Thursday, May 31, 2012

అలలు -15 - (4)




అతని తెల్లని 
లాల్చీ పై 
ఛాతీ పై ఎడమ వైపు 
సిందూరపు మరక
నాన్న...కళ్ళల్లో ...
చిలిపి నవ్వు ....ఆనందం....ప్రేమతో ...జగతి 

నేనతన్ని కోరిన 
విలువైన ఆభరణాలు 
చేతులనిండుగా
ఎర్రని మట్టి గాజులు ....ప్రేమతో ...జగతి 

నాకు కవిత్వం రాదు
అన్నాడతను ...
నేను నవ్వేసా..
ప్రేమే కవిత్వం 
ఇక అదెందుకు అంటూ.....ప్రేమతో ...జగతి 

నీకు కోపం రాదా 
అడిగాడు తను 
వస్తుంది ....
నిను చూడగానే 
ప్రేమగా మారిపోతుంది 
అన్నా.........ప్రేమతో...జగతి

ఐదు పదులు దాటినా
ఏమిటీ అల్లరంటే....
తొమ్మిది పదులైనా
తొలి ప్రేమ పదునే
అంటాడు ....గర్వంగా....ప్రేమతో ...జగతి 

పాప కళ్ళలో పడింది 
అతని పెదాల పైన 
కాటుక మరక 
అమ్మ కళ్ళని ముద్దాడావు కదూ
పాప అడగని ప్రశ్నకు ముందే 
నాలో బిడియపు ప్రకంపన .....ప్రేమతో...జగతి 

అనురాగం బంధం
కావోచ్చునేమో ....
బిగిసిన అసూయా 
బంధనం కాకూడదు .....ప్రేమతో ...జగతి 

ప్రేమతో అని రాస్తావు 
అందరన్నా నీకు ప్రేమేనా ?
అడిగారొక పెద్దాయన 
ప్రేమకు తన పర ఉంటుందా అసలు?.....ప్రేమతో జగతి 

ప్రేమ, ద్వేషం 
రెండు లేనే లేవు 
తీవ్రమైన ప్రేమే 
ద్వేషం కూడా.....ప్రేమతో ...జగతి 

తగాదా లేనిదే 
ఏ బంధంలోనూ అందం లేదు
అందుకే ఆ పని 
తనకే వదిలేసా 
తగవు తీరి అలసాక 
నా వడిలో వాలి పోతాడు పాపం యోధుడు...ప్రేమతో ...జగతి 

చదువుకోవాలి నిజమే 
మన మనసుని 
మనమే క్షుణ్ణంగా......ప్రేమతో ...జగతి 

మనసులోకి తొంగి 
చూసావా ....
చాలా బాధాకరం 
ఓడిపోయిన కలలన్నీ 
ఓటి కుండల్ల్లా 
పడి ఉంటాయ్ ......ప్రేమతో ...జగతి 

ప్రేమంటే కట్టి 
పడేసుకోవడం కాదు 
ఎక్కడికెళ్ళినా , ఏమి చేసినా 
నీ దగ్గరికే వచ్చే 
స్వేచ్చనివ్వడం .......ప్రేమతో...జగతి 

అతని కళ్ళలోని
వెలుగు కొరత  
నాకు అర్ధమౌతుంది 
తాను  తప్పటడుగు వేశాడని .....ప్రేమతో ...జగతి 

మన్నించడమంటే...
మరచి పోవడం కాదు 
ఆ విషయాన్నిక 
విషం చేయకుండా 
వదిలేయడం......ప్రేమతో....జగతి 

31st May Thursday 11.40 am 2012



















No comments:

Post a Comment