Saturday, December 3, 2011

పున్నాగ పూలు .......

పున్నాగ పూలు .......

శీతల కార్తీకంలో 
మంచుల  మార్గశిరంలో నూ
మనసు నిండి పోయే 
పున్నాగ పూల పరిమళం
ఎక్కడెక్కడి నుండో 
నన్నల్లుకుంటుంది..
నడుస్తూ నడుస్తూ ఆగి
రాలిన పున్నాగలను
ఏరు కుందామని 
నా మనో పూల సజ్జనిండా 
నింపు కుందామని ఎంతో ఆశ
ఎన్నని ఏరను
ఊహ తెలిసిన నాటినుండీ
విజయనగరం పార్కుల పక్కన 
నాన్నతో నడిచినప్పటి 
జ్ఞాపకాల పున్నాగలు
డచ్  బంగ్లా మీదుగా
విశ్వ విద్యాలయానికి 
వెళ్తూ ఉన్నప్పటి మత్తు గొలిపే
తీయని స్నేహ  పరిమళాలు 
ఎంతో ఎత్తునుండి కవ్విస్తూ ఉన్నా.....
ఎంత జాలిగా  నా ముందర 
వాలుతాయో........
నాలు గు పదుల ముళ్ళ  వసంతాలలో
ఎక్కడో కొన్ని  దాచుకోవడానికి 
మిగిలిన అందమైన 
శిశిరాలు...ఈ పున్నాగపూలు
శిశిరం రుతువుల ముగింపా
కాదు కాదు మరో వసంతానికి ఆహ్వానం
అని మృదువుగా తమ స్పర్శతో
విలక్షణ పరిమళంతో 
విరిసి మురిపించే పున్నాగలు
బతుకు రుతువులో రాలి పోయిన 
మిత్రుని నవ్వులా
నాన్న ప్రేమలా
ప్రియుని అనురాగంలా 
ప్రియంగా పలకరించే 
పున్నాగ పూలు
ఇంకెన్ని శిశిరాలు  చూడగలనో
అని ఆత్రంగా 
ప్రతి శీతా కాలం లోనూ
పరుగెత్తుకెళ్ళి
హృది దోసిలినిండా నింపుకుని
తనివితీరా ఆఘ్రాణిస్తాను అందుకే
ప్రతి వత్సరం శిశిరం కోసం 
ఎదురుచూస్తూ
గత మధుర స్మృతి ఝరి లో 
తడిసి ముద్దవుతూ .....
శిశిరం కోసం నిరీక్షిస్తూ....
.............................................ప్రేమతో..జగతి 2.20pm 3/12/2011 Saturday 















2 comments:

  1. నడుస్తూ నడుస్తూ ఆగి
    రాలిన పున్నాగలను
    ఏరు కుందామని అమ్మ !
    నాకు ఎంతో ఇష్టం ఈ పూలు అంటే. ఎక్కడ చెట్టు కనబడిన ఏరుతూ ఉంటాను.
    ఇక శివ అయితే నా పిచ్చి చూసి తను కూడా అలవాటు చేసుకున్నారు.
    మావారు ఆ పువ్వులు నాకు తెచ్చి ఇచ్చిన రోజు నాకు ఎంత సంబరంగా ఉంటుందో చెప్పలేను.
    మీ కవిత నిండా పున్నాగల పరిమళమే

    ReplyDelete
  2. wowww!!
    ఈ పున్నాగ పూలన్నా, పున్నాగ పూల పరిమళమన్నా నాకెంతో ఇష్టమో మాటల్లో చెప్పలేను. చాలా చాలా బాగా రాసారు.
    Thanks for the beautiful post! :)

    ReplyDelete