Sunday, June 17, 2012

నాన్న ఒక తీయని మాట , ఒక మంచి మనిషి , ఓ వెచ్చని స్పర్శ , ఒక మధుర స్మృతి కొందరికి . మరి కొందరికి ఒక చేదు అనుభవం, ఒక రాక్షసుడు ...అమ్మను హింసించే వాడు , తమని కొట్టేవాడు , నిజమేనా అనిపిస్తోంది కదూ? ఎవరెవరి అనుభవాలను  బట్టీ వారికీ అలా అనిపిస్తుంది.   
ఏది ఏమైనా మన జన్మకు కారణమైన బీజ ప్రదాత నాన్న. అమ్మను గూర్చి ఎన్నో రాస్తాము మాటాడుతాము   కానీ ఈ మధ్య నేను గమనించిన ఒక విషయం  నాన్నను గురించి కూడా చలా కవిత్వం , స్మృతులూ వస్తున్నాయి. ఉదాహరణకి "మా నాన్నగారు" అనే ద్వానా శాస్త్రి సంకలనం, "నాన్న చెట్టు" ప్రసాద మూర్తి కవిత సంపుటి ...ఇలా సాహిత్యం లో .
ఇక సమాజంలో నాన్న ను గూర్చి చెప్పాలంటే.... ఇప్పుడు నాన్నకు అమ్మతో బాటే ఎక్కువ బాధ్యతలున్నాయ్. ఇప్పుడు అమ్మ నాన్న ఇద్దరూ ఇద్దరి బాధ్యతలూ నెరవేర్చాల్సి వస్తోంది. ఇది వరకు నాన్న లా ఆఫీసుకు మాత్రం వెళ్లి  వచ్చో లేక పని కెళ్ళి వచ్చో అమ్మ పెట్టే అన్నం తిని పిల్లలతో ఆడుకునే నాన్నలు కారు నేటి తండ్రులు. 
ఒకోసారి ఆశ్చర్యం వేస్తుంది సాంకేతికత మానవ సంబంధాలని ఎంతగా మార్చేసింది? స్త్రీ విద్య కూడా అంతే...ఇది నేను వ్యతిరేకతతో అనడం లేదు జరుగుతోన్న చిత్రాన్ని చెప్తున్నా. స్త్రీ పురుషులిరువురు, వారి పని వత్తిడి వల్ల , అమ్మ నాన్నలుగా మారడానికి  చాలా మంది ఇష్టపడటం  లేదని ఒక సర్వే చెబుతోంది. లోకం లో అమ్మ కున్న స్థానం గొప్పదే  అయినా నాన్న లేని ఇల్లు సింహద్వారం  లేని కోట లాంటిదే సుమా , ఇలాంటి అభిప్రాయం వెలువరిస్తూ ఎన్నో కధలూ  కవితలు ఆధునిక అభివ్యక్తి లో వచ్చాయి.  ఇవాళ మగవాడికి అదనపు బాధ్యత కూడా చేపట్టాల్సి వస్తోంది. భార్య ఉద్యోగానికి  వెళ్తే తనే ఇంటి పనులు పిల్లల పనులూ చేయాల్సి వస్తోంది. ఇది ఒకప్పుడు నామోషి అయిన పని ..కానీ ఇప్పుడు అవసరం.
పిల్లలలో కూడా తండ్రి కొడుకు కన్నా తండ్రి కూతురు ఎక్కువ దగ్గర కాగలుగుతారు. ఆడపిల్ల తన భర్తను కూడా తన తండ్రితోనే పోల్చి చూసుకుంటుంది. మంచివాడైన తండ్రైతే అలాంటి వాడె భర్తగా కావాలనుకుంటుంది, చెడ్డవాడైతే  అలాంటి వాడు వద్దనుకుంటుంది. 
తండ్రి కూతుళ్ళ మధ్య అనుబంధాన్ని ఎలెక్ట్రా కాంప్లెక్స్ అంటారు మనో శాస్త్రజ్ఞులు. తండ్రి కూతుళ్ళ మధ్య ఆకర్షణ ప్రేమ , చనువు అలాంటిది . శాస్త్రీయంగా ఎన్నో కారణాలున్నా ఈ బంధాన్ని నిర్వచించడానికి ఈ ఉదాహరణ చాలు. 
మన సంప్రదాయం లో ఫాదార్స్ డే అంటూ ఏదీ ఉండదు కానీ ఎక్కడెక్కడో  విసిర వేయబడ్డ పిట్టల్లా ఉన్న పిల్లలందరూ ఒక రోజు పెట్టుకుని ఆ రోజు అందరు తమ తండ్రిని కలుసు కోవడం అతనితో సమయం గడపడం అనేది విదేశీ నాగరికత కాదనను ,అదీ ఒక అవసరమే. ఎందుకంటే మనలా పండగలూ పబ్బాలూ వాళ్ళకి ఉండవు అందరూ కలిసి ఒక దగ్గర కూర్చునే అవకాశమే ఉండదు పాపం. ఇప్పుడు మన ఇళ్ళల్లోనూ అదే పరిస్థితి ఏర్పడింది . 
ఎక్కడో ఉద్యోగాలు చేసుకుంటున్న పిల్లలు , దూరంగా ఉన్న మనుమలూ అందరూ ఒక్కసారి ఒకదగ్గర  చేరడం కాసేపు ఆపాత  మధురాలలో తేలడం , కలిసి భోజనం చేయడం , ఉన్నంతలో ఆనందంగా గడపడం ఆ స్మృతులని మళ్ళీ ఏడాది దాకా హృదయాలలో పదిలపరుచుకోవడము ఇదే ఈ రోజు ప్రత్యేకత. 

