Sunday, July 10, 2011

గర్భ శోకం


అందరూ నా పేగు బంధాలే 
నా ఇరు రొమ్ముల పాలు తగి పెరిగిన వారే
ఏ మాయలు, ఏమాటలు, ఏ వేటులు
వేరు చేసాయో.... 
కుడి ఎడమలై విడిపోయి 
శోక తప్తగా నన్ను మిగిల్చారు 

ఆదర్శాల అగ్నిపుష్పమాలలు ధరించి 
ఆవేశంతో ఆయుధం పట్టిన వారు కొందరు 
అడవుల అగాంతరాల పాలౌతూ 
అనుక్షణం అసిధారా వ్రతంలో 
అందుకోలేని ఆశయాల శోధకులై 
గుర్తింపులేక  గుర్తులే మిగలక
గుళ్ల వర్షంలో గుప్తమై పోతారు 
వారికి పతకాలుండవు 
పతనాలు తప్ప
ఆదరణలుండవు ఆప్తుల ఆక్రోశం తప్ప ....

ప్రాణాలకు తెగించి 
తమవారిని త్యజించి 
రక్షణే కర్తవ్యంగా 
విధి నిర్వహణలో 
తమని తాము అర్పించుకుంటారు కొందరు 
సమరంలో స్వైర విహారులు
సహజ జీవన మాధుర్యానికి నోచుకోని వారు 
అకాల వైషమ్య దురాక్రమణకి 
అధాటుగా బలి పశువులౌతారు
జల సమాధులలో ఆశువులు బాసి 
కర్మవీరులౌతారు 
పరమ వీర చక్రాలుగా 
వీర పతాకలుగా
ఆత్మీయులకు మిగులుతారు 

బాటలు వేరైనా 
అందరూ సమ సమాజ స్వాప్నికులే....

అసహాయ విధ్వంసాల ఆదర్శం ఒకరిది
నిస్సహాయ కర్తవ్య పాలన ఇంకొకరిది                           

అహరహమూ సాగే పోరు బాటయే
ఇరువర్గాలదీ......
ప్రాంతమేదైనా , పేరు ఏదైనా, కారణమేదైనా 
రాలేది మాత్రం నా బిడ్డల ప్రాణాలే
నా పేగు ముడిని తెంచుకున్న 
కడుపుతీపి తుంచుతున్న
పల్లేరు బాటల పయన మిరువురిదీ

ప్రాణాల హవిస్సులనర్పిస్తూ 
ఆప్తుల అనుబంధాలకందని దూరాలకు చేరి 
జ్ఞాపకాలుగా, జ్ఞాపికలుగా మిగిలిపోయే 
అనునిత్యం హననమై సాగే 
ఈ విషాద విధ్వంసక పయనం
ఆగే దెన్నడు?

నా నిరంతర    గర్భ శోకానికి 
ముగింపు పలికే దెన్నడు????? 

.............................................................ప్రేమతో ....జగతి 

5.35pm wednesday 02-07-2008.....లో రాసినది 




 

1 comment:

  1. bagundi kavitha hrudaya vidarakanaga undi....

    ReplyDelete