Sunday, September 9, 2012

జ్ఞాపకాలు





చిన్నప్పుడు నాన్న కొనిచ్చిన అమర చిత్ర కథలతో మొదలైన అక్షర పయనం నాది. జీతం వచ్చిన వెంటనే రైల్వే స్టేషన్ లో నాకు మీరాబాయ్  , కృష్ణ  లాంటి వి , తమ్ముడికి శివాజీ , పృధ్విరాజ్ లాంటి కామిక్స్ కొని చదివించేవారు. రైల్వే రక్షక శాఖలో నాన్న సర్కిల్ ఇన్స్పెక్టర్ గా పనిచేసేవారు. అతి తక్కువ జీతమైనా మాకు పుస్తకాలు కొనడం మానేవారు కాదు. అలా మొదలై నేను తొమ్మిదో ఏట మొట్ట  మోదట చదివింది కకుభ గారి "జీవితం ఏమిటి ?" ఆంధ్ర ప్రభ లో సీరియల్ అప్పుడు మా మేనత్తలు నలుగురు నేను , నాన్న ఆ సీరియల్  చదివే వాళ్లము. మా చిన్నత్త (చాల చిన్న వయసులోనే చనిపోయింది) తను తన పాపకి నీలిమ అని పేరు పెట్టుకున్నది ఆ సీరియల్ చదివాకే. అంతలా సాహిత్యాన్ని చదవడం చర్చించుకోవడం వాళ్ళందరూ పెద్దలతో బాటు నేనూ చర్చిన్చేదాన్ని. అందులోని ఒక ముఖ్య సన్నివేశం మాత్రం నన్ను ఇప్పటికీ కలచి వేస్తుంది నీలిమ భర్త గోపి సినిమా నటుడు అయ్యాక వేరే అమ్మాయి తో ప్రేమ లో పడి ఈమెను వదిలేస్తాడు, చివరికి మారి  పోయానని వచ్చిన  అతన్ని ఆమె మనసు క్షమించలేక పోతుంది , ఆ రాత్రి ఆమెను పొందిన అతను తర్వాత గ్రహిస్తాడు తను రమించింది  ఆమె మృతదేహం తో నని తెలిసి పిచ్చి వాడై పోతాడు. బాగా ప్రభావితం చేసిన నవల ఇది. అప్పుడే చివుకుల పురుషోత్తం గారి " ఏది పాపం" వాసిరెడ్డి సీతాదేవి నవలలు అన్నీ మా మేనత్త విమల  నాకిచ్చి  చదివించింది. 

అలా మొదలైన అక్షర యానం ఖుర్దా రోడ్ లో (ఒరిస్సా) లో ఉన్నప్పుడు కవితలుగా మొలకెత్తి , కాస్తగా పూలు పూచి అక్కడ ఉన్న " కవిత" సంఘం వారి " పురోగామి" లిఖిత పత్రిక లో మొదటి కవిత వచ్చిందీ . అటు పైన ఒరిస్సా నుండి మళ్ళీ ఆంధ్రా వచ్చేసినా రాసిన కవితలేవరికీ చూపించేదాన్ని కాదు. నా  ప్రతి కవితకి ఒకే ఒక శ్రోత మా తమ్ముడు జగన్నాథ్ మేము ఉదయ్ అంటాము ( ఇప్పుడు అమెరికాలో ఉన్నాడు). అన్నిటికంటే నా జీవితం లో మరిచి పోలేని తియ్యని జ్ఞాపకం మా తమ్ముడు నేను ఎక్కడో  రాసి పడేసిన కవితలన్న్నీ ఏరి ఎప్పుడు చేయించాడో ఆరోజుల్లో డి.టి.పి  అవీ లేవు గా ఎలెక్ట్రానిక్ టైప్ చేయించి నా  పెళ్లి రోజు నాడు నాకు బహుమతి ఇచ్చాడు. ఎప్పటికీ నీలోని ఆ కవితా  జగతి ని చచ్చిపోనివ్వకు  అక్కా అంటూ. ఇంతకంటే మధుర స్మృతి నాకు జీవితం లో లేదు. నాన్న కూడా నా కవితలకి సంతోష పడేవారు. కానీ నేనెప్పుడూ ఏ పత్రికకీపంపెదాన్ని కాదు. నా కవితలు ప్రోత్సహించడం లో మా మామయ్య దుర్గ ప్రసాద రావు ఒకరు (మా పేద్ద మామయ్యా ) అతను చాలా  ప్రోత్సహించేవారు శ్రీశ్రీ ని చదవమని చెప్పింది తనే . నాకు శ్రీశ్రీ మహాప్రస్థానం కొనిచ్చ్సింది ఆ రోజే "మల్లెపూవు" సినిమా చూపించింది మా దీన చిన్నాన్న. ఇవి మామూలుగానే కనిపించినా మరువలేని జ్ఞాపకాలు ఎందుకవుతాయంటే ఆ రోజు అలా వారు చెప్పకున్న ఇవ్వకున్నా వేరే విధంగా ఉండేది. 

