Friday, March 16, 2012

జీవన వాస్తవిక రచయితలు చాసో , జగన్నాధ శర్మ



జనవరి 17   ఈ తారీకు వినగానే సాహితీ లోకమంతా పద్దెనిమిది ఏళ్లుగా వెంటనే తలచుకునేది విజయనగరం లో చాగంటి తులసిగారు తన తండ్రి,అభ్యదయ రచయితల సంఘం సంస్థాపకుడు అయిన జగమెరిగిన రచయిత "చాసో స్ఫూర్తి " పురస్కారం. ఇప్పటికి పదిహేడు మంది కి ఇవ్వబడ్డ ఈ పురస్కారం ఈ ఏడాది నవ్య వార పత్రికా సంపాదకులు , ప్రముఖ కధకులు శ్రీ జగన్నాధ శర్మని వరించింది. సమంజసమే ఆనందం కూడాను. ఇటీవల ఇక్కడ జరిగిన ఒక సాహితీ సభ లో జనవరి రెండవ తారీకున చాసో పై ఒక సమాలోచన సభ ప్రజాస్పందన అధ్యక్షులు శ్రీ చాగంటి సుందర రావు గారు నిర్వహించారు. ఆ సభలో చాసో కుమార్తెలు చాగంటి తులసి గారు, కృష్ణ కుమారి గారు కూడా పాల్గొన్నారు. చాగంటి తులసి గారు మాట్లాడుతూ ఈ పురస్కారం ఇవ్వడంలోని ఉద్దేశాన్ని వివరించారు. చాసో నిర్భయంగా , నిర్మొహమాటంగా, ఉన్నది ఉన్నట్లు చెప్పే మనిషని , తన కధలకి తానే మొదటి విమర్శకుడని నచ్చక పోతే , లేదా తాననుకున్న స్థాయి లో కధ లేదనుకుంటే నిర్మొహమాటంగా చింపేసేవారని చెప్పారు. అందుకే  ఒక కధకుడిగా , ఒక ఆత్మ విమర్శకుడిగా , సాహితీ స్రష్ట గా చాసో సాధించిన సాహితీ కీర్తి చాల తక్కువమందికి లభిస్తుంది.

తాము రాసిన ప్రతి అక్షరం చాలా గొప్ప అనుకుంటున్నఎందరో రచయితలకు చాసో నిజంగానే ఒక స్ఫూర్తి. ఇక ఈ పురస్కారం వెనుక గల సాహితీ కారులు కొంతమంది ప్రజల మనసులలో నిలిచిపోయే మానవీయ కోణాన్ని ఆవిష్కరించే కధకులకి ఈ పురస్కరాన్నివ్వడం జరుగుతోందని , అంతే కానీ దేనికి మీ కధల సంపుటులు  పంపండి అని ఏమీ రూల్ లేదని చెప్పడం చాల ముదావహంగా ఉంది. ఒక సత్యమైన సాహితీ కారుని లేదా కళా కారునికి గుర్తింపును మించిన ఏ పురస్కారము అక్కర్లేదు. అతని అక్షరాలు శాశ్వతంగా నిలవడమే అతనికి అన్నిటికీ మించిన వరం, పురస్కారం. అయితే కొన్ని పురస్కారాలు రచయితకి గుర్తింపు తీసుకోస్తూనే మరింత సామాజిక బాధ్యతను కూడా పెంచుతాయి. అలాంటి స్ఫూర్తి కలిగించడం లో ఈ పురస్కారం కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డ్ ను  అతి పిన్న వయసులోనే అందుకున్నసలీం వంటి రచయితలను కూడా వరించింది. తెలుగు సాహిత్య లోకంలో తల మానికంగా నిలిచిన ఈ పురస్కారం పొందాల్సిన రచయిత లో ముందు ఉండాల్సిన అతి ముఖ్యమైన లక్షణాలు , మానవీయత, సహజత్వం, సామాజిక బాధ్యత, తనదైన విశిష్ట శైలి. ఇవన్నీ కలిగిన కధకులకు మాత్రమే ఈ పురస్కారం లభిస్తుంది. 

