Saturday, April 13, 2019

ఏప్రిల్ నెల విశాలాక్షి మాస పత్రిక లో నా శీర్షిక అక్షరాంగనలుఅక్షరాంగనలు మాలతీ చెందూర్ హృదయత్రినేత్రులు రామలక్ష్మి, జానకమ్మ, స్వరాజ్యం

మాలతీ చెందూర్ మన అందరికీ చిరపరిచితమైన మన ఇంట్లో మనిషిలా అనిపించే ఆత్మీయమైన  రచయిత్రి. ప్రమాదావనం తో ఆంధ్రప్రభలో వనితలను అలరించినా , తన రచనలతో అందరినీ ఆలోచింపజేసినా , పాత కెరటాలు , కొత్త కెరటాలు అంటూ ప్రపంచ సాహిత్యాన్ని మనకి పరిచయం చేసినా , జగతి పత్రిక తో సామాజిక బాధ్యతను పంచుకున్నా మాలతి చెందూర్ ఒక విశిష్టమైన పేరు. వంటలూ-పిండివంటలు తెలుగు వారికి అందించిన తొలి తెలుగు కుక్ బుక్ రచయిత్రి కూడా. ఈ పుస్తకం ఇప్పటికీ 30 సార్లు పైగా ప్రచురణ పొందింది.   నాటి మద్రాస్ నేడు చెన్నై పట్నం ఆకాశవాణి లో తన గళాన్ని అనర్గళంగా వినిపించిన కథయిత్రి మాలతీ చెందూర్.  ఎన్నో కథలు, మరెన్నో నవలలు , కాలమ్స్ , ఎన్నెన్నో రచనలను అందించిన మాలతీ చెందూర్ తెలుగు ఇళ్ళల్లో అమెకో ప్రత్యేక స్థానం ఉంది. ఆమె నవల హృదయనేత్రి కి 1987 లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాహిత్య అకాడమీ పురస్కారం, అదే నవలకి 1992 లో కేంద్ర సాహిత్య అకాడెమీ పురస్కారం లభించాయి. విశాఖలో సహృదయ సాహితి వారు గురజాడ పురస్కారం కూడా ఈమె 1998 లో శ్రీ ఎల్ ఆర్ స్వామి, శేఖరమంత్రి ప్రభాకర రావు గారి నిర్వహణలో  స్వీకరించారు. ఈ సంస్థ గత 40 యేళ్లుగా ప్రతీ వారం సాహిత్య కార్యక్రమం నిరాటంకంగా జరుపుతోంది.
2005 లో విశాఖలో శ్రీ యార్లగడ్డ లక్ష్మి ప్రసాద్ గారు స్థాపించిన లోక్ నాయక్  ఫౌండేషన్ తొలి అవార్డ్ ఆమె స్వీకరించారు. స్త్రీలకు విద్యా , స్వేచ్చా స్వతంత్రాలు ఉండాలని బలంగా ప్రతిపాదించిన రచయిత్రులలో మాలతి చెందూర్ ఒకరు. ఆమెకు రాష్ట్ర దేశ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చిన ఆమె నవల హృదయనేత్రి లోని ప్రభావంతమైన స్త్రీ పాత్రలు రామలక్ష్మి, జానకమ్మ, స్వరాజ్యం నేడు మన అక్షరాంగనలు. ఈ హృదయ నేత్రులను గురించి కాసేపు ముచ్చటించుకుందాం రండి.