అర్ధ రాత్రి అపరాత్రి అని లేకుండా ఎన్ని పుస్తకాలు చదివినా ఏమీ అనని  డాడీ , విపరీతంగా తిట్టి అలసి పోయే అమ్మ, ఇలా పన్నెండేళ్ళ వయసుకే  మెట్రిక్  పాసయి , ఇరవైలోకి అడుగు పెట్టే అప్పటికే   ఆంధ్రా యూనివెర్సిటీ  లో ఏం.ఏ .ఆంగ్ల సాహిత్యం లో యూనివెర్సిటీ  ఫస్ట్ వచ్చాను. ఆనాడు కుముద్ బెన్ జోషి నుండి అవార్డ్ అందుకోవడం మా నాన్న కిష్టమైన  ఆంగ్ల సాహిత్యాన్ని చదివి ఆయనకీ తృప్తి ఆనందాన్ని కలిగించానన్న తృప్తి నాలో మిగిలింది. 
విశ్వవిద్యాలయం లో తనకు గ తనే నా దగ్గరికి " కానుక" పుస్తక రూపం లో వచ్చిన నా చలం. ఇక అక్కడినుండి చలం సాహిత్యం నా  జీవితం లో ఓ భాగమై పోయింది. చలం " స్త్రీ" మొదటి సరిగా నను పరిచయం చేసిన వ్యక్తీ మంచి మిత్రుడు వేణు అలాగే " హిమజ్వాల" కూడా తనే ఇచ్చి చదివించాడు . ఇక అక్కడినుండి ఎవరూ నాకేమీ ఇది చదువు అని చెప్పలేదు, నాకు గా నేనే అటు తెలుగు , ఇటు ఇంగ్లీష్, అలాగే హిందీ సాహిత్యాన్ని బాగా చదువుకున్నా. చలం అభిమానినని అని ధైర్యంగా   ఆ పుస్తకాలు పట్టుకుని చదువుకున్నందుకు    నన్నుకేవలం   చూడటానికి   ఒక అబ్బాయి ప్రత్యేకంగా వచ్చి చూసి వేల్లేదు   . అంత హీరోఇసం   ఉండేది చలం పుస్తకాలు చదవడమంటే. ఇదేప్పుడో మాట కాదు ఏనాభైల్లోది. అత్యంత మేదావులయిన  ఎల్.ఎస్.ఆర్ కృష్ణ శాస్త్రి, ఇలా రావు , జానకి రెడ్డి  , నరసింహ స్వామి, కృష్ణారావు గారు  లాంటి వారి దగ్గర విశ్వ విద్యాలయం లో చదువుకోవడం ఒక అదృష్టం.

నా మొదటి కధ " వృక్ష స్థలే .."  కి ఆర్ ఎస్ కృష్ణమూర్తి కథల  పోటీలో రెండవ బహుమతి రావడం తోనూ , "చలం- ఆధ్యాత్మికత"  ప్రసంగం తోనూ విశాఖ పట్నం లో నా ఉనికి అందరికి తెలిసింది. మొజాయిక్ సాహిత్య సంస్థ నేను . ఎల్ .ఆర్. స్వామి గారు, రామతీర్థ మరి కొంత మంది మిత్రులం కలిసి స్థాపించిన తర్వాత ఇక వెనుకకి తిరిగి చూడకుండా సాహిత్య ప్రస్థానం కొనసాగుతూనే ఉంది. మొజాయిక్ సంస్థ ఒక ప్రత్యేకతను కలిగి ఉండాలని మేము చేసే కార్యక్రమాలను మేము ఎక్కువగా శ్రెద్ద తీసుకుంటాము . అంతే కాక ఎక్కువ కంపేరిటివ్ లిటరేచర్ మీద, జాతీయ అంతర్జాతీయ సాహిత్యాల పైన కార్యక్రమాలు చేస్తాము. ఇప్పటికి ఎందరో కవులను, కధకులను అనువాదం చేశాను . ముఖ్యంగా నేను రామతీర్థ కలిసి చేసిన జే.పి.దాస్ గారి కవితలు ప్రపంచ తెలుగు సాహిత్య సభలో ఆవిష్కరించడం   ఇప్పటికీ మరిచి పోలేము. మండలి బుద్ధ ప్రసాద్ గారి ప్రోత్సాహం తో " వజ్ర భారతి" లో తెలుగు తత్వవేత్తలు జిడ్డు కృష్ణ మూర్తి , యు. జి. మీద వచ్చిన వ్యాసం కూడా చాలా పేరు తెచ్చింది. 

