తాము రాసిన ప్రతి అక్షరం చాలా గొప్ప అనుకుంటున్నఎందరో రచయితలకు చాసో నిజంగానే ఒక స్ఫూర్తి. ఇక ఈ పురస్కారం వెనుక గల సాహితీ కారులు కొంతమంది ప్రజల మనసులలో నిలిచిపోయే మానవీయ కోణాన్ని ఆవిష్కరించే కధకులకి ఈ పురస్కరాన్నివ్వడం జరుగుతోందని , అంతే కానీ దేనికి మీ కధల సంపుటులు పంపండి అని ఏమీ రూల్ లేదని చెప్పడం చాల ముదావహంగా ఉంది. ఒక సత్యమైన సాహితీ కారుని లేదా కళా కారునికి గుర్తింపును మించిన ఏ పురస్కారము అక్కర్లేదు. అతని అక్షరాలు శాశ్వతంగా నిలవడమే అతనికి అన్నిటికీ మించిన వరం, పురస్కారం. అయితే కొన్ని పురస్కారాలు రచయితకి గుర్తింపు తీసుకోస్తూనే మరింత సామాజిక బాధ్యతను కూడా పెంచుతాయి. అలాంటి స్ఫూర్తి కలిగించడం లో ఈ పురస్కారం కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డ్ ను అతి పిన్న వయసులోనే అందుకున్నసలీం వంటి రచయితలను కూడా వరించింది. తెలుగు సాహిత్య లోకంలో తల మానికంగా నిలిచిన ఈ పురస్కారం పొందాల్సిన రచయిత లో ముందు ఉండాల్సిన అతి ముఖ్యమైన లక్షణాలు , మానవీయత, సహజత్వం, సామాజిక బాధ్యత, తనదైన విశిష్ట శైలి. ఇవన్నీ కలిగిన కధకులకు మాత్రమే ఈ పురస్కారం లభిస్తుంది.
ఈ లక్షణాలన్నీ పుష్కలంగా కలిగిన రచయిత జగన్నాధ శర్మ. శర్మ గారు ఫ్లైట్లో కూర్చుని పేద వారి జీవితం గూర్చి కధ లల్లరు , నిజ జీవితం లో అతి పేదరికం నుండి వచ్చి , ఆ పేదరికపు ముళ్ళనుండి ఈనాడు ఒక పత్రికా సంపాదకుడిగా ఎదిగినప్పటికీ ప్రతి క్షణం తన మూలాలు మరవని రచయిత శర్మ. జీవితం లో ఎన్నో అనుభవాలను చేదు శాతం ఎక్కువగా ఉన్న వాటిని చవి చూస్తూ , దుఖాల్ని దిగమింగు కుంటూ తనకున్న ఒకే ఒక ఆయుధం , ఆలంబనా అక్షరం మాత్రమే అని మనస్పూర్తిగా నమ్మే ఆత్మ గౌరవమున్న మనిషి శర్మ. అందుకే అతని కధల్లో చాసో పురస్కారానికే కాదు సకల సాహితీ మానవ లోకాన్ని కదిలించగల వాస్తవాలున్నాయి. జీవితాన్ని అక్షరీకరించడం మాటల తో పని కానే కాదు. అందుకు ముందుగా ఉండాల్సిన ఆత్మ స్థైర్యం, ఆత్మ పరిశీలనా , అభివ్యక్తి ఇవన్నీ ఉంటే నే గానీ ఒక కధ రాసి మెప్పించాలేము , పాఠకుల హృదయాలలో నిలవలేము. సార్వజనీనత ఉండని కధలు కాని సాహిత్యం కానీ ఎక్కువ కాలం నిలవదన్నది మనమందరమూ ఎరిగిన సత్యం.
ఈనాటి కధకుడు తను ఏ భాష వాడైనా, ఏ ప్రాంతపు వాడైనా రాసేది సకల మానవ హృదయ సంక్షోభం , విశ్వ సత్యాలు అయినప్పుడు అవి ఎన్నటికైనా నిలుస్తాయి. కేవలం నాలుగు పుంజీలు కధలు మాత్రమే రాసిన చాసో కొన్ని తరాలకు స్ఫూర్తినివ్వగల రచయిత గా మిగిలాడంటే అది అతని నిజాయితీ గల అక్షరం లోని బలం.
