Saturday, May 28, 2011

ఇది జీవితం...ఇదా జీవితం?


ఇదా జీవితం అనుక్షణం ఆగని కన్నీటి ప్రవాహం ???


ఒక్క క్షణం అనంత దివ్య కుసుమాల దివ్య పరిమళం
మరుక్షణం మరుభూమిలో మండే మానవ శరీర దుర్గంధం 
మనసు పొరల్లో కదిలి రగిలించే అనుభూతులు 
కన్నీటి కెరటాల సుడి గుండాన ముంచి వేసే అపశృతులు
ఇదీ జీవితం! ఇదేనా జీవితం?

ఒక్క క్షణం....
హృదయంతరాళంలో
సుమం విరిసిన సౌరభం
హిమం కరిగి నర నరాల్లో ప్రవహించే అనుభవం
మరు క్షణం.....
అంతులేని ఆవేదనతో ఆర్తిగా సాగే అశక్త పోరాటం

మనసు మమత
ప్రేమ ద్వేషం 
అంతా ఉత్త దగా 
మోసం కుట్ర పన్నాగం
అర్ధంలేని వ్యర్ధపు ఆలోచనలు 
సాగించలేని అనవసరపు శోధనలు
సాధించలేని ఆర్భాటపు విజయాలు 
దారి తెలియని స్వర్గానికి సోపానాలు 
తీపి పూత పూసిన చేదు మాత్రల్లాంటి నిజాలు 
ఇదీ జీవితమేనా ?

అంబరపు అంచుల కెగసిన ఆనందం ఒక్క క్షణం 
మరు క్షణం అథఃపాతాళాన విసిరి వేయబడ్డ విషాదం 
నిస్సహాయత ....అంతర్మథనం 

మనసు విరిగితే అతికేందుకు ఏ ఎరాల్డైట్ దొరుకుతుంది బ్రదర్ !
దారం తెగితే ముడివేయ గలవే కానీ తిరిగి అతక లేవుగా?
తెగిన బంధాన్ని ముడి వేశానని నువ్వు సంబర పడినా 
ఆ 'ముడి' మాత్రం ఎప్పుడూ కనిపిస్తూనే ఉంటుంది 
నీ 'అశ క్తతని ' వెక్కిరిస్తూ 
ఇంకెందుకీ వ్యర్ధ ప్రయత్నం??

అందుకే నేస్తం! ఇలా ...ఇలా...
అనంతమై ఎగసి ఎగసి
అగాధమై వగచి వగచి 
నిర్వీర్యంగా నిస్తేజంగా
రగిలి ..పొగిలి
మిగిలిపోయి శుష్క హాసంతో ప్రశ్నిస్తూ
ఇదా జీవితం???

అవును ఇదే జీవితం
అనంతమైన అగాధం 
అనూహ్యమైన శూన్యం
ఊహకందని కన్నీటి చిత్రం 
ఇదీ జీవితం
అఫ్ కోర్సు ఇదే జీవితం
అనుభవించి తెలుసుకున్న 'చేదు నిజం' 

......................ప్రేమతో....జగతి 
అమాయకంగా హాయిగా చిన్న వయసులోనే ఎం.ఏ. ఆంగ్ల సాహిత్యం చదువుకుంటున్న, జీవితం పట్ల అవగాహన లేని ఓ అమ్మాయి బతుకు చదువు విజ్ఞత మంచి   మనసు కూడా లేని ఓ మూర్ఖుడికిచ్చి పెళ్లి చేస్తే ఆ అమ్మాయి వ్యధ ఈ వాక్యాలు. జీవితం లో జరగాల్సిన ప్రతి విషయము అసహజమైతే....ప్రతి క్షణమొక ఆశా నిపాతమైతే దశాబ్దం పాటు వెలుగు చూడకుండా గడిపిన ఓ పిచ్చి దాని ఆవేదన....'ప్రేమ'ను తప్ప మరేదీ పంచని ఓ వెర్రి  దాని రోదన ఇది నా జీవితం.తాను చేసిన తప్పుకి తన గాజు బొమ్మలాంటి కూతురి బతుకు కాలిపోయిందని అతి చిన్నవయసులోనే ప్రాణం విడిచిన ఓ కన్నతండ్రి బంగారు కూతురి కధ ....జీవితం ...అనుభవాలూ ..... ఎన్ని దెబ్బలు కొట్టినా మరింత రాటుదేలింది 'ప్రేమ'తో...హహహ్హ !!!





