Tuesday, April 23, 2013

మౌనించిన "స్వర వసంతం " అన్నపూర్ణ దేవి ( ఎన్ అన్హర్డ్ మెలడీ )







మౌనించిన "స్వర వసంతం " అన్నపూర్ణ దేవి ( ఎన్ అన్హర్డ్ మెలడీ )

సప్త స్వరాలే సమ్మె చేస్తే , ప్రణవ నాదమే ప్రకోపిస్తే 
సరస్వతి వీణా గానం మానిమౌనిస్తే 

ఏమౌతుంది , ప్రపంచమంతా నిశ్శబ్దం లో శూన్యం లో మునిగి పోతుంది . కానీ ఈ అపర సరస్వతి అలా చెయ్యలేదు . తన కున్న సంగీత సంపదను విద్య దానం చేసి తానూ మూగావోయినా వారిని తన సంగీత  సౌరభానికి ప్రతీకలుగా చరిత్ర లో నిలిపింది .  ఒక హరి ప్రసాద్ చౌరసియా , నిత్యానంద్ హల్దిపూర్ , నిఖిల్ బెనర్జీ , సురేష్ వ్యాస్ లాంటి ఉత్తమ కళాకారులను ఎందరినో మన కందించిన ఒక మౌనించిన సంగీత సరస్వతి అన్నపూర్ణా దేవి గురించి మనం ఇప్పుడు మాటాడు కుంటున్నాం. 

ఇటీవలే కాలం చేసిన పండిట్ రవిశంకర్ మొదటి భార్య అని చెప్పాల్సి రావడం నిజంగా దురదృష్టమే . ఎందుకంటే ఎవరికీ కనిపించక వినిపించక ఈ లోకాన్ని త్యజించిన తాపసి ఈమె. ఒక గొప్ప కళాకారునిగా మనమందరం గౌరవించిన రవి శంకర్ జీవితాన్ని పంచుకున్న భాగస్వామిని ఏ కాక అతని వల్ల దాదాపు ఐదు దశాబ్దాలుగా తనకి తానూ విధించుకున్న శిక్ష లా ఇహ లోకానికి దూరమైన విదుషీమణి అన్నపూర్ణా దేవి . 

ఆమె సాక్షాత్తూ భారత దేశం గర్వించే సుర్ బహార్  విద్వాంసులు బాబా అల్లౌద్దిన్ ఖాన్ గారాల  పట్టి . ముస్లిం ఇంట హిందూ పేరా అని మనం అందరం ఆశ్చర్య పడటం సహజమే. చైత్ర పౌర్ణమి నాడు దివి నుండి భువికి అరుదెంచిన అన్నపూర్ణ వంటిదని , ఈ మాటలే మహారాజ బ్రిజ్ నాథ్ సింగ్ ఉస్తాద్ బాబా తో అనగా అతని మీదున్న వాత్సల్యం తోనూ , కాశీ అన్నపూర్ణ దేవి ని గూర్చి రాజా వారు చెప్పిన కథ విన్నాక , అల్లౌద్దిన్  ఖాన్ తన కూతురికి అన్నపూర్ణ అన్న నామమే స్థిరపరిచారు . అన్నపూర్ణ ఎంత అందంగా సంగీతం  లా వినబడుతోంది ఈ మాటా అనుకుంటూ 
" ఆ ని ని పా రెని " అని గళ మెత్తి  పాడుకుని మురిసిపోయాడు తండ్రి  . ఐతే అప్పుడు ఆమె ఇంత విద్వాంసురాలు అవుతుందని , కను మరుగై పోతున్న  అద్వితీయమైన వాయిద్యం " సుర్ బహార్ " కు చేతులోడ్డి కాపాడుతుందని అనుకోలేదు . 
సంప్రదాయానికి ఏదో రోషనార అని ముస్లిం పేరు పెట్టినా ఎవరికీ ఆమె పేరు రోషనార అని తెలీదు గుర్తులేదు . అన్నపూర్ణ గానే విరాజిల్లింది ఈ అమృత గాన లాహరి . 

ఘరానా సంప్రదాయ సంగీతాన్ని కేవలం తమ పుత్రులకే వారసత్వంగా బోధించి తయారు చేసేవారు. ఇందులో కూతుళ్ళకు స్థానం లేదు . అలాగే బాబా కూడా అన్నపూర్ణను అసలు సంగీతం వైపుకే రానివ్వలేదు .  మరో ముఖ్య కారణం కూడా ఉంది , అన్నపూర్ణ కంటే పెద్దమ్మాయి జహానారకి సంగీతమంటే ప్రాణం . ఆమె ఉత్సాహానికి ఊతం ఇచ్చి పుట్టింట్లో ఆమెకు సంగీతాన్ని నేర్పేరు కుడా . కానీ ఆమె దురదృష్టం అత్తవారింట్లో గొంతు విప్పి కనీసం కూనిరాగం కూడా తీసేందుకు వీలుకాలేదు . అన్ని అంక్షల మధ్య బ్రతకలేక నిరాశతో ఆత్మ హత్య చేసుకుంది ఆమె . అప్పటినుండీ అస్సలు ఆడపిల్లలను సంగీతం జోలికే రానిచ్చేవారు కాదు ఆమె తల్లి తండ్రి . 

ఒక నాడు బాబా తన వారసుడు సుపుత్రుడు అయిన అలీ అక్బర్ ఖాన్ కు సంగీతం నేర్పుతూ ,కొన్ని స్వరాలూ పలకించడం లో అపశృతి పలుకుతుంటే ఓర్చుకోలేని కోపం తో బయటకు వెళ్లి పోయారు బాబా . కాసేపు పోయాక కోపం లో వెళ్ళిపోయారు కానీ డబ్బులూ సంచీ తీసుకుని బజార్ కి వెళదామని తిరిగి వచ్చిన ఆ సంగీత విద్వాంసునికి తన ఇంటి  నుండి సుస్వర సుమధురమైన సంగీతం వినిపించింది . చూస్తే పదేళ్ళ అన్నపూర్ణ సోదరునికి తండ్రి చెప్పిన స్వరాలూ సరిగ్గా ఎలా పలకాలో పాడి వినిపిస్తోంది . వెనుకగా నించుని తన గానం తండ్రి వింటున్నాడని తెలియని అన్నపూర్ణ గాన పరవశం తో పాడుతోంది . అప్పుడు ఆమెను అలాగే కూర్చున్న ఫళాన జుట్టు పట్టుకుని దాదాపు ఈడ్చుకేల్తున్నట్టుగా సంగీత 
వాయిద్యాల గదిలోనికి సరస్వటి దేవి విగ్రహం ముందుకి తీసుకెళ్ళి ఆమె చేతిలో సుర్ బహార్  ఉంచారు బాబా అల్లుద్దిన్ ఖాన్ . ఈ క్షణం నుండి నీవు సంగీతానికే కట్టుబడి ఉండాలి . ఇన్నాళ్ళూ నిన్ను నేను గుర్తించలేదు . నీలోని అంకిత భావం నన్ను ముగ్ధుణ్ణి చేసింది అన్నపూర్ణా , ఇక నీవు వివాహితావు సంగీతానికే ఇచ్చి నిన్ను వివాహం చేస్తున్నాను . నీ జీవితం లో ఏ పరిస్థితిలోనూ సంగీతాన్ని విడిచి పెట్టనని మాట ఇవ్వు అని అడిగారు బాబా . ఆనందం , ఆశ్చర్యం, అనుకోకుండా వచ్చిపడిన అదృష్టం అన్నీ అన్నపూర్ణను ఆ క్షణాన సంగీతానికి బద్దురాలిని చేసాయి . తండ్రి విద్వత్తు పట్ల ఉన్న హిమాలయ శిఖరమంత  గౌరవం  సంగీతం పట్ల ఉన్న ప్రాణ ప్రదమైన ఇచ్ఛ ఆమెను వివశు రాలిని చేసాయి . 
అది ఎటువంటి దివ్య క్షణమో ఆ క్షణాన తండ్రికిచ్చిన మాట నేటికీ తప్పలేదు ఆమె . సంగీతమే సర్వస్వంగా జీవించింది , జీవిస్తోంది . 

అండ్ ఆల్ ఈస్ వెల్ అన్నది జీవన లక్షణం కాదు కదా . అందుకే సంగీత ధ్యానం లోనూ తపస్వినిగా అలరారుతున్న అన్నపూర్ణ పదునాల్గవ  ఏట ఆమె జీవితం లో రవి శంకర్  ప్రవేశించాడు  . ఆమె తండ్రి వద్ద విద్య అభ్యసించడానికి వచ్చిన రవి శంకర్ , బాబాకు అత్యంత ప్రియ శిష్యునిగా మారడం , అన్నపూర్ణను ఇష్టపడి . తండ్రి అనుమతి తోనే వివాహం చేసుకోవడం జరిగాయి . అప్పటికే రవి శంకర్ పేరున్న సితార్ వాద్యుడు . కానీ  అల్లౌద్దిన్ ఖాన్ శిష్యరికం లో తన విద్యకు చాలా మెరుగులు దిద్దుకున్నాడు . వజ్రాన్ని   సాన పట్టినట్టు రవిశంకర్ ని తీర్చి దిద్దారు బాబా . అందులో అన్నపూర్ణ కూడా సహాయం చేసేది . బాబా దగ్గర అభ్యాసం ( ఉర్దూ లో తాలిమ్ అంటారు) , సాధన చాల కఠినమైనవి . అంతటి దీక్షా పట్టుదల లేకుంటే వారికి సంగీతం నేర్పేవారే కాదు బాబా . 

అప్పటికే  ప్రాచీనా వాయిద్యమైన "సుర్ బహార్ "  ను బాబా అన్నపూర్ణకు నేర్పేరు . సితార్ ను మించిన అతి కష్ట మైన మధురమైన వాయిద్యం సుర్ బహార్ . వీణ సితార్ కన్నా చాలా కష్ట తరమైన వాయిద్యం . సుర్ బహార్ ఆహా ఎంత అందమైన పేరు "స్వర వసంతం " (సుర్= స్వరం, బహార్ = వసంతం ) . ఇంతటి అన్దమైఅన్ కష్టమైనా ఇప్పటికీ ఎవరూ సాధించలేని ఈ వాయిద్యాన్ని వారసత్వంగా తన పుత్రికకు సరస్వతీ రూపమైన అన్నపూర్ణకు ఇచ్చారు ఉస్తాద్ అల్లౌద్దిన్ ఖాన్ . ఆయన నాటికే భారత దేశం గౌరవించే అతి కొద్ది మంది విద్వాంసులలో ప్రసిద్ధి పొందిన కళాకారులు . 
అన్నపూర్ణ రవి శంకర్ వైవాహిక జీవితం :

1938 లో ఒక నాడు తండ్రి ఆధ్వర్యం లో అతని శిష్యుడైన రవి శంకర్ కు భార్య అయింది అనపూర్ణ . సంగీత సాధనే తప్ప కనీసం తన దేహం లోని మార్పులు కుడా సరిగా అర్ధం చేసుకోలేని పసి మొగ్గ , రవి శంకర్ పట్ల విపరీతమైన ఆరాధనా భావం భార్తగానే గాక , సంగీత విద్వాంసుడిగా కూడా అతనంటే పంచ ప్రాణాలు అన్నపూర్ణ కి . సంగీతం , భర్త తో కలిపి సాధన , అతని ప్రేమ తీవ్రత , ఇందులోనే మునిగి పోయిన అన్నపూర్ణకు తాను పెళ్ళైన మొదటి నెలలోనే నెల తప్పానని కుడా తెలియలేదు . తాను తల్లిని కాబోతున్న విషయం రవి శంకర్ కు చెప్పింది . తమ ప్రేమ ఫలించ బోతుందని ఆనందం రవి శంకర్ వదనం లో . 30మార్చ్  వ  తేదీ 1942 లో శంకర్ వంశాంకురం అయిన తనయుడు జన్మించాడు వారికి . తల్లి పరిచర్య లో తోలి బిడ్డను కన్నది అన్నపూర్ణ . మన పుత్రుడు మనకన్నీ శుభాలనే తీసుకుని వచ్చాడు అందుకు అతనిని " సుభేంద్ర శంకర్ " అని పిలుద్దామని తండ్రి అయిన ఉత్సాహం తో రవి శంకర్ ఉద్విగ్నంగా పలికాడు . 

