Tuesday, September 18, 2012

విచిత్రం




నా తెల్లని హృదయ కాన్వాసు పై 
నీ భావనల రంగులన్నీ ఒకేసారి చిమ్మావు
నీ కోప తాపాల, ఉద్వేగాల, ఉద్విగ్నతల 
ఆశ నిరాశల, అస నిపాతల, అహంకారాల 
నీ వేదనల, శోధనల , అంతర్యపు వర్ణాలెన్నో 
అన్నిటినీ ఒకేసారి దోసిలి  నిండా తీసుకుని 
ఒక్కసారిగా  విసిరేవు ...
అన్ని ఛాయలు కలగలిసిన నీ హృదయాన్ని 
అదాటుగా ఆవిష్కరించేవు 
నీలోని అన్ని రంగులను  ఒకేసారి చూసిన నా మది 
నిశ్చేష్ట అయి పోయింది 

చిత్రమైన నీ భావాల వైచిత్రికి 
నా హృది మూగబోయింది 
సప్త వర్ణాలు కలగలిసిన విన్నూత్న వర్ణమేదో 
గజిబిజి గా నన్ను కంగారు పెట్టింది 

ధవళ వర్ణం తప్ప ఎరుగని నా ఎద
ఇన్ని రంగుల కల బోతకు బిత్తరపోయింది 
నీవు విసిరిన పలు రంగులను కన్నీటితో కడిగి చూసుకున్నాను 
నీ వలపు వర్ణం ఉందా లేదా అని 

సప్త వర్ణాల కలబోత 
నీ భావాల కుంచెలోంచి 
స్పష్టా స్పష్ట కలనేత నీ చిత్రాల చిత్రం 
నీ హృదిని ఆవిష్కరించింది 

అన్ని వర్ణాలలోనూ 
నా కనులకు , మనసుకు 
స్పష్టంగా అగుపించింది 
నీ అనురాగ రంజిత సువర్ణం 
ఈ లోక పు కుడ్యం పై ఎప్పటికీ 
వన్నె తరగని ప్రేమ తైల వర్ణ చిత్రం 
 ప్రియతమా! బహు చిత్రమైన చిత్రకారుడివి నీవు 
అంతరంగాన్ని అన్ని రంగుల మిశ్రమం లోనూ  
మమతల మధురిమను దర్శింప జేశావు 
మాటల్లో చెప్పవు కానీ నీ చిత్రాలలో 
పటం కట్టుకున్నది మాత్రం ప్రేమానురాగాలేనని
అవగతమైంది నాకు ....ఇప్పుడు నీ చిత్రాలు 
చిత్రం కావు నాకు ... నవీన రీతులలో తీరిన 
నీ ఊహల , ఆశల ,ఆంతర్య అద్వితీయ హర్మ్యాలు !!!

........................................................................ప్రేమతో జగతి 6.09am .18th Sept Tuesday 2012 











1 comment:

  1. "చిత్రమైన నీ భావాల వైచిత్రికి
    నా హృది మూగబోయింది
    సప్త వర్ణాలు కలగలిసిన విన్నూత్న వర్ణమేదో
    గజిబిజి గా నన్ను కంగారు పెట్టింది".............. "నీలోని అన్ని రంగులను ఒకేసారి చూసిన నా మది నిశ్చేష్ట అయి పోయింది..." నిశ్చేష్ట అయిపోయింది నా మది అమ్మా......!!

    ReplyDelete