చూసిన జీవితపు ఎగుడు దిగుళ్ళతో బాటు నా కవిత్వం నా సాహిత్యం సాగుతూనే ఉన్నాయి. ప్రపంచం లో దేనినైనా మార్చగలిగే శక్తి , ప్రేరణ కలిగించ గల ప్రాణ స్పందన కేవలం "ప్రేమ" అని నమ్మే నేను ఇప్పటికీ ఎప్పటికీ ప్రేమని, సాహిత్యాన్ని మైనస్  చేస్తే ఈ జగతి లేదు అని చెప్తాను. వివిధ భాషల్లో ని కవులను తెలుగు లోకి అనువదించి ఎనిమిది వారాల పాటు " కావ్య జగతి " పేరిట ఆంద్ర భూమి లో నా ఫీచర్  ప్రచురించిన శ్రీ ఏం.వి.ఆర్. శాస్త్రి గారికి కృతజ్ఞతలు చెప్పాలి, అది మంచి పేరు తెచ్చింది నాకు. నవ్యలో అచ్చిన నా కధ " రూప వస్తువు" కి తెల్లవారేసరికి నిఖిలేశ్వర్ గారు కాల్ చేసి చాలా సేపు అభినందించడం ఒక ఎత్తైతే, ఇటీవల అచ్చైన కవిత" వాసన" చూసి ఎందరెందరో , సలీం, ఎన్,గోపి , ఇంకా ఎందరో ఇప్పటికీ అభినందించడం  నాకు నిజంగా జీవిత సార్ధక మనిపిస్తుంది . ఇటీవల కలిసినప్పుడు ఆశారాజు గారు ఆ కవిత మొత్తం చదివి తను జ్ఞాపకమ్హ్తో చదివి మెచ్చుకోవడం మరో మధుర స్మృతి. జగన్నాధ శర్మ గారికి కూడా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఎన్నో పరిచయాలు ఎందరో కవులు ఇప్పుడు నాకు ఆత్మీయ మిత్రులు ఒకప్పుడు వీరి నసలు చూడగలనా అనుకున్నా వారు నాకి ప్పుడు ఎంతో స్నేహితులు అని చెప్పడానికి గర్విస్తున్నాను. జ్వాల ముఖి  , శివ రెడ్డితో  , నగ్న ముని తో . ఇలా ఎందరెందరో పెద్దలను చూడటమే కాదు ఆత్మీయంగా మాట్లాడటం నాకు చాల ఆనందం కలిగించే  విషయం. నా గురించి శివారెడ్డి గారు బరంపురం తెలుగు మహాసభల్లో మొజాయిక్ సంస్థ గురించిన నా కృషిని చెప్పడం అంత పెద్ద సభలో , నేను ప్రెసెంట్ చేసిన " కన్యా శుల్కం -కొత్త ఆలోచనలు" పేపర్ కి వెను వెంటనే పాటిబండ్ల రజని వచ్చి కౌగలించుకుని  అభినందించడం తియ్యని జ్ఞాపకం. 

నా సాహిత్యం బ్లాగ్ ఒకటి నడుపుతూ, ఇంకా ఇతర సాహిత్య గ్రూపులు నడుపుతూ ఫేస్  బుక్  లో కూడా చాలా మంచి సత్  సంబంధాలు కలిగిన దానన్ని  చెప్పగలను. సాంకేతికత మనుషుల్ని ఎంత దగ్గర  చేసిందో అది  సరిగా  ఉపయోగించకుంటే ఎంత చెడ్డది గా పరిణమిస్తుందో అది గుర్తు పెట్టుకోవాలి మనం. ఈ రోజుల్లో మనల్ని కలిపే ఈ సోషల్ నెట్ వర్క్ల్ లను సరిగ్గా ఉపయోగించుకున్న నాకు ఎందరో ఇతర దేశాల భాషల ఎన్దరో  సాహితీ  మిత్రులను సంపాదించు కున్నాను. సాహిత్యం లోని అన్ని పార్శ్వాలను ,అంటే ఆధ్యాత్మిక సాహిత్యాన్ని కూడా ఎక్కువగా అధ్యయనం చేశాను. శంకర  అద్వైతం  కోసం, లాజిక్  కోసం , ఏం ,ఏ. ఫిలాసఫీ, ఏం.ఎస్ .సి. సైకాలజీ, ఏం.ఏ. సోషయాలజీ, ఏం .ఎడ్ ఇలా కొన్ని డిగ్రీలు కేవలం చదువు కోసమే చదువుకున్నాను. ఎం.ఫిల్ శ్రీ ఆరోబిందో చిన్న కవితలపైన చేశాను. 