హృదయనేత్రి నవల కథ సంక్షిప్తంగా: ఈ కథ గోపాలరావు అనే ఒక వ్యక్తి జీవన యాత్ర. మరి హృదయనేత్రి అని ఎందుకు పేరు పెట్టారు అంటే నవల గురించి తెలుసుకుంటే తెలుస్తుంది. దేశం లోని రాజకీయ సందర్భాలతో , వాటి ప్రభావం జీవితాల మీద ఎలా ప్రభావం చూపించింది, వివిధ సందర్భాలలో మనుషుల ప్రతిస్పందనలు ఏంటి అన్న వివిధ కోణాలనుండి చర్చించిన నవల ఇది. గోపాలం ఏడేళ్ళ పిల్లవాడిగా మనకి నవల ఆరంభం లో పరిచయం అవుతాడు . స్వతంత్ర పోరాటం చీరాల నుంచి అకుంఠిత దీక్ష తో చేస్తున్న మేనత్త రామలక్ష్మమ్మతో కలిసి తల్లి తండ్రులని విడిచి పెట్టి ఆమె తో చీరాల వెళ్ళిపోతాడు. అక్కడ మామయ్య వాసుదేవరావు దంపతులతో కలిసి గాంధీ గారిని కూడా చూస్తాడు. ఆ చిన్నారి మనసులో స్వాతంత్రభిలాష బీజం పడుతుంది. పోరాటం లో ధీటుగా జైలుకి వెళ్ళిన బాల్య వితంతువు స్వతంత్ర సమర యోధురాలు జానకమ్మల ధైర్యం త్యాగం గోపాలన్నీ బాగా ప్రభావితం చేస్తాయి. కాశీలో చదువుకి వెళ్ళినా అక్కడ చదువు పూర్తి కాగానే ఇక పై చదువులు చదివి బ్రిటిష్ వాడికి కూలి చెయ్యాలి కదా అనే ఆలోచనతో స్వతంత్ర పోరాటం లోపాల్గొని జైల్ కి వెళతాడు. మూడు సార్లు జైల్ కి వెళతాడు గోపాలరావు. చీరాల లో దుగ్గిరాల గోపాలకృష్ణయ్య గారి పోరాట కాలం నుండి ఇందిరా ఎమెర్జెన్సీ తరవాత ఆమె విజయం , ఆ తర్వాత ఆమె మరణం వరకు జరిగిన అన్నీ సంఘటనలు గోపాల రావు జీవితం మీద ఎటువంటి ప్రభావం చూపాయి దానికి ఆయన ఎలా ప్రతిప్సందిస్తూ జీవితాన్ని గడిపాడు అన్నదే కథ. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఉద్యమం లో ప్రాణాలొదిలిన కొడుకు శ్రీనివాస్, కోడలు రమ , వారు అప్పగించిన చిన్నారి పాపను పెంచుకుంటూ ఉంటారు గోపాలరావు పార్వతి. ఆమెకు స్వరాజ్యం అని పేరు పెట్టుకుని తన ఆదర్శాలకనుగుణంగా తీర్చి దిద్దుతాడు గోపాలరావు. విద్యావంతురాలైన యువతిగా ఎదిగిన స్వరాజ్యం పెళ్లి జీవన పరమార్ధం కాదని చెప్పి జానకమ్మ గారు చివరిగా ఇచ్చిన డబ్బులు, రామలక్ష్మమ్మ గారు ఇచ్చిన ఇంటిలో ఒక వృద్ధాశ్రమం నడపాలని నిశ్చయించుకుంటుంది. రామలక్ష్మమ్మ , జానకమ్మ ఆశించిన ఆచరించిన సర్వ స్వాతంత్ర్యాన్ని , స్త్రీ స్వేచ్చ పతాకను తన చేతుల ధరిస్తుంది స్వరాజ్యం. ఆదర్శవంతమైన స్వాతంత్ర్య పోరాట యోధుడిగా , ఆలోచనా పరుడిగా గోపాలరావు సామాజిక ధృక్పధం ఎలా అచంచలమైన విశ్వాసం తో ఆదర్శం తోఈ ముగ్గురు స్త్రీల ప్రభావం తో  కొనసాగిందో చాలా విపులంగా చర్చిస్తారు రచయిత్రి.
