ఇదా జీవితం అనుక్షణం ఆగని కన్నీటి ప్రవాహం ??? |
ఒక్క క్షణం అనంత దివ్య కుసుమాల దివ్య పరిమళం
మరుక్షణం మరుభూమిలో మండే మానవ శరీర దుర్గంధం
మనసు పొరల్లో కదిలి రగిలించే అనుభూతులు
కన్నీటి కెరటాల సుడి గుండాన ముంచి వేసే అపశృతులు
ఇదీ జీవితం! ఇదేనా జీవితం?
ఒక్క క్షణం....
హృదయంతరాళంలో
సుమం విరిసిన సౌరభం
హిమం కరిగి నర నరాల్లో ప్రవహించే అనుభవం
మరు క్షణం.....
అంతులేని ఆవేదనతో ఆర్తిగా సాగే అశక్త పోరాటం
మనసు మమత
ప్రేమ ద్వేషం
అంతా ఉత్త దగా
మోసం కుట్ర పన్నాగం
అర్ధంలేని వ్యర్ధపు ఆలోచనలు
సాగించలేని అనవసరపు శోధనలు
సాధించలేని ఆర్భాటపు విజయాలు
దారి తెలియని స్వర్గానికి సోపానాలు
తీపి పూత పూసిన చేదు మాత్రల్లాంటి నిజాలు
ఇదీ జీవితమేనా ?
అంబరపు అంచుల కెగసిన ఆనందం ఒక్క క్షణం
మరు క్షణం అథఃపాతాళాన విసిరి వేయబడ్డ విషాదం
నిస్సహాయత ....అంతర్మథనం
మనసు విరిగితే అతికేందుకు ఏ ఎరాల్డైట్ దొరుకుతుంది బ్రదర్ !
దారం తెగితే ముడివేయ గలవే కానీ తిరిగి అతక లేవుగా?
తెగిన బంధాన్ని ముడి వేశానని నువ్వు సంబర పడినా
ఆ 'ముడి' మాత్రం ఎప్పుడూ కనిపిస్తూనే ఉంటుంది
నీ 'అశ క్తతని ' వెక్కిరిస్తూ
ఇంకెందుకీ వ్యర్ధ ప్రయత్నం??
అందుకే నేస్తం! ఇలా ...ఇలా...
అనంతమై ఎగసి ఎగసి
అగాధమై వగచి వగచి
నిర్వీర్యంగా నిస్తేజంగా
రగిలి ..పొగిలి
మిగిలిపోయి శుష్క హాసంతో ప్రశ్నిస్తూ
ఇదా జీవితం???
అవును ఇదే జీవితం
అనంతమైన అగాధం
అనూహ్యమైన శూన్యం
ఊహకందని కన్నీటి చిత్రం
ఇదీ జీవితం
అఫ్ కోర్సు ఇదే జీవితం
అనుభవించి తెలుసుకున్న 'చేదు నిజం'
......................ప్రేమతో....జగతి
అమాయకంగా హాయిగా చిన్న వయసులోనే ఎం.ఏ. ఆంగ్ల సాహిత్యం చదువుకుంటున్న, జీవితం పట్ల అవగాహన లేని ఓ అమ్మాయి బతుకు చదువు విజ్ఞత మంచి మనసు కూడా లేని ఓ మూర్ఖుడికిచ్చి పెళ్లి చేస్తే ఆ అమ్మాయి వ్యధ ఈ వాక్యాలు. జీవితం లో జరగాల్సిన ప్రతి విషయము అసహజమైతే....ప్రతి క్షణమొక ఆశా నిపాతమైతే దశాబ్దం పాటు వెలుగు చూడకుండా గడిపిన ఓ పిచ్చి దాని ఆవేదన....'ప్రేమ'ను తప్ప మరేదీ పంచని ఓ వెర్రి దాని రోదన ఇది నా జీవితం.తాను చేసిన తప్పుకి తన గాజు బొమ్మలాంటి కూతురి బతుకు కాలిపోయిందని అతి చిన్నవయసులోనే ప్రాణం విడిచిన ఓ కన్నతండ్రి బంగారు కూతురి కధ ....జీవితం ...అనుభవాలూ ..... ఎన్ని దెబ్బలు కొట్టినా మరింత రాటుదేలింది 'ప్రేమ'తో...హహహ్హ !!!