ఒంటరితనం ఒక్కోసారి వరం
నిజం....నేస్తం
నీ నిరాశా నిస్పృహల వేడి గాఢ నిట్టూర్పులు
ఎవరికీ వినబడనంత సౌండ్ ప్రూఫ్ ఏకాంతం
ఫ్లడ్ గేట్స్ ఎత్తేసిన గుండెనుండి వెల్లువైన కన్నీటి వరదలు
ఎవరి కంటా పడకుండా మది రిసర్వాయర్లో దాచేసే ప్రయత్నం
స్మృతి పథం వెబ్సైట్లో జ్ఞాపకాల సీక్రెట్ ఫైల్స్ తీసి
పరికించి నవ్వడమో, ఎఅడ్వడమో చేసే రహస్య తరుణం
మృతి పథపు ప్రస్థానానికి ఆత్మని సిద్ధం చేసుకుంటున్నట్టు
రెండో కంటికి కూడా తెలియనీయక
నీకుగా నీవే చేసుకునే నిశ్శబ్ద ప్రయాణ సన్నాహం
జరిగిన దానికి వగర్పో
జరగనిదానికి వగపో
అనవసరమన్న వివేచనా కలిగించే విజ్ఞాన వీక్షణం
కరిగి పోతున్న కాలాన్ని గాలం వేసి ఆపలేక
అలాగని చేజారిపోనీయనూ లేని అసహాయపు సందిగ్ధం
ఒంటరితనం ఒక్కో సారి వరం
నిజం నేస్తం....
నిన్ను నువ్వు నగ్నంగా నిర్లజ్జగా
నీ అంతరంగపు అద్దంలో విశదంగా పరీక్షించుకునే అవకాశం
మర్యాదపు వలువలు విప్పి పారేసి
అసహజపు మాస్కులు తీసేసి
అసలు సిసలైన నీ ఆంతర్యపు చిత్రాన్ని స్కాన్ చేసి చూపగల
అత్యద్భుత సత్యం
అందుకే ఒక్కోసారి
ఒంటరితనం మనిషికి చాలా అవసరం
మనిషితనం మిగులుందో లేదో అప్పుడప్పుడు
ఎవరికీ వారు చేసుకునే అంతరీక్షణ ....!!!
ప్రేమతో...జగతి