తొలి హృదయత్రినేత్రి రామలక్ష్మమ్మ : నవల తొలి పేజీలోనే రాముడత్తయ్య గా గోపాలం దృష్టి ద్వారా మనకు పరిచయముతుంది రామలక్ష్మమ్మ. నిండుగా , హుందాగా , నగలతో , ఉండే రాముడత్తయ్య అంటే గోపాలానికి  ప్రాణం. ఆమె తన అమ్మ, అమ్మమ్మ , నాన్న లాగా కాక స్వరాజ్యం కోసం , పోరాటం చేస్తుంది. అదే ఆమె పట్ల ఆరాధన అతనికి. అదే ఆరాధనా జీవితమంతా ఉంటుంది గోపాలరావుకి. ఆమెతో చీరాల తీసుక్లెళ్లిపోతుంది. అక్కడ భర్త వాసుదేవరావు తో కలిసీ దుగ్గిరాల సీతారామయ్య గారి నాయకత్వం లో స్వాతంత్ర్య  పోరాటం లో పాల్గొంటుంది. గాంధీ గారు పోరాటానికి నిధులు సేకరిస్తున్నప్పుడు వేదిక మీదికి వెళ్ళి నగలన్నీ ఇచ్చేస్తుంది. మంగళ సూత్రం ఇవ్వబోతే గాంధీ వారిస్తారు. మళ్ళీ నగలు చేయించుకోను , జీవితం లో పెట్టుకోను అని శపధం పడుతుంది గాంధీ ఎదుట. గాంధేయ ఆదర్శాలన్నీ పాటిస్తూ రోజూ రాట్నం  వాడికి నూలు తీయడం చేస్తుంది. జైల్ కి వెళ్ళి వచ్చి అనారోగ్యం పాలైన భర్తను కంటికి రెప్పలా కాచుకుంటుంది. “మీ మామయ్యను ఇలా వదిలేసి నేను ముందు చచ్చిపోలేనురా. నేను లేకపోతే ఆయనకి ఎవరు సేవ చేస్తారు? గుక్కెడు నీళ్ళు నోట్లో పోసేవాళ్ళు ఉండరు. ఎవరు ఎన్ని అనుకున్నా నా గుండె రాయి చేసుకుని బెంగని, భయాన్ని వెనక్కి నెట్టి తిరుగుతున్నాను. ఒరేయ్ గోపాలం నాకు చావంటే భయం లేదు. మీ మామయ్యని అనాధగా వదిలి ముందే వెళ్లిపోయే పిరికిదాన్ని మటుకు కాలేను, కాను” మృత్యువు ముఖం లో ఉన్న భర్త ను గురించి ఆమె అన్న మాటలివి. ఎనిమిదవ ఏటనే పెళ్లి అయి వచ్చిన తనని విద్యావంతురాలను, సామాజిక చైతన్యవంతురాలను చేసిన భర్త ఆమెకి గురువు సర్వస్వం. గోపాలం వంటి యువత దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడాలని ఆమె ఆకాంక్ష. భర్త పోయిన తర్వాత ఉన్న ఊరును వదిలి గాంధీజీ ఉద్యమం లో పాలు పంచుకుంటుంది. అందరికీ దూరంగా ఉంటూ కనీసం పలకరింపు ఉత్తరం కూడా గోపాలాన్నీ రాయొద్దు అని చెప్తుంది. తనకు కొన్నాళ్లు అందరి నుండి దూరంగా ఉండటం అవసరమని అది తన జీవన సమరానికి సమాయుత్తం కావడానికి ఉపయోగిస్తుందని అందరి నుండి దూరంగా ఉంటుంది. కొన్నేళ్లు గాంధీ గారి ఆశ్రమ వాసం చేసి నేను సైతం అంటూ ఆ పోరాటం లో సమిధ అవుతుంది. చివరికి అనారోగ్యం పాలై క్షయతో సీతానగరం తిరిగి వచ్చి తనువు చాలిస్తుంది. ఎవరు ఏమనుకున్నా తనని ఆక్షేపించినా ఏమాత్రం పట్టించుకోకుండా తాను నమ్మిన ఆదర్శ పోరాటం చేస్తుంది రామలక్ష్మమ్మ. భర్త చనిపోతే కర్మ కాండ చేయడం కూడా ఆమెకు నమ్మకం ఉండదు , చేయదు. నిజమైన హేతువాద , ఆదర్శ నారి ఆమె. తాను చనిపోతూ ఉన్న ఒక్క ఇల్లును గోపాలరావుకి అప్పజెప్పమని జానకమ్మ కి చెప్తుంది. ఆదర్శ వాదిగా, ఆచరణ శీలిగా సత్యమైన గాంధేయవాదిగా జీవితాన్ని సార్ధకం చేసుకున్న మహిళా రామలక్ష్మమ్మ. ఆమె ప్రభావం గోపాలరావు జీవితమంతా అంతర్లీనగా ఉండనే ఉంటుంది. మానమరాలు స్వరాజ్యం ని చూసినప్పుడు ఆమె ప్రవర్తన ఆలోచనా విధానం చూసి మా రాముడత్తయ్యే ఇలా పుట్టిందా అనుకుంటాడు. ఆమె మాటలు అతనికి  ఉపనయనం లో గాయత్రి మంత్రం కన్నా ఎక్కువ వంటబడతాయి అతని జీవితాన్ని దిద్ది తీర్చుతాయి. తన తర్వాతి తరం లోఅత్యంత విశ్వాసాన్ని ప్రకటించే రామలక్ష్మమ్మ దార్శనికురాలు.
