Wednesday, June 22, 2011

అతను....

అక్షరాంజలి .....!!!!!



ఆత్మీయంగా  పలకరించాడు 
ఆప్యాయంగా జవాబిచ్చాను 

అరమరికలు లేకుండా మాట్లాడాడు 
అభిమానంగా ఆహ్వానించాడు
కుసలాలు కౌశలాల నుండీ 
జీవన పధాల వరకూ
సాగింది మాటల పయనం
కన్నీటి పొరతో మసకబారుతోన్న
కళ్ళను నవ్వుల నందివర్ధనాలతో ఒత్తి 
సజీవ చిత్రాలెన్నో చూపాడు 
అనురాగపు అంచుల నుండి జరిపడినా
అనుభవాల చేదును మింగినా
అహరహమూ వేధించే ఒంటరితనాన్ని
తపస్సు చేసుకుని 
శిధిల అనుభూతులను 
సిద్ధాన్నంగా భుజించి 
జీవన పోరును జయించి 
తాను కల్ప వృక్షమై
ఎందరికో జీవిక నిచ్చాడు
ఏకాంత సాధన లో
హిమ శిఖరమై ఎదిగాడు
మన్ననలు పొందాడు 
మనసు నిండుగా అతని మాటలే
ఈరోజు వ్యధ శిల అయిన నా మనసును
ఆశల ఉలితో జీవకళా రూపంగా
దిద్ది తీర్చాడు
ఎవరితను? ఎక్కడివాడు?
నా మది వెతలను మరిపించి
మాటలతో ప్రాణం పోసి
నిర్లిప్తమైన హృదయాన్ని
ఉద్దీప్తం చేసాడు
పరిచయలెన్నో ఉంటాయి
ప్రత్యేకమైనవి కొన్నే
జ్ఞాపకాలెన్నో ఉంటాయి 
మధురమైనవి కొన్ని మాత్రమే
ముఖపరిచయాలెన్నో ఉన్నా
బతుకును పరిమళింప జేసేదీ 
సరి బాటను నడిపేదీ
ఇలాంటి ఓ మహద్భాగ్యం 
ఈ రోజు నన్ను కరుణించింది
ఇప్పుడు లోకమంతా
ఆశల వెన్నెల పూలే 
అగుపిస్తున్నాయి......ఆతని మాటలై
సప్త స్వరాలు వినవస్తున్నాయి
ఆతని ఆకాంక్షా గీతంలో.....
నవ నాడులూ 
ఆశా నాదం నినదిస్తున్నాయి
అతని కై కృతజ్ఞతతో 
కైమోడ్పుగా కనులు వాలి పోతున్నాయి....  
వసివాడిన ఆశా లతలు 
పసిడి చివురులు వేస్తున్నాయి....
అన్యమనస్కంగా  ఉన్న మనసుని 
ఆహ్లాద గీతం చేసిన అతనికే 
ఈ అక్షరాంజలి  



 ఈనాడే కనుగొన్న ఓ అరుదైన వ్యక్తికి "మిమిక్రీ  శ్రీనివాస్" కి 

.................................ప్రేమతో....జగతి 4.25pm wednesday 22-06-2011















Saturday, June 18, 2011

ఆరాధన ..


అద్వైతం ......


జీవితం చొచ్చుకు వచ్చిన వారు 
కొంత కాలముంటారు 
మనసు చొచ్చుకు వచ్చిన వారు 
మరువని జ్ఞాపకాలై 
ఎదలో మిగిలి పోతారు 
ఆత్మ చొచ్చుకు వచ్చిన వాడివి
ప్రభూ!.అనవరతం నాలోనే నీవు 
....అద్వైతం మనం ......ప్రేమతో...జగతి  

Wednesday, June 8, 2011

కారాగారంలో శాంతి ....


కారాగారంలో శాంతి ...చెదరని చిరునవ్వు ....
కామేరాల తళుకులు ముప్పిరిగోనలేదు.... 

టీవీ చానెళ్ళు ముట్టడించలేదు
అంతా సవ్యంగానే జరిగింది 
అంతర్జాతీయ శాంతి బహుమతి బహూకరింప బడింది
దశాబ్దాల కృషి ఫలితంగా 
ఎన్నో అడ్డంకులు, నిరసనల నడుమ
శాంతి స్వర్ణ పతకం
ఒక ఖాళీ కుర్చీలో ఉంచబడింది
అవ్వడానికి అది ఖాళీ కుర్చీయే అయినా
అది ఒక శాంతి కాముకుని
మానవ హక్కుల అపర భగీరథుని స్థానం 
శతాబ్ద కాలంలో ఒక ఆసియా దేశానికీ ఇవ్వబడిన 
ఒక శాంతి పురస్కారం 
గ్రహీత గాని అతని తరపు ఎవరు గానీ లేకుండా 
ప్రదానం చెయ్యబడిన చారిత్రాత్మక క్షణమది 
తైన్మేన్ స్క్వేరులో తన శాంతి పోరాటాన్ని 
మొదలిడిన అక్షర యోధునికి
కాలాన్ని కత్తిగా కవాతు చేయించిన 
వాక్ స్వాతంత్ర్య పోరాట సైనికునికి 
ఎందరి అభినందనలో
చీకట్లో తన జైలు గదిలోనికి 
గాలి తెరలు మోసుకోచ్చాయి 
మనిషికి కారాగారం కానీ 
మాటలకు కారాగార శిక్ష లేదని
ప్రజా స్వామిక భావ స్వాతంత్ర్యంతో 
తన దేశం మున్ముందుకు నడవాలని
ఓ రండు చేతులు ఆకాశం వైపు సాచి ప్రార్ధించాయి

సంబరాల తేలి యాడ వలసిన ఆ రోజు
ఉడికించిన కాయ గూరలతో 
మరొక రొట్టెముక్క, మాంసం ముక్క అదనంగా
భార్య  జియా తో కలసి కాపలా వాళ్ళ మధ్య 
విందు భోజనం చేసాడీ అపర సిద్ధార్థుడు 

"శాంతి" వినడానికి  ఎంత చిన్న మాట 
సాధనలో ఎన్నెన్ని యోజనాల దూరం
అయినా ఎన్నటికీ
ఆగనిదీ శాంతి పథమని నిలిచిన
ఒంటరి బాటసారిని చూసి పుడమి పులకరించింది
ఇనుప ఊచలు జేజేలు పలికాయి
మసిబారిన జైలు గోడలు
తప్పక గెలుస్తామన్న భరోసానిచ్చాయి 
చిరునవ్వుతూ వాటితో కరచాలనం చేసాడీ అభిమన్యుడు
తన "విల్లు" సార్ధకం అయిందని 
"నోబెల్" ఆత్మ శాంతించింది
......................................ప్రేమతో.. ...జగతి 

8.50pm.12-12-2010 sunday 


మిత్రులారా లిఉ షీ బో కేవలం మనవ హక్కుల పోరాట వీరుడే కాదు మంచి కవి కూడా ఇతని ఒక కవిత ను కౌముది లో కూడా నా అనువాదాన్ని వేసుకున్నారు కిరణ్ ప్రభ గారు. అతాని కవిత్వం పూర్తిహా ఆంగ్లంలోకి అనువదిస్తున్నారు ఇప్పుడు. అది త్వరలో వస్తుంది. ఇది ఆ రోజు రాసిన నా కవిత మీతో పంచుకుందామని .....ప్రేమతో...జగతి