ఒక సంభాషణ ....ఒక నిర్ణయం

"అమ్మా!...ఏంటి కన్నా?"

ఆన్లయిన్లో రాగానే అయిదువందల కిలోమీటర్ల నుండి అమ్మాయి పలకరింపు...
"హాయ్ మా!"
"హాయ్ కన్నా!"
"నాకో సలహా కావాలి "
"చెప్పు"
"మనతో ఎప్పుడూ అబద్ధాలు చెప్పే మనిషిని మన జీవిత భాగ స్వామిగా భరించగలమా?"
"ఇంతకీ తను ఆడిన అబద్ధాలు ఎలాంటివో  తెలుసుకోవచ్చా?"
"అంటే అబద్ధాలలో రకాలున్టాయా?"
"యా ఉంటాయి సప్పోస్ ఉరికే నిన్ను ప్లీస్ చేయడానికి చిన్న చిన్న అబద్ధాలు చెప్పాడనుకో వాటిని నీకూ తెలుసుగా వైట్ లైస్ అంటారు అవి ప్రమాదకరమేమీ కావు"
"అదేమీ కాదు పెద్ద అబద్ధాలే, నాలుగేళ్ళనుండి పార్న్ సినిమాలు చూస్తూ కుడా ఎప్పుడు చూడలేదని చెప్పటం అబద్ధం కాదా?"
"హహ్హహ్హ "
"ఎందుకలా నవ్వుతావ్ నాకు కోపమోస్తోంది"
"అది పెద్ద అబద్ధం ఎందుకు అవుతుందిరా చాల మంది చూస్తారు అది నీకు నచ్చదని అలా చెప్పాడేమో?"
"ఆహా అంటే ఇది నీ దృష్టిలో పెద్ద అబద్ధం కాదు ఓకే , మరి తనకేదన్నా వేరే అఫైర్  ఉంది నాతో చెప్పకుండా తిరిగితే "
"మ్మ్మ్! ఇది కొంచం సీరియస్ విషయమే లే  కానీ నువ్వు ఒకర్ని కంట్రోల్ చేయగలం అనుకోవడం కొంచెం అసహజ మేమో ఆలోచించు...ప్రేమతోనే ప్రేమని సంపాదించుకోవాలి కానీ....."
"ఆపు తల్లీ నీ ప్రేమ థియరీ ఎప్పుడు చూసినా ప్రేమొక్కటే మార్గమంటావు...ఒళ్ళు మండుతుంది నిన్ను చుస్తే...."
"హహ్హహ చూడటం లేదు కదా మరెందుకు మండుతోంది...."
"జీవితంలో ఇన్ని దెబ్బలు తిన్నా ఇంకా ప్రేమ మీద నీకు నమ్మకం పోలేదంటే ...."
"బాగా దెబ్బలు తిన్నాకే ఇంకా ప్రేమ గట్టిపడింది..."
"ఊ సరే ఇంతకీ నేనడిగిన దానికి  తిరకాసుగా కాకుండా కరెక్ట్ గా చెప్పు సమాధానం, అలాంటి అబద్ధాలాడే వాళ్ళని క్షమించగలమా  అసలు?"
"అది వ్యక్తిగతం రా కన్నా ఎవరి నిర్ణయం వారు తీసుకోవాలి ఎన్నో అబద్ధాలు చెప్పినా నీ మీద  ప్రేమ ఉన్న వ్యక్తిని దూరం చేసుకోకూడదు కదా...."
"అంటే ....అతనాడే అబద్ధాలన్నీ ఆనందంగా భరించాలా?"
"అసలు తను అబద్ధాలేందుకు చెప్పాడు నువ్వు హార్ట్ అవకూడదని , అంటే అతనికి నీ మీద ప్రేమ ఉందనేగా అర్ధం, సో అన్నీ అబద్ధాలే చెప్తున్నాడనే  అపోహ నువ్వు ముందు నీ మైండ్ లోంచి తీసేయ్యాలి"
"ఆహా ఏమి తల్లి వమ్మా! మాతా నమో నమః అబద్ధాలకోరుని భరించమని బోడి సలహా ఇస్తున్నావా ? నాకు నీ అంత సహనం  ఓపిక లేవు తల్లీ !"
"ఇక్కడ ప్రశ్న సహనం ఓపిక కాదు అతని వైపునుండి కూడా ఆలోచించు అన్నా అంతే...."
"అంతే తమరు చెప్పేది నేను కూడా అప్పుడప్పుడూ హాపీగా అబద్దాలడుతూ వెధవ వేషాలన్నీ వేసేయ్యోచ్చా?"