మరో హృదయత్రినేత్రి జానకమ్మ:  ఈమె బాల వితంతువు. దుగ్గిరాల వారి ప్రభావానికి లోనయి ఖద్దరు కట్టడం ఆరంభించింది. ఆ తర్వాత రోజూ రాట్నం వడికి అమ్ముకు రావడం ఆ డబ్బుని ఆదర్శవంతమైన పనులకు ఉపయోగిస్తుంది. బ్రిటిష్ వారు విధించిన పన్నులకు వ్యతిరేకిస్తూ జరిపిన పోరాటం లో ఊరు వదిలి అందరూ పోవడానికి నిశ్చయించుకుంటారు. మగవారిలో దుగ్గిరాల వారు ముందడుగు వేస్తే స్త్రీలలో జానకమ్మ ముందుగా అడుగేసి అందరినీ నడిపిస్తుంది. కులం మతం అనే వివక్ష లేకుండా ఎందరో స్త్రీలకి పురుళ్లు పోస్తుంది. అందువలన కుటుంబ సభ్యులందరూ ఆమెను వెలి వేస్తారు. తనదగ్గర ఉన్న నగలను గాంధీ గారికి ఇచ్చేస్తుంది. అడ్డమైన వాళ్ల ఇళ్లకూ వెళ్ళి పురుడు పోస్తుంది అని ఆమె ఇంటి వాళ్ళు దొడ్డి వసరాలో ఆమెకు అన్నం పెట్టబోతే ఆమె తినలేదు. ఆరోజు నుండీ వండిన ఆహారాన్ని తినడం మానేసింది. కేవలం నాన పెట్టిన పెసలూ, శనగలు వంటివి మాత్రమే తినేది. స్వాతంత్ర్య సమరయోధులతో జైలుకి వెళ్ళి వస్తుంది. రాయవెల్లూరు జైలు లో స్వతంత్ర పోరాట  ఖైదీలను వేరుగా ఉంచాల్సింది ఉంచకుండా మామూలు ఖైదీలతో కలిపి ఉంచుతారు. చాలా హింసకు గురి అవుతుంది. రాళ్ళు , బొద్దింకలతో కలిపిన తిండి పెట్టి ఆమె ఆరోగ్యం క్షీణింపజేస్తారు జైల్ వాళ్ళు. జైలు నుండి విడుదల అయిన ఆమె దుస్థితిని చూసి కళ్ళనీళ్లు పెట్టుకుంటుంది రామలక్ష్మమ్మ. సంప్రదాయ పరుడైన తండ్రి జానకమ్మకు జుట్టు తీయించేస్తాడు భర్త పోయిన వెంటనే. అదే ఆమె చివరివరకూ పాటిస్తుంది. జైలులో మంగలాడిని పంప కుండా, మంగళ వారంపూట పంపితే ఎలా గొరిగించుకోనూ అందుకే జుట్టు పేలు పట్టి పుళ్లైపోయాయి అని ఆమె నీరసంగా చెప్తుంటే అందరి కళ్ళూ చెమరిస్తాయి. ఆచారాలను వ్యతిరేకించకుండానే ఆదర్శాలను పాటించే మనిషి ఆమె. ఇంత బాధ పడినా కొద్ది రోజులలోనే ఆమె తిరిగి కోలుకుని మళ్ళీ తన కార్యక్రమాలు యధావిధిగా కొనసాగిస్తుంది. స్వాతంత్ర్యాన్ని చూస్తుంది. తెలుగు రాష్ట్రం ఏర్పడటం నుండి ఇందిరా గాంధీ మరణం కూడా చూస్తుంది. తమ గ్రామంలో పన్నుల పోరాటం లో ఇల్లు కాలి చనిపోయిన సాలె శివయ్య కొడుకు సూర్యం, అతని భార్య  చేత వయోజన విద్యా కేంద్రం, అలాగే చిన్నపిల్లలికి స్కూల్ పెట్టిస్తుంది. ప్రభుత్వం తో మాట్లాడి వాళ్ళకి స్థలం ఏర్పరుస్తుంది. చివరికి రామలక్ష్మమ్మ ఇంటి కాగితాలను , తన దగ్గర ఉన్న పది వేల రూపాయలను ఒక్క పైసా తనకోసం అట్టే పెట్టుకోకుండా  గోపాలరావుకి అప్పజెప్పి ఏదైనా మంచి కార్యం చేయమని ఆదేశిస్తుంది. స్వరాజ్యం లోని ఆదర్శవంతమైన గుణాన్ని చూసి ఆనందంతో ఆమెను ఎన్నో ఆదర్శవంతమైన కార్యాలున్నాయి ఏదైనా చేపట్టమని దిశా నిర్దేశం చేస్తుంది.  సుమారు వందేళ్ల ప్రాయం లో ఒంటరిగా పూరిపాక లో జీవితం చరమాంకం లో ఉంటుంది. ప్రభుత్వం వారు స్వతంత్ర యోధులకు ఇచ్చిన ఐదు ఎకరాల పొలాన్ని తీసుకుని పేద వారికి సాగు చేసుకోమని ఇచ్చేస్తుంది.  కథ మొదలునుండీ చివరి వరకు భౌతికంగా తన ప్రభావాన్ని చూపే ప్రభావంతమైన ఆదర్శ మహిళ జానకమ్మ. వితంతు జీవితాన్ని కుటుంబ సభ్యులకి పని మనిషిగా గడిపేస్తూ, ఇంటికే పరిమితమయి పోవడం ససేమిరా ఇష్టపడక జీవితాన్ని సమాజం కోసం దేశం కోసం జీవిస్తూ ఇతరులను జీవింపజేస్తూ , భావి తరం ఆలోచనలపై ఎంతో నమ్మకం చూపించే జానకమ్మ మరో హృదయత్రినేత్రి .