ఇది విదేశీ సంస్కృతి మనకేల? అంటారు కొందరు నిజమే కానీ ఇవి పరిస్థితుల ప్రభావం , ఇప్పుడే కనుక ఒక రోజు అని అనుకోక పోతే అమెరికా నుండో , ఇతర రాష్ట్రాలనుండీ  అందరూ ఒకేసారి ఒక దగ్గర చేరే అవకాశమే లేదు అందుకు ఫాదర్స్ డే అని ఒకటి పెట్టుకుంటే కలవగాలుగుతమని ఆశ. అన్నిటినీ వక్ర దృష్టితో చూడక్కర్లేదు. కొన్ని మంచి పనులు కూడా ఉంటాయి మనం నేర్చుకోవచ్చు. 
నిజానికి నాన్నను ప్రేమించడం లో ఆడపిల్లకున్నంత ప్రేమ మగ పిల్లాడి కుండదు. తండ్రి కూడా అమ్మాయి దగ్గరే ఎక్కువ ఆనందంగా మెలగ గలుగుతాడు. ఇది మనందరం చూస్తున్న విషయమే. మంచి మిత్రులైన ఒక వ్యక్తికి ఇద్దరు కూతుళ్ళు . పెళ్ళిళ్ళు చేసి వాళ్ళకు అన్నీ అమర్చీ  తను రిటైర్ అయి శాంతంగా జీవితం గడుపుదమనుకునే సరికి భార్య హటాత్తుగా పోయింది . ఇక ఆ తండ్రి , మళ్ళీ ఒంటరి  మగ వాడు అయిపోయినట్టే  . ఇప్పుడు ఆ ఇద్దరు కుతుళ్ళూ అతనికి అమ్మలు గానే చూస్తారు. వాళ్ల ఉద్యోగాలు  వీలుని బట్టి ఒక పూట ఒకరింట్లో రెండో పూట మరోకరింట్లో భోజనం చేస్తారు ఆ తండ్రి ఇప్పుడు. మళ్ళీ వచ్చి తన ఇంటిలోనే ఉంటాడు .  తమ అమ్మాయిలు వచ్చేదాకా పిల్లల్ని చూసుకుంటూ నేను బిజీ అండీ బేబీ సిట్టింగ్ లో ఉన్నా అని చెప్పే ఆ తండ్రిని చుస్తే ముచ్చటేస్తోంది. 
ఇది నేను ప్రత్యక్షంగా చూస్తోన్న ఒకరి జీవితం. 
ఒక ఆడపిల్లగా చెప్పాలంటే నా మటుకు నాకు నాన్న అంతే "మై డాడీ స్త్రాన్గేస్ట్ "అన్నట్టు ఉండేది. ఏ మాటైనా జీవితం లో నాన్న దగర దాచాల్సిన అవసరం లేదు. అంత స్వేచ్చ్చగా చెప్పెసేదాన్ని . చివరిసారిగా ఇరవై ఏళ్ళ క్రితం నా పాప నా లో ఉండగా నాన్న గోరింటాకు పెట్టి నా చేతులకు కాళ్ళకు అవి ఎక్కడ పాడయి చెరిగి  పోకుండా తన  ఒళ్లో పెట్టుకుని కూర్చున్న సంఘటన ఒక తీయని జ్ఞాపకం. నా బిడ్డని చూడ కుండానే హటాత్తుగా నాన్న  వెళ్లి పోవడం ఒక తీరని విషాదం. 
నాటి నుండీ నేటి వరకు మళ్ళీ గోరింటాకు పెట్టుకోలేదు  నేను. ఇదేదో గొప్ప విషయం కాక పోవచ్చుఅందరికీ. ఎందుకంటే  అందరికీ ఇలాంటి  స్మృతులేన్నో ఉంటాయి . 
ఆడపిల్ల తండ్రిని చూసినట్టే  తండ్రి కి ఆడపిల్ల మీద ఉన్న ప్రేమ అలవి కానిది, అంటే మగ పిల్లాడి మీద ఉండదని కాదు. 
