Monday, April 25, 2011

మా విశాఖ డిలైట్ హౌస్...!!!

అతనిది మనోధర్మ సంగీతం 
మేధో సాంద్ర సాహిత్యం
వెరసి అతనో డబల్ ధమాకా 
నవ్వుల పువ్వుల మా విశాఖ డిలైట్ హౌస్ మా  "భరాగో"                                       
నవ్విస్తూ తానవ్వక                              
ఒప్పించుకు తిరుగుతూనే ఉన్నాడు
మాట పెళుసు 
మనసు మెత్తనే
పేదరికపు ఉలి దెబ్బలతో 
రాటు దేలిన వాడు మరి
వారాలబ్బయిగానే జీవితానికి
విధేయుడిగా ఉంటూ
కధన సేద్యం చేస్తూ
హాస్యపు పంటలు పండించాడు
మనిషి స్వభావం పట్టుకోవడంలో
సి.టి. స్కాన్ అతను
మూడుకోణాలనుండి మనిషిని
తివర్ణ చిత్రంగా త్రీ డి లో విశ్లేషించగల దిట్ట 
ఫ్రాయిడ్ . మామ్, లారెన్స్, ప్రభావం ఉందంటాడు తనపై నిర్మొహమాటంగా 
తనకి తానే ఓ విశిష్టమైన అభివ్యక్తితో
అన్ని వైపులా వెలుగు సారించే 
మా విశాఖ డిలైట్ హౌస్ తాను 
జీవన విషాదాలకు 
సరదాల కర్టెన్లు వేసి 
నవ్వు పువ్వుల డిజయిన్ లెన్నో చెక్కిన రస శిల్పి
కదిలినన్నాల్లూ తానో టైటానిక్ 
రసజ్నులందరికీ అతని సాంగత్యం
ఓ మంచి టానిక్
డాల్ఫిన్ హౌస్ లా, కైలాసగిరిలా
సింహాద్రి కొండలా
మా 'భరాగో' అందరినీ  కదిలిస్తూ
తాను మాత్రం కదలని కొండై నిలిచాడు
అలాగే నిలిచి ఉంటాడని
ఉండాలని అనుకున్నా 
(నిజానికి ఇప్పటికీ ఉన్నట్టే అనిపిస్తుంది)
కాకుంటే అల్లరి పెడుతూ 
మొరాయిస్తోన్న దేహానికి 
బుద్ధి చెప్పి వదిలి వెళ్ళాడు  
అక్కడ యముడికో ఇంద్రుడికో 
ఓ గాట్టి "వార్నింగ్" ఇచ్చి 
త్వరలో మళ్ళీ వినూత్న దేహధారుడై
మా సాహితీ లోకానికి విచ్చేస్తాడు 
"మీకూ కధలే ఇష్టం " అంటూ మరిన్ని చెప్పడానికి ...ప్రేమతో ..జగతి 
22.10 pm sunday  18/04/2010 
(ఈరోజు భరాగో గారి సంవత్సరీకం ఆ సందర్భంగా అప్పుడు ఆంధ్ర భూమిలో అచ్చయిన ఈ నివాళిని చిన్ని మార్పులతో..25-04-2011..)


1 comment:

  1. 'మిడిపాటిమపాలం' అంటూ ఆంధ్రభూమి వారపత్రికలో ఆయన పేరు లో 'భ.రా.గో 'లేకుంటే ఆయన గొప్పేమిటంటూ సరదాగా (భ)మిడిపాటి (రా)మ(గో) పాలం గురించి నేను రాసిన ఆర్టికల్ కు ఆయన ఎంత సంతోషించారో!'నేను మిడిపాటి మపాలం మాట్లాడుతున్నా' అని ఆయన ఫోన్ చేస్తే నేనే ఎవరా అని తికమకపడ్డా.-Sudhama

    ReplyDelete