Thursday, May 31, 2012

దివ్య గానం


         
పాట పాడటమంటే మాటలు కాదు 
అమృతగానం ఓ అద్భుత తపస్సు 
చక్కని సాహిత్య 
చిక్కని స్వరాల , సుమధుర స్వర పేటికతో
చేసే  శబ్దానుక్రియా కాదు 
చిట్ట స్వరాల చిద్రూప కల్పనతో 
సంగతులను సంతరిస్తూ పలికే 
పాండిత్య ప్రతిభా కాదు సంగీతం 
హావ భావ విన్యాసాల 
రాగ తాళ మేళవింపులతో 
శ్రుతి లయానుబద్దమై సాగేది మాత్రమే 
కాదు గానమంటే ....

దివ్య గానమంటే.....
భావనాప్లావితమైన  రసఝరి 
షట్చక్రాలను ప్రదీప్తించి 
సహస్రారాన్ని ప్రపుల్లితం చేసే దివ్య కాంతి 
భక్తి , అనురక్తి , విషాదం, వినోదం , భావమేదైనా 
రస స్ఫూర్తితో పలికితేనే గీతిక
కృతియో, కీర్తనో, లలితమో, 
మరి జానపదమైనా ...
ఆయా రీతుల లోతులు గని 
పలికితేనే గానము 

ఆరోహ అవరోహణల అనుష్టానమే కాదు 
గానం నవరసానుభూతుల అనుసంధానం 
సరిగమల , రాగాల సంగమమే కాదు 
మధురమై , మంజులమై , 
మనోధర్మానుసారాన సాగి 
భక్తి , జ్ఞాన , ప్రపత్తులతో 
సామవేద సారాన్ని 
సప్త స్వరాల వరాలతో 
అద్వైతాన్ని సిద్ధింప జేసే సన్మార్గము 
పండిత , పామర 
హృదయానురంజకమై
భావోద్దీపన కలిగించే 
నాదాను సత్ సాధనమే సంగీతం !!!
..........................................ప్రేమతో ...జగతి ( అభ్యుదయ రచయితల సంఘం వారి సంకలనం లో ముద్రితమైన కవిత) 





No comments:

Post a Comment