మొహబ్బత్ కా మసీహా! ఆదాబ్ అర్జ్ హై !!
ఆత్మీయ లిపిలా గుండెనిండా ఆవరించివున్న
మీ గురించి ఏమి రాయగలను?
దోసెడు పదాలు పుంజీడు వాక్యాలతో
మీ ఆప్యాయతా మాధుర్యాన్ని ఆవిష్కరించలేను
కొందరి మాటలు మెదడుకి పని చెపుతాయి
కొందరి పలుకులు హృదయాన్ని కదిలిస్తాయి
మీ వాక్కులు రస గుళికలు
మెదడునూ , మదినీ చలింప చేస్తాయి
ఇరానీ చాయ్ నుండి ఇండో -చైనా సంబంధాల దాకా
చక్కెర పొంగలి నుండి చలం శైలి దాకా
ఒకటా రెండా ఎన్నని కబుర్లు కమ్మని విందులు
మీతో కలిసి గడిపిన కొద్ది సమయమైనా
బహు విషయాంశాల మృష్టాన్న భోజనమే --
నజ్మ్ , గజల్, గీత్ , షేర్
సైగల్ , సురయ్యా , జగ్జిత్ , కిషోర్ ,
హిందీ , ఉర్దూ, తెలుగు , సంస్కృతం
ప్రాచీన , ఆధునిక కావ్య మధురిమ
మీ వాక్ ఝరీ ప్రవాహం లో
నవ రాసానుభూతుల ఆస్వాదనమే
ఆపితే ఆ క్షణాలు ఎక్కడ జారిపోతాయోనన్న
ఆతృత తో మాట్లాడే మీ ఆర్ద్రత
బతికే ప్రతి క్షణాన్ని జీవించడం లోని
మమతను తెలిపిన మీ ఔదార్యం
జీవనావసరాలెన్నున్నా
ఎవరినీ అర్ధించని మీ ఆత్మాభిమానం
నిలువెత్తు నిండు దనానికి నిదర్శనమయిన
జనాబ్ -ఎ - ఆలం ! అస్సాలామాలేకుం !
కలిసిన ప్రతి సారీ
ముంచెత్తే మీ వాక్కుల వరద వాగు ముందు
జలపాతాలు చిన్నబోతాయి
సముద్రం తడబడి గొంతు సవరించుకుంటుంది
పిడుగుల లోకమొకటి
తన అంశను భూమ్మీద చూసి సంతసిస్తుంది
రెండో పోలిక లేని
ఒకటో రకపు విస్మయానుభవానంద కరం
ప్రసంగమై సాగే మీ స్థిర గంభీర స్వరం
తిరిగిరాని స్వప్నమిక ఎన్నటికీ --
గత ఏడాది ఇరవై ఒకటి మార్చి న
మీ మాటలింకా గుర్తున్నాయి
ఎలా బతకాలని కల గన్నాం అన్నప్పుడు
నిబిడ ఆశావాద కాంతి మీ విప్పారిన కళ్ళల్లో
ఎలాగో జీవితాన్ని జీవించాం
అన్నప్పుడో అనివార్య నిర్వికారత
అగ్ని పర్వతం మీద కాల కరాళ మేఘ ఛాయ
గుండెల్లో గడ్డ కట్టుకు పోయింది
పాదాలకు నమస్కరిస్తే
మీ దంపతులందించిన ఆశీర్వచనాలు
అవే మాకిక వెలకట్టలేని జ్ఞాపకాలు
నిరంతర స్ఫూర్తి దాయకాలు
సిద్ధాంతాలూ, విశ్వాసాలూ,
జీవన క్రూర వాస్తవాలు
బతుకు లోని విలోమాలు
అన్నిటినీ సమ్యక్ దృష్టి తో స్వీకరించిన
మీ మహోన్నత తాత్వికత
మాకు చిరంతన ఆదర్శం
హమేషా కె లియే అల్విదా అంటూ
మము వీడిపోయిన
పదును పలుకుల పసిడి అంచుల పాదుషా !
ఖుదా హఫీజ్
మానవ ప్రేమానురాగా ప్రవక్తా !!!
...........................................ప్రేమతో ...జగద్ధాత్రి
(జ్వాలా ముఖి మరణం తర్వాత ఆయనకి ఇచ్చిన నివాళి , నాకు వచ్చీ రాని భాషలో , బాగా వచ్చిన ప్రేమ భాషలో )