ఉమ్మ నీటి నుండి జారి పడీ పడగానే
మొదలౌతుంది ....అమ్మ తో బొడ్డు తాడు కోసిన వెంటనే
ఆకలి కేకలేస్తావు ఆగ్రహ ప్రకటన చేస్తావు
వెచ్చని గర్భ గుడినుండి
తిని బజ్జోడమూ, అప్పుడప్పుడూ తిరగడం తప్ప
ఆ చిన్ని గర్భ గుడి నుండి ఈ గుహలోకి వచ్చినందుకు
ఏడుస్తావు మరీ మరీ....
ఆకలనుకుని ...నీకు అమ్మ రొమ్ము నందిస్తుంది
నిరాహార దీక్ష విరమించి పాలు తాగుతావు
ఆకలి, నిద్దుర, ఆకతాయి అల్లర్ల అధ్యాయాన్ని ఆరంభిస్తావు
అక్షరాభ్యాసం తో బతుకు పుస్తకానికి శ్రీకారం చుడతావు
జీవితపు ప్రతి రోజూ ఒక తెల్ల కాగితమై వస్తే
ఇరవై నాలుగ్గంటల్లో గా వీలున్నన్ని రంగులు పులుముతావు
రోజులు వత్సరాలై... దశాబ్దాలుగా మారుతుండగానే
ప్రతి పేజీ నిండి పోతుంటుంది ...
ఏడాదికొక వసంతం గడిచి పుస్తకం మధ్యలో కొస్తావు
రాగారంజితమైన వలపు తేనియలు
ఉద్విగ్న పూరిత ఆశోదయాలు
నీరసపు నిశి రాత్రులు ఎన్నో ఎన్నెన్నో
ఆర్ధిక జగత్తులో నీ మేధను అమ్ము కుంటావు
ఆశల హార్మ్యాలను అవలీలగా కడతావు
అనుభూతుల అలంకారాలూ
ఉత్ప్రేక్షల ఉద్విగ్నతలు
అవమానాల ఉపమానాలు ఎన్నో చవి చూసి
అతలాకుతలమై నీ ఉనికిని సైతం మరిచి శ్రమిస్తావు
కాలం అనరోగ్యమై హెచ్చరిక గంట కొడుతుంది
పడుతూ లేస్తూ అలసి పోయి మందులతో నెట్టుకోస్తావు
డస్సిన ప్రాణం , వడలిన దేహం తో ఒంటరి గా మిగిలి
నిన్ను నీవు పరికించుకునేసరికి
నీ తరగతి కాలం ముగుస్తుంది
బతుకు పుస్తకపు చివరి పేజీ అంతపు చుక్కకై
కాచుకునుంటుంది ...
తప్పించుకునే ప్రయత్నం లో కొన్ని సార్లు విజయుడవైనా
చివరి పదం రాసి ముగించక తప్పదు
భౌతికమైన ప్రాణుల్ని
ప్రాణం లేని కాసింత ఆస్తిని మిగిల్చి పోతావే గానీ
అక్షరమై నిలిచే ప్రయత్నం చేయవు
జీవిత పరమార్ధం ఇది కాదని తెలుసుకునే లోగా
బతుకు బడికి తాళం పడుతుంది
అందుకే నేస్తం! అయిన వాళ్ళను ప్రేమించు
మనసైన అక్షరాలనూ ఆరాధించు
నీవు పోయినా మిగిలే ఈ అక్షరాలే
నీ భావావేశ ప్రకటనలౌతాయి
నిను చిరస్థాయిగా అక్షర జగతికి
అంకితం చేస్తాయి ... ఆచంద్ర తారార్కం మిగిలే అక్షరాలే
నీ అస్తిత్వాన్ని భావి తరానికి ఆశా జ్యోతులౌతాయి
నువు రాసే ప్రతిదీ గొప్ప కవిత్వం కానక్కర్లేదు
నిజాయితీ నిండిన అనుభవ సారమైతే చాలు
ఆత్మ ద్రోహం చేసుకోకుండా రాసే ప్రతి అక్షరము
నిన్ను ఖచ్చితంగా క్షరం కానీయదని గుర్తుంచుకో చాలు
కాలపు హృదయ గ్రంధాలయం లో
నిన్ను నిక్షిప్తం చేస్తుందని ధ్యాస కలిగి ఉండు
ధ్యానంతో అధ్యయనం , అభివ్యక్తితో నీ ప్రతి అనుభవము
శాశ్వతమై అందరి హృదయాలలో నిలిచేనని తెలుసుకో !!!
.............................. ..........................ప్రే మతో ...జగతి 5.10 pm Thursday 6th Sept 2012
కాఫీ తాగిన చాలా సేపు వరకు ఆ రుచి నాలుక మీదే వుండాలని అనుకుంటాను నేను .... అలాగే చదివిన ఓ మంచి కవిత తాలూకు ప్రభావాన్ని మది కొంత సేపైనా తలుస్తూనే వుంటుంది. మీరిలా ఇన్ని కవితలు ఒకేసారి వదిలితే .......ఆ అనుభూతిని మిస్సు(miss) అవుతున్నాను....మిస్ట్రెస్(mistress) !
ReplyDeleteఅసలు సంగతి మరిచా......... చాలా నిజాయితీ గా ....సింపులు గా వుంది కవిత. అభినందనలు......'' జె '' !