Friday, November 11, 2011

నీ కోసం పాణం నిలుపుకుంటూ.....
నా   కిట్టయ్యా  !!
                     ఏమి ఎరగని ఎర్రి మనసిది ముప్పుతిప్పలు పెట్టుతాది .....సెంతగా నీలోన నిలవాలని ఇంత ఇంతగా మసులుతాది....ఏందీ పల్లెటూరి పిల్లనని ఇట్టా రాస్తున్నానని  ఏటకారమ్మ అయ్యోరికి....ఏమి సేస్తాములే మాకింతకన్నఎమోస్తది రాయిననికి ....అయినా ఏయ్ కిట్టయ్యా....ఎక్కడోనివి నువ్వు మరి నేనేక్కిడా.....అయినా నన్నే ఎతుక్కుంటా నాకోసమోచ్చినావ్ గదా....అయ్యో ! ఎంత బాధ పడినవ్ ..నాకోసమెంత కలవరించినవో కదా ....ఎన్ని జనమలై పాయె ఇక నువ్వు రావని , అసలు   లేవనీ  అసుమంటి వెర్రాసలు  వద్దనీ ఎంతమంది సేప్పినారానీ....అయినా నల్లయ్యా నువ్వు ఏనాటికైనా వస్తావని ఈ పిచ్చి దాన్ని ఏలుకుంటా వని  ఊహ ఎరిగిన కాడ్నించీ నా లోంచి ఏదో సేపుతూనే ఉంది....అందుకే కిట్టాట్టమి అదేలే నువ్వారోజే పుట్టినవంటగా ,  నాడు గుడికి  పోయి  మన  పూజారయ్యను అందరు ఎల్లిపోయినంకా నెమ్మది గా  అడిగినా....
ఎట్టా నవ్విం డో  సామి పండు ఎన్నెల్లా.....ఎందుకే నీ కట్టా అనిపించింది అని అడిగినాడు నా తల మీద సెయ్యేసి నిమురుతూ....పండు సెందు రంటి మన పూజారయ్య  నే  పుట్టినప్పటి  నుండీ  ఎరుగుదు ....(అసలీ ఉత్తరంముక్క రాస్తున్నాడు ఆ అయ్యే) అది నీకు  తెల్వదా ఏమి  ...


మా అమ్మ అయ్యా నే పుట్టగానే అడిగితే నాకు రాద అని పేరేట్టినా డాంటా  ఈ అయ్యే...
నాలుగు అచ్చరాలు   నేర్చుకోయే  అనీవోడు ...అట్టనే  నేరుస్తానన్నా ..పొంగి పోయి పలక తెప్పించిండు....
ఏదో ఓ నమ రాస్తుండు ...నేనాపినా ...ఒయయ్యోయ్ నాకు నాలుగు అచ్చరాలు   సాలు అన్నా....
కళ్ళింత సేసి సూసిండు ...అదేంటే అన్నాడు ...అవునయ్యా నాకు నా కిట్టయ్యా పేరు రాయడమొస్తే సాలన్నా...


పకపకా నవ్విండు ....డబ్బాపండల్లె పచ్చగా ఉంటాడేమో  ఎర్రగై పాయిండు కుంకుమల్లె .....ఎందుకయ్యా నవ్వుతుండావ్ ?
అడిగింది మా యమ్మ అరదం కాక ....నవ్వి నవ్వి అలసి పాయి అప్పుడన్నడు "సూడు సుక్కమ్మ నీ కూతురు కిట్టయ్యా పేరు తప్ప నేర్వదట" అన్నాడు
"ఎవరు సామీ కిట్టయ్యా అంటే ?" అడిగింది అమ్మ
"నా కిట్టయ్యా నాకు అయ్యోరికి తెలుసులే..నీకెందుకు " అన్నా ఉక్రోషంగా అయ్యోరి  నవ్వుకి రోశామోచ్చిన్దిలే . ..మరీ    
"అట్టాగే లే అంటూ నీకు నచ్చిందే సేపుతాదులే అయ్యోరు " అంటూ పొలం లోకేల్లిపోనాది అమ్మ. మా అయ్యకు నా ద్యాసే పట్టదు...నేను నీ కాడ ఉంటె అంతా నువ్వే సూసుకుంటావని.....
ఎవరే అమ్మీ నీ కిట్టయ్యా అని అడిగాడో మారు
ఏమి సెప్పను వస్తాడయ్య సూస్తావుగా అన్నా.....అట్నే వచ్చినావు కదా .....మా అయ్యోరు నన్ను నీకే అప్పజేప్పిండు
ఇక దీని భారమంతా నీదేనయ్యో కిట్టయ్యా అని .....ఎంత  దయ నీకు నా మీద "అట్టాగే నయ్యా నా కంటి పాపల్లె కాసుకుంటా " నన్నావ్ ....నిజం సేప్పకేమీ ఇప్పటికీ ఆ మాట తలిస్తే కండ్లు సెరువులవుతాయి .....

నీది పెద్ద ఉద్దోగేమని అయ్యోరు సెప్పిండు....అయినా నాకేంటి నువ్వు నా కిట్టయ్యవు అంతే .....
నువ్వెళ్ళి నెల అయింది వచ్చేస్తావ్ అని ఏరోజుకారోజు ఎదురు సూస్తూ ఈ గుడి కాడే ఉన్నా రెప్ప కాస్తూ....
"నిదరపాయే అమ్మీ వస్తాడు లే కిట్టు బాబు" అంటడు అయ్య ...

కిట్టయ్యా నా కిట్టయ్యా ! వచ్చేస్తావ్ గదూ....రేపు అమాస పోను ఎల్లుండి పాడ్యమి నాటి కైనా నీ  జాడ అగుపడితే సాలు ...
వచ్చేస్తావ్ లే అదిగో తొలి కోడి కూసింది ఈ య్యాల అమాస దాటి పాడ్యమి.....
సాయంకాలానికి నీ జాడ అగుపడుద్దని సెప్పిండు పూజరయ్య....
మరొక్క పది రోజులోపిక పడితే నువ్వో చ్చేస్తావని  సెప్పిండు...నేనెవ్వరి మాట నమ్మను నా పూజరయ్య మాట .....నా కిట్టయ్యా ప్రేమ ...అదే నమ్ముతా.....

అయ్యో పూజ అయ్యి అలసి పాయిండు పూజరయ్య ఇక ఆపేస్తలే...ఎన్నెన్ని రాసియ్యగలడు..పాపం...నీ పేరు మాత్రం నేనే   రాస్తాలే ఒక సారా వందసార్లా....ఏమో నువ్వోచ్చేదాకా ఎన్నెన్ని ఏల కోట్ల సార్లో....రాసుకుంటా ..ఉండనా మరి .....
నువ్వోచ్చే పాటికి  నీకోసమే పాణం నిలుపుకుంటూ ....నీ ఎర్రమ్మి నీ రాద ...

..........................................................................1.01am 11/11/2011..Friday

హటాత్తుగా నువ్వే నా ప్రాణం   అంటూ  ఆత్మ  చొచ్చుకు  వచ్చిన  నా కృష్ణుడికి ...ప్రేమతో ....జగతి


1 comment:

  1. touched every raw bit of love :-) this is one of ur best mam :-)

    ReplyDelete