తన సుర్ బహార్ , రవి శంకర్ , సుభేంద్ర తో కలం గడిచిపోతోంది అన్నపూర్ణకు . కానీ పిల్లడు మెలిక పడిన పేగులతో పుట్టడం వల్ల ఎప్పుడూ అనారోగ్యం తో బాధ పడేవాడు . రాత్రంతా నిద్ర పోయేవాడు కాదు . దీనికి తోడు  సుభో పుట్టిన రెండున్నరేళ్ళకి  1944 నవంబర్ లో రవిశంకర్ కు విపరీతమైన విష జ్వరం సోకింది . దేహ ఉష్ణోగ్రత 106 కు తగ్గేది కాదు . తండ్రీ కూతుళ్లిద్దరూ హడలి పోయారు రవి శంకర్ స్థితికి . రవి శంకర్ సోదరుడైన రాజేంద్ర శంకర్ వీరిని తన ఇంటికి బొంబాయి తీసుకెళ్ళి ఉంచుకున్నారు . ఇది విషమ పరీక్షా సమయం అన్నపూర్ణ కి  ఒక పక్క జ్వరం తో భర్త , మరొక పక్క అనారోగ్యమైన కొడుకు , వీరికి సపర్యలు చేస్తూనే తన సంగీత సాధన ఎప్పుడూ వదల లేదు ఆమె . 

అన్నిటికంటే కష్ట తరమైన విషయం రవి శంకర్ జ్వరం నెమ్మదించిన తర్వాత చాలా మటుకు జ్ఞాపక శక్తిని కోల్పోవడం . అసలు సితార్ ముట్టుకునే పరిస్థితిలో కూడా లేకుండా నీరసించిపొయిన భర్తను తన సపర్యలతో సేవ చేస్తూ , మరో పక్క అతను  మరిచిన సంగీతాన్ని స్వరాలని , రాగాలని గుర్తు చేస్తూ మళ్ళీ మామూలు మనిషిని చేసింది అన్నపూర్ణ లోని ఆత్మా విశ్వాసం , ప్రేమ . 

రవి శంకర్ ది భ్రమరం లాంటి ప్రేమ . అతనికి శ్వాస తీసుకున్నంత సుళువుగా  స్త్రీల పట్ల  ప్రేమ ఏర్పడుతుంది . తన జీవితం లో ఇది వరకే ఉన్న కమల అనే స్త్రీ గురించి కూడా రవి అన్నపూర్ణకు చెప్పేడు . ఇది ఆ చిన్నారి మనసు తట్టుకోలేక పోయింది . తను సర్వస్వంగా , సత్యం గా ప్రేమించిన భర్త మనసులో మరొక స్త్రీ . వివాహం తర్వాత రవి శంకర్ తప్ప లోకం లో సత్యం లేదని నమ్మిన ఏకోన్ముఖి  , అన్నపూర్ణకు ఇది విఘాతం . ఆమె తన నిరసనను తెలిపే విధానం మౌనమ్ . ఎవరినీ ఏమీ నిందించేది కాదు , పరుషంగా  ఒక్క పలుకు పలికేది కాదు ,అరిచి గోల చెయ్యడం వలన , నిందించడం వలన ప్రయోజనం లేదని ఉండదని ఆమెకు తెలుసు అందుకే  స్థాణువు లా అలా రాత్రంతా మౌనంగా కూర్చునేది . 

రవి శంకర్ కు అంతు  పట్టని విషయం ఇదే . వివాహమంటే ఒకరి కొకరు ఒక స్ఫూర్తిగా ఉండాలని , అతని భావన . అన్నపూర్ణ ఒక్క సారిగా  తనను పట్టుకుని ఎందుకిలా చేస్తున్నావు అని నిలదీసి ఉంటె జీవితం మరో రకంగా ఉండేది అనిపించింది రవి శంకర్ కి . కానీ అమెది మౌన ప్రతిఘటన అంతే . అన్ని పనులూ చేసేది ఇంటి పనులూ పిల్లాడి పనులూ భర్త పనులూ అన్నీ కానీ మౌనం వీడేది కాదు . ఇది  నడుమా పెద్ద అగాధాన్నే సృష్టించింది . కమలతో తన ప్రేమ వ్యవహారాన్ని ఒప్పుకున్నాడు భర్త . సంప్రదాయ కుటుంబం నుండి వచ్చిన ఆమెకు ఆయన ఒప్పుకోవడం మరో స్త్రీతో ప్రేమ సంబంధం ఇవన్నీ సహించ లేనివి గా కనిపించాయి . కమల రాజేంద్ర శంకర్ ల వివాహం కూడా ఆమె మనసు ను కుదుట పరచలేదు . 
మన్నించలేక పోయింది . 
రవి శంకర్ అన్నపూర్ణ ల వైవాహిక జీవితాన్ని మూడు దశల్లో వివరించవచ్చునంటారు ఈ పుస్తక రచయిత స్వపన్ కుమార్ . అది మైహార్ లో బాబా ఇంట్లో వారి కలయిక పరిచయం , ఆల్మోర లో వారి వివాహం , సుభేంద్ర పుట్టుక, కమల మరల రవి హీవితం లో ప్రవేశించడం , అన్నపూర్ణ తిరిగి మైహార్ కు చేరుకోవడం . ఇవన్నీ 1938 -1942 నడుమ జరిగి పోయాయి .  రెండవ దశ 1942 -1956 వరకు వారు , బొంబాయి , లక్నౌ , ఢిల్లీ , మైహార్ , కలకత్తాలోని వారి జీవితం , కాపురం . మూడవ దశ ఆక్కడి నుండి నేటి వరకు అన్నపూర్ణ జీవిస్తోన్న జీవితం . 

రెండవ దశ లో రవి శంకర్ బొంబాయి లోనూ , ఢిల్లీ లోనూ ఆల్ ఇండియా రేడియో లో పనిచేస్తున్నప్పుడు ఆమె ఇటు పుట్టింటికీ అటు రవి ఉన్న ఊరికి వెళ్లి వస్తుండేది . జరిగినదేదో జరిగింది మళ్ళీ జీవితం సరి దిద్దుకుందామని రవి అడిగినప్పుడు ఆమె వ్యతిరేకించలేదు . సర్దుకు పోవాలనే ప్రయత్నించింది . కొంచం కొంచం గా ఆమె బయటి లోకానికి దూరం కాసాగింది . ఐదారు ప్రదర్శనలు  రవి శంకర్ తో ఇచ్చిన మీదట అతనిలో ఆమె పట్ల ఈర్ష్య అసూయ , తనకంటే ఆమెకే అందరూ పెద్ద పీట వెయ్యడం తన భర్తకు రుచించలేదని గ్రహించింది . ఇక ఆనాటి నుండీ కచేరీలు చెయ్యడం అతనితో కానీ  , ఒంటరిగా కానీ పూర్తిగా మానేసింది . 

ఈ అంశం ఆధారంగానే ప్రఖ్యాత దర్శకులు హృషీ కేశ్ ముఖర్జీ " అభిమాన్ " చిత్రాన్ని నిర్మించారు . అయితే చిత్రం కనుక చివరిలో భార్య భర్తలు కలుస్తారు , కానీ అన్నపూర్ణా రవి శంకరుల దాంపత్యంలో  మాత్రం ఆ వెలితి అలాగే ఉంది పోయింది . 
మౌన వ్రతం రాను రాను బలీయం కాసాగింది . బాధా తప్త హృదయం తో , ఆమె టాగోర్ గీతాంజలి వంటి పుస్తకాలను చదవడం , తనకి తానుగా ఒక లోకం లోకి వెళ్లి పోవడం జరిగింది .   
ఇన్ని జరిగినా ఆమె జీవితం లో వదలని సడలనిది కేవలం సంగీతమూ , సుర్ బహార్ మాత్రమే . మనో విజ్ఞాన శాస్త్రానికి సంబంధించిన పుస్తకాలు వంటివి చదవడం లో మునిగి పోయేది . పైకి భర్త కోసం , బిడ్డ కోసం సంసారం లో ఉన్నా ఆమె ఎప్పుడో తన గమ్యాన్ని నిర్ణయించుకుంది అది బాబా ఆమెకు ఇచ్చిన సంగీతం . అది తానూ ప్రదర్శన మానుకున్నా మరి కొంతమందికి నిజంగా సంగీతాన్ని జీవిక గా గాక జీవితం గా స్వీకరించిన కొద్ది మంది శిష్యులను వజ్రాల వంటి వారిని తయారు చేసింది . అందులో హరి ప్రసాద చౌరాసియా లాంటి వారు ముఖ్యులు . 

 రవి శంకర్ ఆల్ ఇండియా రేడియో ఢిల్లీ లో డైరెక్టర్ పదవి లో ప్రవేశించారు 1949 లో . ఇక ఆమెకు మిగిలింది ఇటు అటు సంసారం సంగీతం , ఆమె ఆశల మొలక సుభేంద్ర ని సుర్ బహార్ లో సుశిక్షితుణ్ణి చేయడం . ఇది ఆమె జీవిత ధ్యేయం గా పెట్టుకుంది . చిన్నారి సుభో కి తల్లి చేయించే కఠిన మైన సంగీత సాధన నచ్చేది కాదు . ఏవో బొమ్మలు గీసుకోవడం , తండ్రి వచ్చి తనని తీసుకుని వెళితే బాగున్ను అని ఉండేది . ఆరోజు రానే  వచ్చింది కొడుకు కోసం తల్లి తండ్రులను పుట్టింటిని వదిలి మౌనంగా మళ్ళీ భర్త వెంట నడిచింది అన్నపూర్ణ . భర్త వెంట అడవికి సీతమ్మ లా వెడలిపోతున్న కూతుర్ని చూసి తల్లి కన్నీరు మున్నీరయ్యింది . ఆమె లేని ఇల్లు శూన్యంగా అగుపించింది తండ్రికి . 