ఈ లక్షణాలన్నీ పుష్కలంగా కలిగిన రచయిత జగన్నాధ శర్మ. శర్మ గారు ఫ్లైట్లో కూర్చుని పేద వారి జీవితం గూర్చి కధ లల్లరు , నిజ జీవితం లో అతి పేదరికం నుండి వచ్చి , ఆ పేదరికపు ముళ్ళనుండి ఈనాడు ఒక పత్రికా సంపాదకుడిగా ఎదిగినప్పటికీ ప్రతి క్షణం తన మూలాలు మరవని రచయిత శర్మ. జీవితం లో ఎన్నో అనుభవాలను చేదు శాతం ఎక్కువగా ఉన్న వాటిని చవి చూస్తూ , దుఖాల్ని దిగమింగు కుంటూ తనకున్న ఒకే ఒక ఆయుధం , ఆలంబనా అక్షరం మాత్రమే అని మనస్పూర్తిగా నమ్మే ఆత్మ గౌరవమున్న మనిషి శర్మ. అందుకే అతని కధల్లో చాసో పురస్కారానికే కాదు సకల సాహితీ మానవ లోకాన్ని కదిలించగల వాస్తవాలున్నాయి. జీవితాన్ని అక్షరీకరించడం మాటల తో పని కానే కాదు. అందుకు ముందుగా ఉండాల్సిన ఆత్మ స్థైర్యం, ఆత్మ పరిశీలనా , అభివ్యక్తి ఇవన్నీ ఉంటే నే గానీ ఒక కధ రాసి మెప్పించాలేము , పాఠకుల హృదయాలలో నిలవలేము. సార్వజనీనత ఉండని కధలు కాని సాహిత్యం కానీ ఎక్కువ  కాలం నిలవదన్నది మనమందరమూ ఎరిగిన సత్యం. 
ఈనాటి కధకుడు తను ఏ భాష వాడైనా, ఏ ప్రాంతపు వాడైనా రాసేది సకల మానవ హృదయ సంక్షోభం , విశ్వ సత్యాలు అయినప్పుడు అవి ఎన్నటికైనా నిలుస్తాయి. కేవలం నాలుగు పుంజీలు కధలు మాత్రమే రాసిన చాసో కొన్ని  తరాలకు స్ఫూర్తినివ్వగల రచయిత గా మిగిలాడంటే అది అతని నిజాయితీ గల అక్షరం లోని బలం. 

ఇటీవలే విడుదలైన జగన్నాధ శర్మ కధల  సంపుటి "పేగు కాలిన వాసన" లో ని కధలు ఇటువంటి జీవిత సత్యాలనే అవిష్కరించేవి. పరిస్థితుల కాఠిన్యాన్ని పంటి బిగువున భరిస్తూ జీవన సమరం సాగించే మనషుల కధలు ఇవి. జీవితాన్ని బైస్కోప్ లాగా కాక మైక్రోస్కోప్ లోంచి దాని కణ కణాన్ని చవి చూసి అనుభూతించి రాసిన కధలివి. ఈ  సంపుటిలోని "రెక్క తెగి పడిన పావురం" అనే కధ చదివినప్పుడు ఎటువంటి పాఠకుడికైనా  ఏదో తెలియని ఆవేదన కడుపులో మెలి పెడుతుంది. ఆ ఆవేదన పేరే ఆకలి. బ్రహ్మ రాక్షసి లాంటి ఈ ఆకలిని మనిషికిచ్చి బ్రతకమని శాసిస్తుంది జీవితంపై మమకారం. ఈ రెంటి వేదనల మధ్య తాను ఎలా మసలు కుంటాడో మనిషిగా నిలబడతాదనేది ప్రతి మనిషికీ ఒక అగ్ని పరీక్ష.

అయితే ఇందులో గెలుపు ఓటముల ప్రసక్తి లేదు. సమాజం స్థాపించిన  ఈ కుహనా విలువలు మనిషిని ఎందుకు కట్టి పడేస్తాయో , ఎందుకు మనిషి పరువూ, మర్యాద అనే మాస్కులు వేసుకుంటాడో , ఈ సంఘంలో అన్నది ప్రశ్న. అన్నిటికీ మించి సహజాతమైన ఆకలి, నిద్ర, కామం , ఈ మూడింటిలోనూ మనిషి ఎలా ప్రవర్తిస్తాడనేది ముఖ్యం. ఎప్పుడు ఆత్మను చంపుకోవాల్సి వస్తుంది బ్రతకడానికి ఎలా ఒక స్త్రీ తన భర్త చేత స్వయంగా తన ఆడతనాన్ని మరొక పురుషుడికి వెలకిచ్చి బతుకు బండి నడపడానికి ఎలా తోడ్పడుతుంది అన్నది  ఈకధలోని సారంశం.