"అలా అని నేను అన్నానా కానీ ఏదైనా విషయం రెండు వైపులనుండీ ఆలోచించకుండా నిర్ణయం మంచిది కాదు అంటున్నా"
"గుడ్ మమ్మీ ఒక అబద్ధాల కోరుని భరించమని ఎంత బాగా చెప్పేవు, ఎలా భరిస్తారో ....అసలూ"
"చెప్పానుగా అది వ్యక్తిగతమని, ఒక్కోసారి తెలిసినా భరించాల్సిన పరిస్థితి ఉంటుంది, ఉదహరణకి మనం ఆర్ధికంగా స్వతంత్రులం కాదనుకో ఎం చేస్తాం భరించక....ఇలాంటివి అందరికీ వస్తాయి సమస్యలు.."
"ఒక మనిషని ప్రేమించడమంటే అతనిలో ఉన్న మంచి గుణాలనూ బలహీనతలనూ కుడా ఆక్సెప్ట్ చెయ్యడం, బలవంతంగా కాకా మనస్పూర్తిగా , ప్రయత్నించి ప్రేమతో మార్చుకోలేని మనిషి ఉండడు అని నా నమ్మకం"
"నీకు తెలుసుగా రాణి పిన్నికి అబద్ధం అన్నది నోటి చివ్వర ఉంటుంది అవసరం లేకున్నా ఆడేస్తుంది, అది కొంత మందిలో ఒక పర్సనాలిటీ ట్రే యిట్  దాన్ని మనం మార్చడం కష్టం , అలాగని జీవితాంతం భరించాలని కాదు తను నిజం చెప్పినా తట్టుకోగలను అనే నమ్మకాన్ని ప్రేమని అతని లో కలిగించు , అబద్ధాలడాల్సిన అవసరం లేదని చెప్పు ప్రేమగా సుమా కోపంగా కాదు....ఆ తర్వాత చూడు ఎలాంటి వారిలోనైనా మార్పోస్తుంది....."
"అప్పటికీ మార్పు రాక పొతే ఏమి చెయ్యమని మీ సలహా మేడం ...."
"వదిలేయడమే మనిషినో అతని పై మమతనో లేక రెండూనో చెప్పలేము అది మళ్ళీ పెర్సనల్ విషయం..."
"అమ్మా! " అవతల ఏడుస్తోన్న శబ్దం 
"ఎందుకు ఏడుస్తున్నావో నాకు తెలుసు ...." అన్నాను నిదానంగా 
"నువ్వింతవరకు ప్రేమ అంటే అతని మీద  హక్కని భావించావు అందుకే అతన్ని ప్రేమతో మార్చాలని ప్రయత్నించలేదు, ఇలాంటి చిన్న విషయానికే కదిలి పోయి క్షమించలేను అనేంతవరకూ విషయాన్నీ తెచ్చుకున్నావు..నువ్వే కాదు నీ స్థానంలో ఎవ్వరున్నా నేనిదే చెప్తాను ప్రయత్నించు నీ వైపునుండి, ఇక అసాధ్యం అనుకుంటే అప్పుడు నిర్ణయం తీసుకో....ఒకటి గుర్తుంచుకో...నిర్ణయం తీసుకునే ముందే బాగా ఆలోచించు తీసుకున్నాక పశ్చాత్తాపం ఉండకూడదు..." స్థిరంగా పలికింది నా కంఠం..
"......ఉంటాను....నువ్వు చెప్పిందే ట్రై చేస్తాను..."
"మనస్పూర్తిగా చేసే ప్రయత్నం తప్పక విజయం సాధిస్తుంది , ఒక వేళ కాకుంటే ఒడి పోయానని అనుకోవద్దు, నీ నిర్ణయం నువ్వు తీసుకో .....అల్ ది బెస్ట్ గాడ్ బ్లెస్ యు మై చైల్డ్ ....!"
క్లిక్ మన్న నెట్  శబ్దం తో ఎక్కడో కదిలిన పేగు బంధం ఒక్క క్షణం ఉమ్మ నీరులా ఉబికి వచ్చి కళ్ళల్లో కన్నీళ్లు ....ఉప్పుటేరు ఉప్పెనగా ...... ఎంతైనా ఆడ మనసు కదా....మరి .....!!!