ఇటీవలే విడుదలైన జగన్నాధ శర్మ కధల సంపుటి "పేగు కాలిన వాసన" లో ని కధలు ఇటువంటి జీవిత సత్యాలనే అవిష్కరించేవి. పరిస్థితుల కాఠిన్యాన్ని పంటి బిగువున భరిస్తూ జీవన సమరం సాగించే మనషుల కధలు ఇవి. జీవితాన్ని బైస్కోప్ లాగా కాక మైక్రోస్కోప్ లోంచి దాని కణ కణాన్ని చవి చూసి అనుభూతించి రాసిన కధలివి. ఈ సంపుటిలోని "రెక్క తెగి పడిన పావురం" అనే కధ చదివినప్పుడు ఎటువంటి పాఠకుడికైనా ఏదో తెలియని ఆవేదన కడుపులో మెలి పెడుతుంది. ఆ ఆవేదన పేరే ఆకలి. బ్రహ్మ రాక్షసి లాంటి ఈ ఆకలిని మనిషికిచ్చి బ్రతకమని శాసిస్తుంది జీవితంపై మమకారం. ఈ రెంటి వేదనల మధ్య తాను ఎలా మసలు కుంటాడో మనిషిగా నిలబడతాదనేది ప్రతి మనిషికీ ఒక అగ్ని పరీక్ష.
అయితే ఇందులో గెలుపు ఓటముల ప్రసక్తి లేదు. సమాజం స్థాపించిన ఈ కుహనా విలువలు మనిషిని ఎందుకు కట్టి పడేస్తాయో , ఎందుకు మనిషి పరువూ, మర్యాద అనే మాస్కులు వేసుకుంటాడో , ఈ సంఘంలో అన్నది ప్రశ్న. అన్నిటికీ మించి సహజాతమైన ఆకలి, నిద్ర, కామం , ఈ మూడింటిలోనూ మనిషి ఎలా ప్రవర్తిస్తాడనేది ముఖ్యం. ఎప్పుడు ఆత్మను చంపుకోవాల్సి వస్తుంది బ్రతకడానికి ఎలా ఒక స్త్రీ తన భర్త చేత స్వయంగా తన ఆడతనాన్ని మరొక పురుషుడికి వెలకిచ్చి బతుకు బండి నడపడానికి ఎలా తోడ్పడుతుంది అన్నది ఈకధలోని సారంశం.
1945 లోనే స్వాతంత్ర్యం రాని కాలం లోనే "ఢ౦కా" మాస పత్రికలో చాసో రాసిన "లేడీ కరుణాకరం " కధ. ఈ రెండు కధలూ ఎందుకు చెప్తున్నాను అంటే వీటిలోని సారూప్యత కోసం ఒక చిన్నపాటి పరిశీలన మీ దృష్టికి తీసుకు వద్దామని నా ఉద్దేశం. ముందుగా రెండు కధల్లోని సారూప్యాతలే౦టో చెపుతాను. ఒకటి, రెండు కధల్లోనూ పెళ్ళైన స్త్రీ తన భర్త కోసం వ్యభిచరించడం అదీ భర్తకి తెలిసి ఉండగా. నిస్సహాయుడైన ఆ భర్త పరిస్థితి. ఇక కధన రీతి లో కి వెళితే చాసో నిర్మొహమాటంగా ఆరు దశాబ్దాల క్రితమే ఆవిష్కరించిన జీవన నగ్న సత్యాన్ని 1988 లో శర్మ తన కధ లో ఆర్ద్రతతో ఆవిష్కరించారు. ఎన్ని కబుర్లు చెప్పినా ఆకలి మనిషికి తప్పదు. అలాగే కామం మనిషిని లొంగదీస్తుంది . ఇది మనం ఒప్పుకున్నా లేకున్నా ప్రపంచ౦లోని ఎందరో కధకులు రాసిన సజీవ చిత్రాల్లాంటి కధలు నిరూపించాయి.
