ఆకులు రాలిన ఎర్రమందారం చెట్టు
తుపాకులు పడేసిన తీవ్రవాదిలా ఉంది
యుగ సంధి లో నిల్చిన
ధరణి ధోరణి లా ఉంది
అక్కడక్కడ ఇప్పుడిప్పుడే
అగుపిస్తోన్న నును లేత చివురులు
ఆకుపచ్చ నక్షత్రాలై మెరిసి
ఆశ పొడ చూపుతున్నాయి
కొమ్మలుగా విస్తరించిన
తన పిల్లల్ని చూసి
ఏ కొమ్మ ముందు పూస్తుందోనని
అంగాలారుస్తోంది ఎండలో మాను తల్లి
కొమ్మలన్ని హరిత పత్రావళి అయితే
ఆకుపచ్చ్చ చల్లదనంలో
సేద తీరి ......
తలవంచి గర్వంతో
తన బిడ్డల ఉన్నతిని చూడమంటూ
నేల నేస్తాన్ని పలకరిస్తుంది
నేను లేనిదే నీవు లేవన్న నేలమ్మని
అందుకేగా తలవంచి నీలోకే ఒదిగి పోతున్నానంటుంది...
మరు శిశిరం వరకు
హరిత పత్రాల కిరీటాలతో
ఆనంద భైరవిగా పరవశిస్తుంది
అనాదిగా సాగే ఈ చర్యకి
సర్వ సాక్షి సంతకం కోసం
ప్రతి ఏడూ విపత్ర అయి
నవ జీవ రాజ ముద్ర వేయించుకుంటుంది
మౌనంగా ఏమి తెలియనట్టున్న మా మందారం చెట్టు
జీవన సారం తెలిసిన
యుగ యుగాల ప్రేమ సాఫల్యతకు
ఆనవాలు ....!!!
అనుకుంటే ఓ మామూలు చెట్టే
అర్ధం చేసుకుంటే జ్ఞాన మందారం...!!!
ప్రేమతో ...జగతి
11.58pm 12th march 2011 saturday
No comments:
Post a Comment