1)నిద్రాణంగా ఎక్కడో
దాక్కున్న నైరాశ్యం
ఎన్ని ఆశల ఊసులు చెప్పినా
వినదు కదా.....
కూలిన ఎన్నో మేడలు
చూసి చూసి అలసిన
అంతరంగం ఇక ఏ మాటకీ
లొంగదు కదా.......ప్రేమతో ...జగతి
2)వెళ్లి పోయే ముందరే
నాదంటూ ఓ ముద్ర
మిగుల్చుకోవాలని
కొందరి మదిలోనైనా
చిరు జ్ఞాపకంగా మిగలాలని
ఎంత స్వార్ధమో ...
ఈ చిన్ని మనసుకి ....,,,,ప్రేమతో ....జగతి
3)తొలినాళ్ళలో ఎక్కడో చేజార్చుకుని
పోగొట్టుకున్న దాన్ని
ఇప్పుడు నా కన్న చిన్న వాళ్ళలో
ఆర్తిగా వెతుక్కుంటాను
ఆ స్ఫూర్తి , ఆ ఉత్సాహం
మళ్ళీ రావుగా నాలో..... ప్రేమతో ...జగతి
4)అధాటుగా కుప్పకూలిన
నా అక్షర హార్మ్యాన్ని
మళ్ళీ దశాబ్దాల
తర్వాత .....
పునర్నిర్మించుకుంటున్నా....
తొలి అందం రాక పోవచ్చునేమో
ప్రయత్నం మాత్రం మాననిక....ప్రేమతో ..జగతి
5)బలవంతపు భావాలను
పదవిన్యాసలతో
ఉరితీసి ....
కవిత్వపు ముసుగు
తొడగలేను .. ...
పెల్లుబికిన సహజ
ప్రవాహానికి అడ్డు కట్టా
వేయలేను.....ప్రేమతో ...జగతి
6)భావ సాంద్రత
క్లిష్ట పదాల్లో కాదు
సునిశిత భావ జాలం తో
అలతి వాక్యాలలో
బంధించాలని ...
పలువురికి అందించాలని
ఎప్పుడూ తాపత్రయ పడతాను .....
తప్పో ..ఒప్పో మరి ....ప్రేమతో ...జగతి
7)జీవితానికో అర్ధం
ఉండి తీరుతుంది అంటారు
మరి నా జీవన సార్ధకత
ఏమిటో ఇంకా
కనుక్కుంటూనే ఉన్నా
అంతర్ముఖినై.......ప్రేమతో ...జగతి
8)లోలోపల లుంగలు చుట్టుకు పోతున్న
వేదనను మరిచి ....
ఈ మనసు ఎలా మన గలిగిందో
ఇప్పటికీ ఆశ్చర్యమే మరి ...
లోలోని విస్ఫోటిస్తున్నా..
పెదవులు మాత్రం చిరునవ్వు కోల్పోలేదు
ఇదీ వరమే .....,,,ప్రేమతో ...జగతి
9)తనకూ నాకూ
నడుమ ముఖ్య మైన తేడా
మనసు గడప దాటలేను నేను
మేధ తోనే మసలుతాడతను
ప్రేమికులు వైజ్ఞానికులు కాలేరేమో కానీ
ప్రతి వైజ్ఞానికుడూ మానవ ప్రేమికుడు కావాలి
ఎంత పరిజ్ఞాన మైనా
ప్రేమ ఉంటేనే సాఫల్యత ......ప్రేమతో ...జగతి
10)జీవితం నుండి
నువు పొందిన ఎన్నెన్నో
అనుభవాలను .....
నువు నీ పిల్లలికి అందించాలనుకుంటావు
కానీ ఎవరి అనుభవం వారిదేనని
పడి లేచే తెలుసు కుంటారు
అప్పుడు అక్కున చేర్చుకుందికి
నువు సిద్ధంగా ఉండాలి ...... ప్రేమతో ...జగతి
11)బాధ పంచితే తగ్గుతుంది అంటారు
మనకి కాస్త తగ్గి
ఇతరులి హృదయాలను
బరువెక్కిస్తుంది కదా
అది సమంజసమా ....
ఆలోచించండి ....ప్రేమతో ..జగతి 4.30pm.Monday 11th June 2012
No comments:
Post a Comment