Tuesday, September 25, 2018


చెలిమి చెలమలు గౌనా గజళ్ళు

కథ , కవిత , పాట, బొమ్మ , నటన , అన్నిటికి మించి మా మంచి మాస్టారు , ఒక సంపూర్ణ అక్షరాల బాటసారి మా గంటేడ గౌరునాయుడు. మా  అంటే మా ప్రాంతానికి అని నా ఉద్దేశం కాదు, మనందరి వాడు అని.  తెలుగు సాహిత్యం లోని తొలి తెలుగు కథ గురజాడ వారి దిద్దుబాటును, కమలిగా  రచయిత మల్లిపురం జగదీష్ కథ అక్షరాల దారిలో.. ను సన్నాయి పేరిట యువ దర్శకులు అట్టాడ సృజన్ దర్శకత్వం లో లాంగుల్య క్రియేషన్స్ పేరిట నిర్మించినది గౌరునాయుడే .  అక్షరకారుడు ఎప్పుడూ ఒక ప్రాంతానికో, భాషకో, పరిమితం కాదు. గౌరునాయుడు ప్రవహించే సాహితీనది. తాను సాగిపోతూ తనతో బాటు యువ సాహితీ వేత్తలను, కళాకారులనే పిల్ల కాలువలను కూడా తనతోనే కలుపుకుంటూ సాగే జ్ఞాన నది. అతని పాటలు పాడని యువకులు ఈ ఉత్తరాంధ్రలో ఉండరు అన్నది అతిశయోక్తి కాదు. తెలుగు గజల్ ఇటీవల బాగా ప్రాచుర్యం పొందుతున్న ప్రక్రియ. కీ.శే. డాక్టర్ సినారె , డాక్టర్ అద్దేపల్లి వంటి పెద్దలు ఎక్కువగా ప్రాచుర్యం లోకి తీసుకొచ్చిన వారు. ఇప్పుడీ పాట బాటలోనికి అడుగు పెట్టాడు గౌరునాయుడు. జీవితానుభవాల చల్లను చిలికి భావాల వెన్నను తీసిన మా గంటేడ బావు ఆ భావానుభూతులకి గజల్ రూపం కట్టించి అందంగా అందించాడు.  పార్వతీపురం స్నేహ సాహితి తన ఇరవయ్యవ ప్రచురణగా తీసుకొచ్చిన ఈ పాటల పేటిక “మనసు పలికే..” 70 గజళ్లుగా మన గుండె సందిళ్ళ ఒదిగి మన మనసులను అలరిస్తోంది. డాక్టర్ మంచిపల్లి శ్రీరాములు (అధ్యక్షులు , సాహితీలహరి), జి. రామకృష్ణ (శాంతి), కార్యదర్శి, స్నేహకళాసాహితి మంచి మాటలతో సౌహార్ద్రం తో వెలువడిన మంచు ముత్యాల పల్లకి ఇది.
“ నా అక్షరాలు కష్ట జీవుల కలల నేస్తాలు. శ్రమజీవులకోసం సాచే  స్నేహ హస్తాలు. ప్రేమగా పలకరిస్తాయి. బాధల్ని పంచుకుంటాయి . భుజం తట్టి ప్రోత్సహిస్తాయి.” అంటాడు గౌరునాయుడు తన ముందు మాటలో. సామాజిక బాధ్యత  అందరికీ ఉందనీ అది గుర్తెరిగి మసలుకోవాల్సిన  అవసరం ప్రతి ఒక్కరికీ  ఉందని ఆ స్పృహ కలిగించడం లో , సమాజానికి మేల్కొలుపులు తన పాటలని చెప్తాడు గౌరునాయుడు. పాలకుల అసమర్ధతని సమాజం ముందు నిలబెట్టినప్పుడు తన కథలు, భావోద్విగ్నపు సరస్సులో ఊపిరందనంత ఉక్కిరిబిక్కిరి అయినప్పుడు తన కవితలు ఆవిర్భవించాయంటాడీ కవి.
ఇప్పుడీ గజళ్ళు... గజల్ ఉర్దూ భాషా ప్రక్రియ. గజల్ అంటే ప్రియురాలితో సంభాషణ అని అర్ధం . కానీ ఫైజ్ అహ్మద్ ఫైజ్ నుండి ఈ గజల్ లో సామాజిక స్పృహను, చింతనను మేళవించారు. అలాంటి ఈ సున్నితమైన గాన ప్రక్రియలో తన భావుకతను,జీవన తాత్వికతను, సామాజిక హిత వచనాలను రంగరించి గుమ్మరించాడు గౌనా.