సంగీత సామ్రాజ్యం లో మకుటం లేని మహారాజుగా పండిట్ రవి శంకర్ సితార్ విద్వాంసుడిగా దినదిన ప్రవర్ధమానంగా ఎదుగుతున్నారు . సుభో ని ఆమె ఇష్టానికి వ్యతిరేకంగా చిత్ర కళ నేర్పే పాఠశాల లో పెట్టేరు రవి శంకర్ . 1967 లో తన విదేశీ పర్యటనలో కమల ను తన సహచరిగా పర్యటించి వచ్చారు . కామాలను వివాహం చేసుకున్నారు తర్వాత . 

తల్లి , తాతయ్య ల శిక్షణలో అతని వయసుకు మించిన ప్రతిభతో రాణిస్తున్న సుభో ని తండ్రి తీసుకుపోతాను అని రావడం ఆమెకూ బాబాకూ చాలా  వ్యాకులత కలిగించింది . అతని మాటనే పట్టుకుని తానూ చిత్రకళ లో రానిస్తాననే నమ్మకం తో సుభో సంగీతాన్ని విడిచాడు . అప్పటికీ అన్నపూర్ణ ఒకే ఒక్క విషయం చెప్పింది సంగీతం మొదలైన దగ్గరనుండి అది కొన్ని సంవత్సరాలు సాగుతుంది ఆ సమయాన్ని  "తాలిమ్ " అంటారు అంటే శిక్షణా సమయం . అది ఇంకా ఒక ఏడాదిన్నర ఐతే పూర్తవుతుంది అప్పుడు  సుభో ని తీసుకెళ్ళండి అని చెప్పినా రవి శంకర్ ఆమె మాట వినలేదు . ఇది తట్టుకునే శక్తి ఆమె లో లేక పోయింది . బాబా అంతటి వారు కూడా కన్నీళ్లు పెట్టుకున్నారు సుభో సంగీత శిక్షణ సగం లో ఆపేయడం చూసి . " మనది సంగీత సంప్రదాయం గల వంశం , చిత్ర కళ  కేవలం నీకు కాలక్షేపం మాత్రమే సంగీత శిక్షణ పూర్తి చేసాక నేర్చుకోవచ్చ్సును " అని ఎంతగా నచ్చ చెప్పా ప్రయత్నించినా సుభో నిలకడలేని మనసు తండ్రి ప్రోత్సాహం తో ఆమెకు ఎదురు తిరిగింది . రవి శంకర్ తో ఈ విషయం చర్చించాలనుకుంటుంది కానీ చెయ్యదు . మౌనంగా ఊరుకుంటుంది తన ఆశయాలను , ఇష్టాలను ఏవీ ఎవరి పైనా రుద్దే స్వభావం కాదు అన్నపూర్ణ ది . 


నిర్దయమైన కాలం కరిగిపోయింది . సుభో ఒక అమెరికన్ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని అన్న రోజున రవి శంకర్ హతాశు డయ్యాడు . ఈలోపల మైహార్ లో తల్లి కి మొదలైన మూర్ఛ (ఫిట్స్ ) , మరొక పక్క తండ్రి నిరాదరణ ఇవన్నీ సుభో ని తల్లీ తండ్రిని ద్వేషించే లా చేసాయ్ . అతి సాధారణ మైన బిడ్డకి కుడా దక్కే తల్లి తండ్రుల ప్రేమ తనకు లేదనిపించేది . 

అమ్మ తనను ఎంతగానో ప్రేమించేది , నాన్నా అంటే కానీ తానూ ఎవరికీ చెందని వాడి పోయిన ఒంటరితనం సుభో ని కాల్చివేసేది . తనలోకి తనే ముడుచుకు పోయేవాడు . అలాంటి  సమయం లో లిండా అనే అమెరికన్ మహిళను పెళ్లి చేసుకున్నాడు . ఇద్దరు పిల్లలు సోమ , కావేరి . భారత్ టెలిఫోన్స్ లోపనిచేస్తూనే తండ్రితో కలిసి మళ్ళీ సంగీత ప్రదర్శనలలో పాల్గొనడం మొదలు పెట్టేడు . తండ్రి యశ స్సూ కీర్తీ , ఆతని ప్రదర్శనా చాతుర్యం ఇవన్నీ చూస్తుంటే తానూ ఏమీ కాను తండ్రి ముందు అనే న్యూనతా భావం ఏర్పడింది సుభో లో 

. కొన్ని సార్లు తండ్రి తో కలిసి కచేరీ   వెలితి లోపం కనిపించేవి , కాళ్ళ ముందు  తల్లి అగ్రహ రూపం కనిపించేది , తనని దిద్ది  ఆమె పడిన శ్రమ గుర్తొచ్చేది . నెమ్మదిగా సుభేంద్ర ఒంటరి తనం లోకి జారుకున్నాడు 1992 లో అతి దారుణ మైన మానసిక స్థితిలో అమెరికాలోని ఒక హాస్పిటల్ లో మరణించాడు  సుభో . 

ఒక గొప్ప సంగీత వారసత్వానికి ప్రతీక అయిన సుభో ఆకహ్రి రోజుల్లో తల్లినే తలుచుకుని కునిలి పోయేవాడు . తాతయ్య ఇంటిలో మైహార్ లో ని తన బాల్యాన్ని గుర్తు చేసుకునేవాడు , అమ్మ చివరి సారిగా ఏమి నిర్ణయించుకున్నావు అని తనని అడిగిన క్షణాన స్వతంత్రంగా బతకలనుకుంటున్నాను అనే తన సమాధానం గుర్తొఛ్చి , అప్పుడు అమ్మ టాటా చేతిలో ఉన్న తన సంగీటం నోట్ పుస్తకాన్ని విసిరేసి వెళ్లి గది తలుపేసుకుని " తీసుకెళ్ళి పోండి , వాడు నా కక్కరలేదు " అని ఏడుస్తూ అరవడం రాత్రుళ్ళు గుర్తొచ్చేది మరణ శయ్య పైన . తండ్రితో కనీసం మాటాడటం కూడా మానేసాడు . అలా చివరికి కుములి పోతూ ఒక తెలిజాము 4 గంటలకి 15 సెప్టెంబర్, 1992 నాడు తుది శ్వాస విడిచాడు అన్నపూర్ణా రవిశంకర్ ల కళల , కలల పంట అయిన సుభేంద్ర శంకర్ . 

ఇది ఇంతవరకు జరిగిన జీవన నాటకం అయితే ఇక గురువుగా అన్నపూర్ణ సాధించిన దేమిటో చూద్దాం . 

పండిట్ హరిప్రసాద్ చౌరసియా అప్పటికే సినీ వినీలాకాశం లో ధ్రువతారగా వెలిగిపోతున్న సమయం . అయినా ఒక నాడు అన్నపూర్ణ విద్వత్తును తెలుసుకుని ఆమెను వెదుక్కుంటూ బయల్దేరాడు . ఆమె చాలా ఉద్విగ్న స్వభావం నిన్ను పలకరించాను కూడా పలకరించాడు అన్న నేస్తం మాటలు పక్కకు నెత్తి అన్నపూర్ణను కలిసాడు హరి ప్రసాద్ . ముందు సినిమా వాళ్ళకి నేర్పించాను నేను పైగా నాకు వెనువూ గురించి ఏమీ తెలీదు అని కొట్టి పారేసింది అతన్ని ఆమె. కానీ సాధన మళ్ళీ మొదటి నుండీ నేర్చుకోవడానికి ఒప్పుకున్నాక తాలిమ్ (శిక్షణ ) మొదలయ్యింది . ఒక నాడు పాఠo చెప్తుండగా ఆమె ఆరోగ్యం సరిగా లేదని విపరీతంగా దగ్గు వస్తోందని గుర్తించి మరునాడు ఆమెకు కొన్ని మందులు తీసుకెళ్ళి ఇచ్చాడు . ఆమె ఆ మందులు పారేసి ఎందుకు నాకు మందులు బతకాలి అనుకున్న వారికీ  గానీ నాకెందుకు అని కసురుకుంది .

 హరి ప్రసాద్ తన మాటల్లో అంటాడిలా  ఆమెను గూర్చి " ఆమె ఒక "మౌన సాధిక" , సంగీతం మాత్రమె శ్వాసించే చక్కని గురువు . ఆమె శిక్షణలో ఏంటో నేర్చుకున్నాడు తాను. ఆమె ఒంటరితనం ఎందుకు కోరుకుందో తెలీదు ? అన్న ప్రసన కి ఆమెను  కొన్నాళ్ళు  గమనించాక అప్పుడు అనుకున్నాడిలా "నిజమే ఆమె సాధారణ మానవి కాదు , బాబా అల్లౌద్దిన్ లాంటి సరస్వతి పుత్రుల ఇంట పుట్టిన అపర సరస్వతి ఆమె ఈ మామూలు మనుషులతో , సాధారణమైన మాటలు ఎలా కలపగలదు . ఆమె దివి నుండి ఒక కార్యార్ధం వచ్చిన దేవతా మూర్తి . ఆమెను అతి దగ్గరగా చూసిన  , ఆమె దీక్షను , కఠినమైన నియమాలను అటు జీవితం లోనూ , ఇటు సంగీతం లోనూ కలిగిన ఆమెకు శిష్యుడు కావ డం తన పూర్వ జన్మ సుకృతంగా భావిస్తాడు హరి ప్రసాద్ . 

ఆమెకు మరో శిష్యుడు రూషి . తర్వాత అన్నపూర్ణ రూషిని వివాహం చేసుకున్నారు . అయినా నేను ఆమెకు ఎప్పుడూ శిష్యుడినే అనే రూషి ఒక వ్యక్తిత్వ వికాస తరగతులు చెప్పే ఒక మనో విజ్ఞాన శాస్త్ర వేత్త , పైగా మానేజ్మెంట్ లెక్చర్స్ దేశ  విదేశాల్లో ఇచ్చే వారు . సంగీతం నేరుచుకోవడానికి అన్నపూర్ణ దేవి వద్దకు వచ్చి తనను ఆమె సోదరుడు ఆలి అక్బర్ ఖాన్ పంపేడని  చెప్పినప్పుడు " నేను హిప్పీలకు నేర్పను " అని ఖచ్చితంగా చెప్పేసింది ఆమె . తన సోదరుడు పంపిన కారణంగా ఆ గౌరవం  తో అసలు ముందుగా రూషి కి సంగీత శిక్షణ మొదలు పెట్టింది .  

" మరి ఆమెను మీరెలా పెళ్లి చేసుకున్నారు ?" అంటూ ఆసక్తిగా అడిగిన స్వపన్ కుమార్ ప్రశ్నలకి  రూషి నవ్వేస్తూ ఇలా అంటాడు , " మేమిద్దరం మంచి స్నేహితులుగా పరస్పర గౌరవం  తో మెలుగుతాము . ఇప్పటికీ నాకు అనపూర్ణ గురువే . మీరు ఊహించిన ప్రేమ కథలేమీ జరగలేదు మామధ్య . కొన్నేళ్ళు గడిచాక ఒకానొక రోజు వివాహం చేసుకుందాం అనుకున్నాం అంతే . అందులో మీరు ఎంత ఊహించి కల్పించి రాయడానికి ఏమీ లేదు . ఒక మామూలు నిర్ణయం తీసుకున్నట్టు గానే మా వివాహం జరిగింది . " 

ఒకరికొకరు తోడుగా సంగీతం శ్వాసగా జీవించే వీరు 1982 లో రవి శంకర్ నుండి ఆమె విడాకులు తీసుకున్న చాల కాలానికి వివాహం చేసుకున్నారు . 
జీవితం లో కొన్ని చిత్రాలు ఇలాగే ఉంటాయేమో అంటాడు రూషి , కేవలం భయ భయంగా ఆమె తనకు సంగీతం నేర్పితే చాలనుకుని వచ్చిన తనకు , అన్నపూర్ణ కూ  మధ్య ఈ బంధం ఏర్పడటం దైవికం . ఒకరి స్వేచ్ఛను మరొకరు గౌరవిస్తూ , ఆమె నిర్ణయాలకు , లోకంలో  మనుషులతో కలవని ఆమె ఒంటరితనం నుండి ఆమెను ఏ  మాత్రం చికాకు పరచకుండా చూసుకుంటాడు తను . 

