Friday, October 28, 2011

మృత్యు భాష

నా భాష మీ పట్ల మృత్యు భాష కావడం నా శాపం ........
                                                   
యుగాలుగా నన్ను అనుభూతిస్తూనే ఉన్నారు
పంచేంద్రి యాలతోనూ 
జ్ఞానేంద్రియం తో నూ
నన్ను మీ ప్రతి భావనలోనూ 
రంగరిస్తూనే ఉన్నారు
మీ కోపాలు , తాపాలు 
మీ ప్రియతముల విరహాలు 
మీ దుఖాలు ,సంసారాలూ
అన్నిటికీ నన్నో ఉపమానంగా
ఉత్ప్రేక్షగా, అలంకారంగా
అభివ్యక్తీ కరిస్తూనే ఉన్నారు 
మీరు అక్షర జ్ఞానులు 
రాయగలరు 
నన్ను పదాలలో , పద్య పాదాలలో 
ఇమడ్చ గలరు 
ప్రతీకగా ప్రయోగాత్మకంగా 
ప్రయోజనాత్మకంగా 
ఉపయోగించ గలరు
నాలోని రేగే బడబాగ్నులు
నాలో రేగే ఆనందాలను 
ఏవీ చెప్పలేని నేను 
నా అలల ఘోష లో 
మీ పాదాలు స్పృశిస్తే 
నా భావోద్విగ్నత మీకు పట్టదు
మీ ప్రేయసి చిరు నవ్వితే 
నేను ఆనందంగా కనిపిస్తాను 
అపురూపంగా వర్ణిస్తారు 
మీకు దిగులేస్తే 
నాలోనూ మీకు మీ దిగులే  అగుపిస్తుంది
మీ కన్నీళ్ళను 
మీ ఆశలను
ఆనందాలను 
అనాదిగా అర్ధంచేసుకుంటూనే ఉన్నా
నిరక్ష్య  రాసురాలిని మరి
ఎన్నెన్ని సార్లో 
నా భావాలని 
నా ఆకాంక్షలని 
నా ఆవేదనని 
మీతో ఒక్కసారైనా 
పంచుకోవాలనే 
తపనతో ఏమి చెయ్యాలో
ఎలా వ్యక్తీకరించాలో 
ఎరుగక ఒక్కసారి గా
ఎగిసెగిసి పడి
ఉవ్వెత్తున ఎగిరి ...
మీ దరి చేరాలని 
ఉత్సాహంతో ...
ఉరకలు పరుగులు గా
వస్తానా............
కానీ మీరందరూ  నన్ను
తిడతారు , వంచకి నంటారు 
నా గర్భంలో ని నిధి నిక్షేపాలను 
కొల్లగోట్ట్టినా అడగని నేను
మీ మాలిన్యాలను 
మోస్తున్న నేను 
ఏ ఒక్కసారీ మిమ్మల్ని 
ప్రశ్నించని  నేను
నా ఒక్కగానొక్క భావాన్నో
ఉద్వేగాన్నో , ఉల్లాసాన్నో  
చాటాలని ప్రయత్నిస్తే 
అందరు అప్రమత్తమై 
నేనేదో ప్రమాద కారిణి లా 
భయ పడి దూరం మరింత దూరంగా 
పారిపోతారు ....
నిజమే నాకు తెలుసు 
నా ఆనందమూ 
నా ఆవేదనా
రెండూ మీకు మృత్యువే 
అయినా వ్యక్తీకరించక ఆగలేని తనం 
మీకేనా  .........
నాకు మాత్రం భావ స్వాతంత్ర్యం  ఉండొద్దూ ...
అని పిస్తుంది ఎన్నో సార్లు
మీ ప్రేయసీ విరహాలుగా  
మీ ఆనంద ఆహ్లాదాలుగా   
మీ ప్రియుని ఎడబాటుగా
కష్టాలకు ఉపమానంగా 
మృత్యువుకు ప్రతీకగా 
చివరికి నా వడిలోనే
తనువు చాలించే 
మీలో ...మీతో 
నేను మృత్యువును కానని 
నాలోనూ అమ్మతనం ఉందని 
ప్రేమార్నవ నా వర్ణాలను 
బహు నీలాల రంగుల్లో 
మీకు చూపిద్దామనుకుంటా...
నన్ను నేను మీతో ....
ఏ  అరమరికలూ లేక ....
నన్ను నేను ఆవిష్కరించుకుందామని 
నన్నపార్ధం చేసుకోవద్దనీ 
చెప్పాలనుకుంటా....
నాకు వచ్చిన భాష ఒక్కటే
మరి ఏ భావానికైనా 
ఉవ్వెత్తున పొంగడం
నా  భాష మీ పట్ల మృత్యు భాష 
కావడం నా దురదృష్టం.....
విమోచన లేని  శాపం  ..!!!