మూడో హృదయత్రినేత్రి స్వరాజ్యం: తండ్రి తల్లి నక్సలైట్ ఉద్యమం లో ప్రాణాలు అర్పించగా వారి ప్రేమ చిహ్నంగా మిగిలిన చిన్నారి ని గోపాలరావుకి అప్పగిస్తారు వారి చివరి కోరిక మేరకు వారి మిత్రులు. ఆ అమ్మాయే గోపాలరావు కొడుకు కూతురు స్వరాజ్యం. స్వరాజ్యలక్ష్మి అని పేరు పెట్టుకుని ఇక తానే అన్నీ అయి పెంచుతాడు గోపాలరావు. పార్వతి కూడా పోయిన తన కొడుకుని స్వరాజ్యం లో చూసుకుంటుంది. అలా తాతయ్య చేతిలో అతని ఆదర్శాలనూ , ఆలోచనలనూ, పుణికి పుచ్చుకుని స్వరాజ్యం తనదైన విలువైన వ్యక్తిత్వాన్ని పెంపొందించుకుంటూ ఎదుగుతుంది. ఆమె చిన్నప్పటినుండి తాను రాస్తున్న గాంధేయ వ్యాసాలు బయటికే చదువుతూ రాస్తూ ఉంటాడు గోపాలరావు. అతని వొళ్లో అన్నీ వింటూ ఎదుగుతుంది స్వరాజ్యం అలాగే ఎన్నెన్నో సామాజిక రాజకీయ విషయాలను ఆమెకి చెప్తాడు. స్వంతంగా, స్వతంత్రంగా ఆలోచించడం సునిశితంగా ఏ విషయన్నయినా అర్ధం చేసుకోవడం విశ్లేషించుకోవడం స్వరాజ్యానికి బాగా వస్తుంది. ఆమె తాతయ్య తో ఎన్నో విషయాలు  చర్చిస్తుంది, వాదిస్తుంది కూడా. ఇందిరా గాంధీ ఎమెర్జెన్సీ విధించిన రోజులవి అప్పుడు ఆమె యూనివర్సిటీ లో ఎం ఏ ఏకనామిక్స్ చదువుతూ ఉంటుంది. స్నేహితురాలు ఎంతో  బాగా  రాసినప్పటికీ మంచి గ్రేడ్ ఎందుకు రాలేదో అని ఆమె పేపర్స్ మళ్ళీ పరిశీలించమని మరో ఐదుగురు స్నేహితులతో బాటు వీసీ ని అడగడానికి వెళితే వాళ్ళు ఏమీ గొడవ చేయక పోయినా ఎమెర్జెన్సీ కావడం చేత పోలీసులు జైల్ లో పెడతారు. గోపాలరావు తమ్ముడు బుచ్చి ఎంతో పలుకుబడి ఉన్నప్పటికీ ఎప్పుడు స్వరాజ్యం తమ పట్ల తక్కువ అభిప్రాయాన్ని కలిగి ఉన్న కారణంగా  ఆమెని విడిపించే ప్రయత్నం చేయడానికి ఒప్పుకోడు. అప్పుడు తొలి సారిగా గోపాలరావు తమ తల్లి బుచ్చి వాళ్ళింట్లో