అన్నపూర్ణ ప్రస్తుత జీవితం : 

ఒకే ఫ్లాట్ లో ఉంటున్నా ఆమె జీవితం ఆమెది . తన పనులన్నీ తనే చేసుకుంటుంది . వంట , ఇంటి పనీ కూడా . ఎవరితోనూ మాటాడదు . ఆ ఇంటి ముందు బోర్డ్ మీద రాసుంటుంది మూడు సార్లు బెల్లు మోగించండి ఎవరూ రాకుంటే వెళ్లి పొండి  దయచేసి అని . రూషి ఉంటేనే ఎవరకోసమైనా ఆ తలుపులు తెరుచుకునేది . లేదా ఆమె ఎవరితోనూ మాటాడదు . తనేమో తన సంగీత సాధన అంతే . 
ఆమెను ఇంటర్వ్యూ చేస్తున్నపుడు స్వపన్ కుమార్ అడిగిన ప్రశ్నలకు ఆమె జవాబులు కొన్నిచూద్దాం . 

అన్నపూర్ణను గూర్చి అన్నపూర్ణ :

1994 నుండి 2004 వరకు ఆమె ను తరచూ ఈ పుస్తక విషయమై కలిసేవాడు  స్వపన్. కొన్ని సత్యాలు వెలుగు చూడాలన్న ఆకాంక్ష తప్ప అనపూర్ణ కు తన గురించి పుస్తకం రాయించుకోవడం ఇష్టం లేదు సుతరామూ .  
కమలను వివాహం చేసుకోవడానికి రవి శంకర్ తన శీలం పై అపనిందలు వెయ్యడం . అవి బాబా తో చెప్పడం . అందుకు బాబా ఉద్విగ్నులై నా కూతురు అలాంటి పని చేసి ఉంటె నేనే ఆమె కింత విషమిచ్చి చంపేస్తాను అనడం .ఆమెకు మనస్తాపం కలిగించిన విషయం ఒక వ్యక్తిని వదలాలనుకుంటే ఆమె మీద యింత క్రూర మైన నిండా వేస్తారా ?

" మీరిచ్చే శిక్షణ లో ఏంటి గొప్పతనం ?" స్వపన్ ప్రశ్న 
" ఏమో నాకు తెలియదు . నేను నేర్పేది మనుషులకి కాస్త మనసుకి సాంత్వన ఇస్తుందని అంతే . అదే నమ్ముతాను  . హరి ప్రసాద్ కి కూడా నేనదే చెప్పాను . కొన్ని స్వరాలూ వేణువుపై పలకవు అన్నాడు తానూ అన్నీ పలుకుతాయి పలికించే నేర్పు మనసు దీక్ష ఉండాలి అని " 
" ఒంటరితనాన్ని ఎందుకు కోరుకున్నారు ?" 
" మనుషులతో కలవడం కన్నా ఇది మనసుకు శాంతి గా ఉంటుంది ఈ ఒంటరితనం . పైగా నాకు కావాల్సిన పనులు నేను చేసుకుందికి వీలవుతుంది " క్లుప్త సమాధానం 
" నేను మీరేదో ప్రతిన బూనారని అనుకున్నాను . మీరు కోల్పోయినవి చాలా ఉన్నాయి జీవితం లో అందుకని ఇలా ..' స్వపన్ 
" లేదు లేదు , అలాంటిదేమీ లేదు , సాధారణంగా నేను ఎందుకు మనుషులను కలవడానికి ఇష్ట పడను అంటే  , వారు ద్వంద్వ స్వభావాలతో ఉంటారు . నా ముందు మంచిగా మాట్లాడి వెళ్లి బయట వేరే గా మటాడుతారు  అది నాకు నచ్చదు . అందుకే ఇలా ఉండిపోయాను " చాలా మామూలుగా ఈ విషయాన్నీ చెప్పింది ఆమె . దాదాపు ఐదు  దశాబ్దాలుగా ఎవరినీ చూడకుండా కలవకుండా , బయటికి రాకుండా ఉండగలిగిన ఆమె విశిష్ట వ్యక్తిత్వానికి , ఆమె మనోనిబ్బరానికి చేతులెత్తి నమస్కరించాలి . 

స్వపన్ పక్కనే కూర్చున్న అతని భార్యను చూసి అంటుంది  ఆమె " ఎవరు పెట్టారు మీ వారి మెదడులో నా  గురించి రాయాలని, ఎందుకింత శ్రమ తెసుకున్నావు నా  గురించి ?" అన్న ఆమె ప్రశ్న కు నేనిలా సమాధానమిచ్చాను అంటారు స్వపన్ . 
" మీరు గొప్ప కళాకారులు కనుక " స్వపన్ 
" అయ్యో అదేమీ  కాదు నేనేమీ గొప్పదాన్ని  కాదు " ఆమె ఈ మాటను  అంతగా పట్టించుకోరు స్వపన్ . ఆమె గొప్పతనం తెలియకపోతే కదా . అలా అనడం ఆమె సంస్కారం నిరాడంబరత . 
" చాలా మంది మీ ప్రవర్తన గురించి చాలా విముఖంగా చెప్తున్నారు ఎందుకని ?" స్వపన్ 
" అదే ఎందుకో పండిట్ జీ (రవి శంకర్ ని ఎప్పుడూ ఆమె అలానే అంటుంది ) నా గురించి నా ప్రవర్తన  గురించి , నేనేదో పిచ్చి దానిలా గా ప్రవర్తిస్తానని , ఎవరైనా వస్తే వారిని కొట్టేందుకు వారి వెంట బడతానని ఇలా ఎన్నో నా మీద దుష్ప్రచారాలు చేసారు . ఒక సారి  కిషెన్ మహరాజ్(కథక్ నాట్యాచార్యులు ) , అతని భార్య సిద్దేస్వరి దేవి వచ్చారు . మిమ్మల్ని కలుసుకోవడం నాకు ఏంటో అదృష్టం అని నమస్కరించాను . అంతే సిద్దేస్వరీ  దేవి భర్త  వారిస్తున్నా వినకుండా వెంటనే అనేసింది , ఈమె కేమీ పిచ్చ్చి లేదే చక్కగా ఉంది , మరి రవి అలా చెప్పెరేమిటి ఈవిడ గురించి అని . కొందరు భోళా  మనుషులుంటారు ఆమె లాగా మనసులో దాచుకోలేరు . దీనిని బట్టీ నాకు అర్ధమైంది ఆమె ఏవేవో విన్నది నా  గురించి అని ." అన్నపూర్ణ 

ఆమె , ఆమె ఇష్ట పూర్వకంగా శిక్షణ ఇచ్చిన శిష్యులు ఇప్పటికీ గురు పౌర్ణమి నాడు ఇల్లంతా నిండి పోతారు తమ కుటుంబాలతో సహా . అందరితోనూ చక్కగా మాటాడుతుంది . కానీ బయటికి రాదు , ఎవరూ బయటి వారిని కలవదు . ఒక సారి  ఆమె గోలాలలో పెంచుతున్న మొక్కలు చాలా పచ్చగా ఉన్నాయని శుక్లా  అంటే . నిజామా బయట మొక్కలు కుడా ఇలాగే ఉంటాయా అని అడిగేంత పసిపిల్ల లాంటి అమాయకత్వం  అమెది . మళ్ళీ  ఏడాది వచ్చేటప్పుడు మీకు కొన్ని తెచ్చి చూపిస్తా లెండి అంది శుక్లా . 
నాకైతే ఆ మాటలేమీ అర్ధం కాలేదు అంటారు స్వపన్ . ఆమె మనసు లో ఏముందో సాగారమంత లోతు  గలిగిన ఆ మనసులో ఎన్ని అగాధాలు దాగి ఉన్నాయో ఆ సాగరానికే తెలియాలి . రూషి , సాగరం , ఈ ఇద్దరూ మాత్రమే ఆమె సంగీతాన్ని వినగలరు . 

ఒక చిన్నారి పసి మనసు సంగీతమంటే ప్రాణం అయినా తండ్రి వద్ద చెప్పడానికి భయం . అంతటి పిరికి పిల్ల తండ్రి   ఇచ్చిన సంగీత స్వర వరం తో వారసత్వం తో ఎవరూ మొగించని (లేని) "సుర్ బహార్ " ను అభ్యసించి మైహర్ ఘరానా సంప్రదాయాన్ని నిలిపిన తపస్విని అన్నపూర్ణ . జీవితపు ఒడిదుడుకులను తట్టుకోలేక , తట్టుకోక తప్పని పరిస్థితుల్లోనూ కూడా సంగీత సాధన విడవని మొక్కవోని సంకల్ప బలం గల మనోధర్మం ఆమెది . 

" సంగీతానికి చాల శక్తి ఉంది " అంటుంది అన్నపూర్ణ . ఒకోసారి తానూ రాత్రిళ్ళు సాధన  చేస్తోంటే కమ్మని సువాసనలు వేస్తాయని ఎవరో తన చుట్టూ ఉంది వింటున్నట్టు అనిపిస్తుందని చెప్తుంది ఆమె. ఆ సరస్వతీదేవి కరుణ , తండ్రి కటాక్షమే తనని నిలిపిందని ఆమె నమ్మకం . 
సుభేంద్ర కూతురు కావేరి లో మళ్ళీ తనని తానూ చూసుకుంది అన్నపూర్ణ . 
నాట్యం లో నిష్ణాతురలైన కావేరి లో కళ పట్ల అనంతమైన మమకారం చూసింది అన్నపూర్ణ . 

అన్నపూర్ణ ఒక స్త్రీ మూర్తి కాదు , ఒక కళా సాగరం అందులో ఎన్నో నదులు రవి శంకర్, సుభేంద్ర , కమల, అనుష్క (రవి శంకర్ కుమార్తె ) , సోమ (సుభేంద్ర కొడుకు) , లిండా , అన్నిటికీ మించి బాబా, అన్న ఆలి అక్బర్ ఖాన్ , రూషి ఇలా అందరూ పరిమితి లేని కాలం లో కలిసి పోయే వారే . . 

