Saturday, November 19, 2011

ఫోన్ కాల్

మెత్తగా రాలిన
పొగడపూల పరిమళం లా
సున్నితత్వానికి ప్రతీకల
నిశ్సబ్దంగా రాలే  పారిజాతాల్లా
తెలవారు ఝామున
కార్తీక మాసం లో ని పున్నాగ పూలలా
కొన్ని మంచి తియ్యని
మాటలు .....
ఒక అందమైన వాక్యం
ఓ అర్ద్రమైన కవిత 
ఎంత లాలిస్తుందీ హృదిని
మాటలు తేనెల మూటలంటే
ఇదేనేమో....
మాటాడిన వాటికంటే
మాటాడని మాటలే
ఎంతో విలువైనవి కదూ
ప్రియతమా  ......
కలిసి న ప్రతిసారీ
ఒకరిలోకొకరు
ఒలికి పోవాలని
ఊసు లెన్నో చెప్పేసుకోవాలని
ఎన్ని సార్లో....
ఎంతగా అనుకుంటామో
కంప్యూటర్ యంత్రం పై
మౌనంగా వేళ్ళు
అక్షరాలను మీటి నపుడు
ఎంతగా తెలిసి పోతామో
ఒకరికొకరం
కానీ ఒక్కసారి నీ గొంతు వినగానే
నేను....
నా గొంతు వినగానే నీవు
స్తబ్దులమై..
నిశ్శబ్దాలమై
కాలం నిముషాలు గా కదిలి పోతున్నా
ఎందుకో ఏ మాటా
మాటాడుకోలేక
మౌనించిన హృదయాలతో
మాటలు కరువై
నిట్టూర్పుల  నిస్తేజమై
మిగిలి పోతాము
ఎన్నో చెప్పాలనుకుని
పేలవంగా రెండు
మాటలు మాటాడుకుని
ఏమీ కానీ వారిలా
అటు నువ్వు ఇటు నేను
ఉంటాను అంటూ
పెట్టేస్తాము ఫోన్
ఒకరి వేదన మరొకరు
దీపం కింద చీకటి లా
మనల్ని మనం దాచేసుకుని
నేనేం  చెప్తే తను ఏం  బాధ పడుతుందో నని నువ్వు
నేనేం చెప్పేసి  తనని కష్ట పెట్టేస్తానో అని నేను
ఇద్దరం అరకొర నవ్వుల 
అర్ధం లేని మాటలతో
కాల్ గా  మనకి అందిన  కాలాన్ని
కావాలనే కట్ చేసేస్తాము
ఇదంతా ఏంటో ఎందుకో
మనిద్దరికీ తెలుసు
ఒకరికొకరం ఆనందంగా
అగుపడాలనే తాపత్రయం
తప్ప ఎన్నని మాటలతో
చెప్పగలం చెప్పు
ఏ నెట్వర్క్  అయినా
మన మనసుల్ని అందుకోగలదా
మన మనసుల్లోని మాటలెలా
చెప్తామో నని ఎదురు చూసి చూసి
సెల్ ఫోన్ విసిగి వేసారి పోతుంది
దానికేమి తెలుసు
గతి తప్పిన  మన మనసు గతి....
....................................................ప్రేమతో ...జగతి 12.38am 19-11-2011 saturday (friday night)


(ఈ రోజు మనసు కదిలించిన ఆర్ద్రతతో నింపిన కవి యాకుబ్ సార్ గారి కవిత "మాటలాడని మాటలు " చదివాక)