..................................................ప్రేమతో ....జగతి 3.07 pm friday 28th oct 2011




























Thursday, October 27, 2011

వాసన

ప్రతీ దేహానికీ ఓ పరిమళ ముంటుంది.....






ప్రతిదేహనికీ ఓ పరిమళముంటుంది
అది ప్రత్యేకంగా ఎవరికీ వారికే
పరిమితంగా ఉంటుంది
నవ్వోస్తోందేమో నా మాటలకు
కానీ అనుభవమిది
కొన్ని దేహాలు మృగాల వాసన వేస్తాయి
కొన్ని ఆకలి వాసన వేస్తాయి
కొన్ని పురుష దేహాలు వాంఛ సుగంధం చల్లుతాయి
మరి కొన్నిఉన్మత్తతను పెంచుతాయి
కొన్ని స్త్రీ దేహాలు ఆర్తి పరిమళం వెద జల్లుతాయి
మరి కొందరు నిరాశ నిస్పృహల వాసన వేస్తారు
కన్నీటి ఉప్పదనపు వాసనేస్తారు కొందరు
మరి కొందరు చెమట ఉప్పదనంగా
మరి కొందరు నెత్తుటి ఉప్పదనంగా
అన్నీ ఉప్పనే అయినా వాటి మధ్య తేడాలుంటాయి
ద్రోహపు వాసనేసేవారు కొందరైతే
వలపు వాసనా వేస్తారు కొందరు
అమాయకపు అసహాయపు వ్యధా భరిత౦గా
అహంకారపు ఆభి జాత్యాల పూరితంగా
కొందరు చంటి బిడ్డలా౦టి పురిటివాసన వేస్తారు
మరి కొందరు మోసపు గబ్బు కొడతారు
కొందరు శ్రమ పరిమళమౌతారు
అబ్బో చెప్పకేం... కొందరు డబ్బు కంపు కొడతారు
పిచ్చి వాళ్ళు నయం దుర్వాసన వేయరు
వాళ్ళకే తెలియని పిచ్చి పువ్వుల్లాంటి
ఒక పిచ్చి వాసన వేస్తారు
కొందరు నిజాయితీ సువసనేస్తారు
చెప్పాగా ప్రతి దేహానికీ
తనది మాత్రమే అయిన
ఓ ప్రత్యెక పరిమళ మో , గబ్బో , సుగంధమో , సువాసనో
ఉండి తీరుతుంది
ఎటొచ్చీ అందరినీ అన్నిటి నీ
గుర్తుపట్టలేము
పసిగట్టలేము
పసిగట్టే నా లాంటి వాళ్ళకు
నిజానికి సుఖ ముండదు
నేను అనుమానపు పసిగట్టే వాసన వేస్తానేమో
మరి నన్నెరిగిన వారు ప్రేమ సువాసన వేస్తానంటారు
ఏది ఏమైనప్పటికీ...
నాకు తెలిసి వచ్చిన నిజం మాత్రం ఇదీ..
పరిమళాల దేహాల్ని ప్రేమించగలం
వాంచా పూరిత దేహాల్ని
అర్ధం చేసుకోగలం
వంచన నిండిన దేహాలను
భరించలేము...
అన్నిటికంటే దుఖం ...
వాటిని పసిగట్టీ తెలిసీ
వాటితోనే బ్రతకాల్సి రావడం...
అప్పుడు నేను దుఖపు వాసనేస్తాను కాబోలు.....

......................................................ప్రేమతో ....జగతి 1.11am 24th oct 2011





Saturday, October 22, 2011

త్రిమూర్తిని

 ఆ త్రిమూర్తినిలను నీలోనే స్పర్శించిన అనుభవమిది .......
              
              జల్లులు - విరిజల్లులు 
           జగమంతా -నా మనసంతా కురిసే క్షణమిది 
    సుమధారాలు మది ద్వారాలు దాటి 
  జీవన త్రి కాలాలకు విస్తరించిన  నిమిషమిది

         నిజమో- స్వప్నమో ,మోహమో -తన్మయమో 
        నగవులు -దేహపు బిగువులు తెచ్చ్సిన పరవశమో 
     సుధామధుర సంగమ సంభ్రమంలోంచి ఆశ్చర్యమో 
    నీ త్రిగుణ విశ్వరూప సందర్శనలో  నా  నిరీక్షణ ఫలియించిన తరుణమిది 


            గజగామిని గా ప్రతక్షమయి
         మగత పుష్పంగా పరిమళించి 
        గాధామృత  లహరిగా నువ్వు పలకరించాకా
      ఆ త్రిమూర్తినిలను నీలోనే స్పర్శించిన అనుభవమిది 