దూషణ భూషణ తిరస్కారాలన్నీ  దేహానికే తప్ప మనో నైర్మల్యాన్ని చెరచ వాణి  నమ్మే ఆత్మ స్థైర్యం గల అన్నపూర్ణ జీవితాన్ని కొన్నేళ్ళు శ్రమ పడి " ఏన్ అన్హెర్డ్  మెలోడీ , అన్నపూర్ణ " అనే ఈ పుస్తకాన్ని 2005 లో తొలిసారిగా అత్యంత శ్రమ దమాదులకొర్చి మనకు ఆర్ణవం లాంటి అన్నపూర్ణ కు ఆవలి వైపున కూడా చూపించి లోకానికి ఆమె చరిత్రను స్ఫూర్తిదాయకంగా అందించిన స్వపన్ కుమార్ బందోపాధ్యాయ్ కి అందరమూ రుణ పడి  ఉండాలి . ఎప్పుడో ఒకోసారి ఆమె పాడితే ఆ మాధుర్యానికి పుడమి పులకిస్తుంది అంటారు ఆమె గానం విన్న వారిలో ఆమె శిష్యుడు  అమిత్. 

అన్నపూర్ణ దేవి అనంతమైన రాగ మేఘం .
 వసంత గర్జన . 
నిశ్శబ్ద ఘీంకారం .
 మౌన ఓంకారం 
జీవనపు పలు రాగాలను అత్యంత రమణీయంగా కర్ణ పేయంగా  పలికించగల అపర సరస్వతి . 
 . 
ఆమె అనంత రాగాల  మాలిక . 
ఇప్పటికీ మౌన ధ్యానం లో 
సాగరుడు శృతి  వేయగా 
ప్రకృతియే విశ్వ శ్రోతగా 
ఆమె దివ్య గానం ఒక తపస్సులా , ఒక యోగం లా , ఒక యజ్ఞం లా అలా సాగి పోతూనే ఉంది . 
సప్త పదులు దాటినా వయసులో కూడా ఆమె దినచర్యలో మార్పు లేదు . ఆమె చిన్ని ఇల్లు , సుర్ బహార్ , ఆమె కోసం ఆమె వేసే గింజల కోసం రోజూ వచ్చే  వందల సంఖ్యలో పావురాలు ఇదే ఆమె కోరుకున్న ఆమెకు శాంతిని ఇచ్చే జీవనం . 

ఆమె ను గూర్చి కాసిన్ని మాటలు చెప్పు కో గలిగినందుకు సంతోషిస్తున్నాను . ఆ అనురాగ రస ఝరికి ఇవే నా మనోవాకాలు . 
................................ .............................                                                                                                                           ప్రేమతో ..జగద్ధాత్రి 
                                                                                                                                                                                          4.29 సాయంకాలం 1వ తేదీ ఏప్రిల్ 2013 సోమవారం 

(ఏప్రిల్ చినుకు 2013 జన్మదిన సంచిక  లో ప్రచురితం )

భారతీయాంగ్ల రచయిత్రులు 2 సరోజినీ నాయుడు ( విశాలాక్షి లో ప్రచురితం మార్చ్ 2013 )

భారతీయాంగ్ల రచయిత్రులు 2 సరోజినీ నాయుడు  ( విశాలాక్షి లో ప్రచురితం మార్చ్ 2013 ) 

తోరు దత్ తర్వాత భరతీయాంగ్ల కవయిత్రులులలో సరోజినీ నాయుడు దే చరిత్ర లో వచ్చే పేరు. అరబిందో, టాగోర్ లాగానే సరోజినీ కేవలమొక కవయిత్రి మాత్రమే కాదు. భారతీయ చరిత్రలో స్వాతంత్ర్య యోధురాలిగా , స్వతంత్ర భారతం లో ఒక రాష్ట్ర గవర్నర్ గా కూడా పదవి పోషించి " భారత కోకిల " గా ప్రఖ్యాతిగాంచిన విదుషీమణి. 
భారత మాత  ముద్దు బిడ్డలలో ఒకరుగా సరోజినీ నాయుడు కి అత్యంత ప్రముఖ స్థానం ఉంది చరిత్రలో. అనుకున్నది నిర్మొహమాటంగా ఖచ్చితంగా చెప్పగల ధైర్యం, మంచి వాగ్ధాటి కూడా కలిగిన స్త్రీ మూర్తి గా సరోజినికి పేరుంది. బెంగాల్ అమ్మాయి తెలుగింటి కోడలు గా సరోజినీ నాయుడు కి అత్యంత గౌరవ స్థానం ఉంది. కవిత్వం ఆమెకు ఒక భావ వాహిక. ఆమె జీవితాన్ని కవిత్వాన్ని విడదీసి చూడలేమంటారు కె. అర్. శ్రీనివాస్ అయెంగార్. అయన 1962 లో " ఇండియన్ రైటింగ్ ఇన్ ఇంగ్లిష్" అనే పుస్తకం రాస్తున్నప్పుడు సరోజిని ఒక ఉత్తరం రాస్తూ " నీకు నా ఆశీర్వాదాలు తప్పక  ఉంటాయ్ , నా కవిత్వం గూర్చిరాయటానికి , నా ఉత్తరాలను ఉదాహరించడానికి. కానీ నీకు నాగురించి ఎక్కువేమి తెలుసు? నాతొ చాలా సన్నిహితులకు కూడా నా జీవితం లో తేదీలు తప్ప నా  జీవితం  గూర్చి ఏమీ తెలీదు " అన్నారు. ఇది చాలా ముఖ్యమైన విషయం సరోజిని నాయుడు అంతర్గత జీవితం గురించి ఎవరికీ తెలియదు అన్నది స్పష్టం. ఒప్పుకుని తీరాల్సిన విషయం ఆమె చాలా గుంభనంగా ఉండేదని ఆమె అంతర్గత జీవితాన్ని గూర్చి ఎక్కడా ఎవరికీ కొంచం కుడా తెలియనిచ్చేది కాదని అంటారు శ్రీనివాస్ అయంగార్. ఆమె జీవితాన్ని ఉహించి రాయడం సాహసమే అవుతుంది లేదా ప్రమాద మౌతుంది అంటారు ఆయన. అందరితోనూ ఎంతో  కలుపుగోలుగా మాటాడుతూ చక్కని స్నేహితం తో మెలిగే ఆమె లో ఏదో కనబడని అజ్ఞాత విచారం దాగి ఉందని గోపాల్ కృష్ణ గోఖలే కుడా అంటారు ఆమె తనకు రాసిన ఒక ఉత్తరాన్ని ఉదాహరిస్తూ. ఆమె అనారోగ్యం తో ఇంగ్లాండ్ వెళ్ళినప్పుడు గోఖలే గారు ఒక ఉత్తరం లో " నీ కవిత్వం లో ఎక్కువ శాతం విషాదం ఉంది నీ తేజస్సును తగ్గిస్తోంది. అది నీవు మృత్యువుకి దగ్గరవుతున్నాను అనే భావం వలనా ? " అని అడిగారు 
దానికి ఆమె సమాధానం ఇలా చెప్పింది " కాదు , నేను జీవితానికి అత్యంత సమీపానికి వచ్చాను , దాని జ్వాలలు నన్ను దహించి వేసాయి " అని ఇందులోనూ ఒక మార్మికమైన సమాధానమే తప్ప  ఎవరి వద్దా మనసు విప్పి చెప్పేది కాదు ఆమె. 

సరోజినీ  నాయుడు జీవిత వివరాలు :(13 ఫిబ్రవరి 1879- మార్చి 2 1949) 

శ్రీ అఘోరనాథ్ చట్తోపధ్యాయ్ ,  వరద సుందరీ దేవి అనే బెంగాలీ బ్రాహ్మణ దంపతులకు ప్రధమ సంతానంగా హైదరాబాద్ లో జన్మించింది. ఎనిమిది మంది సంతానం లో నో పెద్దది సరోజినీ. ఆమె మరో తమ్ముడు బిరెంద్రానాథ్  విప్లవకారుడు, మరొక తమ్ముడు హరిన్ద్రనత చట్తో పాధ్యాయ్ పెద్ద కవి , మన తెలుగు కవులైన , దేవులపల్లి, చలం వీరందరితోనూ మంచి స్నేహం ఉన్న వ్యక్తి. సరోజినీ తండ్రి అఘోరనాథ్ హైదరాబాద్ నిజాం కాలేజీ సంస్థాపకులు. 
పన్నెండేళ్ళ వయసులోనే మద్రాస్ విశ్వవిద్యాలయం నుండి మెట్రిక్ పరీక్షలో ప్రప్రధమ స్థానం తెచ్చుకుని అందరినీ అబ్బురపరిచడమే కాక దేశ వ్యాప్తంగా కీర్తి గడించిన బాల మేధావి సరోజిని. ఆమెకు ఉర్దూ, తెలుగు, ఇంగ్లిష్, బెంగాలి పారశీ భాషలు క్షుణ్ణంగా వచ్చును. 
ఆమె కవిత్వ ఆరంభం ఒక విచిత్రం .  ఆమెను విజ్ఞాన్ సాస్త్రవేత్తనో, లేదా గణిత శాస్త్ర వేట్ట్తనో చెయ్యాలని సంకల్పించినా కవిత్వం లో ఆమె కున్న ,ఆసక్తిని  అభివ్యక్తిని గ్రహించి ఆమె తండ్రి ఆమె ను కవితవం లో ప్రొత్సహించారు. ఒకనాడు ఆల్జీబ్రా లెక్కతో కుస్తీపడుతూ ఉంటె ఆమెకు హఠాత్తుగా కాస్త విశ్రాంతి తీసుకుందామనిపించింది. ఆ విశ్రాంతి తీసుకున సమయం లోనే  ఆమెలో కవితా భావోద్విగ్నత  అదే  లో పుస్తకంలో 1300 పంక్తుల కవిత రాసింది. ఆ కవిత పేరు " ద లేడీ ఆఫ్ ద లేక్ ". ఇది చుసిన తండ్రి ఆమెను కవిత్వ దిశగా ప్రోత్సహిన్చానారంభించారు. తండ్రి   ప్రోత్సాహం తో పారసీ భాషలో " మహెర్ మునీర్ " అనే నాటకాన్ని రచించింది. తమ్ముడు హరీంద్రనాథ్ కొన్ని ప్రతులు తన మిత్రులకు ఇస్తూ ఒక ప్రతిని నిజాముకు పంపడం జరిగింది . అతి పిన్న వయసులో ఇంత  అద్భుతమైన నాటకాన్ని రాసిన సరోజినిని నిజాం నవాబు  ఏంతో  అభినందించారు. 

