Tuesday, April 23, 2013

భారతీయాంగ్ల రచయిత్రులు 2 సరోజినీ నాయుడు ( విశాలాక్షి లో ప్రచురితం మార్చ్ 2013 )

భారతీయాంగ్ల రచయిత్రులు 2 సరోజినీ నాయుడు  ( విశాలాక్షి లో ప్రచురితం మార్చ్ 2013 ) 

తోరు దత్ తర్వాత భరతీయాంగ్ల కవయిత్రులులలో సరోజినీ నాయుడు దే చరిత్ర లో వచ్చే పేరు. అరబిందో, టాగోర్ లాగానే సరోజినీ కేవలమొక కవయిత్రి మాత్రమే కాదు. భారతీయ చరిత్రలో స్వాతంత్ర్య యోధురాలిగా , స్వతంత్ర భారతం లో ఒక రాష్ట్ర గవర్నర్ గా కూడా పదవి పోషించి " భారత కోకిల " గా ప్రఖ్యాతిగాంచిన విదుషీమణి. 
భారత మాత  ముద్దు బిడ్డలలో ఒకరుగా సరోజినీ నాయుడు కి అత్యంత ప్రముఖ స్థానం ఉంది చరిత్రలో. అనుకున్నది నిర్మొహమాటంగా ఖచ్చితంగా చెప్పగల ధైర్యం, మంచి వాగ్ధాటి కూడా కలిగిన స్త్రీ మూర్తి గా సరోజినికి పేరుంది. బెంగాల్ అమ్మాయి తెలుగింటి కోడలు గా సరోజినీ నాయుడు కి అత్యంత గౌరవ స్థానం ఉంది. కవిత్వం ఆమెకు ఒక భావ వాహిక. ఆమె జీవితాన్ని కవిత్వాన్ని విడదీసి చూడలేమంటారు కె. అర్. శ్రీనివాస్ అయెంగార్. అయన 1962 లో " ఇండియన్ రైటింగ్ ఇన్ ఇంగ్లిష్" అనే పుస్తకం రాస్తున్నప్పుడు సరోజిని ఒక ఉత్తరం రాస్తూ " నీకు నా ఆశీర్వాదాలు తప్పక  ఉంటాయ్ , నా కవిత్వం గూర్చిరాయటానికి , నా ఉత్తరాలను ఉదాహరించడానికి. కానీ నీకు నాగురించి ఎక్కువేమి తెలుసు? నాతొ చాలా సన్నిహితులకు కూడా నా జీవితం లో తేదీలు తప్ప నా  జీవితం  గూర్చి ఏమీ తెలీదు " అన్నారు. ఇది చాలా ముఖ్యమైన విషయం సరోజిని నాయుడు అంతర్గత జీవితం గురించి ఎవరికీ తెలియదు అన్నది స్పష్టం. ఒప్పుకుని తీరాల్సిన విషయం ఆమె చాలా గుంభనంగా ఉండేదని ఆమె అంతర్గత జీవితాన్ని గూర్చి ఎక్కడా ఎవరికీ కొంచం కుడా తెలియనిచ్చేది కాదని అంటారు శ్రీనివాస్ అయంగార్. ఆమె జీవితాన్ని ఉహించి రాయడం సాహసమే అవుతుంది లేదా ప్రమాద మౌతుంది అంటారు ఆయన. అందరితోనూ ఎంతో  కలుపుగోలుగా మాటాడుతూ చక్కని స్నేహితం తో మెలిగే ఆమె లో ఏదో కనబడని అజ్ఞాత విచారం దాగి ఉందని గోపాల్ కృష్ణ గోఖలే కుడా అంటారు ఆమె తనకు రాసిన ఒక ఉత్తరాన్ని ఉదాహరిస్తూ. ఆమె అనారోగ్యం తో ఇంగ్లాండ్ వెళ్ళినప్పుడు గోఖలే గారు ఒక ఉత్తరం లో " నీ కవిత్వం లో ఎక్కువ శాతం విషాదం ఉంది నీ తేజస్సును తగ్గిస్తోంది. అది నీవు మృత్యువుకి దగ్గరవుతున్నాను అనే భావం వలనా ? " అని అడిగారు 
దానికి ఆమె సమాధానం ఇలా చెప్పింది " కాదు , నేను జీవితానికి అత్యంత సమీపానికి వచ్చాను , దాని జ్వాలలు నన్ను దహించి వేసాయి " అని ఇందులోనూ ఒక మార్మికమైన సమాధానమే తప్ప  ఎవరి వద్దా మనసు విప్పి చెప్పేది కాదు ఆమె. 

