Sunday, March 20, 2011

ఏమిటో...ఇది....?



ఏమిటో...ఇది....?
ఆమె అంటున్న మాటలన్నీ
ఎక్కడో ఎప్పుడో
విన్నట్టుగానే
తెలిసినట్టుగానే
అనిపిస్తున్నాయి
ఆమెతో నాకు
పరిచయమే లేదు అయినా ...
ఆమె మాటలు జన్మజన్మాలనుండి
ప్రతి రోజు వింటున్న  ఓ తియ్యని అనుభూతి
పలకరింపులు,  నవ్వులు .....ఎందుకో మరి...
తన ప్రేమ, ఆవేశం, నివేదన
అన్నీ ఏనాటినుంచో   ఎరిగున్న భావన
అవును ఆలోచిస్తే
అర్ధమౌతోంది
ఇవన్నీ నేను విన్న మాటలే
నా జీవన సహచరి పెదవుల వెంట..
అంతే కాదు అన్నీ నేనూ అన్న మాటలే
వలపు మధురిమలో
పులకరించిన
పలవరింతలే
నా ప్రేయసి ముని వేళ్ళ పై
నే మీటిన అనురాగ స్వరాలే
అందుకేనేమో ఆమె
మాటల్లో ఏదో తెలిసినతనం
పరిచయమైన ప్రేమ తత్త్వం
జీవన సంధ్యా సమయంలో
జీవితమొక తీరుగా
నడుస్తోన్న వేళలో
ఇన్నేళ్ళ ప్రేమ సహచర్యంలో
వింతగా  కొత్తగా
అనిపిస్తోన్న పాత మాటలు
ఎదిగిన చెట్టు మళ్ళీ
చివురులు వేస్తున్న వైనం
ప్రేమకి పాతదనం ఉందా అసలు
లేదు కానీ...
ఆమె పలుకులు సన్నజాజి మొగ్గల్లా
సున్నితంగా
మొగలిరేకుల్లా తియ్యగా
గుచ్చుకుంటున్నాయి
ఎక్కడో దశాబ్దాల క్రితం
హృదయంలో పటం కట్టిన తొలి వలపు
మళ్ళీ జీవం పోసుకుని
ఉలిక్కి పడి...
ఉక్కిరిబిక్కిరై...
గుండె ఝల్లు మనిపించేలా ....
ఆమె ప్రతి చర్య నన్ను
ఇప్పటి 'నా'నుండి
ఎప్పటి 'నేను'నో
తలపిస్తోంటే...
నా ప్రేయసి వెచ్చని కౌగిలిలో  చేరి
'ఆమె' ను తలపులనుండి
నేట్టేద్దామనుకుంటా....
నిర్మల తటాకంలాంటి
నా హృదిలోకి
సూటిగా చొచ్చుకుపోయే
ఆమె విశ్వమంత
నిర్మల అనురాగ ఝరిలో
నాకు తెలియకుండానే
నన్ను నేను మరిచి
కరిగి పోతూ ....
మనసు నిలవరించుకోలేక
ఆమెతో మాట కలుపుతూ
ఉంటా.......
దీన్నేమంటారో మరి......నాకే తెలియడంలేదు
'ఆమెకు' తెలుసునేమో  అడగాలి......!!!

                          ప్రేమతో జగతి 7.55am friday 11-02-2011
1977 లో ఇదే రోజు ఈ జగతి కవిత ఒకటి రాసిన రోజు అది 'పురోగామి' అనే లిఖిత పత్రికలో
ప్రచురించిన వారు రామతీర్థ అప్పటికి ఆయనకి 17 నాకు  13 ఏళ్ళు ....ఖుర్దారోడ్లో ఒరిస్సాలో
ఈ రోజు ఓ కొత్త కవిత మీకోసం .....ప్రేమతో జగతి
 

2 comments:

  1. chakkani bhaavana! prakruti purushudu ekamavadamante ide nemo


    avadhanula vijaya lakshmi

    ReplyDelete
  2. No words to express...only claps

    ReplyDelete