“మై ఔర్ మేరీ తన్హాయీ, అక్సర్ యే బాతే  కార్తీ హై..”(నేను నా ఏకాంతం చాలాసార్లు మాట్లాడుకుంటాము)అంటూ ఒక కవిత సిల్ సిలా సినిమా లో అమితాబ్ స్వరం లో పలికిస్తాడు ఒక హిందీ కవి. అలాగే నేడు మన గౌనా తన గజల్ గురించి ఇలా అంటున్నాడు “నా వరకు నాకు గజల్ ఒక ఊరట. నా ఒంటరి క్షణాలలో నాతో నేను , నాలో నేను సంభాషించుకునేందుకు ఇదొక ఉపకరణం. ప్రశ్నించి , ప్రార్ధించి, ఘర్షించి, శాసించి,నా లోపలి మనిషితో నా సంవేదనల్ని పంచుకోవడానికి ఇదొక ప్రత్యామ్నాయం” ప్రియురాలితో సంభాషణ అన్న గజల్ ని నేడు మన గౌరునాయుడు ఆత్మ సంభాషణ గా నిర్వచిస్తున్నాడు. గజల్ లోని తాత్విక అంశ ఇదే. ఆత్మ యే ప్రేయసి. అలా అంతరంగ సంభాషణే ఈ తీయని గజళ్ళు. లేలేత తాటిముంజెల్లా మన మనసును ఊరించే ఈ గౌనా గజళ్ళు, మమతల పూలు పూయిస్తాయి , ఆవేదానాశ్రువులను  చిలికిస్తాయి, ఆలోచనల జడిని కురిపిస్తాయి. ఆకలి నుండి, అడవి నుండి ,అమ్మనుండి నేర్చుకున్న పాఠాలను ఎంత సున్నితంగా చెప్పాడో చూడండి :
“ఆకలెరిగి పెట్టమని అమ్మ నాకు చెప్పింది /అడగకనే ఇవ్వమనీ అడవి నాకు చెప్పింది /అవమానం కాదు సుమా వొంగి వుండడం/విల్లుగా వొంగమనీ వెదురు నాకు చెప్పింది/... కష్టాల కొలిమి లోన కాలకుంటే ఓ గౌనా /కాలానికి నిలవవని కవిత నాకు చెప్పింది”
“అక్షరాలు  తప్ప ఆత్మ బంధువులేరీ గౌనా/కొనసాగిస్తాను నా ముందరున్న విధులు” అంటాడు ఆర్ద్రంగా ప్రవహిస్తున్నవి నాలో ఎన్నో నదులు గజల్ లో. గౌనా గజళ్లలో తాత్వికతే కాదు సమాజానికి సవాళ్ళు కూడా ఉన్నాయి. మనుషులలోని మూఢత్వానికి వేసే చురకత్తులలాంటి చురకలున్నాయి. “బాబా బూడిద తీస్తే దాన్ని మహిమని అంటారు/గారడీ వాడు చేస్తే అది మేజిక్కని అంటారు /బూడిద ఎందుకు మహిమే వుంటే బువ్వ తియ్యరాదా/అపుడే స్వామీ తేలుతుందని ఆ లెక్కని అంటారు”…. అంటూ చివరికి “పచ్చ నోట్లతో స్వామీజీలకు పాదపూజలేలంటే/జవాబు చెప్పక గౌనామాటలు చెడని అంటారు.” అంటూ ముగిస్తారు.
గౌనా గజళ్లలో ఆవేదన, ఆత్మ శోధన తో కూడిన అంతర్యానం ఉంది.
మృదుమధురమైన ప్రేమానుకంపనలున్నాయి. గెలుపువైపు నడిపించే స్ఫూర్తి ఉంది.
“నిదురించు మృదువీణ శృతి చేయవోయి/కదిలించి మదికింత ధృతినీయవోయి/అనురాగ బంధాలు తెగిపోక ముందే/సవరించి హృదయాలు ముడివేయవోయి/నడివేసవే డస్సి నిను చేరుకుంటే/చిరుజల్లువై గొంతు  తడిపేయవోయి/ పొరపాటులే లేని చేరాత ఉందా?/చిరిపేసి సరికొత్త ప్రతి రాయవోయి/వలపంటే హృదయాల లో వెలుగు గౌనా/ఉదయాలకే ఊపిరులు పోయవోయి”
ఇలా అనురాగం, ఆక్రోశం, సామాజిక హితం అన్నీ ఎర్చీకూర్చిన తేనెగిన్నె ఈ మనసు పలికే గజళ్ళ పుస్తకం.
విలక్షణమైన సైజులో అందంగా ముద్రింపబడిన ఈ పుస్తకం ముందు మన దృష్టినీ, హృదినీ దోచేస్తుంది.
“మనుషుల నడుమ ఏల ఇనుపగోడలు/మనసుల లోలోన ఏల నీలినీడలు/ఆకలి అందరిదొకటే అది తీరే దారొకటే/చెరపవేల మూఢత్వపు అడుగుజాడలు” అని , సర్వ మానవ సమానత్వ తత్వాన్ని ప్రబోధించే భావనలెన్నో ఈ గజళ్ల నిండుగా ఉన్నాయి. అక్షరాల ఆత్మీయత బువ్వనే అందరికీ పంచి ఇస్తూ, యువకుల్లో ఆవేశాన్ని మేల్కొలుపుతూ, పిల్లలికి చదువునిస్తూ చదివిస్తూ ఎందరినో సమాజ యుద్ధ వాటిక లోనికి పంపడానికి  ధర్మ యుద్ధ వీరులుగా తీర్చి దిద్దుతూ జీవితానికి పరమార్ధం జ్ఞాన సంపదని పంచడం అని ఆచరణ లో చూపిస్తున్న  ఈ ఆచార్యునికి సాహిత్య లోకం  వందనాలు. పార్వతీపురం కొండాకోనల్లో బతుకు పాటలు పాడుతూ , సాహిత్య పోడు వ్యవసాయం సాగిస్తూ సాగిపోతున్న ఈ కొండ దొరకి  సాహితీ జగతి దండాలు.
....................................................................జగతి , 6281434862