               ఈ జన్మలోనే వరూధినిని నీలో చూసా 
            నేటి గత జ్ఞాపకాల మధుర వాణిని నీలో దర్శించా
         రేపటి ధాత్రి పై లాలసని నీలోనే స్మరించాను 
 నిన్నటి రాత్రి  నా దేహ -మనో- ఆత్మలను ఒక్కటి చేసి నిన్నే వరించాను

..............................................................................నీ చిన్ను 21-10-2011

"ఎన్నో ఏళ్ల  నిరీక్షణకు ఫలితం ఒక నువ్వు" అనే  టాగోర్ మాటలు తనని కదిలించాయనే ఈ కవి స్వచ్చమైన మనసుకి ప్రతీక ఈ కవిత ......
                                  
     (ఎన్నో ఏళ్లకు తన మది కదిలించి పలికించిన తన ప్రేయసి కోసం ఓ ప్రేమికుని హృదయావిష్కరణమిది )                                                                                

         

Saturday, October 15, 2011

కలయిక ....




దేహాన్ని అర్పించడమంటే
మనసిచ్చినంత సులువుకాదు
మనసు ముడి విప్పినంత తేలికగా
రవికె ముడిని విప్పలేము
దిశ మొలతో నగ్నంగా
అణువణువునా అవతలి వారి
చూపు పాకుతూ స్పృశిస్తోంటే
నిస్సిగ్గుగా తల వాల్చ కుండా
నిలబడడానికి
ధైర్యం కావాలి
తరువూ లతల్లాగా
ఇరు తనువులు
అల్లుకు పోవాలంటే
భయాలూ, బంధాలూ
లేక లయించి పోవాలంటే
ఇరువురిలో సాంద్రత
నిండుగా పొంగిపొరలే
వాగులా ....
తాధాత్మ్యంతో....
మొగ్గలై .....పూచి
మొలకలై ......నిటారుగా
నిలిచిన .....తన్మయత్వంలో
ఒకింత నిజాయితీ ఉండాలి
మనో దేహత్మల
సాక్షిగా
కలయిక జరగాలంటే
అనుభూతించే ఆత్మ స్థైర్యం కావాలి
ఇసుమంత నమ్మకం కలగాలి
మరీ ముఖ్యంగా
క్రతువు కన్న
అనుభూతిని మిగుల్చు కోవాలి....
అప్పుడు ఆ క్షణాన
జరిగే మైధునంలో
పొందే మేధో భావ ప్రాప్తి
అనిర్వచనీయమైనది ....
ఆ నిర్వికల్ప సమాధి లో
రస సిద్ధి పొందిన .. .దేహాలు
దేవళాలు  కాక ......ఏమౌతాయి ???

.......................................................ప్రేమతో...జగతి 3.32pm Thursday vijaya dasami 6/10/2011



Wednesday, October 5, 2011

ఒలికిన అక్షరాలు..