సరోజినీ  నాయుడు జీవిత వివరాలు :(13 ఫిబ్రవరి 1879- మార్చి 2 1949) 

శ్రీ అఘోరనాథ్ చట్తోపధ్యాయ్ ,  వరద సుందరీ దేవి అనే బెంగాలీ బ్రాహ్మణ దంపతులకు ప్రధమ సంతానంగా హైదరాబాద్ లో జన్మించింది. ఎనిమిది మంది సంతానం లో నో పెద్దది సరోజినీ. ఆమె మరో తమ్ముడు బిరెంద్రానాథ్  విప్లవకారుడు, మరొక తమ్ముడు హరిన్ద్రనత చట్తో పాధ్యాయ్ పెద్ద కవి , మన తెలుగు కవులైన , దేవులపల్లి, చలం వీరందరితోనూ మంచి స్నేహం ఉన్న వ్యక్తి. సరోజినీ తండ్రి అఘోరనాథ్ హైదరాబాద్ నిజాం కాలేజీ సంస్థాపకులు. 
పన్నెండేళ్ళ వయసులోనే మద్రాస్ విశ్వవిద్యాలయం నుండి మెట్రిక్ పరీక్షలో ప్రప్రధమ స్థానం తెచ్చుకుని అందరినీ అబ్బురపరిచడమే కాక దేశ వ్యాప్తంగా కీర్తి గడించిన బాల మేధావి సరోజిని. ఆమెకు ఉర్దూ, తెలుగు, ఇంగ్లిష్, బెంగాలి పారశీ భాషలు క్షుణ్ణంగా వచ్చును. 
ఆమె కవిత్వ ఆరంభం ఒక విచిత్రం .  ఆమెను విజ్ఞాన్ సాస్త్రవేత్తనో, లేదా గణిత శాస్త్ర వేట్ట్తనో చెయ్యాలని సంకల్పించినా కవిత్వం లో ఆమె కున్న ,ఆసక్తిని  అభివ్యక్తిని గ్రహించి ఆమె తండ్రి ఆమె ను కవితవం లో ప్రొత్సహించారు. ఒకనాడు ఆల్జీబ్రా లెక్కతో కుస్తీపడుతూ ఉంటె ఆమెకు హఠాత్తుగా కాస్త విశ్రాంతి తీసుకుందామనిపించింది. ఆ విశ్రాంతి తీసుకున సమయం లోనే  ఆమెలో కవితా భావోద్విగ్నత  అదే  లో పుస్తకంలో 1300 పంక్తుల కవిత రాసింది. ఆ కవిత పేరు " ద లేడీ ఆఫ్ ద లేక్ ". ఇది చుసిన తండ్రి ఆమెను కవిత్వ దిశగా ప్రోత్సహిన్చానారంభించారు. తండ్రి   ప్రోత్సాహం తో పారసీ భాషలో " మహెర్ మునీర్ " అనే నాటకాన్ని రచించింది. తమ్ముడు హరీంద్రనాథ్ కొన్ని ప్రతులు తన మిత్రులకు ఇస్తూ ఒక ప్రతిని నిజాముకు పంపడం జరిగింది . అతి పిన్న వయసులో ఇంత  అద్భుతమైన నాటకాన్ని రాసిన సరోజినిని నిజాం నవాబు  ఏంతో  అభినందించారు. 