ఒక చిన్న కధ చెప్తాను ....ఒక తండ్రి అన్ని లాంచనాలతో కూతురికి పెళ్లి చేసి పంపాడు. కొన్నాళ్ళకు వెళ్లి కూతురి కాపురం ఏల ఉందో
 చూద్దామని వెళ్ళాడు.
చుట్టూ అత్తవారూ  , భర్త అందరి  మధ్యనున్న తన అమ్మాయిని పక్కకు పిలిచి అడగలేడు కదా. పాపమా ఆ మ్మాయి తండ్రి భోజనం  తర్వాత  చేయి కడుగుకునేందుకు చేతి మీద నీళ్ళు పోస్తుండగా   నెమ్మది గా అడిగాడు "తల్లీ నీ కాపురం ఎలా ఉందమ్మా?" అంటూ ఆ అమ్మాయికి వినబడే లాగు. "మోచేతి మీద దెబ్బలా ఉంది నాన్నా?"నిర్లిప్తంగా చెప్పేసి వెళ్లి పోయింది అమ్మాయి .
తండ్రికి పెద్దగ ఏమీ  అర్ధం కాలేదు ఏదో కాపురం అన్నాక చిన్న చిన్న పొరపొచ్చాలు ఉంటాయిలే సహజం  అనుకున్నాడు. ఇంటికి తిరిగి వచ్చాడు. ఉయ్యాల బల్ల మీద కూర్చున్నాడు భార్య ఇచ్చిన మంచి నీళ్ళు తాగి గ్లాస్ కింద పెట్టబోతే బల్ల చివర మోచేతికి తగిలి జివ్వున నరాలు జిల్లర్చుకు పోయేంత గా నొప్పి కలిగింది . ఒక్కసారి గా ఆ పిచ్చి తండ్రి అమ్మో నా కూతురు ఇంత బాధ  పడుతోందన్న మాట అంటూ వెంటనే కుతురింటికి పరిగెత్తాడు తన కనుల దీపాన్ని తన పాపకోసం. అదీ తండ్రి ప్రేమంటే... !!
చిన్న వయసులోనే భార్యను పోగొట్టుకుని  మళ్ళీ పెళ్లి చేసుకుంటే పిల్లలని సమంగా చూస్తుందో లేదో ననే సందేహం తో పెళ్లి చేసుకొని త్యాగ ముర్తులైన తండ్రులున్నారు. పిల్లల కోసం తమ జీవితాన్ని శక్తినంతా ధరబోసే తండ్రి అనురాగ ఆత్మ బంధువు. 
ఎంత చెడ్డ వాడైనా ఒక వేళ ఏ తాగుడికి బానిసైన వాడినా కూడా తండ్రిని మన్నించి ప్రేమించే పిల్లలు ఉన్నారు. 
నేటి సమాజం లో యయాతి లాంటి దుష్ట తండ్రులు, దృతరాష్ట్రుడు  లాంటి వెర్రి తండ్రులూ ఉన్నారు. పిల్లలికి అవసరానికి మించి స్వేచ్చని ఇచ్చి బాధ పడేవారు ఉన్నారు. ముఖ్యంగా మగవారిలో ముప్పై ఐదు నుండి అరవై సంవత్సరాల లోపు చాలా వత్తిడి కి గురి అవుతున్నారు. అందుకే వారిలోనే ఎక్కువగా గుండె వ్యాధులు కూడా వస్తున్నాయి ఎక్కువ శాతం. 