ఆద్యంతాలు లేక 
అనూచానంగా వింటూనే ఉన్నా
నీ గుండె చప్పుడు
అయినా ప్రతిసారీ 
ఓ కొత్త గుండెతో రావుగా
అదే హృదయం
ప్రతిసారీ మరో దేహం తో
వేరే  మొహాలతో 
మనం కలిసి నప్పుడు 
ఎప్పుడూ నీకన్న ముందుగా
నీ గుండెల అడుగుల జడి 
వినిపిస్తుంది
నాకూ హృది ఉందని
నువ్వనుకుంటే బాగుండుననిపిస్తుంది
అయినా చెప్పను 
అడిగి లేదనిపించుకోలేను
అహంకారమా? 
అంటావా? ఏమో మరి ?
ఈ అభావాన్ని ఏమంటారో 
నాకే తెలియదు 
కలసి కాళ్ళు నడిచాక
చేతులు కలిసాక
దేహాలు ఒక్కటయిన 
దివ్య  క్షణాలు మాత్రం
నావే నంటాను 
మొహం, వాంఛ, వలపు 
ఇష్టం, అభిమానం 
ఆహా ఎన్నెన్ని పేర్లు పెట్టాం మనం
దివ్యమైన ఒక్కటైన
ప్రేమకి ....
సౌందర్యాన్నంతా నాశనం
చేసాం ప్రేమది 
నింగి లోని సూర్యబింబం
సముద్రంనుండి వచ్చినట్టగుపిస్తే 
అది భ్రమ అంటున్నామా
అందమైన చంద్రోదయాన్ని 
కనులారా తాగడం లేదూ
విశ్లే షిస్తున్నామా?
మరి అనంతమైన ప్రేమాంబుధిని
మాత్రం ఎందుకు ఇంకా 
మన మూర్ఖ సర్పాలతో 
నమ్మకపు కొండలను బిగించి
చిలుకుతున్నాము?
నాకు నువ్వు నిజం
నీకు నేను నిజం 
ఈ కాసిన్ని క్షణాలు 
ఈ భూమ్మీద 
మనవి అని ప్రేమగా
చెప్పుకుంటే 
ఒప్పుకుంటే ఏం?
ఎప్పుడూ ఏదో ఒక అడ్డేనా
హద్దేనా మన మధ్య
అయినా కలసిన మనం 
కలయిక నిజమని 
ప్రేమ పూరితమని 
ఎందుకు అనుకోము
అక్కడ ఆ అద్వైత క్షణాల్లోనూ
నేను కాని  నువ్వు 
నువ్వు కాని  నేను గా 
విడిగానే ఉండి పోతున్నామేం?
నిన్ను నాలోకి తీసుకున్న  క్షణం
ఆ క్షణం మాత్రమే నిజం నాకు
సహజం కానిదేదీ 
సహించలేను 
ఎక్కడో ఏదో బాధ మెలితిప్పి
నేలకేసి కొట్టినట్టు 
వెన్నెముక విరిగినట్టు 
పెటిల్లుమన్నప్పుడు 
దుఖంతో గొంతు పూడుకు పోయి
ఆఖరికి నావైన
ఆ క్షణాలను కూడా
నాకు దక్కనియ్యని 
కాలాన్ని నిందించనా 
ప్రాణాలు ఐదూ నీ  సొంతం 
చేస్తూ నన్ను మరిచి నేనున్నపుడు
నువ్వు మాత్రం 
అది ఆదిమ వాంఛ మాత్రమే
అంటావేమి?
అనుబంధం ఎంత 
గొప్పదైనా
నిర్బంధం కానీయనని  
నీకు తెలియదా 
నన్ను ప్రేమించకు 
కానీ ప్రేమను ప్రేమించడం
మానేయకు....
అదొక్కటే మనలో  ఇంకా
మనిషితనానికి గుర్తు ...
నా ఆడతనం సాక్షిగా
ఇది మాత్రమే నిజం ...........ప్రేమతో...జగతి 4.32pm.Wednesday 5/10/2011

(అనంతమైన నీలి సాగర స్త్రీత్వాన్ని , అనాదిగా కదలని డాల్ఫిన్స్  నోస్ పురుషత్వాన్ని  చూస్తూ మనసులోని మాటలని అక్షరాల్లోకి ఒంపుకున్నా )  



















Tuesday, October 4, 2011

OF MAN’S FIRST…….



Aeons ago we met each other
Ate the fruit with disobedience
But reveled in our living
We lived loved …
But for that we never would have known
What’s love…and lust
No regrets……….
We brought off springs to earth
Made it a human land
Enjoyed fulfilled
We all lived ….real life
Until the word ‘marriage’ entered the minds
We turned possessive
I was possessed
I was made a possession
At that wild moment
We lost our real paradise again
Forever and ever
We died …reborn
Again and again
But the effect of ego
Grew larger and larger
Each time we took birth
Affected with much intensity
Than the effect of fruit forbidden
And all our efforts to fight this out
Seemed futile
More and more viruses
Crept into our cells
As each era passed
And we are and more
Into fathoms deep of
Endless sorrow…
Unrelated to each other
One and only antidote being ‘love’
A very scarce drug
On which we all are working for
And the direst need
For the humanity
To be saved and survive
From this epidemic of
Jealousy and hatred…
Still living in the “hope”
Of Pandora’s box
Life always
An approach –avoidance conflict
May my soul rest in peace…!!!       …….love jagathi 5.05pm.3.10.11Monday






