Friday, April 20, 2018


అందమైన మరణం
అదొక చిత్ర విచిత్ర జగత్తు. అందు ఒక తారా నివహం. ఆ తళుక్కుమనే తారల సౌందర్యాలే మనకి ఆరాధ్యం. అలాంటి అందమైన ఒక తార శ్రీదేవి అందంగా రాలిపోయిన ఒక ప్రేమ నక్షత్రం. ముసలితనపు అడుగుల సడి ముంగిట వినీ వినబడక ముందే తామే ఎదురేగి మరీ మృత్యువు ఒడిలో ఒదిగిపోయిన అందమైన తారలు కొందరు. ఆనాటి కాలం లో మధుబాల, మార్లిన్ మన్రో వంటి వారు ఈ అందంగా ఉండాలన్న ఆకాంక్షతో , కాదు అత్యాశ తో తమ దేహాలను హింసించుకుంటే, వారికి మరో వారసురాలు శ్రీదేవి నేటి నిజం. ఏనోరెక్సియ (anorexia) ఒక భయంకరమైన మానసిక రోగం. ఎప్పుడూ అందంగానే కనబడాలనే తపన తో తిండి మానేయడం. శరీరాన్ని కొలతలతో బంధించి ఉంచాలనే తాపత్రయం. దీని పాలన బడిన వారిలో మరి కొందరు ఉన్నారు కరీనా కపూర్, నయన తార లాంటి వారు అయితే శృతి మించి రాగన పడుతున్న దశలో వారు జాగ్రత్త పడ్డారు. ప్రకృతి ఇచ్చిన దేహాన్ని సంరక్షించుకొనాలి నిజమే , కొంత మెరుగులు దిద్దుకోనూ వచ్చు , కాపాడుకోవాలనే ఆశ ఉండనూ వచ్చు అందుకు అసహజమైన శస్త్ర చికిత్సలు, మాత్రలూ ,మందులూ అవసరమా? ఆలోచించుకోవాల్సినదే కాదు అలాంటి భావన ఒక మానసిక వైకల్యమని గ్రహించాలి.
ముసలితనపు ముడుతలు పడిన మొహాలని ప్రజలకి చూపించo అని ఎంత బలంగా అనుకున్నారో కానీ అలాంటి హఠాత్తు అకాల మరణాలే పొందారు శోభన్ బాబు, శ్రీదేవి. ఇక దివ్యభారతి లాంటి యువతులు ఆత్మ హత్యలతో ఉసురులు తీసుకున్నారు , సౌందర్య లాంటి దివ్య సౌందర్యం అగ్నిపాలైంది. అంతటి రాశి పోసిన సౌందర్యం బొగ్గు ముక్క లా మిగిలితే గుండెలవిసిపోయాయి చూడడానికి.
ఉన్నది చాలక ఇంకా అందంగా కనబడాలనే , ఎల్లప్పటికీ సౌందర్య రాశి గానే మిగలాలనే తాపత్రయం శ్రీదేవిని 29 సార్లు కాస్మెటిక్ సర్జరీలు చేసుకునేలా చేసింది. అయితే దేహం పై ఇన్ని కోతలు పడుతుంటే , ఇన్ని మందుల  ప్రభావం పడుతుంటే గుండె అనేది ఒకటున్నదనీ వీటన్నిటి దుష్ప్రభావం ఆ ముఖ్యమైన అంగం పై పడితే గుండెకి రక్తపు సరఫరా ఆగిపోతుందని తెలుసుకోలేక పోవడం దురదృష్టమే కాదు అమాయకత్వం.
50 ఏళ్ల సినీ జీవితం ఏంటీ 54 యేళ్ళ మనిషికి ,ఔను కదూ నాలుగేళ్ల కన్నా ముందే చంటి పిల్లగానే సినీ జీవితం లో అడుగు పెట్టిన బాల కార్మికురాలు శ్రీదేవి. మంచి బాల నటిగా పేరు తెచ్చుకుని అనురాగాలు సినిమాలో ఆరంగేట్రం చేసి , పదహారేళ్ళ వయసుతో పదిహేనేళ్ళకే అందరి మనసుల్లోనూ స్థిర స్థానం సంపాదించేసుకుంది. హింది సినిమా రంగం లోకి అడుగుపెట్టబోతున్న తరుణం లోనే ఆమెకు అందాలను దిద్ది తీర్చుకోవాలనిపించినట్టుంది, ముక్కుకి ఆపరేషన్ చేయించుకుంది. అది మొదలు ఇప్పటి వరకు ముక్కు , మొహం, వక్షోజాలుకి , పెదాలకి ఇలా 29 కాస్మెటిక్ సర్జరీలు చేయించుకుంది. ఆఖరి క్షణం వరకూ అందంగానే మెరిసి ఒక్క సారి తెగి పడిన రిక్కలా మాయమైపోయింది అంతటి సౌందర్యం. పూల రెక్కలూ కొన్ని తేనె చుక్కలూ రంగరిస్తివో ఇలా బొమ్మ చేస్తివో అని ఆమె గురించి ఓ సినీరచయిత గేయం ఆమెకి సరిగా సరి పోయేట్టే ఉంది. పూల రెక్కలైనా తేనె చుక్కలైనా ఆ నిలువెత్తు అయిదడుగుల ఆరంగులాల శరీరం ఇప్పుడొక గుప్పెడు బూడిద అయిపోయింది.