Friday, November 11, 2011

నీ కోసం పాణం నిలుపుకుంటూ.....
నా   కిట్టయ్యా  !!
                     ఏమి ఎరగని ఎర్రి మనసిది ముప్పుతిప్పలు పెట్టుతాది .....సెంతగా నీలోన నిలవాలని ఇంత ఇంతగా మసులుతాది....ఏందీ పల్లెటూరి పిల్లనని ఇట్టా రాస్తున్నానని  ఏటకారమ్మ అయ్యోరికి....ఏమి సేస్తాములే మాకింతకన్నఎమోస్తది రాయిననికి ....అయినా ఏయ్ కిట్టయ్యా....ఎక్కడోనివి నువ్వు మరి నేనేక్కిడా.....అయినా నన్నే ఎతుక్కుంటా నాకోసమోచ్చినావ్ గదా....అయ్యో ! ఎంత బాధ పడినవ్ ..నాకోసమెంత కలవరించినవో కదా ....ఎన్ని జనమలై పాయె ఇక నువ్వు రావని , అసలు   లేవనీ  అసుమంటి వెర్రాసలు  వద్దనీ ఎంతమంది సేప్పినారానీ....అయినా నల్లయ్యా నువ్వు ఏనాటికైనా వస్తావని ఈ పిచ్చి దాన్ని ఏలుకుంటా వని  ఊహ ఎరిగిన కాడ్నించీ నా లోంచి ఏదో సేపుతూనే ఉంది....అందుకే కిట్టాట్టమి అదేలే నువ్వారోజే పుట్టినవంటగా ,  నాడు గుడికి  పోయి  మన  పూజారయ్యను అందరు ఎల్లిపోయినంకా నెమ్మది గా  అడిగినా....
ఎట్టా నవ్విం డో  సామి పండు ఎన్నెల్లా.....ఎందుకే నీ కట్టా అనిపించింది అని అడిగినాడు నా తల మీద సెయ్యేసి నిమురుతూ....పండు సెందు రంటి మన పూజారయ్య  నే  పుట్టినప్పటి  నుండీ  ఎరుగుదు ....(అసలీ ఉత్తరంముక్క రాస్తున్నాడు ఆ అయ్యే) అది నీకు  తెల్వదా ఏమి  ...


మా అమ్మ అయ్యా నే పుట్టగానే అడిగితే నాకు రాద అని పేరేట్టినా డాంటా  ఈ అయ్యే...
నాలుగు అచ్చరాలు   నేర్చుకోయే  అనీవోడు ...అట్టనే  నేరుస్తానన్నా ..పొంగి పోయి పలక తెప్పించిండు....
ఏదో ఓ నమ రాస్తుండు ...నేనాపినా ...ఒయయ్యోయ్ నాకు నాలుగు అచ్చరాలు   సాలు అన్నా....
కళ్ళింత సేసి సూసిండు ...అదేంటే అన్నాడు ...అవునయ్యా నాకు నా కిట్టయ్యా పేరు రాయడమొస్తే సాలన్నా...


పకపకా నవ్విండు ....డబ్బాపండల్లె పచ్చగా ఉంటాడేమో  ఎర్రగై పాయిండు కుంకుమల్లె .....ఎందుకయ్యా నవ్వుతుండావ్ ?
అడిగింది మా యమ్మ అరదం కాక ....నవ్వి నవ్వి అలసి పాయి అప్పుడన్నడు "సూడు సుక్కమ్మ నీ కూతురు కిట్టయ్యా పేరు తప్ప నేర్వదట" అన్నాడు
"ఎవరు సామీ కిట్టయ్యా అంటే ?" అడిగింది అమ్మ
"నా కిట్టయ్యా నాకు అయ్యోరికి తెలుసులే..నీకెందుకు " అన్నా ఉక్రోషంగా అయ్యోరి  నవ్వుకి రోశామోచ్చిన్దిలే . ..మరీ    
"అట్టాగే లే అంటూ నీకు నచ్చిందే సేపుతాదులే అయ్యోరు " అంటూ పొలం లోకేల్లిపోనాది అమ్మ. మా అయ్యకు నా ద్యాసే పట్టదు...నేను నీ కాడ ఉంటె అంతా నువ్వే సూసుకుంటావని.....
ఎవరే అమ్మీ నీ కిట్టయ్యా అని అడిగాడో మారు
ఏమి సెప్పను వస్తాడయ్య సూస్తావుగా అన్నా.....అట్నే వచ్చినావు కదా .....మా అయ్యోరు నన్ను నీకే అప్పజేప్పిండు
ఇక దీని భారమంతా నీదేనయ్యో కిట్టయ్యా అని .....ఎంత  దయ నీకు నా మీద "అట్టాగే నయ్యా నా కంటి పాపల్లె కాసుకుంటా " నన్నావ్ ....నిజం సేప్పకేమీ ఇప్పటికీ ఆ మాట తలిస్తే కండ్లు సెరువులవుతాయి .....