....................................ప్రేమతో....జగతి 1.15pm saturday 28-o5-2011










Thursday, May 26, 2011

నువ్వు , నేను , సముద్రం ....







నువ్వు, నేనూ, సముద్రం,....మరి చంద్రుడో....?
"నాకు సముద్రమంటే చాల ఇష్టం...అస్సలు పిచ్చి అనుకో.." అతనన్నాడు ఎదురుగా నురుగులు కక్కుతోన్న నీలి సంద్రాన్ని చూస్తూ పరవశంగా
"ఆహా అలాగేం అయితే ఆ సముద్రంతోనే ఉండు నే పోతా "..అల్లరిగా ఆమె 
"అలా ఆ నీలి కెరటాల్లోంచి ఆ లోతుల్లోకి నడిచి వెళ్లి పోవాలనిపిస్తుంది  నిజం ..." 
"స్వామీ మీరు అలా వెళ్ళండి నేనిలా లోకంలోకి వెళ్తాను , నా చెయ్యి వదలండి నాకింకా బోలెడు పనులున్నాయి " నవ్వింది 
"ధీరూ...ప్లీజ్ అలా అనకు నువ్వు లేకుండానా నేనిక్కడ....?" అతని గొంతులో ఏదో జీర పలికింది
"మరేమీ చేయను తమరు నాతొ గడుపుతానని వెన్నెల్లో సముద్రం చూద్దామని వచ్చానన్నారు కానీ సముద్రం నాకంటే ఎక్కువ గా మిమ్మల్ని ఆకట్టుకుందిగా కాసేపు పరవసించండి మరి"
"అంటే ఇప్పుడు నువ్వు నన్నొదిలి వెళ్ళిపోతావా ?" జాలిగా అన్నాడు అతని చూపులు  మాత్రం సాగరాన్ని వదిలి రావడం లేదు. ఆ నీలి అనంతం లో తనూ ఓ కెరటమై పోవాలని ఆ సాగరంలో కలసి పోవాలని అప్పుడప్పుడూ తేలి వచ్చి తీరాన్ని  పలకరించి మళ్ళీ  వెనెక్కి వెళ్లి పోవాలని ఏవేవో ఆలోచనలు ఊహలు ఆశలు కమ్మేస్తున్నాయి అతన్ని.
"ఎక్కడికి పోతాను బాలూ ! నిన్నిలా వదిలి ఇక్కడే వదిలేస్తే అమ్మో ఏ గంగ పుత్రితోనో సెటిల్ అయిపోవూ" గంభీరంగా అనబోయిన ఆమె గొంతులో ఏదో చిలిపితనం దాగలేదు
గాలికి ఒక్కసారి ఆమె తెల్లని సిల్క్ చీర కొంగు అతని ముఖాన్ని కప్పేసింది 
"అయ్యో నీకు నీ సంద్రానికీ మధ్య నా కొంగు అడ్డం ఎందుకులే స్వామీ...." అంటూ కొంగు తీసుకో  బోయింది
"ధీరూ! ఇలా రా నా పక్కన కూర్చో " ఆమె చెయ్యి పట్టుకుని తన పక్కనే కూర్చోబెట్టుకున్నాడు 