ప్రఖ్యాత మనోవిజ్ఞాన శాస్త్రజ్ఞుడు అబ్రహాం మాస్లో తన థియరీ ఆఫ్ నీడ్స్ లో ఒక కోను రూపంలో ప్రస్తావించాడు.ముందుగా మనిషికి కావలసినవి మానవ సహజాతాలు అయిన ఆకలి , నిద్ర, కామం, ఇవి తీరిన తర్వాతే మనిషి మానసిక మైన అవసరాలను గూర్చి ఆలోచిస్తాడు. అందులో గుర్తింపు, కీర్తి, ధనం, పదవులూ, ఇక చివరిగా తనని తని తెలుసుకునే ప్రయత్నాన్ని ఆత్మ సిద్ధికి గా ప్రస్పుటీకరిస్తాడు మాస్లో. ఏ మనిషి ఇందుకు భిన్నంగా ప్రవర్తించడం మనం చూడలేము. ఇక ఈ రెండు కధల మధ్యన దాదాపు 28 సంవత్సరాల దూరం ఉనప్పటికీ అదే జీవన సత్యాన్ని ఆవిష్కరించడంలో శర్మగారు క్రుతక్రుత్యులయారు. ఆకలి , పేదరికం మనిషిని ఆత్మాభిమానాన్ని చంపుకుని మానాన్ని అమ్ముకునే విధంగా ఎలా తాయారు చేస్తుందో నిజానికి చాసో చాల కఠోర౦గా ఆవిష్కరించారు. శర్మ కధలో కొంత ఆర్ద్రత ఉన్నప్పటికీ జరిగే విషయం మాత్రం ఒకటే. అక్కడ "లేడీ కరుణాకరం" లో ని కరుణాకరం, శారద అయినా, ఇక్కడ "రెక్క తెగి పడిన పావురం లోని వనజాక్షి , శంకర౦ అయినా ఒకే లాంటి పరిస్థితి ఒకే లాంటి పరిష్కార౦.
"అనేక విషయాలలో సమాధానాలు పడుతూ ఉంటేనే జీవితం ఎవరికైనా గడుస్తుంది" అని సరి పెట్టుకుంటాడు కరుణాకరం తనకి పుట్టని తన ఆరుగురు పిల్లల్నీ చూస్తూ. ఇది మనిషిని కలిచి వేసే నిష్టూరమైన నిజం. అలాగే శర్మగారి కధలో మేడ పైన రామకృష్ణ వనజాక్షి పై ఆశ పడుతున్నాడని తెలిసీ చూసి చూడనట్టు ఉరుకుంటాడు శంకరం. చివరికి ఇక శంకరం అమ్మ మరణం తో అక్కడికి వెళ్ళాల్సి రావడానికి చేతిలో చిల్లిగవ్వ లేదు, ఇక రామక్రిష్ణని ఆశ్రయించక తప్పని పరిస్థితిలో పైన ఏమి జరుగుతుందో తెలిసీ ఆమెను అక్కడికి పంపి తను బయటికి వెళతాడు ఈ మగడు. అయితే రామకృష్ణ ఏమీ దాన కర్ణుడు కాదు ఉత్తినే ఐదు వందలు సమర్పించడానికి , వాళ్ళు ఆ డబ్బు తిరిగి ఇవ్వలేరనీ తెలుసు అతనికి. ఇక్కడ వనజాక్షి దేహంతో బేరం పెడతాడు .లొంగక తప్పని తనం తో వనజాక్షి రామకృష్ణ బేరానికి ఒప్పుకుంటుంది.
చాసో కధలో మొట్ట మొదటి సారి తన భార్య వేరెవరితోనో ఉండడం చూసి మండిపడిన కరుణాకరం మగతనం మామగారి మాటలతో అవాక్కైపోతుంది. నీ చదువుకి డబ్బులు ఇవన్నీ ఇలా వచ్చినవే అని చెప్పిన మామగారి మాటలు విన్నా ఇకనైనా వద్దని భార్యని తీసుకుని వేరే ఉద్యోగం వెతుక్కుని సంసారం చేస్తుంటాడు కరుణాకరం ఒక చలీ చాలని జీతం తో, అసంతృప్తి జీవితం తో. అక్కడికి కూడా శారద కోసం నాయుడు రావడాన్ని అభ్యంతర పరచగా శారద అప్పుడు అతన్ని అడిగిన కఠోర మైన సత్యాలముందు, తను సంపాదించినా డబ్బులు చుపిస్తోంటే ,భవిష్యత్తు బంగారం చేసుకో మని హితబోధ చేస్తుంటే ఇదంతా నీ కోసమే మన కోసమే చేసానని చెప్తోంటే మరి కరుణాకరం లోని మగ వాడు లేవడు, కేవలం స్వార్ధపరుడు మాత్రమే బ్రతుకుతాడు. అందుకే ఆ డబ్బు తోనే చదువుకుని పెద్ద బాంక్ ఆఫీసరై చివరికి "సర్" అనే బిరుదు ఆ రోజుల్లో ఒక గొప్ప పురుషునికిచ్చే బిరుదును సొంతం చేసుకుంటాడు, దానితో శారద కాస్తా లేడీ కరుణాకరం అవుతుంది. ఈ కధ ఆఖరి వాక్యం "శారద మహా పతివ్రత" అంటూ ముగిస్తాడు చాసో. భర్త కోసం పరాయి వారితో బిడ్డల్ని కన్న కుంతి లాంటి వాళ్ళు పతివ్రతలితే మరి శారద మాత్రం కదూ? ఖచ్చితంగా అవుననాలి మనసున్న ఏ మనిషైనా.