నేను , అతను , ప్రేమ


"నేను ప్రేమను నమ్మను" అన్నాడతను స్థిరంగా
"నేను ప్రేమనే నమ్ముతాను, ప్రేమనే జీవిస్తాను " అంది ఆమె ఆతని వంకే  చూస్తూ నిశ్చలంగా
"నేను ప్రేమను నమ్మను, ప్రేమించే వారిని నమ్ముతాను" అతను
పకాలున నవ్వింది ......
"అంటే ప్రేమని నాకంటే నువ్వే ఎక్కువ నమ్ముతావన్నమాట   "అంది చిలిపిగా
"అదేంటి నే  చెప్పింది వేరు" కొంచం విసుగు అతని కంఠంలో
"ప్రేమంటేనే నమ్మకం కదా అంటే ప్రేమను నమ్మేవాళ్ళను  నమ్మడమంటే ప్రేమించడమే కదా"
"నీ మొహం అదేమీ కాదు నీకలా అర్ధమైతే అది నీ ఇష్టం"
"ఎందుకు చిన్ను అంత కోపం నేనన్న  దాంట్లో  తప్పేమన్న ఉందా?" లాలనగా అడిగింది తన ఒడిలోని అతని తలని సవరిస్తూ...
"నాకు కోపం లేదు రాదు కూడా , నీకు నాగురించి ఏమి తెలియదు" 
"నాకు నా గురించే తెలియదు ఇక నీ గురించేమి తెలుస్తుంది?" నవ్వింది
"ఎందుకలా మాటాడ తావు అన్నీ తెలిసినట్టు మరీ" వెక్కిరింపు అతని స్వరంలో
"అన్నీ తెలుసు కనుక " అల్లరి సమాధానం 
"ఇప్పుడే నీకు నువ్వే తెలియదన్నావ్ ఇంతలోనే అన్నీ తెలుసు నంటావ్ కొంచం ఎమన్నా లూజా నీకు" 
"హహహ లూసేన్టోయ్ భద్రం అసలు స్క్రూ ఉంటేగా " గలగలా మని నవ్వుతూ 
"భద్రమా  వాడేవాడు?"
"ఏమో?నాకేం తెలుసు?"
"మరి అలా ఎందుకన్నావ్ ?"
"ఊరికే అనాలనిపించింది అన్నా "
"అబ్బ ధీరూ ఎన్టీ అల్లరి ?పద రూం కి  పోదాం ఆమె ఒడిలోంచి లేస్తూ అన్నాడు
"అల్లరా  నేనా? భలేవాడివే నేను అల్లరి చేయడమేంటి నాకేమీ చేతకాదు....ప్రేమించడం తప్ప "
"అన్నట్టు బాలూ నేనూ నీలాగే ప్రేమిస్తాను ప్రేమని నమ్మే వాళ్ళని నమ్ముతాను మంచిదాన్ని కదూ?"
"ఆ నీకు నా సర్టిఫికేట్ కావాలా తల్లీ లే లే పోదాం"
"ఏం నువ్వు మెచ్చ్చుకునేంత ప్రేమ లేదా నాలో ?"
"ధీరూ చాలు ఇక పద పోదాం"
"ఆహా నేనడిగింది  చెప్పు ముందు అప్పుడే లేచేది " ఇసుకలో కళ్ళు చాపుకుని కుర్చుని పదాలు అల్లరిగా ఆడిస్తూ అంది.
"ఏంటి చెప్పేది అసలేంటి నువ్వడిగింది ?" ఎంత దాచుకున్దామన్న కొంచం కరుకు అతని స్వరం లో .. 
"అదే ప్రేమను నమ్మేవాళ్ళను నమ్మడం ప్రేమ కాదా? దిస్ ఈజ్ మై క్వెస్చన్? యూ ఆన్సర్ ఐ కం నో ఆన్సర్ ఐ నో కం "
పకపక లాడుతున్న ఆమెను చూస్తే అతనికీ నవ్వొచ్చింది .
"నేను చెప్పేది నీ మేధ కందని విషయం ఇప్పుడా చర్చ ఎందుకు పద "
"ఏం ఎందుకని నాకు తెలివి లేదా అర్ధం చేసుకోలేనా ?"
"అవును అర్ధం  చేసుకోలేవు అందుకే నీకు నీ ప్రేమ లాజిక్ కి అందనిది  అది..."
"భలే అసలు లాజిక్ లేనిదే ప్రేమ ఇక ప్రేమ లాజిక్ ఎక్కడిది?" 
"అది కాదులే అసలు నువ్వనుకుంటున్న ప్రేమ కాదు నే చెప్పేది"
"అయ్యో బాలూ నేను చెప్పేది అదే ప్రేమ అంటేనే నమ్మకం ఆ నమ్మకం ఒక మనిషి పట్ల అయితే వ్యక్తి ప్రేమ అదే ఓ దేశం   పట్ల అయితే దేశ భక్తీ, ఒక సిద్ధాంతం పట్ల అయితే ఓ ఉద్యమం ...." వివరిస్తున్న ఆమెను మౌనంగా చూస్తూ నిలబడ్డాడు.