ఆతను అడగకుండానే  ఆమె వడిలో తల  పెట్టుకునేలా కాళ్ళు చాచి తన వొళ్లోకి లాక్కుంది అతన్ని...
"మ్మ్! ఇప్పుడు చెప్పమ్మా ఏంటీ బాలు గారి బాధ ? " అతని జుట్టు సవరిస్తూ లాలనగా అడిగింది
నిశ్శబ్దం.............చాల సేపు............ఇద్ద్దరూ మౌనంగా సంద్రం కెరటాల చప్పుడు వింటూ తమ  గుండె లయలతో  ఐక్యం చేస్తూ అలా ........పున్నమి చంద్రుడు ...మౌనంగా వెలుగుతున్నాడు 
"ధీరూ!..." నెమ్మదిగా పిల్చాడతను.. ".."ఊ...ఏంటి " మంద్ర స్వరంలో పలికింది ఆమె
"దీన్నే మంటారు ప్రేమేనంటావా?"
"ఎందుకు కాదు?"
"ఇద్దరం కలిసి ఉండేది ఈ కాసేపే కదా?"
"అవును ఆ కాస్సేపూ మరో ఆలోచన దేనికి?"
"అదికాదు..."
"ష్....సముద్రం చూడు నీతో ఏదో చెప్తోంది..గుండె రిక్కించి విను ...అలల సందే శాన్నిస్తోంది .." ప్రేమగా అతని  నుదుటి పై ముద్దిచ్చింది ఆమె.
"ఉహు నాకు వినిపించడం లేదు ...నీ  హృదయ లయే వినిపిస్తోంది " తీయగా మత్తుగా అన్నాడు.
"బాలూ...విను ఏదో అంటోంది ...." అతని తల నిమురుతూ అంది
"నువ్వూ, నేనూ, సముద్రం .....ఇంకేమీ అక్కరలేదనిపిస్తోంది....ఎంత దివ్య క్షణాలివి ధీరూ...!!"
"మరి వెన్నెలో, చంద్రుడో పాపం ఆయన్ని వదిలేసావెం...?" నవ్వింది 
తటాలున అతని మీదకి వంగి   అతని తలని గుండెకు హత్తుకుంది బలంగా
వెన్నెల సాగరం సాక్షిగా ఇద్దరూ అల్లుకు పోయారు....
"అబ్బ ఈ క్షణాలు శాస్వ తమైపోతే..".పలవరించాడతాను 
"అవ్వవు కూడదు కూడా ..." నవ్వింది 
"ఏమి ఎందుకని మనం కలిసే ఉంటె ఎందుకు కావు....?"
"ఎందుకు కలిసే ఉంటాము ఎలాగ కలిసే ఉంటాము ....అయినా ఎప్పుడూ కలిసే ఎందుకుండాలి ?"
"అబ్బో చలం ఊర్వశిలా నాకు ప్రేమ తత్త్వం బోధిస్తావా  ఏంటీ?" నవ్వాడు 
"లేదులే ....అవేవీ సాధ్యం కావు ఉన్న కొన్ని క్షణాలు , జీవితంలో దొరికే అపురూపమైన క్షణాలను గుండె అల్మరః లో భద్రంగా దాచేసు కోవాలి నీ ఫోటోల్లా..... నువ్వు తీసే ఫోటోలు చూడు ఆ క్షణాన్ని బంధిస్తాయి నీ కెమెరాలో అలాగే జీవితంలో కొన్ని మధుర క్షణాలను కూడా మన ఆర్కైవ్స్ లో ఉంచుకోవాలి మనకి మాత్రమే అవి సొంతం...అప్పుడప్పుడు క్లిక్ చేసి చూసుకుని ఆ అనుభూతిని మళ్ళీ అనుభవించి ఉత్తెజితమవ్వడానికి ...." 