పసి  ప్రాయం నుండి కవిత్వం తో ఎదుగుతోన్న సరోజినీ కి పదిహేనేళ్ళ ప్రాయం లోనే తనకంటే వయసులో బాగా పెద్దైన డాక్టర్ గోవిందరాజులు నాయుడు గారిని మనస్పూర్తిగా ప్రేమించింది . 
తల్లితండ్రులు నివ్వెర పోయారామే చర్యకు. వారు కులీన బ్రాహ్మలు బెంగాలీ వారు నాయుడు గారు చూస్తె తెలుగు వారు పైగా బ్రాహ్మలు కారు ఎలా ఈ వివాహానికి అంగీకరించడం? పెద్ద 
సమస్య. నిజాము నవాబు ఆమె రాసిన నాటకాన్ని మెచ్చుకుని ఆమెకు ఇంగ్లండు వెళ్లి ఉన్నత విద్య నభ్యసించేందుకు స్కాలర్ షిప్ ఇచ్చారు. ఈ అవకాశాన్ని వదిలేయకుండా ఆమెని మనసు కుడా మరలు తుంది అనే ఉద్దేశం తో ఆమెను ఇంగ్లండు పంపడం జరిగింది. అక్కడ లండన్ లోని కింగ్స్ కాలేజ్ లోనూ గర్టన్ కాలేజ్ , కేంబ్రిడ్జ్ లోనూ ఆమె అభ్యాసం కొనసాగింది . ఆక్కడే ఆర్థర్ సైమన్స్ , ఎడ్మండ్ గోస్ లాంటి మంచి మిత్రులని విద్యా, సాహితీ వేత్తలని ఆమెకి పరిచయం చేసింది . ఈ పరిచయంలో వారి విద్యా సహచర్యం లో మరింత పదునుగా భాష పై పట్టు అభివయ్క్తి స్పష్టతా అన్నీ ఆమెకు ఆంగ్ల భాషలో అబ్బాయి . లేకుంటే ఆమెకున్న భావ తీవ్రతకు సరి అయిన భాషా వాహిక దొరికేది కాదు ఆమె తన భావాలను అక్షరాల్లోకి అనువదించాలేకపోఎది కుడా . 
ఇంగ్లాండ్ ప్రయాణం ఆమెను సాహిత్యం లో మరింత  పరిపుష్టం చేసింది . అయినా ఆమె చిన్ని హృదయం లో  ప్రేమ బీజం కూడా ఆమెతోనే ఎదుగుతూ ఏమాత్రం రాజీపడకుండా నాయుడు  గారిని వివాహం చేసుకోవడం లో ఎక్కడా రాజీ పడలేదు . ఆరోజుల్లో ఒక కులాంతర వివాహం చలా సంచలనాన్న్ని సృష్టించింది . సరోజిని  ప్రేమ సంకల్పం తో సరోజినీ నాయుడు అయి మన తెలుగింటి కోడలైంది . నలుగురు బిడ్డలా తల్లి  అయింది . జయ సూర్య , పద్మజా , రణధీర , లీలామణి ఆమె బిద్దలు. తన బిడ్ల గూర్చి కవిత్వం రాస్తూ జయ సూర్యను , బంగారు విజయ సూర్యుని గా సంబోధిస్తూ , తన జీవితంలోని మబ్బు తొలగించే దివ్య తేజస్సు నీవని పేర్కొంటుంది . అలాగే మిగిలిన పిల్లలగుర్చి కుడా కలవ భామ అని , పద్మజను , యుద్ధ వీరుడవని రణ ధీరనూ , నా జీవితపు చిరు దీపికవు అంటూ లీలామణి ని ఉద్దేశించి రాస్తుంది సరోజినీ. 

సరోజినీ నాయుడు కవిత్వం : ప్రచురణలు 

 భారతీయ సంస్కృతిని ప్రతిబింబించే కవిత్వం సరోజిని నాయుడు ప్రత్యేకత. ఆమె రాసిన " బాంగెల్ సెల్లర్స్" , " కోరమాండల్ ఫిషర్స్ " , " ఇండియన్ వీవర్స్ " కవితలు స్కూల్  లో చోటు చేసుకున్నాయ్  దాదాపు అందరూ చదివిన కవితలు ఇవి. 
ఆమె కవిత్వాన్ని చూసిన ఎడ్మండ్ గాస్ ప్రోత్సాహం తో , ఆర్థుర్ సైమన్స్ ముందు మాటతో " ద గోల్డెన్ త్రెష్  హోల్డ్ "(1905 ) లో ఇంగ్లాండ్ లో ప్రచురితమయింది. 
"ద బర్డ్ ఆఫ్ టైం : సాంగ్స్ ఆఫ్ లైఫ్, డెత్ , & ద  స్ప్రింగ్ ",1912 లో లండన్ లో ప్రచురితమయింది . 
"ద బ్రోకెన్ వింగ్ : సాంగ్స్ ఆఫ్ లవ్,డెత్ , అండ్ ద స్ప్రింగ్" , మరియు "ద గిఫ్ట్ ఆఫ్ ఇండియా" (1915 లో బహిరంగ సభ లో చదివినది) ఇవి అన్నీ 1917 లో ప్రచురితమయాయి. 
" ద స్కేప్ట్ర్డ్ర్డ్ ఫ్లూట్ : సాంగ్స్ ఆఫ్ ఇండియా, 1943 లో ఆమె  తర్వాత ప్రచురితమయాయి . 
"ద ఫెదర్ ఆఫ్ ద డాన్ " ఆమె కుమార్తె పద్మజా నాయుడు సంపాదకత్వం లో 1961 లో ప్రచురితమయింది. 

సరోజిని  నాయుడు వ్యక్తిత్వం మరియు  కవిత్వ తత్త్వం :

సరోజినీ నాయుడు బహు ముఖ ప్రజ్ఞా శాలి , కవయిత్రి గానే కాక మంచి  వక్త గా కూడా మంచి ప్రఖ్యాతి గల స్త్రీ మూర్తి. కాంగ్రెస్ సభల్లో ఆమె చేసిన ప్రసంగాలకు అందరూ ముగ్ధులై పోయేవారు. అనారోగ్యాన్ని కుడా లెక్క చేయకుండా స్వాతంత్ర్య ఉద్యమం లో పాల్గొన్న ధీశాలి. ఆమె కవిత్వం లో చాలా విషయాలను వస్తువులుగా తీసుకుని రచించింది.ఎ విషయాన్ని తీసుకుని కవిత్వీకరించినా అందులోని భావ సాంద్రత , భాషా అలంకారాలు , ప్రతీకలు చదువరుల మనసుకి హత్తుకు పోయేవి . 
భారత మహిళలకొక మేలుకొలుపుగా ఆమె వాని పనిచేసింది ఆ నాడు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఉత్తర ప్రదేశ్ గవర్నర్ గా పదవీ బాధ్యతను కూడా సమర్థవంతంగా నిర్వహించింది . భారత దేశపు మొట్ట మొదటి మహిళా గవర్నర్ సరోజినీ నాయుడు. అందరికీ స్ఫూర్తి దాయకమైన ఆమె మాటలు , అనర్గళంగా మధురంగా ప్రసంగించగల శక్తి ని చూసి గాంధి గారు ఆమెను " భారత కోకిల " గా పేర్కొన్నారు. 

అనుకున్నది ఎంత కష్ట తరమయిన  పని అయినా మొక్కవోని పట్టుదలతో సాధించే సరోజినీ కవిత్వం లోని ఆమె ఆంతర్యం మాత్రం కనుగొనలేదు చాలామంది. ఎ కొద్ది మందికో తప్ప ఆమె కవిత్వం లోని భారతీయత కాక ఆమె వైయుక్తిక దు:ఖం అగుపించలేదు. " ద బ్రోకెన్ వింగ్ " లో ఆమె కవిత్వం లో అంతర్లీనంగా నిక్షిప్తమైన ఆమె అంతరంగ మథనం  దృష్టికీ కనబడకుండా అతి గాంభీర్యం తో మెసలేది ఆమె. 
ఆర్థర్ సైమంస్ అంటాడు ఆమె గురించి ఇలా " ఆమె కోరిక ఎప్పుడూ , ఓక స్వేచ్ఛా విహంగమై పక్షులతో గాలిలో, గుండె నిండా పాట నింపుకుని ఎగరాలనే " కోరుకునేది . 
ఇంట ధీశాలి అయిన ఆమె సున్నిత హృదయురాలు. ఎక్కడో మది లో ఏమూలో సోక  ఐన ఆమె మానసం ఆమె కవితల్లో స్పష్టమౌతుంది. 
జీవితం లో  అన్నీ  గలిగినా ఎక్కడో  మేఘ ఛాయలు ఆమె హృది ఆవరణమంతా పరుచుకుని ఉండేవి . ఇది ఫలానా విషయానికి ఈ బాధ అని ఎవరికీ తెలియనివ్వని నిండుతనం ఆమె వ్యక్తిత్వానికి పెట్టని కోట. 
సరోజినీ నాయుడు లోని ఆఎమ్ వైయుక్తిక దుఖాన్ని ఇప్పటికీ ఆమె కవిత్వం లోనుండి పట్టుకుని పరిశీలనా చేసిన వారు బహు కొద్దిమంది . తానూ వ్యక్తీకరించడానికి ఇష్టపడే వ్యక్తిత్వాన్ని  మాత్రమే  తన చుట్టూ ఉన్నవారికి చూపించి తనలొఇ దు:ఖాలను  మార్మికత యవనిక వెనుక దాచేసిన కవయిత్రి ఆమె. ఆమె కవిత్వం లోని  భారతీయత ఉట్టిపడుతుంది . కానీ ఆమె కొన్ని కవితల్లో తన బాధను కూడా వెలువరించింది . అలాంటి  రెండు కవితలు ఆమె హృదయ వేదనా గళం నుండి ఒలికినవి ఇక్కడ మీకోసం . 

మరణించిన నా  స్వప్నం 

తుదకు నను కనుగోన్నావా , ఓ నా స్వప్నమా ?
సప్త యుగాల క్రితం నీవు మరణించావు , మంచు అడవుల్లో నిన్ను ఖననం చేశాను 
మరల ఎందుకు తిరిగి వచ్చావు ? నీ దీర్ఘ నిదురను చెదిరించిన దెవరు 
నన్ను ఈ నీలి అఘాతాలనుండి వెతకమన్నది ఎవరు ?
నా ఇంటి చూరుపై నున్న ఈ పవిత్ర హరిత పత్ర మాలలను తుంచేస్తావా ?
గూడు కుదిరిన శ్వేత , ఆనందపు అడవి పావురాలను భయపెడతావా ?
మరణించిన నీ చేతి వేళ్ళ స్పర్శతో  నా పౌరోహిత్యపు మది వస్త్రాలను తాకి మైల పరుస్తావా ?
నీ బాధను ప్రేమ మంత్రాల అలికతో నా పండుగ లో పఠిస్తావా ?

తిరిగి వెళ్ళు నీ సమాధికి , ఓ నా స్వప్నమా, మంచు అడవుల లోతులకి 
ఎక్కడ ఒక గుండె చెదిరిన బాల నిన్ను దాచిందో ఏడూ యుగాల ముందర అక్కడికే వెళ్ళు 
నీ చీకటి నుండి నిన్ను ఎవరు తట్టి లేపారు ? నేను నీకు వీడ్కోలు పలుకుతున్నాను !
నా  హృదయ శకలాలలో నే కట్టుకున్న దేవళాలను ఛిద్రం చెయ్యకు . 