1945 లోనే స్వాతంత్ర్యం  రాని కాలం లోనే "ఢ౦కా" మాస పత్రికలో చాసో రాసిన "లేడీ కరుణాకరం " కధ. ఈ రెండు కధలూ ఎందుకు చెప్తున్నాను అంటే వీటిలోని సారూప్యత కోసం ఒక చిన్నపాటి పరిశీలన మీ దృష్టికి తీసుకు వద్దామని నా ఉద్దేశం. ముందుగా రెండు కధల్లోని సారూప్యాతలే౦టో చెపుతాను. ఒకటి, రెండు కధల్లోనూ పెళ్ళైన స్త్రీ తన భర్త కోసం వ్యభిచరించడం అదీ భర్తకి తెలిసి ఉండగా. నిస్సహాయుడైన ఆ భర్త పరిస్థితి. ఇక కధన రీతి లో కి వెళితే చాసో నిర్మొహమాటంగా ఆరు దశాబ్దాల క్రితమే ఆవిష్కరించిన జీవన నగ్న  సత్యాన్ని 1988 లో శర్మ తన కధ లో ఆర్ద్రతతో ఆవిష్కరించారు. ఎన్ని కబుర్లు చెప్పినా ఆకలి మనిషికి తప్పదు. అలాగే కామం మనిషిని లొంగదీస్తుంది . ఇది మనం ఒప్పుకున్నా లేకున్నా ప్రపంచ౦లోని  ఎందరో కధకులు రాసిన సజీవ చిత్రాల్లాంటి కధలు నిరూపించాయి. 

ప్రఖ్యాత మనోవిజ్ఞాన శాస్త్రజ్ఞుడు అబ్రహాం మాస్లో తన థియరీ ఆఫ్ నీడ్స్ లో ఒక కోను రూపంలో ప్రస్తావించాడు.ముందుగా మనిషికి కావలసినవి మానవ సహజాతాలు అయిన ఆకలి , నిద్ర, కామం, ఇవి తీరిన తర్వాతే మనిషి మానసిక మైన అవసరాలను గూర్చి ఆలోచిస్తాడు. అందులో గుర్తింపు, కీర్తి, ధనం, పదవులూ, ఇక చివరిగా తనని తని తెలుసుకునే ప్రయత్నాన్ని ఆత్మ సిద్ధికి గా ప్రస్పుటీకరిస్తాడు మాస్లో. ఏ మనిషి ఇందుకు భిన్నంగా ప్రవర్తించడం మనం చూడలేము. ఇక ఈ రెండు కధల మధ్యన దాదాపు 28  సంవత్సరాల దూరం ఉనప్పటికీ అదే జీవన సత్యాన్ని ఆవిష్కరించడంలో శర్మగారు క్రుతక్రుత్యులయారు. ఆకలి , పేదరికం మనిషిని ఆత్మాభిమానాన్ని చంపుకుని మానాన్ని అమ్ముకునే విధంగా ఎలా తాయారు చేస్తుందో నిజానికి చాసో చాల కఠోర౦గా ఆవిష్కరించారు. శర్మ కధలో కొంత ఆర్ద్రత ఉన్నప్పటికీ జరిగే విషయం మాత్రం ఒకటే. అక్కడ "లేడీ కరుణాకరం" లో ని కరుణాకరం, శారద అయినా, ఇక్కడ "రెక్క తెగి పడిన పావురం లోని వనజాక్షి , శంకర౦ అయినా ఒకే లాంటి పరిస్థితి ఒకే లాంటి పరిష్కార౦. 

"అనేక విషయాలలో సమాధానాలు పడుతూ ఉంటేనే జీవితం ఎవరికైనా గడుస్తుంది" అని సరి పెట్టుకుంటాడు కరుణాకరం తనకి పుట్టని తన ఆరుగురు పిల్లల్నీ చూస్తూ. ఇది మనిషిని కలిచి వేసే నిష్టూరమైన నిజం. అలాగే శర్మగారి కధలో మేడ పైన రామకృష్ణ వనజాక్షి పై ఆశ పడుతున్నాడని తెలిసీ చూసి చూడనట్టు ఉరుకుంటాడు శంకరం. చివరికి ఇక శంకరం అమ్మ మరణం తో అక్కడికి వెళ్ళాల్సి  రావడానికి చేతిలో చిల్లిగవ్వ లేదు, ఇక రామక్రిష్ణని ఆశ్రయించక తప్పని పరిస్థితిలో పైన  ఏమి జరుగుతుందో తెలిసీ ఆమెను అక్కడికి పంపి తను బయటికి వెళతాడు ఈ మగడు. అయితే రామకృష్ణ ఏమీ దాన కర్ణుడు కాదు ఉత్తినే ఐదు వందలు సమర్పించడానికి , వాళ్ళు ఆ డబ్బు తిరిగి ఇవ్వలేరనీ తెలుసు అతనికి. ఇక్కడ వనజాక్షి దేహంతో బేరం పెడతాడు .లొంగక తప్పని తనం తో వనజాక్షి రామకృష్ణ బేరానికి ఒప్పుకుంటుంది. 