"చాల మాటాడేసాను  కానీ పద వెళ్దాం...."...లేచి నుంచుంది 
ఆమె నడుం చుట్టూ చేతులు వేసి దగ్గరగా హత్తుకున్నాడు.
ఆమె స్పర్శలో వేడి లేదు ఆవేశం లేదు చాలా శాంతంగా ఉంది ఆమె కౌగిలి.
"నువ్వు రామ్మనక  పొతే  నేను నిన్నూ మిస్ అయ్యేవాడిని ...."
"నేను రమ్మందీ  సముద్రం అంటే నీకిష్టం కదా అని "....నవ్వింది
"అందుకేగా తమరు వచ్చింది కుడా "
"కాదు ....ముందు వచ్చింది సముద్రం కోసమే కనీ ఇప్పుడొచ్చింది నీ కోసం"
"నా కోసం కూడా అను "
"కాదు..కాదు ..." ఏదో చెప్పబోయాడు 
"అయిన సముద్రం నాకు పోటీ అయింది నీకు దాని పైనే ధ్యాసంతా...."
నవ్వాడు .....
"నేనో మాట చెప్పనా....నువ్వూ సముద్రమూ రెండూ వేరుగా అనిపించలేదు నాకు....నా కోసం ఈ దివ్య క్షణాలు ఉంటాయని ఊహించనే లేదు 
"సాగరం నుండి అలల అందియలు , దీరు నుండి ఈ వలపు సవ్వడులు గుండె నిండా నింపుకున్నా .....థాంక్ యు ..!"
" కొన్ని మన చేతుల్లో ఉండవు , మన తార్కికతకి  అందవు అందుకే వాటిని అనుభూతించాలి తప్ప విశ్లేషణ చెయ్యకూడదు...."
"ఆహా అలాగా! పంతులమ్మగారు మంచి పాటాలే చెప్పారు ...ధన్యవాదములు " ఆమె బుగ్గ పై ముద్దు పెట్టుకున్నాడు 
"మరే ప్రేమ రుచి మర్చిపోయిన మీ లాంటి వాళ్ళకి అప్పుడప్పుడూ ఇలా రేఫ్రేషేర్  కోర్సు ఒకటి పెట్టాలి మరి....లేకపోతే
అన్నీ మర్చిపోయి శిలాజాలై పోతారు ".....గలగలా నవ్వింది 
తనలో కలవడానికి గోదారి వచ్చిందా అని సాగరుడు ఒక్కసారి ఉలిక్కిపడి చూసాడు..
ఇద్దరూ చేయి చేయిగా సాగర తీరం నుండి మళ్ళీ జీవన సాగరంలోకి నడిచారు. ఇద్దరి వదనాలపైన ప్రేమ వెన్నెల వెలుగు మరకలు నిండుగా వెలుగుతూ......
......................................ప్రేమతో....జగతి 12.35pm thursday 