ఆంగ్ల మూలం : మై డెడ్  డ్రీమ్ , సరోజిని నాయుడు 
తెలుగు సేత : జగద్ధాత్రి 

 మృత్యువుతో కవి 

కాసేపాగు , ఓ మృత్యువూ, నేనిపుడు మరణించలేను 
నా మధుర జీవనం వసంత హేలలో ఓలలాడతోంది ;
నా   సుందరంగా ఉంది , గొప్పగా పూచిన కొమ్మలు ప్రతిధ్వనిస్తున్నాయి 
మత్త కోకిలలు ఆలపిస్తున్నాయ్ 

కాస్త ఉండు ఓ మరణమా నేను చావలేను 
విరబూసే నా కలలన్నిటినీ కోసుకోకుండా 
నా ఆనందాలను ఆస్వాదించకుండా , నా గీతాలను అలపించకుండా
నా కన్నీళ్లను స్రవించకుండా , నేను మరణించలేను 
కాసింత నిలువు , నేను సంతృప్తి చెందేదాక 
అనురాగంతో , ఆవేదనతో , దాత్రితో, మారే గగనం తో 
నా మానవ ఆకళ్లన్నీ తీరేదాకా  
ఓ మరణమా , నేను మరణించలేను 

ఆంగ్ల మూలం : ద పోయెట్ టు డెత్ , సరోజిని నాయుడు 
తెలుగు సేత : జగద్ధాత్రి 

భారతీయ ఆంగ్ల కవులు మహానుభావులైన తాత్విక కవులు టాగోర్ , అరబిందో లాంటి ఎందరినో మెప్పించిన కవయిత్రి సరోజినీ.   ఆంగ్లేయులు కూడా తనది కాని భాష లో పట్టు సాధించి కవితా హృదయాన్ని ఆవిష్కరించిన  సరోజిని పట్ల అత్యంత అభిమానం , ఆమె కవితా శక్తికి అబ్బురం చూపేవారు. 
స్వాతంత్ర్య  పోరాటం లో గాంధీ ని అనుసరించి , గోపాల కృష్ణ గోఖలే , నెహ్రూ వంటి వారి తో సమానంగా గౌరవమ్ పొందిన మన తెలుగింటి కోడలు , భారత దేశ పు ఆడపడుచు సరోజినీ నాయుడు . అనంతమైన తాత్వికత తో బాటు స్త్రీ హృదయాన్ని అక్షరీకరించిన ఆది ఆంగ్ల కవయిత్రి సరోజినీ నాయుడు అనడం ఆమెకు మనం సహస్రాంజలి ఘటించడమే. అందుకు అన్ని విధాల అర్హురాలు భారత భారతి ముద్దుల చిన్నారి సరోజినీ నాయుడు. 


జగద్ధాత్రి 

భారతీయాంగ్ల కవయిత్రులు, రచయిత్రులు (విశాలాక్షి పత్రిక లో ప్రచురితం )


భారతీయాంగ్ల కవయిత్రులు, రచయిత్రులు (విశాలాక్షి పత్రిక లో ప్రచురితం )
                                                         

రెండు శతాబ్దాలు మన భారతాన్ని పరిపాలించిన ఆంగ్లేయుల వలన మనకు అబ్బిన భాష ఆంగ్లం. 18, 19 శతాబ్దాలలో ఎందరో ఆంగ్లాన్ని అభ్య సించి, అందులో రచనలు కూడా చేసిన వారున్నారు. భారతీయులై ఉండీ ఆంగ్లం లో సృజనాత్మక రచన  చేసేవారిని భారతీయాంగ్ల రచయితలుగా మనం పేర్కొంటాము. అందులో ఎందరో మహానుభావులు , రోమేష్ చందర్ దత్త్, మైఖేల్ మధు సూధన దత్త్ , టాగోర్ , అరబిందో లాంటి ఎందరో పురుషులైతే, కొందరు ఆణి ముత్యాలవంటి భారతీయ ఇంతులు కూడా ఆంగ్లం లో రచన చేసి పేరు ప్రతిష్టతో బాటు చరిత్ర లో చిరస్థానం పొందిన వారున్నారు. అటువంటి భారతీయాంగ్ల కవయిత్రులు నాటి నుండీ నేటివర కూ ఎందరో ఉన్నారు. ఈ " భారతీయాంగ్ల  కవయిత్రులు " (ఆంగ్లం లో కవి అన్నా కవయిత్రి అన్నా రచయిత లేదా సాహిత్య సృజన చేసే వారని అర్ధం)  , పొయెట్ అనే పదాన్ని వారు రచయితకు కూడా వాడుతారు. మన తెలుగు లో రచయిత వేరు , కవి వేరు గా మనం భావిస్తాము. ఇక్కడ మనం భారతీయాత్మను ప్రతిబింబిస్తూ , భరతీయులై ఉండీ ఆంగ్లం లో రచనలను చేసిన మహిళామణులని పరిచయం చేసుకుందాము, వారి గురించి తెలుసుకుందాము. 

భారతీయాంగ్ల కవయిత్రులలో మొట్ట మొదటి కవయిత్రి తోరు దత్త్. ఈమె బెంగాలీ భాషస్తురాలు అయినప్పటికీ , ఆంగ్లము, ఫ్రెంచ్ , సంస్కృత భాషా పండితురాలు. చరిత్రలో మొదటి స్థానం భారతీయాంగ్ల కవయిత్రిగా ఈమెకే దక్కుతుంది. 

తోరు దత్త్ జీవన విశేషాలు : 

తోరు దత్ మార్చ్ 4 1856 లో గోవిన్ చంద్ దత్త్, క్షేత్రోమణి  దత్త్ దంపతుల తృతీయ  సంతానంగా జన్మించింది. తనకన్నా రెండేళ్ళు పెద్దదైన అక్క అరు , ఐదేళ్ళు పెద్దవాడైన  అబ్జు దత్ ల ముద్దుల చిన్నారి చిట్టి చెల్లెలు తోరు . తండ్రి గొప్ప కవి , భాషా సాహితీ వేత్త, తల్లి కూడా పండితురాలు, తండ్రి సోదరులు , ఓమేష్ చందర్ , గిరీస్ చందర్, హర్ చందర్ పండితులు. వారు గోవిన్ చంద్ దత్త్ కలసి అప్పటికే " ద దత్త్ ఫామిలీ ఆల్బం " రచిస్తునారు. వారి దగ్గర  బంధువు రోమేష్ చందర్ ( రామాయణ , మహా భారతాలను ఆంగ్ల పద్యం రూపం లో రచించిన ) దత్త్ ఇంగ్లాండులో ఉన్నత పదవుల కోసం విద్య నభ్యసించేవారు. ఎటు చూసినా విద్వాంసులు  , పండిత వరేణ్యులు గల గొప్ప వంశం లో అచట పుట్టిన  చేవైన చివురు కొమ్మ తోరు దత్త్ .

నాటి ఎందరో యువతరం లాగే తల్లిదండ్రులు కూడా క్రైస్తవ మతం వైపు ఆకర్ష్ణణతో తోరు కి ఆరేళ్ల ప్రాయం లో మతం మార్చుకున్నారు. మత మార్పిడి కొంత భార్యాభర్తల నడుమ , కుటుంబం లోనూ కొంత కలకలం సృష్టించినా  తల్లి క్షేత్రోమణి త్వర లోనే  క్రైస్తవాన్ని మనస్పూర్తిగా స్వీకరించడమే కాక , "బ్లడ్ ఆఫ్ జీసస్" అనే ఆంగ్ల గ్రంథాన్ని బెంగాలీ లోకి అనువదించి తన మత విశ్వాసానికి , భాషా, పాండిత్యానికి ప్రతీకగా నిలిచింది .
తండ్రి పర్యవేక్షణలో పిల్లలు ముగ్గురు , అబ్జు, అరు , తోరు , అత్యంత శ్రద్ధాభక్తులతో విద్యను  అభ్యసించే్వారు. తోరు తొమ్మిదేళ్ళ ప్రాయం లో ఉండగా 1865 లో ఆ కుటుంబానికి ఈ చిన్నారి మనస్సుకి తగిలిన అతి పెద్ద గాయం 14 యేళ్ళ అబ్జు అకాల మరణం. అక్క  చెల్లెలు అరు , తోరు మరింత దగ్గరవడమే  కాక సాహిత్యం వైపు మనసు మళ్ళించుకుని విపరీతంగా చదవడం ఆరంభించారు. "పారడైస్ లాస్ట్" గ్రంథాన్ని పదే పదే చదువుకునేవారు వీరిరువురూ. 1869 లో ఈ కుటుంబం ఇంగ్లాండు వెళి పోయారు. అక్కడ అక్క చెల్లెళ్లి ద్దరూ ఫ్రెంచ్ మరియు ఆంగ్లం లో నిష్ణాతులయ్యారు. ఇరు భాషలలో వారికి వున్న పాండిత్య ప్రతిభ ఎంతటి దంటే వారు ఫ్రెంచ్ కావ్యాలను ఆంగ్లంలోకి  అనువాదం చేసేవారు. 
1871 లో కేంబ్రిడ్జ్ లో స్త్రీల కు లభించే ఉన్నత విద్యను అభ్యయసించారిద్దరూ . అక్కడే పరిచయమైన మంచి మిత్రురాలు మేరీ మార్టిన్ తోరుకి చిరకాలం స్నేహితంగా ఉంటూ వచ్చింది . తోరు  తన లేఖలు లో ,మేరీకే తన మనోభావాలను వ్యక్తీకరిస్తూ రాసేది. 1873 లో తిరిగి దత్త్ కుటుంబం స్వస్థలమైన కలకత్తా వచ్చేసారు. 

మరొకసారి విధి రాతకు తలవంచక తప్పలేదు  దత్త్ కుటుంబానికి జూలై 23 , 1874 క్షయ వ్యాధితో అరు ఈ లోకాన్ని విడిచి చిన్నారి చెల్లెల్ని ఒంటరిని చేసి వెళ్ళిపోయింది. మేరీకి రాసిన లేఖలో ఈ విషయం గూర్చి రాస్తూ తోరూ అంటుంది , ఇదంతా ఆ దైవ పరీక్ష , ఆయనకు తెలుసు ఏమి చెయాలో , ఏది చేసినా అది మన మంచికొరకే, అంటూ కొండంత వి్షాదాన్ని కూడా ఆ చిన్నారి హృదయం దైవం పైన ఎనలేని విశ్వాసం తో స్వీకరిస్తుంది. 

కలకత్తా వచ్చిన పదినెలల కాలం లో నే తోరు సంస్కృత భాష ను క్షుణ్ణంగా  నేర్చుకుంది. 1875 లొ మొదటిసారిగా 165 ఫ్రెంచ్ కవితల ఆంగ్లానువాదాలను  , అందులో 8 అరు అనువదించినవి  , వీటిని " ఏ షీఫ్ గ్లీండ్ ఇన్ ఫ్రెంచ్ ఫీల్డ్స్ " పేరిట పుస్తకంగా తీసుకొచ్చారు గోవిన్. తోరు తను జీవించి ఉండగా కళ్ళారా చూసుకున్న మొదటి చివరి పుస్తకం కూడా అదే.   ఆమె కవనం ఆమే మరణం తర్వాత ప్రచురించారు తండ్రి. మిగిలిన ఇద్ద రిలాగే తోరు కూడా అతి చిన్న ప్రాయం లో 21 ఏళ్లకే క్షయ వ్యాధితో ఆగస్ట్ 30, 1877 లో తన అన్న అక్కలను కలుసుకోవడానికి ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోయింది. 
ముచ్చ్టటగా ముగ్గురు బిడ్దలు పైగా మువ్వురూ మేధావులు అయిన పిల్లల్ని  కోల్పోయిన గోవిన్ చంద్ దత్త్ బాధ చెప్పనలవికానిది. ఆమె మరణం  తదుపరి మేరీకి రాసిన లేఖలో ఇలా రాస్తాడు , " ఆమె చివరి  ఘడియలు చాలా ్ప్రశాంతంగా గడిచాయి , నేను , ఆమె తల్లి జీవితం లో ఎన్నటికీ మరువలేనిది , ఆమె తుది శ్వాస విడిచేటప్పటి ఆమె ముఖం లోని భావాన్ని , ఎంత అద్భుతంగా ఉందో ఆమె వదనం ఆ సమయాన ...". 
అక్క , అన్న ల సమాధి పక్కనే సి.ఎం ఎస్. సిమెట్రీ , కలకత్తాలో ఆమె పార్థివ శరీరం ఖననం చేయబడింది. 