నీది పెద్ద ఉద్దోగేమని అయ్యోరు సెప్పిండు....అయినా నాకేంటి నువ్వు నా కిట్టయ్యవు అంతే .....
నువ్వెళ్ళి నెల అయింది వచ్చేస్తావ్ అని ఏరోజుకారోజు ఎదురు సూస్తూ ఈ గుడి కాడే ఉన్నా రెప్ప కాస్తూ....
"నిదరపాయే అమ్మీ వస్తాడు లే కిట్టు బాబు" అంటడు అయ్య ...

కిట్టయ్యా నా కిట్టయ్యా ! వచ్చేస్తావ్ గదూ....రేపు అమాస పోను ఎల్లుండి పాడ్యమి నాటి కైనా నీ  జాడ అగుపడితే సాలు ...
వచ్చేస్తావ్ లే అదిగో తొలి కోడి కూసింది ఈ య్యాల అమాస దాటి పాడ్యమి.....
సాయంకాలానికి నీ జాడ అగుపడుద్దని సెప్పిండు పూజరయ్య....
మరొక్క పది రోజులోపిక పడితే నువ్వో చ్చేస్తావని  సెప్పిండు...నేనెవ్వరి మాట నమ్మను నా పూజరయ్య మాట .....నా కిట్టయ్యా ప్రేమ ...అదే నమ్ముతా.....

అయ్యో పూజ అయ్యి అలసి పాయిండు పూజరయ్య ఇక ఆపేస్తలే...ఎన్నెన్ని రాసియ్యగలడు..పాపం...నీ పేరు మాత్రం నేనే   రాస్తాలే ఒక సారా వందసార్లా....ఏమో నువ్వోచ్చేదాకా ఎన్నెన్ని ఏల కోట్ల సార్లో....రాసుకుంటా ..ఉండనా మరి .....
నువ్వోచ్చే పాటికి  నీకోసమే పాణం నిలుపుకుంటూ ....నీ ఎర్రమ్మి నీ రాద ...

..........................................................................1.01am 11/11/2011..Friday

హటాత్తుగా నువ్వే నా ప్రాణం   అంటూ  ఆత్మ  చొచ్చుకు  వచ్చిన  నా కృష్ణుడికి ...ప్రేమతో ....జగతి


Thursday, November 10, 2011

నా "నీకు"

నా "నీ" కు !
          
ఈ రోజు కార్తీక పౌర్ణమి గుర్తుందా  నీకు? అయితే  ఏంటటా? అని క్వెస్చన్ మార్క్  మొహం పెట్టకండి . కోపమొస్తుంది. ఇది గో నీకు కూడా కోపమోస్తుందా అంటారేమో రాదా మరి...మనం చాలా సార్లు పున్నములు సముద్రం ఒడ్డున ఎలా  గడిపామో మరిచి పోయారా? ఈ రోజు మీరు ఉంటె  ఖచ్చితంగా బీచ్ కి వెళ్ళే వాళ్ళం. చల్లని వెన్నెల్లో మీరు నా ఒడి లో పడుకుని కవిత్వం చదువుతుంటే అబ్బ ! ఎంత హాయి ....అసలీ జగతి కి ప్రపంచం పై న స్పృహ ఎక్కడిదీ....నీ రసావిష్కరణంలో మునిగి నిండుగా ఆ మట్టునే ఆ ఆనందపు టంచు ల లోనే  నా ఊపిరి ఆగి అలాగే ఆనందంలో నేను నేనుగా లేకుండా పోయే ఆ దివ్య  క్షణాలు...మళ్ళీ ఎప్పుడో  ఎన్నాళ్ళకు కుదురుతుందో మళ్ళీ. ఎన్ని పౌర్నములైనా నా కెందుకో కార్తీక పౌర్ణమి మార్గశిర పౌర్ణమి చాల ఇష్టం.నీకు తెలీదని కాదు...చలిలో పిచ్చి వాళ్ళలా మనం చంద్రోదయం చూస్తూ కనీసం ఉన్ని దుస్తులేవీ వేసుకోకుండా ఉన్న మనల్ని చూసి కొందరు నవ్వుకుంటే ...ఒకసారి గుర్తుందా ...నువ్వు  నా వొళ్ళో పడుకుని ఉంటే పోలీసు వాడొక ఆఫీసర్ వచ్చి ఏంటండీ ఎవరు మీరు? అంటూ గద్దించాడు . నువ్వు నీ ఐడెంటిటి చూపించాక పాపం కొద్దిగా భయంతో కాస్త లేచి కూర్చోండి సర్...అసలే ఈ చోట మొన్న ఒక హత్య జరిగింది అందువల్ల ఏ జంట కనిపించినా జాగ్రత్తగా గమనించమని మాకు ఆర్డర్స్ అన్నాడు. 