ఆమె మరణ వార్త తెలియ గానే నాకు చండీదాస్ అనుక్షణికం లోని స్వప్న రాగలీన గుర్తొచ్చింది. నిజమే కదూ అమెదీ అలాంటి అందమే, అందమైన మరణమే. స్వప్న రాగలీనకి శ్రీదేవికి పోలికలు ఉన్నాయి అనిపించింది. స్వప్న రాగలీన  కూడా అలాగే అందంగానే, అకాలంగానే మరణిస్తుంది. చండీదాస్ మృత్యువుని ఎక్కువగా గ్లోరిఫై చేస్తాడు అన్నారు ఈ మధ్య ఒక రచయిత. కానీ మృత్యువు కూడా అస్తిత్వం లో భాగమే గా అది ఆకాలంగా వచ్చే అవకాశాలు ఎప్పుడూ ఉన్నాయి గా అని తలిస్తే కన్నీళ్ళ పర్యంతమౌతుంది. నిజానికి అంత అనంత సౌందర్య తాత్వికతనూ, సౌందర్య అంతాన్నీ అర్థం చేసుకున్నారు కనుకనే ఒక టాల్ స్టాయ్ , ఒక చండీ దాస్ లాంటివారు మరణాన్ని మర్యాదతో చిత్రించారా అనిపిస్తుంది.
ఆమె దేహ సౌందర్యం గురించి మాత్రమే మనకి అవసరం ఆమె కూడా అంతా వరకే మనకి దర్శింప జేసింది. ఆమె అంతరంగ సౌందర్యం, ఆమె అనతర్మధనం మనం ఎరగo. మన ఊహా గానాలే తప్ప ఆమె అంతర్గత జీవితం మనకి తెలియదు. ఎందరో ఇలాంటి వారు అందమైన తమ నవ్వుల వెనుక జీవితపు అగ్ని గోళాలను మరుగు పరుస్తారు. శ్రీదేవి గురించి విచారం కలగని వారెవరూ ఉండరు. అయితే ఆమె కేవలం ఒక నటి , తన జీవితం కోసం, జీవికగా నటనను స్వీకరించిన ఒక కళాకారిణి. అంతకు మించి ఆమె సమాజానికి చేసిన , సమాజం మరిచిపోలేని కార్యక్రమo ఏదీ లేదు. అద్భుతమైన కొన్ని పాత్రలకు జీవం పోసిన మంచి నటి.
ఆమె నటనలో ఒక ఈజ్ ఉండేది. నటన లా అనిపించకుండా సహజంగానే ఆమె తత్వమే అంత అనిపించేది. అందుకే అమెను మరిచి పోవడం కష్టం, మరువరానిది కూడా. చిరస్మరణీయంగా మన అందరి హృదయాల్లో నిలిచి వెలిగే కార్తీక దీపం శ్రీదేవి. వ్యక్తిగతమైన జీవితం ఎలాంటిది అయినప్పటికీ అది ఆమె నటనా జీవితాన్ని ఎక్కడా ఆటంక పరచనివ్వలేదు. ఆ విధంగా కూడా ఆమె పెద్ద నటి. మహానటి అని , ఆమెకి దాదాభాయి ఫాల్కె అవార్డ్, భారత రత్న ఇవ్వాలని అనడం మాత్రం కొంత అతిశయోక్తిగానే భావిస్తాను నేను. ఎవరిని ఎంతవరకు వారికి సమాజం లో స్థానం ఇవ్వాలో కొంచం ఉద్విగ్న పూరితమైన మన తెలుగు వారికి తెలియదనే చెప్పాలి. ఆమె పేరిట ఏదైనా పురస్కారాన్ని స్థాపించి ఇవ్వవచ్చును ఇస్తారనే అనుకుంటున్నాను.
అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాడు ఒక అపూర్వ కళాకారిణిని గురించి ఇలా నివాళి రాయాల్సి వస్తోన్నందుకు మనసంతా చేదుగా ఉంది. అనివార్యం మరణమే కాదు ధు:ఖం కూడా కదా.
ఏది ఏమైనా ఒక అందమైన నక్షత్రం మృత్యు కృష్ణ బిలం లోకి హఠాత్తుగా రాలిపోయిందన్నది కాదనలేని సత్యం.
శ్రీదేవి ఒక అందమైన విషాదం , ఒక అకాల అందమైన మరణం!!!  1/3/2018 గురువారం 2.1 పి. ఏం .