పసి  ప్రాయం నుండి కవిత్వం తో ఎదుగుతోన్న సరోజినీ కి పదిహేనేళ్ళ ప్రాయం లోనే తనకంటే వయసులో బాగా పెద్దైన డాక్టర్ గోవిందరాజులు నాయుడు గారిని మనస్పూర్తిగా ప్రేమించింది . 
తల్లితండ్రులు నివ్వెర పోయారామే చర్యకు. వారు కులీన బ్రాహ్మలు బెంగాలీ వారు నాయుడు గారు చూస్తె తెలుగు వారు పైగా బ్రాహ్మలు కారు ఎలా ఈ వివాహానికి అంగీకరించడం? పెద్ద 
సమస్య. నిజాము నవాబు ఆమె రాసిన నాటకాన్ని మెచ్చుకుని ఆమెకు ఇంగ్లండు వెళ్లి ఉన్నత విద్య నభ్యసించేందుకు స్కాలర్ షిప్ ఇచ్చారు. ఈ అవకాశాన్ని వదిలేయకుండా ఆమెని మనసు కుడా మరలు తుంది అనే ఉద్దేశం తో ఆమెను ఇంగ్లండు పంపడం జరిగింది. అక్కడ లండన్ లోని కింగ్స్ కాలేజ్ లోనూ గర్టన్ కాలేజ్ , కేంబ్రిడ్జ్ లోనూ ఆమె అభ్యాసం కొనసాగింది . ఆక్కడే ఆర్థర్ సైమన్స్ , ఎడ్మండ్ గోస్ లాంటి మంచి మిత్రులని విద్యా, సాహితీ వేత్తలని ఆమెకి పరిచయం చేసింది . ఈ పరిచయంలో వారి విద్యా సహచర్యం లో మరింత పదునుగా భాష పై పట్టు అభివయ్క్తి స్పష్టతా అన్నీ ఆమెకు ఆంగ్ల భాషలో అబ్బాయి . లేకుంటే ఆమెకున్న భావ తీవ్రతకు సరి అయిన భాషా వాహిక దొరికేది కాదు ఆమె తన భావాలను అక్షరాల్లోకి అనువదించాలేకపోఎది కుడా . 
ఇంగ్లాండ్ ప్రయాణం ఆమెను సాహిత్యం లో మరింత  పరిపుష్టం చేసింది . అయినా ఆమె చిన్ని హృదయం లో  ప్రేమ బీజం కూడా ఆమెతోనే ఎదుగుతూ ఏమాత్రం రాజీపడకుండా నాయుడు  గారిని వివాహం చేసుకోవడం లో ఎక్కడా రాజీ పడలేదు . ఆరోజుల్లో ఒక కులాంతర వివాహం చలా సంచలనాన్న్ని సృష్టించింది . సరోజిని  ప్రేమ సంకల్పం తో సరోజినీ నాయుడు అయి మన తెలుగింటి కోడలైంది . నలుగురు బిడ్డలా తల్లి  అయింది . జయ సూర్య , పద్మజా , రణధీర , లీలామణి ఆమె బిద్దలు. తన బిడ్ల గూర్చి కవిత్వం రాస్తూ జయ సూర్యను , బంగారు విజయ సూర్యుని గా సంబోధిస్తూ , తన జీవితంలోని మబ్బు తొలగించే దివ్య తేజస్సు నీవని పేర్కొంటుంది . అలాగే మిగిలిన పిల్లలగుర్చి కుడా కలవ భామ అని , పద్మజను , యుద్ధ వీరుడవని రణ ధీరనూ , నా జీవితపు చిరు దీపికవు అంటూ లీలామణి ని ఉద్దేశించి రాస్తుంది సరోజినీ. 

సరోజినీ నాయుడు కవిత్వం : ప్రచురణలు 

 భారతీయ సంస్కృతిని ప్రతిబింబించే కవిత్వం సరోజిని నాయుడు ప్రత్యేకత. ఆమె రాసిన " బాంగెల్ సెల్లర్స్" , " కోరమాండల్ ఫిషర్స్ " , " ఇండియన్ వీవర్స్ " కవితలు స్కూల్  లో చోటు చేసుకున్నాయ్  దాదాపు అందరూ చదివిన కవితలు ఇవి. 
ఆమె కవిత్వాన్ని చూసిన ఎడ్మండ్ గాస్ ప్రోత్సాహం తో , ఆర్థుర్ సైమన్స్ ముందు మాటతో " ద గోల్డెన్ త్రెష్  హోల్డ్ "(1905 ) లో ఇంగ్లాండ్ లో ప్రచురితమయింది. 
"ద బర్డ్ ఆఫ్ టైం : సాంగ్స్ ఆఫ్ లైఫ్, డెత్ , & ద  స్ప్రింగ్ ",1912 లో లండన్ లో ప్రచురితమయింది . 
"ద బ్రోకెన్ వింగ్ : సాంగ్స్ ఆఫ్ లవ్,డెత్ , అండ్ ద స్ప్రింగ్" , మరియు "ద గిఫ్ట్ ఆఫ్ ఇండియా" (1915 లో బహిరంగ సభ లో చదివినది) ఇవి అన్నీ 1917 లో ప్రచురితమయాయి. 
" ద స్కేప్ట్ర్డ్ర్డ్ ఫ్లూట్ : సాంగ్స్ ఆఫ్ ఇండియా, 1943 లో ఆమె  తర్వాత ప్రచురితమయాయి . 
"ద ఫెదర్ ఆఫ్ ద డాన్ " ఆమె కుమార్తె పద్మజా నాయుడు సంపాదకత్వం లో 1961 లో ప్రచురితమయింది. 