బలవన్మరణం చెందిన విషయాన్ని తిరగతోడుతాను  అని బెదిరించి ఆమెను విడిపించేలా చేస్తాడు. అందుకు ఆయన మనసులో చాలా బాధ పడతాడు కానీ తప్పదు జైల్ లో ఉంచితే ఆరోజుల్లో ఏమైనా కావచ్చును అనే భయం. పెళ్లి చేసుకోమని నిత్యం పోరుతున్న మామ్మ పార్వతికి తాను పెళ్ళికి వ్యతిరేకిని కాను కానీ తన ఆదర్శాలను అర్ధం చేసుకున్న వాడు దొరికితే తప్పక చేసుకుంటాను అంటుంది స్వరాజ్యం. ఆమె స్థిరత్వానికి గోపాలరావు దంపతులు ఒప్పుకోక తప్పదు. చివరికి ఇందిరా గాంధీ హత్యకి గురైన రోజున విపరీతమైన ధు:ఖానికి గురవుతుంది స్వరాజ్యం. అంతకు ముందే తాత మనవరాలు జానకమ్మ ని చూసి వస్తారు. ఆమె అప్పగించిన డబ్బులు తీసుకుంటూ తానింకా ఏదీ నిశ్చయించుకోలేదు కానీ ఆ డబ్బు తప్పక మంచి పనికి ఉపయోగిస్తాను అని జానకమ్మకి మాట ఇస్తుంది స్వరాజ్యం. ఇందిరా గాంధీ హత్యకు గురవ్వడం ఆమెను బాగా కదిలించి వేస్తుంది. ఆరోజు ఆమె నిర్ణయం తీసుకుంటుంది చీరాల లో రామలక్ష్మమ్మ ఇచ్చిన ఇంటిలో జానకమ్మ ఇచ్చిన డబ్బుతో ఒక వృద్ధాశ్రమం స్థాపించాలి అని. ముందుగా తాత, మామ్మ, జానకమ్మ ను తాను చూసుకుంటూ ఇంకా మిగిలిన వారిని చేర్చుకుంటాను , డబ్బు జానకమ్మ గారు ఇచ్చిన దానితో మొదలు పెడితే తర్వాత డబ్బులు అవే వస్తాయి అనే ధృఢ సంకల్పం తో తాత గారితో చెప్తుంది ఇద్దరూ చీరాల బయల్దేరుతారు. ఇక్కడితో ఈ కథ ముగుస్తుంది అనే కంటే ఆరంభం అవుతుంది అనడం సబబు. ఆదర్శ జీవన యానం కొనసాగుతుంది. ఆ క్షణం లో స్వరాజ్యాన్ని చూస్తుంటే శత వృద్ధురాలు జానకమ్మ గారికి దూర దృష్టి మాత్రమే కాదు భవిష్యత్ వాణిని గుర్తించగల అపూర్వ శక్తి ఉన్నదేమో అనిపించింది. ఆ జానకమ్మ గారు కల గన్నది స్వరాజ్యం తన హృదయనేత్రం తో చూస్తున్నదా అనే విస్మయం కలుగుతుంది గోపాలరావుకి.