నిజమే కదూ అనిపించింది నాకు . నువ్వేమో ఊరుకోకుండా అల్లరి గా నేనూ అదే పని మీద ఈవిడని తేచ్చానండీ అంటూ ఆటపట్టించడం...అసలు నిన్నూ....ఏమి చేసినా  పాపం లేదు అని నేను తిడుతుంటే
నవ్వుకుంటూ వెళ్లి పోయాడా ఆఫీసర్. అయినా ఆ అల్లరేంటి ? మరీ చంటి పిల్లాడిలా తన్నాలనిపిస్తుంది 
అంత గంభీరంగా  ఉండే  నీలో ఇంత ఆల్లరి పిల్లాడు  దాగున్నాడని ఎవరికీ తెలుసు. అందరికీ చెప్తానంటే 
ఎంత కొంటెగా  అంటావ్ "ఇద మరీ బాగుంది ఎప్పుడూ ధుమ ధుమ లాడుతూ  ఉండాలా ఏంటి  సీరియస్ కవి అంటే? వాడికీ ఓ ప్రేయసి ఓ ఆనందం ఉండవా ఏంటీ , ఓయ్ అమ్మాయీ ?"అంటూ కొంగు పట్టుకు లాగటం చూసి...ఆ స్టూడెంట్ కుర్రాళ్ళు ఎలా వెక్కిరించారు "అంకుల్ మహా జోరు మీదున్నాడ్రోయ్"..అంటూ 

వాళ్ళకేమి తెలుసు ! ఎన్నేళ్ళ తర్వాత ఈ అరుదైన క్షణాలు లభించాయో మనకి ....చిన్న పిల్లలు అనుకుని నవ్వేసుకుననము ఇద్దరం. అసలు విషయం అడుగుదామనే మరిచి పోయాను ...తమరు మళ్ళీ పౌర్ణమి అనగా మార్గశిర పున్నమి కైనా వచ్చ్చేస్తారా ? నిన్న పత్రిక ఆఫీసుకి పోయి మనం  ఇవ్వాల్సిన  రచనలు ఇచ్చేసి వస్తుంటే తెన్నేటి పార్క్ లో  మనం   కూర్చునే   బెంచీ  దిగులుగా  చూసింది   నా వైపు .....
ఇంతకు ముందు పాతగా ఉన్న పార్క్ ఇప్పుడు చాలా బాగు చేసారు కానీ ఎందుకో  అప్పుడు మనం వెళ్ళిన ఆపాత మాధుర్యమేదో  లేనట్టనిపించింది....విచిత్రమేంటంటే మన పిచ్చి బెంచీ మాత్రం మనకోసం ఉంచేసారు అలాగే కొంచం  రంగు  వేసారులే ..ఎన్టీ అయ్యగారేమన్న లంచమిచ్చి ఆ బెంచీ ని పదిలంగా ఉంచారా ఏంటీ....ఏమో చేసినా చేస్తావ్ ...మీ ఆఫీసులో మనం తొలిసారిగా ..!!!..ఆ సోఫాని కొనేసి తేచ్చేయ్యలేదు ఆఫీసు ఆక్షన్లో ..ఛీ పో
అని విసుక్కుంటాను కానీ నాకూ ఇష్టమే ...
అయినా నీ వన్నీ ఇలాంటి పనులే .....ఏంటో నా రాత...మీరు తో  మొదలెడతా నువ్వు అంటూ రాస్తా.....అయినా మరీ ప్రేమేక్కువైతే ఎవరైనా నువ్వు అంటారు కానీ నేనేంటో మరి ముద్దేక్కువైతే  మీరు అంటా....


