Saturday, September 15, 2012

రాగ సంద్రం ...




" పుట్టిన రోజు శుభాకాంక్షలు తమకు " తియ్యగా పలికిందామే స్వరం 
" హహహ " నవ్వే అతని సమాధానం 
" అదేంటబ్బాయ్ పుట్టిన రోజు నాడు విష్ చేస్తే కనీసం థాంక్స్ అయినా లేదా మాకు?" 
" పుట్టినరోజు హహ ...అదెప్పుడో మానేసాను రా.అయినా అదేమన్న గొప్పా ఏంటి ." 
" అదేంటి అలా అంటావ్ ,,,నీకు గొప్ప కాదేమో గానీ నాకు నా బాలు పుట్టినరోజు గొప్పే సుమా" ఎక్కడో వాక్యం పాదం చివ్వర చిన్న గ వణికింది గొంతు
" ఓకే ఓకే సరే లే ...అయినా ఇంత దూరం నుండి శుభాకాంక్షలు చెప్తే ఏం చేసుకుంటాం అమ్మాయ్ వస్తానన్నావ్ .." మాట మార్చాడు 
" అన్నా ను కానీ ఎగ్జామ్స్  టైం కదా కాలేజ్ లో సెలవు దొరకలేదు " 
" నువ్వు వచ్చి ఉంటే నిజంగా  పుట్టినరోజు చేసుకునే వాడినే ..." ఎక్కడో చిన్న వెలితి కనీకనబడకుండా
" చాల్లే మరీ చెప్తావ్ ఇందాక ఎప్పుడో మానేసానన్నావ్  ?" 
" అదే గా చెప్పేది మానేసాను చిన్నప్పుడే కానీ ...నిజం చెప్పనా ...ఇప్పుడు నీతో కలిసి మళ్ళీ పుట్టినరోజు చేసుకోవాలనుంది ..." నిజాయితీ అతని స్వరం లో 
" అయ్యో నే రాలేక పోయాను బాలు ..అయినా మీ వాళ్ళందరూ ఉన్నారుగా ..." 
" ఎవరున్నారు నాకు ? నాకు నేనే ... నీకు  తెలీదా ..."
" ఒంటరితనం బాధిస్తుంది ధీరూ ... ఎందరిలో ఉన్న ఒక్కడినే అనే ఈ భావం , ఎక్కడో ఏదో మిస్ అయిన ఫీల్ ..." ఆపేసాడు , అంతే అతను ఎప్పుడు మనసు జారుతుందని తెలిసినా వెంటనే మాటలు ఆపేస్తాడు ....ఆమెకి తెలుసు 
"  నేను వస్తే ఏంటి మరి స్పెషల్ ?" అడిగింది సాధ్యమైనంత మామూలుగా 
"  నీకు తెలీదూ , నీతో ఉన్నంత....సరేలే వదిలేయ్ నాగురించి ఎందుకు " తెగిన దారం లా ఆపేసాడు 
" అయ్యో నేను రావాల్సింది  కదూ బాలు , నువ్వైనా వచ్చేయ్యల్సింది ఇక్కడికి ..." 
ఒంటరితనం నిజం ఎన్ని రకాలో , మానసికం, దైహికం , మేధో పరం ...ఇన్ని ఒంటరితనాలను భరిస్తూ ఇద్దరం ... నిజమే ఒకరిలో ఒకరుగా కాక ఒక్కటిగా కలిసిపోగలగడం కేవలం తామిద్దరూ మాత్రమే ....ఆమె మదిలోనూ అలజడి ...
" హే సరేలే అంత బాధ పడతావెందుకు ? మాటాడు ఎందుకా మౌనం , మనం కలిసినప్పుడే  పుట్టినరోజు చేసుకుంటాలే , ఎన్ని సార్లు నీతో ఎన్ని సార్లు పుడతానో నేను " మౌనం "ఎన్ని సార్లు నీలో లయించి పోతానో...." అనుకున్నాడు మనసులో ...అతని అంతరంగం ఆమెకి అర్ధమైంది ...అయినా ఏమీ అడగదు 
" బాలూ! .." ప్రేమ నిండిన మది తో పలకలేక మాట రాక అవస్థ చిత్రమైనది 
"...అయినా ... అమ్మాయ్ నీతో ప్రతి రోజూ ..." హస్కీగా పలికిన్దతని స్వరం మాట మారుస్తూ 
" నాతో ప్రతి రోజూ...." రెట్టించింది 
" ఒక పండుగే నాకు .." అ స్వరానిది ఏ రాగమో యిట్టె చెప్పేయచ్చు అది ముప్పైయ్యారు జన్యు రాగాలను మించిన అనురాగ జన్యు రాగం.