చాసో    కధలో మొట్ట మొదటి సారి తన భార్య వేరెవరితోనో ఉండడం చూసి మండిపడిన కరుణాకరం మగతనం మామగారి మాటలతో అవాక్కైపోతుంది. నీ చదువుకి డబ్బులు ఇవన్నీ ఇలా వచ్చినవే అని చెప్పిన మామగారి మాటలు విన్నా ఇకనైనా వద్దని భార్యని తీసుకుని వేరే ఉద్యోగం వెతుక్కుని సంసారం చేస్తుంటాడు కరుణాకరం ఒక చలీ చాలని జీతం  తో, అసంతృప్తి జీవితం తో. అక్కడికి  కూడా శారద కోసం నాయుడు రావడాన్ని అభ్యంతర  పరచగా శారద అప్పుడు అతన్ని అడిగిన కఠోర మైన సత్యాలముందు, తను సంపాదించినా డబ్బులు చుపిస్తోంటే ,భవిష్యత్తు బంగారం చేసుకో మని హితబోధ చేస్తుంటే ఇదంతా నీ కోసమే మన కోసమే చేసానని చెప్తోంటే మరి కరుణాకరం లోని మగ వాడు లేవడు, కేవలం స్వార్ధపరుడు మాత్రమే బ్రతుకుతాడు. అందుకే ఆ డబ్బు తోనే చదువుకుని పెద్ద బాంక్ ఆఫీసరై చివరికి "సర్" అనే బిరుదు ఆ రోజుల్లో ఒక గొప్ప పురుషునికిచ్చే బిరుదును సొంతం చేసుకుంటాడు, దానితో శారద కాస్తా లేడీ కరుణాకరం అవుతుంది. ఈ కధ ఆఖరి వాక్యం "శారద మహా పతివ్రత" అంటూ ముగిస్తాడు చాసో. భర్త కోసం పరాయి వారితో బిడ్డల్ని  కన్న కుంతి లాంటి వాళ్ళు పతివ్రతలితే మరి శారద మాత్రం కదూ? ఖచ్చితంగా  అవుననాలి మనసున్న ఏ మనిషైనా. 

శర్మ కధలో రామకృష్ణ తో వెళ్తే అతను కడుపు నిండా తిండీ నిద్రా ఇస్తానన్నాడు అని అక్కసుగా చెప్తే  అయితే మరి ఉన్నది ఒక్క సూట్ కేసు కదా మా బట్టలేక్కడ పెట్టుకోవాలి అన్న శంకరాన్ని అసహ్యంతో నువు మనిషి పుట్టుక పుట్టలేదూ అని చీత్కరిస్తుంది వనజాక్షి. అప్పుడు శంకరం .."మనిషిగా పుట్టాను కనుకనే , అందునా మధ్య తరగతి మనిషిగా పుట్టాను కనుకనే ఎన్ని దేబ్బలైనా ఓర్చుకునే మనస్తత్వాన్ని కలిగి ఉన్నాను. నువ్వు చెప్పిచ్చుకు కొట్టినా నేను బాధ పదను." అంటూ తననిలా తాయారు చేసింది తన కుటుంబ వ్యవస్థ అనీ పేడ వంటి ఈ సమాజం లో తనని నిస్సహాయంగా జరవిదిచారని అందులో పురుగులా తప్ప జీవించడం కష్టమని ఎటువంటి సమాధానమూ భార్య ప్రశ్నకు ఇవ్వడు శంకరం. ఆ క్షణంలో  అతనిలోని బతుకు భయాన్ని చూసి ఒక్కసారి అతన్ని అల్లుకు పోతూ పిచ్చిగా అంటుంది నేనూ లేకుంటే నువ్వెలా  బతుకుతవయ్యా అంటూ పసి పిల్లాడ్ని అక్కున చేర్చుకున్న తల్లిలా పెనవేసుకుపోతుంది. మరి వనజాక్షి పతివ్రత కాదూ?
ఈ కధ చివరి వాక్యం "టికెట్ డబ్బులు పైన ఓ పది రూపాయలు మాత్రమే జేబులో ఉంచండి. మిగిలినవిటిచ్చేయండి. సూట్కేస్ లో దాచేద్దాం " అంటుంది. చివరి మాట "దాచేద్దాం " లోనే  మనమిద్దరం ఒకటి ఏమి చేసినా సరే కలిసి బతుకుదాం అనే నిశ్చయం కనిపిస్తుంది పాఠకుడి హృదయాన్ని తడిమి కన్నీరు పెట్టిస్తుంది. 