జ్ఞాపకాల అలలతో మళ్ళీ జీవన సాగరంలోకి ..........




Wednesday, May 25, 2011

అక్షరాంగి

ఆమె నా సహచరి 
నా మధు సఖి
నా ఉద్విగ్నతలకు , ఉద్వేగాలకు ఊతమిచ్చి 
నా ఊహలకు ఊపిరినద్దే
నా కళల సాకారం ఆమె

ఆమెది ఏక రూప సౌందర్యం కాదు
తాను బహురూపదారి
నవరసాల ఝారీకృత సుమనోహర లావణ్యం  ఆమెది 
భావానికొక భాష్యమై
భాష్యానికొక రూపమై
రూపానికొక తేజమై 
విరాజిల్లే విరాట్ స్వరూపిణి ఆమె

ఆమె నన్ను ఉత్తేజితుడిని చేస్తుంది
ఉత్ప్రేరక మౌతుంది 
జన్మాంతరాల నా సంస్కారానికి 
వ్యక్తానుభూతినిస్తుంది 

చైతన్య లహరి గా నన్ను ఉద్దీపించి 
రససిద్ధి శిఖరాల విజయ కేతనమౌతుంది 
నా మేధో మధనానికి
అద్వితీయ భావ ప్రాప్తినిస్తుంది

పేగు బంధమై ఆమె నన్ను లాలిస్తుంది 
స్నేహ పరిమళమై సేద తీరుస్తుంది
ఆప్యాయతల సందిట నను ఓదారుస్తుంది

ఓటమి -గెలుపుల జీవన క్రీడలో 
సమన్వయ సమగ్రతను 
సంప్రాప్తింప జేస్తుంది 

ఆమె దివ్య సాన్నిహిత్యంలో 
నేను మూడు కాలలనూ శ్వాసిస్తాను 
సకల చరాచరాలనూ ప్రేమిస్తాను
సర్వ సన్మంగళ  వచనాలను రచియిస్తాను 

ఆజన్మాంతాల మా ఆత్మీయత  
ఆద్యంతాలు లేని ఓ పార బౌతిక మార్మికత 

ఆమెతో సహజీవిస్తూ నేను 
సకల శాంతి  కామేష్టి యాగంలో 
త్రికరణ శుద్ధితో  సోమయాజినై
త్రికాల జ్ఞాన సర్వాన్నీపూర్ణాహుతి చేస్తాను 
ఆవిర్భవించిన సత్య , జ్ఞాన ఫలాలను 
సకల జనావళికి పంచి పెడతాను

ఆమెతో నా అనుబంధం ఈ జన్మది కాదు
అక్షరం ఆవిర్భవించిన నాడే 
మా రాగ బంధం పెనవేసుకుంది
అనాదిగా రూప క్రియాను సంధానంగా
పరిణమించి పటిష్టతను సంతరించుకుంది

అక్షర శిల్పిగా శాశ్వతత్వాన్ని 
నాకు ప్రసాదించే  ఆమె
సురభిళ, సుస్వర , సారస్వత సర్వానికీ
అక్షయ మూర్తి
అక్షర కాంతి
చిదానంద శాంతి

....ప్రేమతో జగతి 8pm 08-04-2008 మంగళవారం 








Tuesday, May 24, 2011

చల్లని నీ నవ్వు....

ఇన్నేళ్ళూ నువ్వెక్కడో హాయిగా ఉన్నావన్న
తలపు  గుండెలనిండా...
చల్లగా , పదిలంగా, సంతృప్తిగా....
నిన్ను గుర్తు చేసుకున్న ఊసుల్లో
"తల నిండా పూదండ దాల్చిన రాణీ" అని 
పాడుతూ నా వైపు ఆర్తిగా చుసిన నీ కన్నుల మెరుపులింకా
ఎదను చురుక్కుమనిపించేవి
ఎన్ని తిట్టినా ఎవరు తిట్టినా హాయిగా నవ్వేసే
పసిపాపలాంటి నీ నవ్వు నయిర్మల్యం 
తలచుకుంటే అయ్యో ఎంత బాధించానూ తనని 
అని నోచ్చుకునేది హృదయం

అలనాటి మన విశ్వవిద్యాలయ మిత్రమండలి 
అల్లరి కబుర్లు నే చెబుతుంటే విని 
ఫక్కుమనే నా పాప నవ్వులో 
నిన్ను చూసుకునేదాన్ని 

నిశ్శబ్దపు రెండు దశాబ్దాల తర్వాత
నన్ను చుసిన మరుక్షణం నీ కళ్ళలో
అదే తాజా తళుకు 
ఇప్పటికీ మదిలో....