బి.ఎడ్ కాలేజీ లో లెక్చరర్ గా పనిచేస్తూ ఎందరితోనో గురువులకు గురువుగా సత్సంబంధాలు కలిగి ఉన్న, కొందరి నైనా మంచి ఉపాధ్యాయులను  తయారు చేసిన ఆనందం తృప్తి జీవితంలో. ఇప్పుడు నా పిల్లలు ( శిష్యులు) చాలా చోట్ల నాకంటే పెద్ద హోదాలో లెక్చరర్లు గా పని చేస్తున్నారు. అది పుత్రోత్సాహం కలిగిస్తుంది. నాకంటే చిన్నవారి లోనూ, నా సాటి వారిలోనూ ఎవరూ ఏ గొప్ప విజయాన్ని సాధించినా ఎంతో  ఆనందిస్తాను, ఇప్పటి తరం పిల్లలికి మంచి సాహిత్యాన్ని చదవమని ప్రోత్సహించడం తో బాటు వారి లో నా విజయాల్ని చూసుకుని మురిసిపోతాను. ఎన్నో పరిచయాలు నన్ను నన్నుగా ప్రేమించే ఎందరో నాకు ప్రాణం. సాహిత్యమే కాదు సామజిక విషయాల పట్ల కూడా అధ్యయనం చేస్తాను. నేను కోల్పోయిన  కాలాన్ని అవకాశాలను  నా భావి తరం వారి లో చూసుకుని సంతృప్తి చెందుతాను. తెలుగు నుండి చాలా మంది కవుల కవితలను ఆంగ్లం లోకి చేసాను. అందులో చాలామంది నేటి తరం కవులున్నారు.

చాలా వ్యాసాలు చినుకు మాస పత్రికలోనూ, ఆంధ్రప్రభ సాహితీ గవాక్షం లోనూ, ప్రచురించి నన్ను ప్రోత్సాహన్నిన్చ్చిన సదా శివ  శర్మ గారు  , చినుకు రాజ గోపాల్ గారు , తెల్కపల్లి రవి ఇలా ఎందరెందరో అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు ఇలా ఈ పత్రికా ముఖంగా తెలియజేస్తున్నాను. ప్రస్తుతం చలం గారి ఉత్తరాల మీద అధ్యయనం చేస్తున్నాను. ఇటీవల కెనడియన్ రచయిత్రి మార్గెరెట్ అట్వుడ్ కవితలని అనువాదం చేశాను. కవిత్వం, వ్యాసాలు ఇష్టమైన ప్రక్రియలు. జీవితం లో ఎదురైనా స్పందన కలిగించే అనుభూతిని అభివ్యక్తిస్తాను. కాల్పనికట కంటే సత్యమే ఎక్కువగా రాస్తాను, రాసిన సాహిత్యమంతా నా అనుభావాలలోనుంది వచ్చినదే. ఏ ఇజాలు నాకు లేవు, అయినా అందరి పట్ల గౌరవం ఉంది.ఆంగ్లం లోనూ, హిందీ లో కూడా రాస్తాను. విశాఖ మాత్రమే కాక, పూణె, భువనేశ్వర్ , హైదరాబాద్ ,విజయవాడ లాంటి ఎన్నో చోట్ల సాహిత్య ప్రసంగాలు చేశాను . 

నిరంతర సాహిత్య అధ్యయనం తోనూ ప్రేమ తోనూ ఇక ఇలా మిగిలిన జీవితాన్ని సాగించాలని , బతుకు చివరి శ్వాస వరకు సాహిత్యం తో , ప్రేమతో , గడపాలని జీవితాశయం. మనిషిని యధాతధంగా ప్రేమించడం ప్రేమంటే అని నమ్ముతాను, ఆచరిస్తాను.   . మీ అందరికి  సాహిత్యాభినందనలు , ఆంధ్ర జ్యోతి వారికీ కృతజ్ఞతలు తెలియ జేస్తున్నాను. 
....................................................................................................................జగద్ధాత్రిhttp://dhaathri.blogspot.com/

4 comments:

  1. http://www.andhrajyothy.com/pdffiles/2012/sep/9/vzg/visaka%20city02.pdf

    ReplyDelete
  2. జీవితం ఏమిటి నవల దొరుకుతుందా మేడమ్

    ReplyDelete
  3. This comment has been removed by the author.

    ReplyDelete
  4. జీవితం ఏమిటి నవల ఎక్కడ దొరకుతుందో దయచేసి చెప్పగలరు...చాలాకాలం నుంచీ ప్రయత్నిస్తున్నానండీ..

    ReplyDelete