అటు చాసో కధలో కానీ ఇటు శర్మ కధలో కానీ పేదరికం మనిషిని ఎంత బలహీనుడ్ని చేస్తుందో కధకులు బలంగా ప్రతిపాదించారు. అయితే కరుణాకరం  తానో చిన్న ఉద్యోగాస్తుడిగా బ్రతికేయగల అవకాశమున్నా తెలివి తేటలు గల కరుణాకరం బతుకు కేవలమొక చాలీ చాలని గుమస్తా గిరితో అపెయాలనుకోడు . అతని అంతరంగం కనిపెట్టింది కనుకనే శారద కరుణాకరానికి నిజం నిర్భయంగా చెప్పి మరీ తన సంపాదన్లోంచి తీసి డబ్బులు ఇచ్చి చదివిస్తుంది అతన్ని చివరికి సర్ బిరుదు కి అర్హుడని చేస్తుంది. అక్కడ కరుణాకరం అయితే నేను రేపటినుండీ లేడీ కరుణాకరాన్ని అన్నమాట అని సంబర పడుతున్న సరాదని చూస్తూ "ఎస్ మై డార్లింగ్" అంటాడు ఇక్కడ శంకరం మేడ మీంచి దిగి వచ్చి తన చేతికి ఐదువందల రూపాయలిచ్చిన వనజాక్షి మొహంలోకి చూడలేక "థాంక్స్ ఏ లాట్" అంటాడు. ఎంత  దయనీయమైన  హేయ మైన పరిస్థితి ఇది అని మనం సానుభూతి చూపాలా లేక ఎందరు కనబడని శారదలూ , వనజాక్షులూ ఉన్నారో నని గుండెలు చేమర్చాలా మనకి. మారని మధ్య తరగతి మానవుని హేయమైన పరిస్థితికి ఇంకా వ్యవస్థను నిందించాలా?

ఒక ప్రాంతం , ఒక భాష  అని పరిమితం కాకుంటే ఈ పేదరికపు కధలెన్ని ప్రాంతాల్లో లేవు కనుక. ప్రతి చోటా అవి సాహిత్యం లో చోటు చేసుకుంటూనే ఉన్నాయి. ఇరవైయ్యవ శతాబ్దం మానవుని కేంద్రంగా మానవ వేదనా. చేతన, ఆనందం, అన్ని రకాలైన కోణాలలో ఆవిష్కరించింది అందులో మన తెలుగు కధకులు చాసో , జగన్నాధ శర్మ మాత్రమే కాక ఇంకా ఎందరో ఉన్నారు. సందర్భం వచ్చింది కనుక m వీరిరువురి గురించి మాత్రమే మాటాడుకుంటున్నాము . భమిడి పాటి రామగోపాలం కధ "మనోధర్మం" లో కూడా ఇటువంటి మానవ బలహీనతలు అవిష్కరిమ్పబడ్డాయి. ఇక రావి శాస్త్రి కధల గూర్చి చెప్పనే అక్కర్లేదు. ఇటీవలే మరణించిన అస్సామీ రచయిత్రి ఇందిరా గోస్వామి తన "ఖాళీ శవపేటిక" లో ఇంతకన్నా దారుణమైన పేదరికాన్ని వాస్తవ జీవన చిత్రీకరణ చేసింది. చివరికి చలికి ఆకలికి తట్టుకోలేని ఓ పేద తల్లి శ్మశానం నుండి శవాన్ని తీసేసి పడేసిన ఒక శవ పేటికను తెచ్చుకుని  వెచ్చగా పడుకోవడానికి ప్రయత్నించడం , ఆ కధ చదివితే గుండె కలచి వేస్తుంది  . 

