ఆమె నా సహచరి
నా మధు సఖి
నా ఉద్విగ్నతలకు , ఉద్వేగాలకు ఊతమిచ్చి
నా ఊహలకు ఊపిరినద్దే
నా కళల సాకారం ఆమె
ఆమెది ఏక రూప సౌందర్యం కాదు
తాను బహురూపదారి
నవరసాల ఝారీకృత సుమనోహర లావణ్యం ఆమెది
భావానికొక భాష్యమై
భాష్యానికొక రూపమై
రూపానికొక తేజమై
విరాజిల్లే విరాట్ స్వరూపిణి ఆమె
ఆమె నన్ను ఉత్తేజితుడిని చేస్తుంది
ఉత్ప్రేరక మౌతుంది
జన్మాంతరాల నా సంస్కారానికి
వ్యక్తానుభూతినిస్తుంది
చైతన్య లహరి గా నన్ను ఉద్దీపించి
రససిద్ధి శిఖరాల విజయ కేతనమౌతుంది
నా మేధో మధనానికి
అద్వితీయ భావ ప్రాప్తినిస్తుంది
పేగు బంధమై ఆమె నన్ను లాలిస్తుంది
స్నేహ పరిమళమై సేద తీరుస్తుంది
ఆప్యాయతల సందిట నను ఓదారుస్తుంది
ఓటమి -గెలుపుల జీవన క్రీడలో
సమన్వయ సమగ్రతను
సంప్రాప్తింప జేస్తుంది
ఆమె దివ్య సాన్నిహిత్యంలో
నేను మూడు కాలలనూ శ్వాసిస్తాను
సకల చరాచరాలనూ ప్రేమిస్తాను
సర్వ సన్మంగళ వచనాలను రచియిస్తాను
ఆజన్మాంతాల మా ఆత్మీయత
ఆద్యంతాలు లేని ఓ పార బౌతిక మార్మికత
ఆమెతో సహజీవిస్తూ నేను
సకల శాంతి కామేష్టి యాగంలో
త్రికరణ శుద్ధితో సోమయాజినై
త్రికాల జ్ఞాన సర్వాన్నీపూర్ణాహుతి చేస్తాను
ఆవిర్భవించిన సత్య , జ్ఞాన ఫలాలను
సకల జనావళికి పంచి పెడతాను
ఆమెతో నా అనుబంధం ఈ జన్మది కాదు
అక్షరం ఆవిర్భవించిన నాడే
మా రాగ బంధం పెనవేసుకుంది
అనాదిగా రూప క్రియాను సంధానంగా
పరిణమించి పటిష్టతను సంతరించుకుంది
అక్షర శిల్పిగా శాశ్వతత్వాన్ని
నాకు ప్రసాదించే ఆమె
సురభిళ, సుస్వర , సారస్వత సర్వానికీ
అక్షయ మూర్తి
అక్షర కాంతి
చిదానంద శాంతి
....ప్రేమతో జగతి 8pm 08-04-2008 మంగళవారం
జన్మాంతరాల నా సంస్కారానికి
ReplyDeleteవ్యక్తానుభూతినిస్తుంది, నా మేధో మధనానికి
అద్వితీయ భావ ప్రాప్తినిస్తుంది, ఆమె దివ్య సాన్నిహిత్యంలో
నేను మూడు కాలలనూ శ్వాసిస్తాను... ధాత్రిగారూ..! వ్యాఖ్యాని౦చడానికి నాకు మాటలు రావడ౦ లేదు. మీ భాషా స౦స్కారానికి శిరసువ౦చి ప్రణమిల్లుతున్నాను.
dhanyavadalu chala pedda mata adi nenedo chinnadanni (sahityamlo)me spandanaki krutajnatalu ...premato...jagathi
ReplyDelete