శర్మ కధలో రామకృష్ణ తో వెళ్తే అతను కడుపు నిండా తిండీ నిద్రా ఇస్తానన్నాడు అని అక్కసుగా చెప్తే అయితే మరి ఉన్నది ఒక్క సూట్ కేసు కదా మా బట్టలేక్కడ పెట్టుకోవాలి అన్న శంకరాన్ని అసహ్యంతో నువు మనిషి పుట్టుక పుట్టలేదూ అని చీత్కరిస్తుంది వనజాక్షి. అప్పుడు శంకరం .."మనిషిగా పుట్టాను కనుకనే , అందునా మధ్య తరగతి మనిషిగా పుట్టాను కనుకనే ఎన్ని దేబ్బలైనా ఓర్చుకునే మనస్తత్వాన్ని కలిగి ఉన్నాను. నువ్వు చెప్పిచ్చుకు కొట్టినా నేను బాధ పదను." అంటూ తననిలా తాయారు చేసింది తన కుటుంబ వ్యవస్థ అనీ పేడ వంటి ఈ సమాజం లో తనని నిస్సహాయంగా జరవిదిచారని అందులో పురుగులా తప్ప జీవించడం కష్టమని ఎటువంటి సమాధానమూ భార్య ప్రశ్నకు ఇవ్వడు శంకరం. ఆ క్షణంలో అతనిలోని బతుకు భయాన్ని చూసి ఒక్కసారి అతన్ని అల్లుకు పోతూ పిచ్చిగా అంటుంది నేనూ లేకుంటే నువ్వెలా బతుకుతవయ్యా అంటూ పసి పిల్లాడ్ని అక్కున చేర్చుకున్న తల్లిలా పెనవేసుకుపోతుంది. మరి వనజాక్షి పతివ్రత కాదూ?
ఈ కధ చివరి వాక్యం "టికెట్ డబ్బులు పైన ఓ పది రూపాయలు మాత్రమే జేబులో ఉంచండి. మిగిలినవిటిచ్చేయండి. సూట్కేస్ లో దాచేద్దాం " అంటుంది. చివరి మాట "దాచేద్దాం " లోనే మనమిద్దరం ఒకటి ఏమి చేసినా సరే కలిసి బతుకుదాం అనే నిశ్చయం కనిపిస్తుంది పాఠకుడి హృదయాన్ని తడిమి కన్నీరు పెట్టిస్తుంది.
అటు చాసో కధలో కానీ ఇటు శర్మ కధలో కానీ పేదరికం మనిషిని ఎంత బలహీనుడ్ని చేస్తుందో కధకులు బలంగా ప్రతిపాదించారు. అయితే కరుణాకరం తానో చిన్న ఉద్యోగాస్తుడిగా బ్రతికేయగల అవకాశమున్నా తెలివి తేటలు గల కరుణాకరం బతుకు కేవలమొక చాలీ చాలని గుమస్తా గిరితో అపెయాలనుకోడు . అతని అంతరంగం కనిపెట్టింది కనుకనే శారద కరుణాకరానికి నిజం నిర్భయంగా చెప్పి మరీ తన సంపాదన్లోంచి తీసి డబ్బులు ఇచ్చి చదివిస్తుంది అతన్ని చివరికి సర్ బిరుదు కి అర్హుడని చేస్తుంది. అక్కడ కరుణాకరం అయితే నేను రేపటినుండీ లేడీ కరుణాకరాన్ని అన్నమాట అని సంబర పడుతున్న సరాదని చూస్తూ "ఎస్ మై డార్లింగ్" అంటాడు ఇక్కడ శంకరం మేడ మీంచి దిగి వచ్చి తన చేతికి ఐదువందల రూపాయలిచ్చిన వనజాక్షి మొహంలోకి చూడలేక "థాంక్స్ ఏ లాట్" అంటాడు. ఎంత దయనీయమైన హేయ మైన పరిస్థితి ఇది అని మనం సానుభూతి చూపాలా లేక ఎందరు కనబడని శారదలూ , వనజాక్షులూ ఉన్నారో నని గుండెలు చేమర్చాలా మనకి. మారని మధ్య తరగతి మానవుని హేయమైన పరిస్థితికి ఇంకా వ్యవస్థను నిందించాలా?