వేరే భాషల కధలు చాలా  విరివిగా ఆంగ్లం లోకి వెళ్ళడం వల్ల ఎక్కువగా అందరికీ తెలుస్తున్నాయి  అదే అంతకంటే ఎక్కువ సాంద్రత గలిగిన కధలు మన కధకులు  ఎంత గొప్పగా రాసినా సజీవంగా రాసినా ప్రపంచ పాఠకులకి అందడం లేదు. అందుకు జగన్నాధ శర్మ కధ గానీ , చాసో కధలు కానీ అన్ని భాషల్లోకి ముఖ్యంగా ఆంగ్లం లోకి( కొన్ని వెళ్ళే వుంటాయి) , తప్పక వెళ్లి తీరాలి. మానవ సజీవ చిత్రణ మా కధకులూ చేస్తున్నారు అని ఆత్మ  గౌరవంతో తెలుగు వారు చెప్పుకునే లాంటి ఓ రోజు రావాలి. పొరుగు కన్నడ రాష్ట్రం వరకు వచ్చిన  ఎస్.ఎల్.భైరప్పకి వచ్చిన "సరస్వతీ సమ్మాన్" మన తెలుగు కధకుల్ని కూడా వరించాలి అంతే కాక తెలుగు వారు చాలా ఏళ్లుగా పొందని జ్ఞానపీటం మళ్ళీ మన తెలుగు సాహిత్య పుష్పాలతో అలంకరించాలి. చాసో , శర్మ , భరాగో, రఘోత్తమ రెడ్డి, సినారె, గురజాడ . సలీం, ఖాదిర్ బాబు. కుప్పిలి పద్మ ఇలా ఎందరెందరో మన తెలుగు రచయితలు అన్నా భావన  మనలో మిగిలున్నన్నాళ్ళూ మనం సాహిత్యానికి ఏమి చేయగలమో ఆ సేవ చేయాలి అని భావిస్తూ ....చాసో స్ఫూర్తి  పురస్కారాన్ని పొంది మరింత  బాధ్యతను ప్రపంచ  కధకుడిగా తన భుజాల పైన మోయ సిద్దుడైన జగన్నాధ శర్మ గారిని మనసారా అభినందిస్తోంది సాహితీ జగతి.

.................................................జగద్ధాత్రి   
 మార్చ్ నెల ప్రస్థానం లో ప్రచురితమైన వ్యాసం....

Thursday, March 8, 2012

ఎన్నెన్నో వర్ణాలు!!


ఏ వర్ణ మీది .....?
రంగుల పండుగ
వసంతోత్సవం
దిగంతాల నిండా రంగులే
జీవన వర్ణాలే
సప్త వర్ణాల
కలగలుపు తెలుపు
రాజకీయమైనప్పుడు
రుధిర నేత్రాల జ్వాల
ఎరుపవ్వదా
గుండె గొంతుక లోనే
కొట్లాడిన ఉసులు
ఆకు పచ్చన్ని చేలు
బతుకు పండిన
పసుపు పచ్చన్ని రంగు
విరహ బాధల
దూరం నీలంపు మేఘం
వగపు నిర్లిప్తతా
ఊదా ......కదూ
కెంజాయ రంగులో
ఊరు శతకోటి ఆశలు
రంగు మలగిన కల
కాదా ఊది
ఇన్ని రంగుల
చూసి విసిగి
వేసారిన బతుకు
నలుపులోనికి
నెమ్మదిగా జారు
మరి రావు
మరి లేవు
ఏడేడు వర్ణాలు
అన్ని వర్ణాలు
ఇక ఎలదేటి పాలు
.................................ప్రేమతో ....జగతి 10.35 pm Wednesday 7th march 2012




Wednesday, February 29, 2012

అవును అప్పుడే……అక్కడే…..



అవును అప్పుడే……అక్కడే…..