సరోజిని  నాయుడు వ్యక్తిత్వం మరియు  కవిత్వ తత్త్వం :

సరోజినీ నాయుడు బహు ముఖ ప్రజ్ఞా శాలి , కవయిత్రి గానే కాక మంచి  వక్త గా కూడా మంచి ప్రఖ్యాతి గల స్త్రీ మూర్తి. కాంగ్రెస్ సభల్లో ఆమె చేసిన ప్రసంగాలకు అందరూ ముగ్ధులై పోయేవారు. అనారోగ్యాన్ని కుడా లెక్క చేయకుండా స్వాతంత్ర్య ఉద్యమం లో పాల్గొన్న ధీశాలి. ఆమె కవిత్వం లో చాలా విషయాలను వస్తువులుగా తీసుకుని రచించింది.ఎ విషయాన్ని తీసుకుని కవిత్వీకరించినా అందులోని భావ సాంద్రత , భాషా అలంకారాలు , ప్రతీకలు చదువరుల మనసుకి హత్తుకు పోయేవి . 
భారత మహిళలకొక మేలుకొలుపుగా ఆమె వాని పనిచేసింది ఆ నాడు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఉత్తర ప్రదేశ్ గవర్నర్ గా పదవీ బాధ్యతను కూడా సమర్థవంతంగా నిర్వహించింది . భారత దేశపు మొట్ట మొదటి మహిళా గవర్నర్ సరోజినీ నాయుడు. అందరికీ స్ఫూర్తి దాయకమైన ఆమె మాటలు , అనర్గళంగా మధురంగా ప్రసంగించగల శక్తి ని చూసి గాంధి గారు ఆమెను " భారత కోకిల " గా పేర్కొన్నారు. 

అనుకున్నది ఎంత కష్ట తరమయిన  పని అయినా మొక్కవోని పట్టుదలతో సాధించే సరోజినీ కవిత్వం లోని ఆమె ఆంతర్యం మాత్రం కనుగొనలేదు చాలామంది. ఎ కొద్ది మందికో తప్ప ఆమె కవిత్వం లోని భారతీయత కాక ఆమె వైయుక్తిక దు:ఖం అగుపించలేదు. " ద బ్రోకెన్ వింగ్ " లో ఆమె కవిత్వం లో అంతర్లీనంగా నిక్షిప్తమైన ఆమె అంతరంగ మథనం  దృష్టికీ కనబడకుండా అతి గాంభీర్యం తో మెసలేది ఆమె. 
ఆర్థర్ సైమంస్ అంటాడు ఆమె గురించి ఇలా " ఆమె కోరిక ఎప్పుడూ , ఓక స్వేచ్ఛా విహంగమై పక్షులతో గాలిలో, గుండె నిండా పాట నింపుకుని ఎగరాలనే " కోరుకునేది . 
ఇంట ధీశాలి అయిన ఆమె సున్నిత హృదయురాలు. ఎక్కడో మది లో ఏమూలో సోక  ఐన ఆమె మానసం ఆమె కవితల్లో స్పష్టమౌతుంది. 
జీవితం లో  అన్నీ  గలిగినా ఎక్కడో  మేఘ ఛాయలు ఆమె హృది ఆవరణమంతా పరుచుకుని ఉండేవి . ఇది ఫలానా విషయానికి ఈ బాధ అని ఎవరికీ తెలియనివ్వని నిండుతనం ఆమె వ్యక్తిత్వానికి పెట్టని కోట. 
సరోజినీ నాయుడు లోని ఆఎమ్ వైయుక్తిక దుఖాన్ని ఇప్పటికీ ఆమె కవిత్వం లోనుండి పట్టుకుని పరిశీలనా చేసిన వారు బహు కొద్దిమంది . తానూ వ్యక్తీకరించడానికి ఇష్టపడే వ్యక్తిత్వాన్ని  మాత్రమే  తన చుట్టూ ఉన్నవారికి చూపించి తనలొఇ దు:ఖాలను  మార్మికత యవనిక వెనుక దాచేసిన కవయిత్రి ఆమె. ఆమె కవిత్వం లోని  భారతీయత ఉట్టిపడుతుంది . కానీ ఆమె కొన్ని కవితల్లో తన బాధను కూడా వెలువరించింది . అలాంటి  రెండు కవితలు ఆమె హృదయ వేదనా గళం నుండి ఒలికినవి ఇక్కడ మీకోసం . 

