Saturday, January 12, 2013

ఏ రాగమో ....???




ఉదాశీనత ఊదా దుప్పటి  కప్పుకుని 
నిశ్శబ్దం  తలదిండులోకి తల  దూర్చి 
నిద్ర పోదామని వెర్రి ప్రయత్నమొకటి  చేస్తానా  
ఉహు  కలత నిదుర కూడా కరుణ చూపదే 

నీ మాటలు  నాకోసం మాత్రమే నీవు ఆలపించే గీతం 
మనమధ్య  తెలీకనే జారిపోయిన మోమాటపు యవనిక 
మాటల మాటునుండి కలిసిన మనసుల భావాలు 
గుండెనెవరో తడిమి చేతుల్లోకి తీసుకున్నట్టు 
మౌన ప్రసారాలలో మనః ప్రాకారాలను చుట్టేస్తోన్న  
 నీ  ప్రాణ వీణా నాదం ...

ఎన్నో మైళ్ల దూరం లో నీవున్నా 
నా  చెక్కిలి పై నీ కన్నీటి స్వర స్పర్శ 
అభిజాత్యాలని అహంకారాలని వదిలేసి 
నీవు పలికే సరాగాల సరస రాగాలు 
ఇలా వేళకాని వేళలో ...
ఈ  నిశ్శబ్దపు నిశీధిలో నను కనురెప్ప వేయనీయవు 

ఏ  క్షణాన్నైనా నీవు మోగించే తంత్రీ నాదం 
నిను వినలేక పోతానేమో నన్న భయం 
నీవల్లిన పదాల పాదాలను స్పృశించాలని 
అను క్షణం ఎదురు చూస్తూ 
ఎంత రాత్రైనా ...ప్రదోష వేళ నైనా 
ఒక్క సారి నీ గళ  మాధుర్యం లో తరించనిదే 
ఊపిరి తీస్తోన్నా ప్రాణం లేనట్టు 
మనసులేని మనిక లో తప్పక బతుకుతూ 

కొన  ఊపిరి వరకూ నీ కోసం ....
నిరీక్షిస్తూ ....
నీ మాట వినని నాడు ...
ఉదాసీనత దుప్పటి కప్పుకుని 
నిశ్శబ్దం తలదిండులోనికి 
నిరాశా నిస్పృహలను  వొంపు కుంటూ 
నిద్రా శూన్యత లో ...కొనగోటి మీటుకై వేచే 
బతుకు వీణ తీగెలను శృతి చేసుకుంటూ 
నీవోచ్చే వేళకి అపస్వరాలను పలకనీయకుండా 
ఉంచాలని విశ్వ ప్రయత్నం చేస్తూ ...

అనంత శూన్యం లోకి చేతులు చాచి ..
చిక్కని చీకటి లోనికి చూపులు నిలిపి ..
నీ కోసం ...నిరంతరం ..
నీకూ నాకూ నడుమ కనురెప్ప కూడా 
అడ్డం పడకూడదని రెప్ప గాస్తూ ...
 కాల గమనం లో చలించని గమకాన్నై  ..
.... .నీకోసమే !!!

.............................................................ప్రేమతో .... జగతి 3.19am Saturday 12th january 2013 





No comments:

Post a Comment