Saturday, May 19, 2012

బాసలు ..


...
నిదుర రాని ప్రతి రేయీ
ఎన్నెన్ని రాతలు రాస్తానో 
మాగన్నుగా కూడా
మూయలేని కనురెప్పల 
కాగితాలపై 
ఎన్ని వేల తలపుల 
అక్షర  శిల్పాలను 
పలవరిస్తానో  ...
ఒంటరిగా నా మది 
ఆలపించిన ఎన్ని రాగాలను 
మౌనంగా నా కనుపాపలకు 
వినిపిస్తానో...
లెక్కలేనన్ని ఊహలు ....
కనులు పట్టనన్ని కలలు 
గత వర్తమాన భవిష్యత్తుల
ట్రై కలర్ స్వాప్నిక జగత్తులో
మల్టీ కలర్ లో నే రాయని 
రాయలేని ...కమ్మని 
కవితలు, కథలూ....పాటలూ 
చెయ్యాలని ,చేసి తీరాలని 
ఎన్నెన్ని బాసల ఊసులో...
ఏమీ చెయ్యలేక పోయానన్న 
దిగులు దిగాలు చూపులు చూస్తే 
ఓదార్పు చిర్నవ్వుతో 
నాకు నేనే ధైర్యం చెప్పుకుంటూ
నన్ను నేనే ప్రేరణ కలిగించుకుంటూ
కనే కలలు , ఊహలు , ఆశలు 
చెప్పాలంటే ఎన్ని రాత్రులు పడతాయో 
రాయాలంటే ఎన్ని పర్వాలౌతాయో 
అందుకే అన్నిటినీ 
తెలవారు ఝామున 
కనులు అలసి మూతలు 
పడుతున్నప్పుడు ...
భద్రంగా కనుల పెట్టెల్లో పెట్టేసి 
తప్పక మీ ఆశలు
నెరవేరుస్తాను సుమా 
అని ఒట్టుపెట్టి.......
కోడి కూసే ఝాము లో 
కాస్త కూడా కునుకు పట్టని హృదయాన్ని
సోలసిపోయిన  దేహాన్నీ 
సేదదీర్చడానికి ప్రయత్నిస్తాను ....
....................................ప్రేమతో...జగతి 4.25pm Wednesday 9/05/2012 (home) 

No comments:

Post a Comment