Tuesday, March 12, 2013

నూత్న సనాతనం


నూత్న  సనాతనం 

శ్మశాన విరాగ నిశీధిలో సైతం 
అప్రమేయంగా సహజాతంతో 
కదిలిన నవనాడుల ప్రకంపనం 
జవ జీవాల జీవన నాదం 


అనాదిగా వస్తున్నదే అయినా 
అందిన ప్రతి సారీ ఒక కొత్త రూపు 

ఎన్ని పదాలు , పదబంధాలు, ప్రబంధాల సారమైనా 
ప్రతి మారూ వినూత్న చలనం 

తానే నేనై , నేనే తానైన 
త్వమేవాహమా 
తానూ నేనూ లేని అద్వైతమా 

తనూ నేను ప్రేమల  విశిష్టాద్వైతమా 
సమాధానపడని మనసుకి 

శాంతించని దేహానికీ నడుమ 
ప్రతి క్షణం రగిలే వాంఛా జ్వలనమా 

తీవ్ర స్ఖలనాల పిదప 
తీయని కౌగిలిలో సేద తీరే 
మనోదేహాల ఆత్మీయ చాలనం 

కాలమున్నంత వరకూ
మనిషిని శాసించే 
విశ్వజనీన శృంగార సామ్రాజ్యం 
విజయులూ వీర మరణాలూ లేని 
సరస సంగమ సంగ్రామం 

అనూచానంగా మనోదేహాత్మలను 
రంజింప జేసే మధుర మరణమిదే 
రస సిద్ధి  పొందిన 
రసజ్ఞుల   ప్రాప్త మోక్ష ఫలం   
నిత్య నూతన సనాతనం 
నిరంతరం !!!

................................ ........................ ప్రేమతో ..జగతి 4.36pm tuesday 12th march 2013 

Sunday, March 10, 2013

సందేహం


సందేహం 

గడిచి పోతున్నాయి
నిమిషాలు గంటలూ రోజులూ 
కానీ ఎక్కడో దెబ్బ తిన్న చిన్ని పావురం లాంటి మనసు 
గాయం ఎందుకైందో కూడా గుర్తు లేని 
ఇంకా ఆ బాధతోనే ... 

దు:ఖం కూడా లయమైపోయిన నిర్లిప్తత 
కవితలల్లిన కలానికి అక్షరాలే మర్చి పోయినట్టు 
ఏదో మరుపు ,
మరిచిపోవాలని ప్రయత్నించినా 
మరవలేని తనం నుండి 
పదాలను మరిచిపోయిన తనం 

మెదడు పొరల్లో నిక్షిప్త జ్ఞానపు పూల తీగ
తెగి పడి అల్లార్చుతూ ..... 
మనసు పందిరి నిస్సహాయంగా చూస్తూ 
చేయ్యందించాలని  ప్రయత్నిస్తూ 

అన్నీ పక్కకు నెట్టి 
అసహజపు నిద్ర అరువు తెచ్చుకోవాలని 
మత్తు లో మునిగి 
మెలకువా నిద్రా కాని సందిగ్దత లో 

ఎక్కడో వాడి రాలిపోయిన కవితా కుసుమ పరిమళం 
గాలిలో తేలుతూ మెదడు మేనుని తాకుతూంటే 
నైరాశ్యపు పొరలు చీల్చుకుని 
పదాలు పరుగులిడి నా కౌగిలిలోకి ఉరుకుతోంటే 

కాదనలేని ప్రేమ పాశమే దో  సంధించి 
నను పట్టి లాగుతోన్న  వైనం 
చిత్రాతి చిత్రంగా నాకు నా మనసే 
కొత్తగా , పరిచయం లేని పాపడిలా 
నా కొంగున దోగాడుతూ ... 

మళ్ళీ నిశ్శబ్దం లోంచి శబ్దం లోకి 
మౌనం నుండి మానసాన్ని 
మళ్ళించాలని చేయాలనిపించీ 
చెయ్యలేని విశ్వ ప్రయత్నం లో 
ఓడి పోయి , నిస్సహయంగా 
జారిపోతున్న కాల సుమాలని 
నిస్తేజంగా చూస్తూ ఉండి  పోతున్నా 

ఈ నిశ్శబ్ద మౌన సమాధి నుండి 
మళ్ళీ  ఎప్పుడు మేల్కొంటా నో 
అసలంటూ మరల పూర్తి మెలకువ 
ఇక ఎన్నటికైనా వస్తుందో రాదో 
అదీ సందేహమే మరి 

...... ..... ...... ..... ...... ....... .... ప్రేమతో ..జగతి 7.52 pm sunday (shivaratri) 10th march 2013