కాసేపు రెండు వైపులా నిశ్శబ్దం . ఆమె చెప్పాలని అనుకుంటున్నది  అతనికి తెలుసు , తను చెప్పాలని ఆమె ఆశిస్తున్నది ఏమిటో కూడా అతనికి తెలుసు..అయినా మౌనం 
ఎందుకీ సన్నని పోరా కంటికీ చూపుకీ  నడుమ కనురెప్పలా .....
" ఎప్పుడొస్తున్నావ్ ఇక్కడికి ఈ నెలాఖరులో వస్తానన్నావ్ గా ?" ఆశ గా 
" వస్తున్నా కానీ నీతో ఉండలేక పోవచ్చునేమో రా" 
" అదేంటీ ఎందుకని ..." తీవ్ర నిరాశ ఆమె లో 
" అదీ నేను వస్తున్నా కానీ మా బాస్ తో వస్తున్నా సో , అయన ప్రోగ్రాం ప్రకారమే మళ్ళీ వెళ్ళాలి .." ఏ భావము పలక కుండ అన్నాడు 
" అవునా ....." నిశ్శబ్దం ఒక రెండు నిముషాలు 
" ధీరూ...ఏయ్ ...పలకవేంటి ... "
" ఏమి లేదు ఎన్నాళ్లైందో నిన్ను చూసి , రెండు రోజులైనా ఉంటావని ఆశ పడ్డాను "
" నిజమేరా కానీ ఇప్పుడు ఈ ట్రిప్ లో కుదరదు , మళ్ళీ నెల పది దాటాక వస్తా అప్పుడు నీకోసమే వస్తా నీతో ఉంటా .." నమ్మకంగా అతను 
" ఏమో మళ్ళీ అప్పుడేమి చెప్తావో , ఛ ఏమి ఉద్యోగాలో ... " నిరాశతో కూడిన విసుగు ఆమె లో
" ఏయ్ వస్తానని చెప్పానుగా ... నేనంటే వస్తానని నీకు తెలుసు గా ...అబ్బా చీర్ఫుల్ గా ఉండరా " 
" మ్మ్...అలాగే ..." 
" అదిగో అప్పుడే స్వరం లో నీరసం ...హాహా ఏయ్ ధైర్యవంతురాలా! ఏంటిదీ నువు నవ్వకుండా ఉంటే బాగోదురా..." 
" అవును ఎప్పుడు ఇకిలించుకుంటూ ఉండాలి మీరు ఏమి చేసినా " ఉక్రోషం గా అంది 
" హహహః అది కాదు రా నాకు మాత్రం లేదా నీతో ఉండాలని , కానీ ఇప్పుడు ఈ హడావిడి లో కుదరదు రా కనిపిస్తా గా కాకుంటే ఉండటం అవ్వదు మరి " 
" ఓహో మీ బాస్ తో వస్తున్నావ్ గా కనీసం మాటాడుతావా అదీ లేదా ..." 
" అరె కూల్ రా! మాటాడకుండా ఎలా ఉంటాను రా ..." 
" ఏమో నిన్ను చూడటానికే వస్తున్నా నేను ఆ మీటింగ్ కి లేకుంటే నాకేమీ ఇంట్రెస్ట్ లేదు ..." ముక్తసరిగా 
" నాకు తెలుసు ....కలుస్తాగా ...ఉండనా మరి " మెత్తటి అభ్యర్దన 
" సరే అలాగే .... మంచి మాట చెప్పేవు పుట్టినరోజు నాడు , నేనింకా రోజులు లెక్క బెట్టుకుంటున్నా  నువ్వొస్తున్నావని .."
" బాలూ!....." 
" చెప్పరా ...ఏంటి ?" లాలన 
" నీకు నేనేమి అర్ధం అయ్యానో తెలియదు కానీ నువ్వంటే మాత్రం నాకు ప్రాణం ..."చలించింది స్వరం 
" నాకు తెలుసు ....నువ్వు " అర్ధోక్తిలో ఆపేసాడు ఓదార్పుగా 
" ఏయ్ సాగర ముగ్ధా ! ఓయ్! " అల్లరిగా పలకరించాడు 
" అదేంటీ సాగర కన్యో మత్స్య  కన్యో  అంటారు కానీ సాగర ముగ్ధ ఏంటి ?" నవ్వింది కొంచెం 
" మరి నువ్వు ... ముగ్ధ వి కదా కన్య వి కాదుగా హహహ..." పకపక నవ్వాడు 
" ఛి పో ..చాల్లే అల్లరి ..." నవ్వుతూ పెట్టేసింది.
ఒంటరితనపు ఇనుప కౌగిలిలో  చిక్కిన రెండు మనసులు , దేహాలు ....ఆత్మలు ఆశలు ...మాటల వంతెనలు కట్టుకుంటూ సుదూరాలనుండి ....
                      .................................................ప్రేమతో ...జగతి 1,14pm,15th Sept 2012 Saturday 

1 comment: