకుండానే వెళ్ళాల్సి వచ్చినందుకు
కళ్ళల్లో నీరు తిరుగుతుండగా
గేటు దాటి వె్ళ్తోన్న తనని కిటికీలోంచి చూసిన
క్షణం లోనా ……నిజమే పిల్లలు లేని తాను
నన్నే తన పాపగా భావించిన మామయ్య
ఐదు పదులు నిండకుండానే వెన్నెముక
దెబ్బతో దేహంపని చెయ్యని నాడు
వద్దు వద్దు పాపని మాత్రం నన్ను
చూడటానికి రావద్దని చివరి శ్వాసవరకూ
మెసిలిన మామయ్య ప్రేమలోనా …..
అవును అక్కడేఅప్పుడే
మా రాజు మామయ్యని
చూడలేక పోయినా…..
అతని అనురాగం ఇప్పటికీ
కనులలోమనసు మూలల్లో
ఎక్కడో ఎప్పుడూ కనలి మెదిలిస్తూనే
ఉంటుంది …….
బూచాడమ్మ బూచాడు పాట చూసి
అలాంటిదే గౌను కొని కుట్టించిన
మా మామయ్యని ……మా రాజు మామయ్యని
గయ్యాళి భార్యతో వేగలేక
ఎప్పుడూ మా ఇంట్లోనే మాతో
ఆడుతూ పాడుతూ మా అమ్మని చెల్లెలి గా
భావిస్తూ ….
ఎంత చనువున్నానాన్నని మాత్రం
సార్ అనే వాడే మాత్రంకానీ అతి చనువు
తీసుకోని మా వెర్రి మామయ్యని
అది నన్నీ స్థితిలో చూస్తే తట్టుకో లేదమ్మా అంటూ
చివరి శ్వాస వదిలిన మామయ్య లాంటి
మానవ మూర్తి లో కదూ …..
నిన్ను చూసింది ….అవును
ప్రేమా …..నిన్నక్కడే చూసాను
అతి దగ్గరగా…..నాన్న లాగా ప్రేమించి
అమ్మలాగా లాలించి ఏ సంబంధంలేకుండానే
ఎల్లపుడూ నా క్షేమాన్ని కోరుకున్న
మామయ్య ని చివరి క్షణంలో చూడలేక పోయిన
నా అశక్తతలో …..ఎప్పుడూ మామయ్య
చిరాయువుగా చిరునవ్వుతూ
బుల్లెట్ బండి మీద నేను , తమ్ముడూ
మామయ్య వెనకాల కూర్చుని
చిన్ననాటి స్నెహితులు సినిమాకి వెళ్ళినట్టే
నిన్ననో .. మొన్ననో మేము మామయ్య
ఊరు తాడివాడలో …..తియ్యని తాటిముంజెలు
పూతరేకులు ….తింటున్నట్టే ….
ఇంకా ఎప్పుడూ నా మది లోలోపలి
మధుర స్మృతుల గనులలో …….
కదలి కనలి ……నన్ను కన్నీట
కరిగించిన ప్రతి క్షణమూ ….
మామయ్య మాతోనే ఉన్నట్టు
ఏమిటో …. ఈ తియ్యని తాటిముంజె లాంటి
జ్నాపకం……..అనునిత్యం….నాలో
వయసు మీరుతోన్న కొలదీ
మరీమరీమరీ…….మామయ్యా!!!
…………………………..ప్రేమతోజగతి ….12. 30am 29/02/2012/ మంగళవారం

No comments:

Post a Comment