1. నా నవ్వుకు
నీ ఎద పూలు
పూస్తుందంటే ....
మదిమంటలు రేగినా
చెరగనివ్వను ఈ నవ్వుని ......ప్రేమతో ...జగతి
2.ఈత నేర్పకుండా
విసిరేశారు నన్ను
సంసార
సాగరం లోకి ...
నాకు నేనే నేర్చుకుని
పైకి వచ్చేసరికి
కాలం హెచ్చరింపు
గంట మోగిస్తోంది ......ప్రేమతో ...జగతి
3. ప్రేమించడం మాత్రమే
ఎలా తెలుసో
ఈ హృదయానికి
ఎవరినీ ద్వేషించలేని
బలవంతురాలినా
బలహీనురాలినా
నిత్య సందేహం
సమాధానం మాత్రం "ప్రేమ" .....ప్రేమతో ...జగతి
4.ఎన్నో సాంద్ర భావాలు
ఆశలూ.....కలలూ
ఊహలూ...చిత్రాలూ
నగ్న జీవితాన్ని
చూసాక ....
పొగడ్తా , తెగడ్తా భేదం లేదు
ఇప్పుడు ....నిర్లిప్తత ....ప్రేమతో ...జగతి
5.అక్షరాలూ కొన్నే ఉంటాయి
ఎవరికైనా ...
తమా అనుభూతులను
జోడించి అభివ్యక్తితో
సమ్మేళనం చేస్తే ...అవి
లక్షరాలై మిగులుతాయి ....ప్రేమతో ...జగతి
6.దేహ వాంఛ
పెళ్లి విషయం
తెలియని నాకు
దేహమూ బంధమూ
సరిగా అర్ధం కాకుండానే
ఒక్కసారిగా...
ఉప్పెనై చుట్టుకుంది
బాధ్యతా సంద్రం ....ప్రేమతో ...జగతి
7.కవుల మదులలో
జీవించి .....
కవితా తేనియలు
ప్రోది చేసుకుంటున్న
పిచ్చి తేనెటీగను
నయవంచన ....
పొగ బెట్టి నన్ను
నా నుండి దూరం చేసారు ....ప్రేమతో ...జగతి
8.ఎంత తాత్వికను
చెప్పినా ....
ఎన్ని యోగాలు
అన్వయం చేసుకున్నా..
నేను అనే ఈ దేహానికి
ఈ అస్తిత్వ రూపం
ఉన్నన్నాళ్ళేగా
అన్నీ.........ప్రేమతో...జగతి
9.ఆశాభంగమైన క్షణం లో
రోదించాను , ఆత్మ నిందతో
ఏమీ చేయలేని నిస్సహాయతతో
నన్ను నేనే ఓదార్చుకుని
లేచి నిలిచిన నాడు
జీవన వృక్షం మారాకు
తొడిగి....మమతలు పూసింది ......ప్రేమతో ...జగతి
10.ప్రేమ లేదని కొందరు
దేవుడు లేడని కొందరు
వాదిస్తుంటే ....
నవ్వొస్తుంది ...
లేదూ అని అంటున్నారంటే
అసలు ఉందని ఒప్పుకున్నట్టే కదా .......ప్రేమతో ..జగతి
11.కాలాన్ని నిందిస్తూ కొందరు
కాలమే పరిష్కరిస్తుందని
మరి కొందరు ....
ఆశా నిరాశల నడుమ
ఊగిసలాడుతుంటారు ...
మనలో మార్పు రాక పొతే
కాలం ఏమి చేస్తుంది
అని ప్రశ్నిస్తే ....మాత్రం
విరుచుకు పడతారు .....ప్రేమతో ..జగతి
12.కన్న ప్రేమ కొన్నేళ్ళూ
కాపురం కొన్నేళ్ళూ
ప్రేమ , ఎడబాటూ
కొన్నేళ్ళూ .....
బాధ్యతా పర్వం
మరి కొన్నేళ్ళూ
నాలుగున్నర దశాబ్దాల
నిశ్శబ్దపు వేదన
మాత్రం ...నిరంతరం ....అనంతంగా
నాతోనే ...నాలోనే.....ప్రేమతో ...జగతి
13.కలతించినా.....
కలహించినా....
ప్రేమించినా....
పరవశించినా ....
కవిత్వీకరించకుంటే అక్షరాలలో
ఎక్కడో ఏదో హృదయ నాళంలో
రక్త ప్రసరణ ఆగిపోయి
ఊపిరి ఆగినట్టు
ఉక్కిరి బిక్కిరి .......ప్రేమతో ...జగతి
14.మాటలకు హృదయం ఉంటుందా
అనుకునే దాన్ని చిన్నప్పుడు
మాటలకు పూల మనసూ
చుర కత్తుల పదునూ
పిడి బాకుల ఉద్రేకం
వడగళ్ళ ఉద్వేగం
ఉంటాయని తెలిసాక
చాలా జాగ్రత్త పడతున్నా...
మనసుతో మాట కలపాలని
మంచిగా , పూల సుగంధం లా......ప్రేమతో ..జగతి
15.వెక్కిరిస్తూ మాటాడే
అతని ప్రతి మాట వెనుకా
నాపై కొండంత అనురాగం
దాస్తున్నాడని తెలుసు
తను చెప్పకున్నా
తన హృది సవ్వడి చెప్పేసింది నాతో
తను నా కౌగిలిలో
కరిగిపొతున్న క్షణాన ........ప్రేమతో ...జగతి
16.ప్రేమ, పాశమే కాదు
ద్వేషము కూడా
మనిషి పట్ల మరో
మనిషి మనసులో
ఒకే సాంద్రత కలిగి ఉండాలని లేదు
కొద్దో, గొప్పో .....
తేడా ఉంటుంది .......ప్రేమతో ..జగతి
17. కాలాన్ని మనుషుల్నీ
నిందించను ...
పాపం కాలం ఏమి చేసింది
తన పని తను చేసుకు పోతుంది
మౌనంగా....
మనుషులు మాత్రం
ఏమి చేస్తారు
వారి వారి ఆలోచనలను
అమలుపరుస్తారు ....ప్రేమతో ..జగతి
18. చేతి గాజులు గీరుకుంటేనే
తట్టుకోలేకపోయాడు నా రాజు
మది గాయాల నెలా
ఓర్చుకుంటూ నవ్వుతున్నాడో
తలచుకున్న ప్రతి సారీ .....
కన్నీటి చెలమలౌతాయి కళ్ళు ....ప్రేమతో ...జగతి 5th june 2012 Monday 6.10pm
No comments:
Post a Comment