ఒక ప్రాంతం , ఒక భాష అని పరిమితం కాకుంటే ఈ పేదరికపు కధలెన్ని ప్రాంతాల్లో లేవు కనుక. ప్రతి చోటా అవి సాహిత్యం లో చోటు చేసుకుంటూనే ఉన్నాయి. ఇరవైయ్యవ శతాబ్దం మానవుని కేంద్రంగా మానవ వేదనా. చేతన, ఆనందం, అన్ని రకాలైన కోణాలలో ఆవిష్కరించింది అందులో మన తెలుగు కధకులు చాసో , జగన్నాధ శర్మ మాత్రమే కాక ఇంకా ఎందరో ఉన్నారు. సందర్భం వచ్చింది కనుక m వీరిరువురి గురించి మాత్రమే మాటాడుకుంటున్నాము . భమిడి పాటి రామగోపాలం కధ "మనోధర్మం" లో కూడా ఇటువంటి మానవ బలహీనతలు అవిష్కరిమ్పబడ్డాయి. ఇక రావి శాస్త్రి కధల గూర్చి చెప్పనే అక్కర్లేదు. ఇటీవలే మరణించిన అస్సామీ రచయిత్రి ఇందిరా గోస్వామి తన "ఖాళీ శవపేటిక" లో ఇంతకన్నా దారుణమైన పేదరికాన్ని వాస్తవ జీవన చిత్రీకరణ చేసింది. చివరికి చలికి ఆకలికి తట్టుకోలేని ఓ పేద తల్లి శ్మశానం నుండి శవాన్ని తీసేసి పడేసిన ఒక శవ పేటికను తెచ్చుకుని వెచ్చగా పడుకోవడానికి ప్రయత్నించడం , ఆ కధ చదివితే గుండె కలచి వేస్తుంది .
వేరే భాషల కధలు చాలా విరివిగా ఆంగ్లం లోకి వెళ్ళడం వల్ల ఎక్కువగా అందరికీ తెలుస్తున్నాయి అదే అంతకంటే ఎక్కువ సాంద్రత గలిగిన కధలు మన కధకులు ఎంత గొప్పగా రాసినా సజీవంగా రాసినా ప్రపంచ పాఠకులకి అందడం లేదు. అందుకు జగన్నాధ శర్మ కధ గానీ , చాసో కధలు కానీ అన్ని భాషల్లోకి ముఖ్యంగా ఆంగ్లం లోకి( కొన్ని వెళ్ళే వుంటాయి) , తప్పక వెళ్లి తీరాలి. మానవ సజీవ చిత్రణ మా కధకులూ చేస్తున్నారు అని ఆత్మ గౌరవంతో తెలుగు వారు చెప్పుకునే లాంటి ఓ రోజు రావాలి. పొరుగు కన్నడ రాష్ట్రం వరకు వచ్చిన ఎస్.ఎల్.భైరప్పకి వచ్చిన "సరస్వతీ సమ్మాన్" మన తెలుగు కధకుల్ని కూడా వరించాలి అంతే కాక తెలుగు వారు చాలా ఏళ్లుగా పొందని జ్ఞానపీటం మళ్ళీ మన తెలుగు సాహిత్య పుష్పాలతో అలంకరించాలి. చాసో , శర్మ , భరాగో, రఘోత్తమ రెడ్డి, సినారె, గురజాడ . సలీం, ఖాదిర్ బాబు. కుప్పిలి పద్మ ఇలా ఎందరెందరో మన తెలుగు రచయితలు అన్నా భావన మనలో మిగిలున్నన్నాళ్ళూ మనం సాహిత్యానికి ఏమి చేయగలమో ఆ సేవ చేయాలి అని భావిస్తూ ....చాసో స్ఫూర్తి పురస్కారాన్ని పొంది మరింత బాధ్యతను ప్రపంచ కధకుడిగా తన భుజాల పైన మోయ సిద్దుడైన జగన్నాధ శర్మ గారిని మనసారా అభినందిస్తోంది సాహితీ జగతి.
.............................. ...................జగద్ధాత్రి
మార్చ్ నెల ప్రస్థానం లో ప్రచురితమైన వ్యాసం.... |
No comments:
Post a Comment