Thursday, April 7, 2011

జీవన నిఘంటువు


భాషా నిఘంటువు లాగే జీవన నిఘంటువును                    
కూడా నవీకరించుకుంటూ ఉండాలి
అనుభవాల పరంపర నుండి
కొత్త పదాలను చేర్చుకుంటూ పోవాలి
కాల గమనంలో ఓ వసంతం
నీ అయువుకే కాదు
నీ కౌసలానికీ  ఒక మెట్టే
నీ నిగ్రహ ఆగ్రహలకు
ఎగుడు దిగుళ్ళ ఆనవాలే
తరలిపోతూ ఓ వత్సరం వేసిన దెబ్బలు
ప్రక్రుతి విసిరిన భీభత్సపు క్రియానుభావాలు
ప్రవృత్తి చేసిన మంచి చెడు కార్యాలు
తీపి చేదు ఫలితాలను మాటలుగా
మిగిలిపోయే  ఎన్నో ఆశా నిరాశలను
బతుకు వ్యాకరణంలో జోడించుకుంటూ
శిశిరం వదలిన  తిమిరపు ఛాయలను వీడి
నవ వసంత హేలను స్వప్నిస్తూ
మరో ఉగాది షడ్రుచులకు ప్రతీకగా
స్వీకరిస్తూ .....
అనంతమైన కాలాన్ని మన చేతులతో కొలుస్తూ
మరో ఏడాదిని ఆనందంతో ఆహ్వానిస్తాం
ఆమెకో నామకరణం చేస్తాం
తానివ్వబోయే ఫలితాలను
మన మిడి మిడి మేధతో ఊహించి
మనకు కవాల్సినట్టుగానే ఉండాలని ఆశను
ఆకాంక్షలతో పంచంగాలను రంగరిస్తాము
ప్రతి ఏడు మిశ్రమ ఫలాలే
విడదీయలేని ఆశా నిరాశల
అనుబంధాల అనురాగాల
జీవితమే ఒక మిశ్రమనామవాచకం  కదా
ప్రయా ప్రమేయాలు లేని
సంక్లిష్ట క్రియానుభుతి కాదా?
భౌతిక మానసిక షడ్రుచులను
మేధో మాధనంతో ఆస్వాసిస్తూ
ఆస్వాదిస్తూ సాగుతూ పోవడమే
జీవన ధర్మమని మరో సరి
మనకి మనం వక్కాణిన్చుకునే
మరో సారి జీవిత వ్రతానికి
సంకల్పం చెప్పుకునే
ఉగాది ప్రతి ఏడాది అర్ధాలు మారే
అరుదైన పదం
అందుకే ప్రతి ఏడాది ఉగాదినాడు
జీవన నిఘంటువును
అనుభవాల పరంపరలోని
సరికొత్త భాష్యాలతో
పర్యాయ పదాలతో
మారిన అర్ధాలతో
నవీకరించుకోవాలి
లేదా కాలపు జోరు పరుగులలో
మనం వెనుకబడి పోతాము
వసంతాగమనం ఓ పండుగ కంటే
జీవన నవ్య నిర్వచనాలకు
నవ ఆచరణలకు
ప్రణాళికలు వేసుకుని
తద్యనుగుణంగా వచియించు కుంటూ
సాగిపోయే సజీవ యాత్రకు సంకేతం
ఉగాది అంటే జీవితానికి ప్రతిపదార్థం కదా...!!!

....................................ప్రేమతో...జగతి 


                                      








No comments:

Post a Comment