అనుదినమూ ఆరు ఋతువులను చవి చూసే నాకు
అందరిలా ఆమని ఏడాదికోసారి కాదు....రోజుకోసారి..
తొలిసంధ్య వేళ చిరునగవుల ఆధారాలతో
నా మోవి పై నీవద్దిన సుప్రభాత
ముద్దు మందారాల కెంజాయలో
ప్రతి ఉదయమూ ఓ వసంతాగామనమే...
నీవడిగిన వెంటనే
కాలమో, పుస్తకమో, కాగితమో
నీకందియ్యని క్షణాన
ఆగ్రహించే నీ మృదు వదనం
నా పాలిట జ్వలించే గ్రీష్మ తాపమే
నా కను గప్పి దాటిపోయిన
నీ ప్రియ వస్తు సముదాయాన్ని
శోధించి సాధించి నీ కందించినపుడు
నీ కన్నులు చిందించే
ఆనందామృత వర్షిణిలో
శ్రావణ మయూరాన్నై ఓల లాడుతాను
అలసి సొలసి నీవరుదెంచిన
సాయం సంధ్య వేళ
ఆరుబయట కూర్చుని
ఆసాంతం , శాంతంగా
ఊసుల ఉసుల రాశులను
ప్రోవుచేసుకునే హేలలో
శరత్కాల కౌముదినై పరిమళి స్తాను
ముద్దుల మురిపాల బువ్వల
గోరుముద్దలు గ్రోలుతూ
మరు ఝాము లో మైమరచి
హేమంతపు సీమంతినై పరవశిస్తాను
మేధో మధనాలూ, కలాల కవాతులూ
అన్నిటినీ చక్కబెట్టి
అనురాగాంబుధిలో ఒకరితో ఒకరుగా
ఒకరిలో ఒకరుగా
ఇరువురమొకటై రససిద్ధి పొందే
ఆదివ్యామృత క్షణాలు .....
ఆకులు రాలే శిశిరం కాదది
మన ఆత్మలు ఐక్యించే
అనురాగాంక్షిత మధుర వైనం
మరో సుందర నవవసంతానికి
మరలా చివురులు వేసేలా
మనో దేహాత్మలను
సిద్ధం చేసుకునే
అద్వైతానందార్నవం
అందుకే....
అందరిలా ఆమని
ఓ ఋతువు కాదు నాకు
ప్రతి అరుణోదయ అస్తమాలూ
నీ సన్నిధిలో
ఓ ఋతు సమ్మేళనమే
నవ రసాల విన్నూత్న ఆవిష్కరణమే
నవీన భావనల
షడ్రుచుల సమ్మేళనమే
ఉగాది కాని రోజేది లేదు నాకు
ఉగాది జీవన చర్యకు పర్యాయ పదం కదా...!!!
ప్రేమతో....జగతి
Marvelous Dhatri garu,
ReplyDelete