మరణించిన నా  స్వప్నం 

తుదకు నను కనుగోన్నావా , ఓ నా స్వప్నమా ?
సప్త యుగాల క్రితం నీవు మరణించావు , మంచు అడవుల్లో నిన్ను ఖననం చేశాను 
మరల ఎందుకు తిరిగి వచ్చావు ? నీ దీర్ఘ నిదురను చెదిరించిన దెవరు 
నన్ను ఈ నీలి అఘాతాలనుండి వెతకమన్నది ఎవరు ?
నా ఇంటి చూరుపై నున్న ఈ పవిత్ర హరిత పత్ర మాలలను తుంచేస్తావా ?
గూడు కుదిరిన శ్వేత , ఆనందపు అడవి పావురాలను భయపెడతావా ?
మరణించిన నీ చేతి వేళ్ళ స్పర్శతో  నా పౌరోహిత్యపు మది వస్త్రాలను తాకి మైల పరుస్తావా ?
నీ బాధను ప్రేమ మంత్రాల అలికతో నా పండుగ లో పఠిస్తావా ?

తిరిగి వెళ్ళు నీ సమాధికి , ఓ నా స్వప్నమా, మంచు అడవుల లోతులకి 
ఎక్కడ ఒక గుండె చెదిరిన బాల నిన్ను దాచిందో ఏడూ యుగాల ముందర అక్కడికే వెళ్ళు 
నీ చీకటి నుండి నిన్ను ఎవరు తట్టి లేపారు ? నేను నీకు వీడ్కోలు పలుకుతున్నాను !
నా  హృదయ శకలాలలో నే కట్టుకున్న దేవళాలను ఛిద్రం చెయ్యకు . 

ఆంగ్ల మూలం : మై డెడ్  డ్రీమ్ , సరోజిని నాయుడు 
తెలుగు సేత : జగద్ధాత్రి 

 మృత్యువుతో కవి 

కాసేపాగు , ఓ మృత్యువూ, నేనిపుడు మరణించలేను 
నా మధుర జీవనం వసంత హేలలో ఓలలాడతోంది ;
నా   సుందరంగా ఉంది , గొప్పగా పూచిన కొమ్మలు ప్రతిధ్వనిస్తున్నాయి 
మత్త కోకిలలు ఆలపిస్తున్నాయ్ 

కాస్త ఉండు ఓ మరణమా నేను చావలేను 
విరబూసే నా కలలన్నిటినీ కోసుకోకుండా 
నా ఆనందాలను ఆస్వాదించకుండా , నా గీతాలను అలపించకుండా
నా కన్నీళ్లను స్రవించకుండా , నేను మరణించలేను 
కాసింత నిలువు , నేను సంతృప్తి చెందేదాక 
అనురాగంతో , ఆవేదనతో , దాత్రితో, మారే గగనం తో 
నా మానవ ఆకళ్లన్నీ తీరేదాకా  
ఓ మరణమా , నేను మరణించలేను 

ఆంగ్ల మూలం : ద పోయెట్ టు డెత్ , సరోజిని నాయుడు 
తెలుగు సేత : జగద్ధాత్రి 

భారతీయ ఆంగ్ల కవులు మహానుభావులైన తాత్విక కవులు టాగోర్ , అరబిందో లాంటి ఎందరినో మెప్పించిన కవయిత్రి సరోజినీ.   ఆంగ్లేయులు కూడా తనది కాని భాష లో పట్టు సాధించి కవితా హృదయాన్ని ఆవిష్కరించిన  సరోజిని పట్ల అత్యంత అభిమానం , ఆమె కవితా శక్తికి అబ్బురం చూపేవారు. 
స్వాతంత్ర్య  పోరాటం లో గాంధీ ని అనుసరించి , గోపాల కృష్ణ గోఖలే , నెహ్రూ వంటి వారి తో సమానంగా గౌరవమ్ పొందిన మన తెలుగింటి కోడలు , భారత దేశ పు ఆడపడుచు సరోజినీ నాయుడు . అనంతమైన తాత్వికత తో బాటు స్త్రీ హృదయాన్ని అక్షరీకరించిన ఆది ఆంగ్ల కవయిత్రి సరోజినీ నాయుడు అనడం ఆమెకు మనం సహస్రాంజలి ఘటించడమే. అందుకు అన్ని విధాల అర్హురాలు భారత భారతి ముద్దుల చిన్నారి సరోజినీ నాయుడు. 


జగద్ధాత్రి 

No comments:

Post a Comment