Tuesday, December 27, 2011

పాడ్యమి వెన్నెల గ్రహణం


పాడ్యమి వెన్నెల గ్రహణం 




చందమామకి కృష్ణ పక్షమూ
శుక్ల పక్షమూ ఉంటాయిగా
అలాగే మా జ్యోత్సకూ 
ఉన్నాయనుకున్నానమ్మా
తల్లీ అంటూ ఇంకెవరు రా 
పిలుస్తారు నన్ను
అన్నం తిన్నావా ?
అన్న నా మొదటి ప్రశ్నకి 
ఎంత బుద్ధిగా జవాబిచ్చేవాడివి
నా చేత ఎన్నెన్ని చివాట్లు 
తిన్నా ఏమీ జరగన్నట్టు 
మళ్ళీ ప్రేమగా పలకరించే 
నీ పలకరింపు 
జీవితాన్ని నిశితంగా 
పరిశీలించి 
అక్షరీకరించ గలిగిన  
వాడిగల వాడివే 
మరి ఎందుకిలా 
కోరి మృత్యువుని ఆహ్వానించావో 
ఒక్క మాటైనా చెప్పలేదు 
ఎన్ని సార్లు చెప్పాను
తిట్టాను బతిమిలాడాను
చివరికి కొట్టాను కూడా 
నిష్కారణంగా బతుకుని 
బలిపెట్టకురా అంటే 
అలాగే రా తల్లీ
అంటూ చేతిలో చెయ్ వేసే వాడివి 
ఎందుకూ నా చెయ్యి వదలగానే 
మాట తప్పే౦దుకేనా?
ఎవరికుండవురా బాధలు 
ఎందుకురా నాన్నా ఇట్లా
అంటే లేదమ్మా బాగుంటానుగా
అని చిన్ని పాపడిలా అలాగే  
అని భరోసా ఇచ్చేవాడివి 
నిజమనుకునేదాన్ని 
నీ కలం లోని స్ఫూర్తి 
నీ అక్షరార్తి ఏవీ నిన్ను
కాపాడలేదా?
ఒంటరి తనం భరించలేను 
పుస్తకాలే నేస్తాలంటూ 
పుస్తకాలెన్నో చదివావు కదా
అంత మంది మస్తిష్కాల 
ప్రభావమైనా నిన్ను 
మార్చలేక పోయిందా 
ఇంకా శుక్ల పక్ష చంద్రుడిలా దినదినాభివృద్ధి
చెందాల్సిన కవన వెన్నెలవి
పాడ్యమి కి ముందే 
కనుమరుగైపోయావా?
సూదంటు రాయంటి నీ చూపులు 
హృద్యమైన నీ పద విన్యాసం 
నీ కవితా ఝరి ని 
ఎందుకు అర్ధంతరంగా
ముగించి ...రాస్తూ రాస్తూ 
ఉన్న కలాన్ని హటాత్తుగా 
మూసేసి వెళ్ళిపోయావు
మనసులోని వేదన 
ఒక్క మాట కూడా 
ఒలకనీయక ...
అంత గరళాన్ని 
ఎందుకు దాచుకున్నావురా
ఎలా దాచుకుని 
దిగమింగలేకా ఎంత 
అవస్థ పడ్డావో నా తండ్రీ
దేహాన్ని ఎంతలా
ఛిద్రం చేసుకున్నావో
మనసు ఎన్ని ముక్కలైందో
ఏమైందో కూడా 
ఏనాడూ ఎవరితోనూ
మనసు జారి ఒక్క మాటైనా 
చెప్పలేదు కదూ
నువ్వు ప్రాణం మీదకి
తెచ్చుకుంటున్నావని 
కోపగించామే  కానీ 
నీ మీద ప్రేమ లేక కాదు కదరా
ఇవన్నీ నీకు తెలుసు 
కవివి కదా
అందుకేనా ఇక మా మాటలు
చివాట్లూ ఏమీ వినబడనంత 
దూరం వెళ్లిపోయావూ 
కనబడకుండా వినబడకుండా 
కవిని నేనని చెప్పేందుకేనా?
పాడ్యమి వెన్నెలకి 
గ్రహణం పట్టిన వైనాన్ని 
ఇలా మాకు చూపించావా? 
అక్షరంగా మిగాలాల్సిన
నీ అస్తిత్వం ఇవాళ
అస్థికలై ధూళిలో 
కలుస్తూంటే ఎలా ఇవ్వను 
కన్నీటి నివాళి ....
.........................జగద్ధాత్రి 
[మిత్రుడు, సీనియర్ పాత్రికేయుడు మంచి కవి బరంపురం వికాసం నుండి విరిసిన "జ్యోత్స్న" అకాల మృత్యువుకి కన్నీటి నివాళి ] 

6 comments:

  1. kanneeru pettinchaaru mee kavithatho ...jyothsna gaariki kanneeti nivali

    ReplyDelete
  2. నిజంగానే ఒక మంచి వ్యక్తిని కొలిపోవడం బాధగానే ఉంది .అయన గారి సాహిత్య సేవలను ఎవరు మరచి పోరు ....జ్యోస్త్న గారు భౌతికంగా లేకున్నా అక్షరరుపంలో అందరి మనసుల్లో చిరకాలంగా నిలిచి ఉంటారు ... అయన గారి కుటుంభానికి న ప్రగాఢ సంతాపం ........... సెలవు
    టి వి

    ReplyDelete
  3. నిజంగానే ఒక మంచి వ్యక్తిని కొలిపోవడం బాధగానే ఉంది .అయన గారి సాహిత్య సేవలను ఎవరు మరచి పోరు ....జ్యోస్త్న గారు భౌతికంగా లేకున్నా అక్షరరుపంలో అందరి మనసుల్లో చిరకాలంగా నిలిచి ఉంటారు ... అయన గారి కుటుంభానికి న ప్రగాఢ సంతాపం ........... సెలవు
    టి వి

    ReplyDelete
  4. మాటలు రాని పరిస్థితి. అంత మంచి వ్యక్తిని కోల్పోయినందుకు బాధగానే ఉంటుంది. అమ్మా... జ్యోత్స్నగారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించటం తప్ప మరేం చేయలేం కదా...

    ReplyDelete
  5. జ్యోత్స్న గారి మృతి తీరని లోటు..మీ ఆత్మీయత ప్రేమానురాగాలు పంచుకునే తీరుకు సదా వందనాలు అమ్మా...

    ReplyDelete
  6. ఆత్మకు శంతి కలుగు గాక

    ReplyDelete