నేను మనోవైజ్ఞానిక శాస్త్ర పరంగా చాలా మంది పిలల్లతో ఏమి చెపుతానంటే తండ్రిని మీరు ఎక్కువగా వత్తిడి కి గురి చేసేంత  అల్లరి చేయకండి. అతనెంతో నిరంకుసుడైతే తప్ప, అది అతని మానసిక ఆరోగ్య స్థితి పై ప్రభావం చూపుతుంది అని చెప్తాను.ఎందుకంటే మగాడికి ఆడవారిలా ఏడ్చి తమ కష్టాలు చెప్పే అవకాశమూ ఉండదు. అన్నీ తమలోనే దాచుకుని కుమిలిపోతారు. తమ ఆశలను ఆకాంక్షలను తల్లులు చెప్పినంత మృదువుగా తండ్రులు చెప్పలేరు ఒకోసారి ....దాని వల్ల తండ్రి పట్ల ద్వేష భావం పిల్లల్లో కలుగుతుంది. 
అందుకే తండ్రులతో మాటాడే టప్పుడు  నే చెప్పేది ఒకటే పిల్లల మనసెరిగి మాటా డండి  అని . కానీ ఇది పిల్లలకూ వర్తిస్తుంది , తండ్రిని అవసరానికి వాడుకునే పిల్లలూ ఎక్కువయ్యారు ఇప్పుడు. స్వార్ధం వెళ్ళు  ఈనాటివే కాదు ఎప్పుడూ ఉన్నాయి కాకుంటే ఇప్పుడు మరీ ఎక్కువయ్యాయి. మాతృ దినోత్సవానికి  పిత్రుదినోత్సవానికి  పళ్ళూ ఫలాలూ గొప్ప  కోసం ఒల్దేజ్ హోములలో పంచడం , ఫోటోలు దిగడం కాదు. బతికి ఉంటే నాన్నని ఒకసారి కలుసుకుని మాటాడే తీరిక చేసుకోవడం , లేదా తండ్రి ని కోల్పోయిన వారు  ఆ రోజున ఏదన్న సత్కార్యం చేయడం మంచిది. 
నాన్న దినం అనీ అమ్మ దినం అనీ వెక్కిరించేకన్నా అందులోని అవసరాన్ని వెనుక ఉన్న ఆకాంక్షనీ గుర్తిస్తే మనం ఎవరినీ చులకనగా మాటా డము . కనుక పిల్లలూ తండ్రులూ మీ నాన్న కోసం మీరేమి చేయదల్చుకున్నారో , పిల్లలంటే చిన్నవాళ్ళే కాదు  , తండ్రులున్న పిల్లల్లందరూ అని ....తండ్రి నమ్మకం అంటాము నిజమే తండ్రి మనల్ని రక్షించే ఒక  రక్షకుడు గా భావిస్తాము, చివరికి దైవాన్ని కూడా తండ్రీ అనే వేడుకుంటాము. అంత లా తండ్రి అనే ఈ భావన మన నర నరాల్లోనూ ప్రపంచమంతా కలిసిపోయింది . ఎద్దేవా చెయ్యడం మానుకుని ఫాదర్స్ డే ని హాయిగా గడపండి . ఆ మధుర స్మృతులని గుండెలనిండా నింపు కోండి ....అందరికీ పిత్రుదినిత్సవ శుభాకాంక్షలతో....ప్రేమతో ..జగతి 

2 comments:

  1. Gude lothulloni Vaakyalu Sakala Devatala Subhaasessulu

    ReplyDelete

  2. MOTHERSDAY AND FATHERSDAY-anevi mana sampradayam kakunna-mana parents ni valla sevalani manam maro sari special ga gurthunchukunelaga chese oka roju.Daanni please vetakaram cheyakunda unte chalu.

    ReplyDelete