హటాత్తుగా మొన్న ఉదయం....
మన ప్రసాద్ గాడు ఏడుస్తూ ....చెప్పిన 
నువ్వు మరి లేవన్న నిజాన్ని
నీ పాల నవ్వు ఇక కనబడదన్న వాస్తవాన్ని
ఆమోదించని హృది
కన్నీరు స్రవించడం కూడా మరచి
మ్రాన్పడిపోయింది..

ఎలా ఉన్నావని  మొన్న మొన్ననే గా 
నీ కన్నుల్లో  అనురాగంతో ఆత్మీయతను చిందిస్తూ పలకరించావు
నా చెయ్యి పట్టుకోవాలని ఉన్నా  
బలవంతాన అణుచుకుంటున్న  నీ మొహమాటం గమనించి
నేనే గా చేయి కలిపాను
కళ్ళతోనే కౌగిలించుకున్న నీ అనురాగ మాధుర్యం
ఇంకా .......ఎ మార్పూ లేని నీ చూపుల్లోంచి ...
ఇద్దరమూ బలవంతాన విడివడి...  
పెద్ద వాళ్ళ మయి  పోయాము అనుకుని నవ్వుకున్నాము 

ఇన్నేళ్ళకు కలిసామన్న ఆనందం 
ఇంకా మనసుని వెలిగిస్తూనే ఉంది 
ఇంతలోనే ....ఇదెందుకిలా..
మరి నిన్ను చూడలేనన్న 
వాస్తవం వెక్కిరిస్తోంది..
అలవి కాని నా ప్రేమ అసహాయంగా వెక్కి పడుతోంది 

నా కన్నీటి జడి నడుమ అదిగో..కనిపిస్తున్నావు నేస్తం!
అదిగో నీ చల్లని వెన్నెల నవ్వు
నిశ్సబ్దంగా వినిపిస్తోంది 
నువ్వు లేవన్నది నిజమేనేమో.....
నాకు మాత్రం
నేనున్నన్నాళ్ళూ
నా మది గదిలో ...
నువ్వూ, నీ పాటా...
నీ మాట నీ ప్రేమ భద్రంగా
అదిగో అల్లదిగో శ్రీహరి వాసమూ అని 
పాడే నీ పాటలా
ఇదిగో ఇల్లిదిగో మా మురళీ 
వెన్నెల దరహాసమని
నా ఊపిరి ఆగిపోయే దాకా
నీ జగత్ (అల పిలిచేవాడివి నువ్వొకడివే) అంతరంగంలో
మధుర స్మృతిగా....నేపధ్య సంగీతంలా....
మంద్ర స్వరంలో....
నిరంతరం సాగుతూ......

.............................ప్రేమతో...జగతి 11.25 am 9/5/08 friday

సుతిమెత్తని నెమలి పింఛమల్లె  మదిని గిలిగింతలు పెట్టిన నా ప్రియ నేస్తం "మురళి " ఈ జగతినే వీడి పోయాడని తెలిసిన రోజున కన్నీళ్ళతో........ఇలా పగిలి పొగిలి.....    
22 may మండే మొజాయిక్ కార్యక్రమంలో "తల నిండా పూదండ " దాశరధి గారి పాట బాట రామారావు గారి గళం లో విని మళ్ళీ గుండెలో ఘనీభవించిన దుఖ్ఖం .....పొంగి పొరలి ...మూగ పోయిన నా. ...మురళి కోసం....రాసుకున్నఈ చిన్ని జ్ఞాపకం.....ఇక్కడిలా ఉంచాను ....