ఫ్రెంచ్ మైదానాలలో విహరించి ఆ కవితా సుమ సుగంధాలను ఆంగ్ల భాషకి పంచిన తోరు , అతి కొద్ది కాలం లోనె అత్యంత అద్భుతంగా అభ్యసించిన సంస్కృత భాషనుండి రామాయణ , మహాభారత కథలను కూడా ఆంగ్లం లోకి అనువదించింది. రామయణం లోని సీత పాత్ర పట్ల ఆమెకి కలిగిన అభిమానం , లక్ష్మణ్ అనే కవితలో లక్ష్మణుని గూర్చి తోరు తన అవగాహన  కూడా రంగరించి  కవన రచన చేసింది. 
సంస్కృతం నుండి ఆమె చేసిన అనువాదాలను కూడా ఆమె మరణం తర్వాత ప్రచురించారు  ఆమె తండ్రి. భారత , భాగవతాలలోనూ కొన్ని పాత్రలు ఆమెకి ఎంతో ఇష్టం ఉండేవి. క్రైస్తవ మతం ఆమె హిందూ సంస్కృతికి అడ్డంకి కాలేదు. 

అతి సున్నిత మనస్కురాలు, అతి చిన్న జీవిత కాలం లోనే ఎన్నో విషాదాలను చవి చూసినా మొక్కవోని ధైర్యం తో కడదాకా రచనా వ్యాసంగాన్ని చేస్తూనే తుది శ్వాస విడిచిన భారతీయ వనితా శిరోమణి తోరు  దత్ . ఆమెను గూర్చి ప్రస్తావిస్తూ కె. ఆర్. శ్రీనివాస్ అయంగార్ తన పుస్తకం " ఇండియన్ రైటింగ్ ఇన్ ఇంగ్లిష్ " లో ఆమె జీవితాన్ని కవిత్వాన్నీ విడదీసి చూడటం అసాధ్యమంటారు. ఆమె రచించిన ఫ్రెంచ్ నవల బియాంకా కూడా ఫ్రెంచ్ వారి మన్ననలు అందుకుంది. ఇంగ్లిష్ భాషలో కామాలు, హైఫెన్స్ (చిన్న గీత గుర్తు) ఎంతటి అర్ధాన్ని సూచిస్తాయో  వాటి ఉనికి ఆ కావ్యం మనకు అర్ధం కావడంలో ఎంత భావ సాంద్రతని ప్రతిఫలిస్తాయో అలాగే తోరు దత్ అస్తిత్వం భారతీయాంగ్ల  సాహిత్య చరిత్రలో అంతటి విలువ గలిగిన స్థానం సంతరించుకుంది అని పేర్కొంటారు అయ్యంగార్. పురాణ కథలను, విష్ణు పురాణం నుండి ,   కథలను చెప్పడం ఆమెకి ఎనో ఇష్టమైన పని గా ఉండేది . 
భారతీయ కీట్స్ అని పిలిచేవారు తోరు దత్ ను . దీనికి రెండు కారణాలు ఇరువురు అతి పిన్న వయస్సులోనే మరణించారు కానీ  చరిత్రలో నిలిచిపోయే సుస్థిర స్థానం సంపాదించుకున్నారు. " అవర్ కాసురీనా ట్రీ " అనే కవితలో కుడా తోరు తన వ్యక్తిగత జీవన విషాదాన్ని పలికిస్తుంది. ఆ చెట్టును నేను ప్రేమించేందుకు కారణం ఆ చెట్టు నీడన తను , అక్క, అన్నయలతో కలిసి ఆడుకున్న , పాడుకున్న , తీయటి స్మృతులను అక్షరబద్ధం చేస్తుంది. 
సావిత్రి కథలో యముణ్ణి కేవలం మృత్యు దేవత గానే గాక ధర్మ దేవతగా చిత్రిస్తుంది. ఇది తోరు నిశిత దృష్టికి అభివ్యక్తికి , జ్ఞాన పరిపక్వతకి నిదర్శనం. 


తన కవితల గురించి తోరు మాటల్లోనే ఇలా :
                                                                అసంబద్దం అనిపించవచ్చు నే నుడివే గాధలు 
                                                                కవాతు చేస్తున్న కాలాలకు అవి సరిపోక పోవచ్చు 
                                                                 ఆ కథలను చెప్పిన పెదవులను ప్రేమించాను నేను 
                                                                అందుకే నా పద్యాలలో ఉండనివ్వండి వాటిని 
తోరు తల్లి వద్దనుండి విన్న పురాణ కథలను ఏంటో శ్రద్ధగా మళ్ళీ తన కవిత్వం లో చెప్పే ప్రయత్నం లో సఫలీకృతురాలు అయ్యింది అని నిస్సందేహంగా చెప్పవచ్చు. ఆమె కవిత " సీత " కవితకు స్వేచ్ఛానువాదం  చూడండి. 

సీత 

చీకటైన  గదిలో ఆనందంతో ముగ్గురు పసి పిల్లలు!
కనులు విప్పార్చి చూస్తున్నదేమిటో  ?
సూర్యుని వెలుగు రేఖ కూడ చొరవని చిక్కని , దట్టమైన అడవి 
అందులో మధ్యగా ఒక స్వచ్ఛమైన ప్రదేశం  -- అక్కడ పూచేను 
పొడుగు చెట్లను అల్లుకున్న తీగెలకు అతి పెద్ద పూలు , అక్కడ 
నిశబ్దమైన నిర్మల తటాకం లో 
తెలి హంసలు  ఈదుతున్నాయి  ; " ఆగిన రొదతో ",
నెమలి పురివిప్పింది ; అక్కడ, జింక  మందల పరుగు పందెం 
అక్కడే , పొలాలలో  పసుపు పచ్చటి కంకులు  ఊగుతున్నాయి ;
అక్కడే వింతైన పూజా పీఠాల నుండి తేలికగా ఎగస్తోన్న నీలి పొగ 
ఆక్కడ వసిస్తున్నాడు పరమ శాంత  కవి- రుషి .
కానీ ఎవరీ స్నిగ్ధ స్త్రీ మూర్తి ? ఎడతెగక రోదిస్తోంది 
ఆమె కార్చే ప్రతి కన్నీటి బొట్టూ  
మూడు జతల పసి కనులనుండి జాల్వారుతున్నాయి 
ధు:ఖపు బరువుతో వంగి ఉన్నాయి చిన్నారి మూడు తలలు 
అది ఒక పాత అతి పురాతన కథ , 
సీతను తన గతం నుండి ఆవిష్కరిస్తోంది 
ఒక యవ్వనవతి ఐన తల్లి గానం .....నిట్టూర్పుతో కథ ముగిసింది 
వారి నయనాల ముందునున్న చిత్రం వెలిసింది 
కానీ అదే కథను కల గంటారు ఆ చిన్నారులు  పొ్ద్దుటివరకూ!
మళ్ళీ ఆ తల్లి దగ్గర ఆ ముగ్గురు  పిల్లలు ఎన్నడు చేరేను 
ఆహ్ మనసా! మరలా అలాంటి ఒక సాయం సమయం వచ్చేనా? 

ఆంగ్లమూలం : సీత 
కవయిత్రి : తోరు దత్ 
తెలుగు సేత ; జగద్ధాత్రి 

ప్రఖ్యాత సాహితీ విమర్శకుడు జేమ్స్ డారమేస్టేటర్  ఆమెకి అద్దినట్లు  సరిపోయే నివాళినిచ్చారు.
" బెంగాల్ కన్న పుత్రిక , ఆరాధ్యంగా, అద్భుతమైన విద్వత్తు కానుక గలిగి, జాతి, సంప్ర దాయం లో హిందువు అయి ఉండీ, విద్య వలన ఆంగ్ల మహిళ , ఫ్రెంచ్ స్త్రీ మనస్సు కలిగి , ఆంగ్ల కవయిత్రి, ఫ్రెంచ్ రచయిత్రి, పద్దెనిమిది ఏళ్లకే భారత దేశానికి ఫ్రెంచ్ కవితా పరిమళాలను అందించిన , తనలో మూడు ఆత్మలను, మూడు సంప్రదాయాలను  విలీనం చేసుకున్న , ఆమె సాహితీ జీవిత శిఖరాలను అధిరోహించాల్సిన సమయం లో అకాల మృత్యు వాత బడటం, సాహితీ చరిత్ర లోనే అతి విచిత్రమైన పోలికే లేని ఒక విషయం" 

కవితా నిర్మాణం లో ఆమె సున్నితత్వం , ప్రతిభ రెండిటికీ ఉదాహరణగా " ద లోటస్" అనే కవిత 

కమలం 

ప్రేమ వచ్చి అడిగింది వన దేవతను 
ఏక గ్రీవంగా అందరూ అంగీకరించే ఒక పూల రాణి ని ఇమ్మని 
లిల్లీ , గులాబీ, చాలా కాలంగా ఉన్నాయిగా 
ఆ పదవికోసం పోటీపడుతూ 
ఎందఱో కవులు గానం చేసారు వాటి సౌందర్యాన్ని 
గులాబి శిఖర మందలేదు , లిల్లీ తన ధవళ వర్ణం తో కానీ 
ఐతే లిల్లీ ఏ అందమైనదా ? అంటే 
వన దేవత పుష్పవనం లో రెండు వర్గాల నడుమ ఘర్షణ రేగింది 
" ఇవ్వు నాకొక పుష్పాన్ని రోజా అంత  అందాన్ని 
లిలీ అంత ఠీవి గల దాన్ని అడిగింది ప్రేమ 
" ఐతే మరి ఏ  రంగు?" గులాబి ఎరుపు , కోరింది ప్రేమ ముందర 
పిదప ప్రార్ధించింది " కాదు , లిల్లీ తెలుపు , --- లేదా రెండూ కలిగినది 
అప్పుడు వన దేవత ప్రసాదించింది కమలాన్ని 
గులాబి ఎరుపు వర్ణం , లిలీ తెలుపు కలిగిన మహారాజ్ఞి పుష్పాన్ని. 

ఆంగ్ల మూలం : తోరు దత్ 
కవిత: ద లోటస్ 
తెలుగు సేత : జగద్ధాత్రి 

జీవించిన అతి కొద్ది కాలం లోనే అక్షరంగా మిగిలిన మన భారతీయాంగ్ల  కవయిత్రి తోరు దత్. ఎనలేని కవితా పటిమ, జ్ఞాన గరిమ ను కలిగి ఆంగ్ల  సాహిత్యం లో దీపధారి  అయి అడుగులు వేసి మరింతమంది భారతీయ మహిళలకు స్ఫూర్తిగా నిలిచినా తోరు దత్ చిరస్మరణీయురాలు . 

                                                                                                                                                         జగద్ధాత్రి