Tuesday, May 24, 2011

చల్లని నీ నవ్వు....

ఇన్నేళ్ళూ నువ్వెక్కడో హాయిగా ఉన్నావన్న
తలపు  గుండెలనిండా...
చల్లగా , పదిలంగా, సంతృప్తిగా....
నిన్ను గుర్తు చేసుకున్న ఊసుల్లో
"తల నిండా పూదండ దాల్చిన రాణీ" అని 
పాడుతూ నా వైపు ఆర్తిగా చుసిన నీ కన్నుల మెరుపులింకా
ఎదను చురుక్కుమనిపించేవి
ఎన్ని తిట్టినా ఎవరు తిట్టినా హాయిగా నవ్వేసే
పసిపాపలాంటి నీ నవ్వు నయిర్మల్యం 
తలచుకుంటే అయ్యో ఎంత బాధించానూ తనని 
అని నోచ్చుకునేది హృదయం

అలనాటి మన విశ్వవిద్యాలయ మిత్రమండలి 
అల్లరి కబుర్లు నే చెబుతుంటే విని 
ఫక్కుమనే నా పాప నవ్వులో 
నిన్ను చూసుకునేదాన్ని 

నిశ్శబ్దపు రెండు దశాబ్దాల తర్వాత
నన్ను చుసిన మరుక్షణం నీ కళ్ళలో
అదే తాజా తళుకు 
ఇప్పటికీ మదిలో....

హటాత్తుగా మొన్న ఉదయం....
మన ప్రసాద్ గాడు ఏడుస్తూ ....చెప్పిన 
నువ్వు మరి లేవన్న నిజాన్ని
నీ పాల నవ్వు ఇక కనబడదన్న వాస్తవాన్ని
ఆమోదించని హృది
కన్నీరు స్రవించడం కూడా మరచి
మ్రాన్పడిపోయింది..

ఎలా ఉన్నావని  మొన్న మొన్ననే గా 
నీ కన్నుల్లో  అనురాగంతో ఆత్మీయతను చిందిస్తూ పలకరించావు
నా చెయ్యి పట్టుకోవాలని ఉన్నా  
బలవంతాన అణుచుకుంటున్న  నీ మొహమాటం గమనించి
నేనే గా చేయి కలిపాను
కళ్ళతోనే కౌగిలించుకున్న నీ అనురాగ మాధుర్యం
ఇంకా .......ఎ మార్పూ లేని నీ చూపుల్లోంచి ...
ఇద్దరమూ బలవంతాన విడివడి...  
పెద్ద వాళ్ళ మయి  పోయాము అనుకుని నవ్వుకున్నాము 

ఇన్నేళ్ళకు కలిసామన్న ఆనందం 
ఇంకా మనసుని వెలిగిస్తూనే ఉంది 
ఇంతలోనే ....ఇదెందుకిలా..
మరి నిన్ను చూడలేనన్న 
వాస్తవం వెక్కిరిస్తోంది..
అలవి కాని నా ప్రేమ అసహాయంగా వెక్కి పడుతోంది 

నా కన్నీటి జడి నడుమ అదిగో..కనిపిస్తున్నావు నేస్తం!
అదిగో నీ చల్లని వెన్నెల నవ్వు
నిశ్సబ్దంగా వినిపిస్తోంది 
నువ్వు లేవన్నది నిజమేనేమో.....
నాకు మాత్రం
నేనున్నన్నాళ్ళూ
నా మది గదిలో ...
నువ్వూ, నీ పాటా...
నీ మాట నీ ప్రేమ భద్రంగా
అదిగో అల్లదిగో శ్రీహరి వాసమూ అని 
పాడే నీ పాటలా
ఇదిగో ఇల్లిదిగో మా మురళీ 
వెన్నెల దరహాసమని
నా ఊపిరి ఆగిపోయే దాకా
నీ జగత్ (అల పిలిచేవాడివి నువ్వొకడివే) అంతరంగంలో
మధుర స్మృతిగా....నేపధ్య సంగీతంలా....
మంద్ర స్వరంలో....
నిరంతరం సాగుతూ......

.............................ప్రేమతో...జగతి 11.25 am 9/5/08 friday

సుతిమెత్తని నెమలి పింఛమల్లె  మదిని గిలిగింతలు పెట్టిన నా ప్రియ నేస్తం "మురళి " ఈ జగతినే వీడి పోయాడని తెలిసిన రోజున కన్నీళ్ళతో........ఇలా పగిలి పొగిలి.....    
22 may మండే మొజాయిక్ కార్యక్రమంలో "తల నిండా పూదండ " దాశరధి గారి పాట బాట రామారావు గారి గళం లో విని మళ్ళీ గుండెలో ఘనీభవించిన దుఖ్ఖం .....పొంగి పొరలి ...మూగ పోయిన నా. ...మురళి కోసం....రాసుకున్నఈ చిన్ని జ్ఞాపకం.....ఇక్కడిలా ఉంచాను ....

1 comment:

  1. మురళి గారు ఎప్పుడూ మీ ఆలోచనలలో మీ వ్రాతల ద్వారా మా హృదయాలలో కూడా కలలాకం నిలిచే ఉంటారు ధాత్రి గారూ.
    కళ్ళతోనే కౌగిలించుకున్న నీ అనురాగ మాధుర్యం ఇది ఎంతో అద్భుతమయిన భావన!

    ReplyDelete