జగత్కాంక్ష
ఆగమించే ప్రతి వసంతమూ
నాకొక నిరీక్షణా దీక్షా వ్రతమే
అనంతంగా సాగే నీ కవన యజ్ఞంలో
ఛాయా మాత్రంగానైనా నేనగుపిస్తానా అని
అనుక్షణమూ అంతర్మధనమే
కుముదంలా నా గురించి కధ రాయమని
అభిమానం విడిచి అర్ధించను గానీ
నా అస్తిత్వాన్ని నీవు అక్షరీకృతం చేయాలని
అంతరాంతరాలలో ఆరాట పడతాను
నీ అనుసృజన యాత్రలో
చిరు పద రత్నమై పల్లవించాలని
గ్రీష్మానుతాపంతో పరితపిస్తాను
నవరసాల అభివ్యక్తి నిండిన
ఆషాఢ మేఘపు నీ హృది
నా కోసం ఓ కవితా బిందువు చిలకరించాలని
ఆర్త జగతినయి ప్రతీక్షిస్తాను
తరలి వచ్చే హేమంతపు దివ్య పరిమళాలలో
చేమంతుల సీమంతినిగా
నీ మాటల మధురిమ కోసం కాచుకునుంటాను
ఆకులుగా ఆశలన్నీ రాలిపోయే వేళ
మంచు ముత్యాల శీతల హేలలో
నా గురించి వెచ్చని ఓ ఆప్త వాక్యం రాస్తావేమోనని
ఓడని మోడునై కనురెప్పగాస్తాను
ఆరు ఋతువుల వర్తులం
నిస్తేజంగా, నిర్లిప్తంగా ఆవర్తించాక
నా కన్నీటి నిరాశా ఫలిత పత్రాలను రాల్చి
పాత కోర్కెల సరికొత్త పూతలతో
తొగరు లేచివురునై అంకురిస్తాను
ప్రతి చక్ర భ్రమణమూ
ఆత్మీయానురాగంతో నీవు
నా గురించి రాసే
ఒక్క , ఒకే ఒక్క అక్షరం కోసం
ఆశ నిరాశల అంతరీక్షణతో
అనవరతమూ ఆకాంక్షిస్తూనే ఉంటాను
నీ దివ్యానుగ్రహ అక్షర హారాన్ని
ధరించే అర్హురాలిని కావాలని
ఆయువిచ్చిన ఆమనులన్నీ
అవిశ్రాంతంగా ఎదురు చూస్తూనే ఉంటాను
...............ప్రేమతో జగతి
ప్రేమకి నిర్వచనంలా ఉంది.
ReplyDelete