"ప్రేమ అంటే కేవలం స్త్రీ పురుషుల మద్యనో మనుషుల మధ్యనో  ఉండేదే కాదు స్వామీ మేమూ జీవితాన్ని చూసాం ఎన్ని కష్టలోచ్చినా ప్రేమ పట్ల మనకున్న నమ్మకమే మనకి జీవనాధారమౌతుంది...అది ఎటువంటి ప్రేమైనా దేని పట్ల అయినా ప్రేమ శాస్వతం రా కన్నా మనమూ మన నమ్మకాలూ మన సిద్ధాంతాలూ మన వైరుధ్యాలూ విద్వేషాలూ అన్నింటికీ మూలమంత్రం ప్రేమ అనే రెండున్నర అక్షరాలే  " నిశ్సబ్దంగా ఉన్న ఆ రాత్రి కెరటాలు కూడా చప్పుడు చెయ్యకుండా వింటున్నట్టున్నాయి ఆమె మాటలను అనిపించిదతనికో క్షణం
"నేను ప్రేమని  నమ్మనుఅని నువ్వు  అన్నది కూడా ఒక నమ్మకమే గా ?" ప్రశ్నలా అతని వైపు చూసింది 
జవాబు చెప్పకుండా చిన్నగా నవ్వాడతను 
"థాంక్స్ నాకు జవాబు దొరికింది అబ్ చలో " అంటూ చీరకంటిన ఇసికని దులుపుకుని అతని చేతిని పట్టుకుంది
'ఏం దొరికింది జవాబు నేనేం చెప్పలేదుగా ?"
నిశ్సబ్దంగా నవ్వింది 
"అన్నిటికీ మాటలలోనే సమాధానముండదు స్వామీ"
"నా మౌనాన్నీ నీకు తోచినట్టు అర్ధం చేసుకుంటే నేనేమి చేయలేను నువ్వన్నది నువ్వనుకుంటున్నది"
"నే కాదనలేదుగా నువ్వు నా మాట ఒప్పుకున్నావనీ ఒప్పుకోవాలనీ నాకేమీ లేదు " ఆమె స్వరంలోని ఒకింత గంభీరత
 "ధీరూ " ఆమె భుజం చుట్టూ చెయ్యి వేసాడు ఆప్యాయంగా 
"వద్దు వద్దు నన్ను ప్రేమిస్తున్నానని చెప్ప మాకు " అల్లరిగా నవ్వుతూ అతని దగ్గరికి  జరిగి అతని నడుము చుట్ట్టు చేయి వేసింది 
"అల్లరి పిల్లా నేనేమి నిన్ను ప్రేమిస్తున్న అని చెప్పడం లేదు " నవ్వాడతను
"ఒక వేళ అలా అనిపిస్తుందేమో అప్పుడు నీ నమ్మకం పోతుందేమో అనీ అంతే సుమా " 
"సరే ఇక ఈ ప్రేమ పురాణం ఆపు తల్లీ పద ఆకలేస్తోంది ప్రేమ నిజమో కాదో కానీ ఆకలి మాత్రం నిజం..." 
"అదే మరి ఆకలి, నిద్ర , కామం ,ఎంత నిజమో ప్రేమ కూడా అంత నిజమే నా పిచ్చి బాలూ, నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోక పోయినా పర్వాలేదు " మనసులో అనుకుంటూ 
"అవునవును సాపాటు లేకుంటే పాట్లు పడాల్సిందే పదపద " అతని చేతుల్లో చేతులు కలిపింది
ఇద్దరూ వడి వడి గా నడిచారు హోటల్ వైపు..
ఇద్దరి నమ్మకాలు ఏమైనా ఇద్ద్దరి కలయిక మాత్రం నిజమైనదే కదా వీళ్ళది కలహమా కలయికా?....ప్రస్నార్ధకంగా చూసింది తార దశమి నాటి చంద్రుని వైపు . వారిది కలయికే అలనాటి మన కలయిక లా అనుకుని సిగ్గుతో మబ్బు చాటుకి వెళ్ళిపోయాడు నెలరాజు.
 అలల సందళ్ళు చేస్తూనే ఉంది అనాదిగా ...అనంతంగా ...నిరంతర చంచలత్వంతో అచంచంలంగా .......అచ్చ్చం "ప్రేమ" లా జీవితం లా ...సముద్రం .....
...................................................ప్రేమతో ..జగతి 6.05 pm tuesday 4/10/11 (rams office)  