వెళ్ళిన పని అయ్యిపోయిందీ వచ్చేస్తానన్నావ్  అని ఎదురు చూసా ... ఇంతలో నీ కాల్ ..బయల్దేరి పోయానని  చెప్తా వనుకున్నా  ఇంకా అప్పుడే  కాదూ  అంటే ఏడు పోచ్చేసింది. ఏమో బాబూ నువ్వు నేను లేకుండా ఎప్పుడూ వెళ్లడం అలవాటు లేదేమో ఏంటో గా  ఉంది ....దిగులుగా ఉంది.   


కానీ నీ బాధ్యతలు తప్పవుగా అందుకే వెళ్ళాల్సి వచ్చిందని ...అక్కడి కి నేను రాలేను కనుకే  నువ్వు నన్నొదిలి వెళ్ళావని తెలుసు .......అయినా కాల్ మాటాడి నంత  సేపూ అన్నం తిన్నావా ? మందులేసుకున్నావా? ఈ ప్రశ్నావళి  ఏంట్రా ...ఏదన్న చెప్పొచ్చుగా .....నువ్వు లేకుండా అన్నం సమంగా తినని  నీకు తెలుసు , మందులు వేసుకోనని  నీకు తెలుసు అయినా ఎందుకంత ఆత్రం ? 


నిన్న సూరి గాడోచ్చాడు...మా  అన్నగాడు  కదా  పాపం  కొంచం అన్నం వండి   పెట్టాడు ...ఇలాగైతే  చస్తావే అని రెండు , ఆహా   కాదు  ఐదు  తిట్లు  తిట్టాడు  .....దగ్గర  కూర్చుని  నేను రెండు ముద్దలు  మింగాక అప్పుడు వెళ్ళాడు ....వాడు తినలేదు ....విశాల వచ్చేయ్యమందిట .....పాప అల్లుడు వచ్చేయ్యమన్నారట ....తప్పదు రా అన్నాడు ....సరే  అన్నా.....ఇదంతా రాస్తున్నా గానీ నీకు చూపిస్తానా అమ్మో ...తిట్టవూ....అందుకే బుద్ధిగా 
ఉన్నాను అని చెప్పేస్తా అయినా నా బుద్ది నీకు తెలియదా....
 పాప రేపు సాయంకాలం ఫ్లయిట్ కెగా వెళ్ళేది ...నువ్వు ఎల్లుండి బయల్దేరడం అవుతుందా బహుశా మరో నలుగు రోజులన్న లేకుంటే బాగోదేమో....
నిజమేలే  బాబు , తను ఒంటరి గా ఫీల్ అవుతారు కదా .....
నాకేమీ   ఫర్వాలేదులే  లే .....ఒంటరి తనం అలవాటేగా ....కాస్త మౌనం వీడి ఏదో పుస్తకం పట్టుకుని కూర్చోకుండా మాటలాడండి.....
నీ కోసం అన గౌరీ బెంగెట్టుకుంది...మా అయ్యగారు ఎప్పుడోస్తారంటూ ...మరి  నీ ఫ్రెండ్ కదా .....హహహహః
నా నవ్వులోని దిగులు నీ హృదికి తెలుసు అని నాకూ తెలుసు ...నువ్వూ నన్ను వదిలి ఉండలేవు అయినా జీవితం....లో ..కొన్ని ముఖ్యమైన పనులున్టాయిగా.......నా గురించి దిగులు పడకు అనను దిగులు పడు బాగా .........................

ఎప్పుడెప్పుడోస్తావా  అని ఎదురు చూస్తూ............... ప్రేమతో ....నీ ....."నేను"   3.55pm thursday 10/11/2011