ఎప్పుడో…. ఎక్కడో….నిన్ను చూసానన్న
ఒక తీయని స్మృతి …….
ఎప్పుడూ ఎక్కడా……
అమ్మ నోటికందించిన తొలి చను బాలలోనా
నాన్న ఎత్త్తుకుని ముద్దాడిన తొలి ముద్దు లోనా…..
చూసాను మాత్రం నిన్ను …..నేడు నువ్వో అందని
పాలపుంతవి కానీ అప్పుడు నా చుట్టూ తిరిగే
మా అమ్మమ్మ తాతగార్ల మొహాలలో
నన్ను అపురూపంగా ఎత్తుకుని
బంగారు బొమ్మని చేసి ఆటాడుకున్న
పెళ్ళి కాని మా పిన్నులల వదనాలలోనా
అక్కా నా మేన కోడలే అంటూ మురిసి
పోయిన మేన మామాల గర్వంలోనా….
చూసాను మాత్రం నిన్ను …….
బాగా ఆలోచిస్తే …..మళ్ళీ నిన్నెక్కడెక్కడెక్కడ
చూసానా అని …..
ప్రతి పుట్టీన రోజు ఒక పండుగలా
జరిపే నాన్న ప్రేమ లో …..
ఎందరినో ఆ రోజు పిలిచి
రకరకాల వంటలతో విందు ఇచ్చిన
అమ్మ చేతి కమ్మదనం లోనా
ఆ అప్పుడే …..బాగా చూసినట్టుంది సుమా
నువ్వు క్లాసు ఫస్ట్ వస్తే నిన్ను సినిమాకి
తీసుకెళ్తానని పదవ రేంకునుండి
ఫస్ట్ రేంక్ కి తెచ్చిన మా రాజు మామయ్య
అవ్యాజ్య ఆత్మీయతలోనా…..
ఆ చూసాను సుమా …….అనుభూతించాను కూడా
ఫస్ట్ రేంకు వచ్చిన నాడు తన వాగ్దానం నిలబెట్టుకుని
అప్పు చేసి మరీ " బడి పంతులు" సినిమాకి తీసుకెళ్ళిన
మా మామయ్య, మాట నిలబెట్టుకున్న అతని పట్టుదల లోనా
అవునక్కడే మరి గుర్తుంది బాగా……
అలాంటి మామంచి మామయ్యకి
నన్ను కేవలం చూడాలనే ఒకే ఒక్క చిన్ని ఆశతో
రక్త సంబంధమూ లేకపోయినా
మా రాజు మామయ్యని కనీసంమంచి నీళ్ళు కూడా
ఇవ్వకుండానే అత్త గారి హుకుం వెనుక ఝడిసి దాగిపోయిన
నన్ను చూడకుండానే వెళ్ళాల్సి వచ్చినందుకు
కళ్ళల్లో నీరు తిరుగుతుండగా
గేటు దాటి వె్ళ్తోన్న తనని కిటికీలోంచి చూసిన
క్షణం లోనా ……నిజమే పిల్లలు లేని తాను
నన్నే తన పాపగా భావించిన మామయ్య
ఐదు పదులు నిండకుండానే వెన్నెముక
దెబ్బతో దేహంపని చెయ్యని నాడు
వద్దు వద్దు పాపని మాత్రం నన్ను
చూడటానికి రావద్దని చివరి శ్వాసవరకూ
మెసిలిన మామయ్య ప్రేమలోనా …..
అవును అక్కడేఅప్పుడే
మా రాజు మామయ్యని
చూడలేక పోయినా…..
అతని అనురాగం ఇప్పటికీ
కనులలోమనసు మూలల్లో
ఎక్కడో ఎప్పుడూ కనలి మెదిలిస్తూనే
ఉంటుంది …….
బూచాడమ్మ బూచాడు పాట చూసి
అలాంటిదే గౌను కొని కుట్టించిన
మా మామయ్యని ……మా రాజు మామయ్యని
గయ్యాళి భార్యతో వేగలేక
ఎప్పుడూ మా ఇంట్లోనే మాతో
ఆడుతూ పాడుతూ మా అమ్మని చెల్లెలి గా
భావిస్తూ ….
ఎంత చనువున్నానాన్నని మాత్రం
సార్ అనే వాడే మాత్రంకానీ అతి చనువు
తీసుకోని మా వెర్రి మామయ్యని
అది నన్నీ స్థితిలో చూస్తే తట్టుకో లేదమ్మా అంటూ
చివరి శ్వాస వదిలిన మామయ్య లాంటి
మానవ మూర్తి లో కదూ …..
నిన్ను చూసింది ….అవును
ప్రేమా …..నిన్నక్కడే చూసాను
అతి దగ్గరగా…..నాన్న లాగా ప్రేమించి
అమ్మలాగా లాలించి ఏ సంబంధంలేకుండానే
ఎల్లపుడూ నా క్షేమాన్ని కోరుకున్న
మామయ్య ని చివరి క్షణంలో చూడలేక పోయిన
నా అశక్తతలో …..ఎప్పుడూ మామయ్య
చిరాయువుగా చిరునవ్వుతూ
బుల్లెట్ బండి మీద నేను , తమ్ముడూ
మామయ్య వెనకాల కూర్చుని
చిన్ననాటి స్నెహితులు సినిమాకి వెళ్ళినట్టే
నిన్ననో .. మొన్ననో మేము మామయ్య
ఊరు తాడివాడలో …..తియ్యని తాటిముంజెలు
పూతరేకులు ….తింటున్నట్టే ….
ఇంకా ఎప్పుడూ నా మది లోలోపలి
మధుర స్మృతుల గనులలో …….
కదలి కనలి ……నన్ను కన్నీట
కరిగించిన ప్రతి క్షణమూ ….
మామయ్య మాతోనే ఉన్నట్టు
ఏమిటో …. ఈ తియ్యని తాటిముంజె లాంటి
జ్నాపకం……..అనునిత్యం….నాలో
వయసు మీరుతోన్న కొలదీ
మరీమరీమరీ…….మామయ్యా!!!
…………………………..ప్రేమతోజగతి ….12. 30am 29/02/2012/ మంగళవారం

Monday, February 27, 2012

సర్వామృతవర్షిణి......