Saturday, October 1, 2011

సముద్రం, అతను,నేను

సముద్రం, అతను  నేను 
నీరెండలో  ఆ ఇసికలో పరిగెత్తి అలసి పోయి చెమట పట్టి ఆమె దగ్గరకు వచ్చాడు అతను. "ఏయ్ రా అలా నీళ్ళల్లోకి వెళ్దాం భలే బాగుంటుంది" కూర్చున్న ఆమె చెయ్యి పట్టుకుని అన్నాడు.
"వద్దు బాబూ నాకు నీళ్ళంటే భయమని చెప్పాగా"కదలకుండా అంది ఆమె .
"అబ్బా కదలవు కదా కూర్చుంటే" విసుక్కున్నాడు 
"మరే శ్రీశ్రీ చెప్పినట్టు 'కరి కళేబరములా కదలదు కొండ' అని మా డాల్ఫిన్'స నోస్ ఈ ధీరూ రెండు కదలవు...రెండు కొండలే " గలగలా నవ్వింది 
"మాట కు మాట భలే చెప్తావురా" ఆమె పక్కన కూర్చుంటూ అన్నాడు.
"ఏమి చెయ్యను అవన్న చెప్పాలి కదా ఇంకేమీ రాకపోయినా " 
"అవునా అమ్మాయికి ఇంకేమీ రావా, నిజం" నవ్వు
"నాకు మాత్రం ఏమి వచ్చు కనుక....నాకా మాటలు కూడా రావు " అన్నాడు 
"చేతల్ల్లో చెప్పేవాడికి మాటలెందుకులే" పకపక నవ్వింది 
"సరే పోనీ అలా నడుద్దాము దా రా " అంటూ ఆమె ను చేయిచ్చి లేవదీసాడు
అడుగులు నెమ్మదిగా వేస్తూ ఇద్దరు అప్పుడప్పుడు వచ్చి తాకుతోన్న కెరటాల స్పర్సననుభావిస్తూ ........
"నిన్నో మాట అడగాలని ఉంది ధీరూ"
"అడుగు"
"నీకు నాగురించి ఏమి తెలుసు అని నన్ను ప్రేమించావ్?"
"అబ్బా పాత డైలాగ్ బాలు మరేదన్న కొత్తగా అడుగు " పెదవులు బిగబట్టి నవ్వింది
"నీకు నేనెవరో ఏంటో తెలియదు, కానీ, నేను పిలవగానే నాతో ఇంత దూరం ...."
"ఇప్పటికి మాత్రం నువ్వెవరో తెలుసా ఏంటీ? ఎవరికీ ఎవరూ తెలియరు బాలు లవ్ హపేన్స్ అంతే "
"దీన్నే ఓషో అంటాడు రిలేటింగ్ అని...నిజం ఒకరికొకరం రిలేట్ అవ్వగలిగినప్పుడు ఈ పరిచయాలు తెలుసుకోవడాలూ అన్నీ అక్కర్లేదు...." మృదువు గా అంది అతని చెయ్యి నొక్కుతూ
"అయినా   ఇప్పుడవన్నీ  ఎందుకు  ఇక్కడ కూర్చుందాం రా ఇక్కడినుండి చంద్రోదయం చాల బాగా ఉంటుంది"
మెత్తటి  ఇసుక లో ఆమె, ఆమె మెత్తటి మేనుని అనుకుని అతను చేతులు రెండిటితో ఆమెను చుట్టేసి ఆమె భుజం పైన తల ఆన్చి ఇద్దరూ చంద్రోదయాన్ని వెన్నెల గోళం లా సగరుని లోనుండి పుట్టినట్టు నెమ్మదిగా పైకి వస్తోన్న నిండు పున్నమి  చంద్రుడు...
"అబ్బ  చాల  బాగుంది  కదూ  ఎన్ని సూర్యోదయాలు  చూసినా ఎన్ని చంద్రోదయాలు చూసినా ఇంకా ఈ జన్మ కు తనివి తీరదు నాకు" అన్నాడు తమకంగా ఆమె చెక్కిలి పై ముద్దాడుతూ. 
"మరే ఎందరు అమ్మాయిలను చుసిన తీరనట్టే ...." వెక్కిరింపుగా అంది 
చిన్నగా నవ్వి ఊరుకున్నాడు తను.....ఆమె మాటలకు
"ప్రతి మనిషిలోనూ ఓ సంద్రం దాగి ఉంటుంది కదూ ఎందఱో వస్తారు జీవితం లోకి కానీ అందరికీ కనిపించని లోతులెన్నో ఉంటాయి.....అవి చాలా కొద్దిమందికి మాత్రమే అందేవి..." సాలోచనగా అన్నాడు
"మనలో ఉన్న లోతులు మనకే తెలియనివెన్నో ఉంటాయి బాలూ....అసలు జీవితం లో అదే నేమో ఆ మేస్మెరిసం..
మాజిక్ అఫ్ లైఫ్" అతని చెంపకి తన చెంప రాస్తూ అంది
"నీకో మాట చెప్పనా " ఆమె కళ్ళు వెన్నెల్లో మెరిసాయి 