“పరిస్థితులు దేశ భావితవ్యాన్ని మీ యువత చేతుల్లో పెట్టాయి, భవిష్యత్ ని  ఫలవంతం చేయడం మీ మీద ఉన్న బాధ్యత , ఈ ప్రయత్నం లో నువ్వు విజయం పొందలనే నా ఆకాంక్ష” అంటాడు గోపాలరావు స్వరాజ్యం తో. ఈ మాటలతో వారు చీరాల ప్రయాణం అవుతారు.
ఉద్వేగమైన  వ్యక్తిత్వం , ఉద్యమ స్ఫూర్తి కలిగిన ముగ్గురు హృదయనేత్రులు ఈ ముగ్గురు. చూడగలిగే రెండు కళ్ళతో కాక హృదయ త్రినేత్రం తో విశ్వ హితాన్ని దర్శించి, ఎంచుకున్న మార్గం లో ధీరలై ప్రయాణించేవారు ఈ ముగ్గురూ. సమాజ అవగాహన తో బాటు తాము నిర్వర్తించాల్సిన కర్తవ్యాన్ని ఎరిగి దేనికీ ఎవరికీ వెరవక జడవక తమదైన విశిష్ట  వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకుని సమసమాజ స్థాపన కై నేను సైతం అంటూ పాటు పడిన ఈ స్త్రీ మూర్తులు ఎన్నటికీ చిరస్థాయిగా నిలిచిపోతారు తెలుగు సాహిత్యం లో. దాదాపు ఐదు దశాబ్దాల జాతీయ సామాజిక అంశాల నేపధ్యం లో కథ నడుస్తుంది. దేశ చరిత్రను కధలో నేపధ్యంగా అల్లుతూ కథ చెప్పడంలో మాలతీ చెందూర్ నైపుణ్యం కనిపిస్తోంది. ఇలా రాయగలిగే వారు మన తెలుగు లో చాలా తక్కువ మంది ఉన్నారు. ఉద్యమాలలా శ్వాసించిన  ఈ మువ్వురు హృదయనేత్రులూ భావి తరాలకు ఆదర్శ మూర్తులు. కాల్పనిక సందర్భాలు కాక నవల మొత్తం వాస్తవ సందర్భాలతో ఉండడం ఈ నవల తో పాఠకులకు ఎక్కువ ఐడెంటిఫికేషన్ కలిగిస్తుంది. తెలుగు సాహిత్యం లో మాలతీ చెందూర్ చిరంజీవి ఆమె సృజియించిన ఈ ముగ్గురు మహిళలూ కూడా ఎన్నటికీ చిరంజీవులే అని ఘంటాపధంగా చెప్పొచ్చు. వచ్చేసారి సారి కొత్త అక్షరాంగనలతో మళ్ళీ వస్తా ఇప్పటికీ సెలవా మరి.
.................................................................................................జగద్ధాత్రి 8712293994