సర్వామృతవర్షిణి......

అనాదిగా నీలోనే .... 
అనవరతం నీ లోనే ....
ప్రకృతి పురుషులమన్నారు 
వసుధాకాశాలన్నారు 
ఆదాము అవ్వలమన్నారు   
ధరణికి ఆది దంపతులమన్నారు 
నీవు జడురాలివన్నారు 
అయినా ప్రియతమా .....
నేనేరుగనా నిన్ను....
అర్ధ దేహం ఇచ్చినది 
నేనా.....కాదు ....
నీలో ....ఆర్ద్రంగా ..అర్ధవంతంగా....
ఒదిగే అవకాశమిచ్చిన 
నీవు నా అంతఃస్చేతనవి
పక్కటెముక నుండి పుట్టితివా 
అది నా భాగ్యము కాదా ... 
నా అస్తిత్వానికి ఆలంబనవి 
నీలో కరిగి ... లయించి ....
వీర్య బీజమై స్ఖలించిన 
నాకు ప్రాణ ప్రతిష్ట చేస్తావు 
క్షేత్రం నీవై సఖీ 
నన్ను భూమి మీదికి 
సృజియించుతావు
సకల చరాచర 
జగత్తుకు ఆదిమూలం నీవు 
నీ అనంత వాత్సల్యాంబుధి లో 
అనునిత్యం.......
తారాడే పాపాయిని 
అన్ని రూపాలలోనూ 
అన్న వేళలలోనూ....
నీకై కలవరించి ...
పలవరించే నేను .....
అసంపూర్ణుడను...
నా ప్రేమను నీలో 
ఊపిరి పోసుకునే వేళ
నా సర్వస్య శరణాగతి తో 
నీలో బీజవాపన చెందీ 
నేను పుష్పిస్తాను 
ఫలిస్తాను ..... 
నా క్షేత్రపాలినీ .... 
అనవరతము నీలోనే....
నీతోనే ......నేనంటూ లేక
నా సర్వామృతవర్షిణిలో   
ప్రణయించి ......స్ఖలియించి 
మమేక మై.....పోతాను....
సంపూర్ణ మౌతాను.........
..............................................ప్రేమతో ....జగతి ....12,40am 27/2/2012 monday (sunday night) 



 

Saturday, February 25, 2012

ఆందోళిస్తూనే ...........


ఆందోళిస్తూనే ...........

చేతిలో పట్టుకు మురిసిపోతున్న  
ముత్యాల హారం .....
చటుక్కున తెగి ముత్యాలు 
రాలిపడినట్లు....
రెక్కలొచ్చిన  పిట్ట
ఎగరాలని ప్రయత్నించి 
ఓడిపోయి రెక్కలు  తెగి 
పడిపోయినట్టు ....
గలగలా నవ్వుతోన్న 
పసి పిల్లలు హటాత్తుగా 
మూగపోయినట్టు...
కమ్మని కవితగా
అల్లుకున్న పదాలన్నీ
అక్షరాలుగా విడి విడి గా 
విరిగిపోయినట్టు ...
ఒక రోజు నవ్వుతూ
మాట్లాడే పిల్లలే 
మరునాడు చీత్కరించినట్లు.....
ఎంత మన రాత అని 
సరిపెట్టుకుందామన్నా ....
ఎక్కడో ఏ మూలనో 
ఏదో వెలితి ...
మెలి తిప్పేస్తూ......
ఎంత తప్పుకుందామన్నా
కన్న పేగు ...
అపరాధ భావంతో 
తలదించుకుంటోంది ....
జీవితమంటే ఆకతాయి 
అరుపులు కావని 
ఎలా చెప్పగలను ...
ఒకరి రాతలు మనవి 
కావని ...ఎవరి చేతలు 
వారివేనని తెలిసినా..
ఏమీ చెయ్యలేనని 
ఎరుక గలిగి  ఉన్నా 
ఎంతని నచ్చచెప్పను
కుమిలే హృది కీ.....
కమిలే చెక్కిళ్ళకీ ....
ఆందోళి౦చే అంతర్యానికి
ఎప్పుడూ ఏదో ఒక 
భయం వెన్నాడుతూనే 
సాగుతోన్న జీవనయానానికి.....ప్రేమతో .....జగతి 10.56pm Friday 24/02/2012