"ఇంతవరకు ఎవరినైనా కవిత్వమో రచనో చదివాకా మనిషిని చూసేను...కానీ నిన్ను ప్రేమించాక అన్నీ ఇచ్చేసాక ఇప్పుడు నీ కవిత్వం గురించి తెలుసుకున్నాను.....అసలు తమరు కవులని నాకెందుకు చెప్పలేదు?"
"ఏముంది చెప్పడానికి...అదేమన్న గొప్ప విషయమా?" 
"మరి కాదా?"
"అంటే నేను కవిని అని తెలవకముందే ప్రేమించావుగా  ఇప్పుడు చెప్తే ఇంకా మరికొంచం ఎక్కువ ప్రేమిస్తావా అలా అయితే సరే , నా కవిత్వం వినిపించనా?"
"ష్ ! వద్దు ! చెప్పద్దు ఇది ఒక తీయని అనుభూతి నిన్ను నాలో పూర్తిగా ఐక్యం చేసుకున్నాక నీలో నన్ను లీనం చేసుకున్నాక మాటలతో ఎంత పేర్చినా చెప్పదలుచు కున్నదేదో ఇంకా మిగిలే ఉండి  పోయినట్టున్నా.. ఆ కవిత్వమెందుకు....?"
"నిలువెత్తు కవిత్వాన్ని జీవించాక.... తరి  తీపి రసానుభూతి పొందాకా ఇక మాటలేమి చెప్తాయి....?"
"సముద్రాన్ని చూడనంత వరకూ దాని గురించిన  వర్ణన చదవడానికి వినడానికి బాగుంటుంది... కానీ అచ్చ్చంగా సంద్రాన్నీ దాని అందాన్నీ చూసాక అనుభుతిన్చాలే తప్ప అక్షరాలలో ఇమిడించడం కష్టం బాలూ...." ఆమె కంఠంలోని పరవసత్వంతో  కూడిన జీర ....
"ఉన్మత్త ప్రేలాపనలంటే నాకెంతో ఇష్టం ..." నవ్వాడు
"అవి  హృదయపు లోతులను చీల్చుకు వచ్చే స్వచ్చ్చమైన పలుకులు కనుక , నాకూ అంతే ...అందుకేనేమో ఇలా జతైనాము " నిర్మలంగా నవ్వింది 
"అటు చూడు ఇంతింతై అన్నట్టు గాక అంతంతై ఉదయించిన నిండు చందమామ ఇప్పుడు చూడు నీ బొట్టు లా చిన్ని వెన్నెల బంతి లా నీలాకాశం నుదుట ఎలా ముద్దుగా అమరి  పోయిందో..." ఆమె నుదుటి పై చిన్నగా ముద్దు పెట్టాడు 
"సముద్రం నాకు ఎంత కొత్తదో అంత పాతది....మా వూరికి సముద్రం దగ్గరే...." అన్నాడు
"అయినా విశాఖ సముద్రం కాదుగా ...." చిలిపి నవ్వు
"ఆ నిజమేలే అయినా విశాఖ  సముద్రం లో ఏంటో అంత గొప్పతనం....నాకేమీ కనబడలేదే...."అల్లరిగా
"అవునా  మరెందు కోచ్చారో  ఇంత దూరం....అవును లెండి అయినా మీకు పని ఉంది వచ్చారు అంతేగా ?"
"ఆ అవును పని ఉండే వచ్చాను సముద్రమున్న ఈ విశాఖలో ఒక  పిచ్చి ప్రేమికురాలుందనీ...."
"మరే  మెంటల్ ఆసుపత్రి కూడా మేమే కట్టుకున్నాము అందుకే ....." పకపక నవ్వింది
"ఆ పిచ్చి ప్రేమికురాలి  బుగ్గ సొట్టలో ఒక్కసారి దూకి ఆత్మ హత్య చేసుకుందామని వచ్చా..." అతని స్వరంలోని మార్దవం
" దాన్నీ ఆత్మ హత్య అనరు రసానుభూతి అంటారు ....సంజ్హే....అయినా నువ్వు చెప్పిందీ నిజమే ఆత్మల్ని హత్య చేయనిదే రససిద్ధి పొందలేము...మై భీ సంజ్హే "
"ఝే ఝే ....హహహ్హ" హాయిగా పండువెన్నెల్లో ఆదమరచి అతను నవ్వుతుంటే విప్పార్చుకుని కళ్ళు సముద్రమంత లోతైన అతన్ని చూస్తూ చిరునవ్వుతూ  వెన్నెల  తరగలా ఆమె....
గుంభనంగా నవ్వుతోన్న సముద్రం, అతను ....ఆమె(నేను).......


అక్షరీకరించలేని అద్వితీయ అనుభూతిని రాద్దామని  చేసిన వెర్రి ప్రయత్నమిది అని నాలో నేనే నవ్వుకుంటూ....ప్రేమతో  ...జగతి ....8.20pm Saturday..01-10-2011