Saturday, July 9, 2011

ఇష్టం-కష్టం

Add caption
ఇష్టం-కష్టం

వేకువ వెలుతురులో 
రాలిన పున్నాగ పూలని నా కరకు పాదాలతో
మట్టకుండా హడావిడిగా వెళ్ళడం
ఎంత కష్టమైన పనో నీకేం తెలుసు

పరుగు పరుగున కోవెల చేరేసరికి
విసిగి వేసారిన ప్రేమ పావురం
ఎగిరిపోతోంటే నిస్సహాయంగా 
ఆకాశంలోకి చూస్తాను
తాను తిరిగి  చూసి వస్తుందేమోనని 

కలువ పూల కోసం కొలను 
ఒడ్డున కూర్చున్నా ఎందుకో
అవి చందమామ సొత్తే కాని నావి కావు అనిపిస్తుంది 

ఉదయ హృదయంలో గూడు కట్టుకోవాలని 
పూల బాసలు విని తీరాలని 
పికముల కువ కువలు వింటూ వాటిని తిరిగి పలకరించాలని
ఎన్నెన్ని ఆశలో మదినిండా......

ఉరుకుల పరుగుల జీవితమే....
ఏమి చేయగలను 
నేను ప్రకృతిని ఆరాధిస్తూ కూర్చుంటే
నా భర్త పిల్లలూ ఏమౌతారు ?
హార్దిక సంబంధాలు ఎమౌతాయి
ఆర్ధిక సంపాదన లేకుంటే

కష్టం వచ్చినా....
గుడికి  రాలేని కష్టం నాది
దైవారాధనలో గడపటానికి 
గుడికే రావాలని లేదు...

ఇష్టంతో జీవించటం...
ఎంత కష్టమో 
నీకు మాత్రం తెలియదా?
నీవు మాత్రం ఈ బాధ పడటం లేదా?
గుండె మీద చెయ్యేసుకుని చెప్పు?

మాటలు చెప్పడం తేలికే 
అయినా నిన్ను నిందించను 
నా మీద ప్రేమతోనేగా నీ ఈ హెచ్చరింపు 
ప్రతి ఉదయానా 
వసంత రాగాలాపనకన్న 
అమ్మా అన్న నా పిల్లల 
హృదయ వసంత రాగాలు
నన్ను మనిషిని చేస్తాయి...
ఎక్కడో  ఎప్పుడో ఓ క్షణం
ప్రకృతినీ ప్రేమించలేక పోతానా? 
అది నా ప్రకృతికే విరుద్ధం....
అది నీకంటే ప్రకృతికి తెలుసు
తానూ తల్లేగా......ప్రేమతో జగతి


to thappita sreenivas fb friend...who wrote a poem asking the modern woman not to miss the nature's beauty , these lines are an answer to his poem
శీను కోసం .....ప్రేమతో ....జగతి 

1-05 pm thursday 9-6-2011 










Wednesday, July 6, 2011

నన్ను క్షమించకు !!!

...................................................
నిన్ను నే   పెట్టిన కష్టాలకి
నాకు నేనే సిగ్గిలుతున్నా ఈ క్షణం
ఎన్ని సార్లు ఎన్ని మార్లు నిన్ను
బాధించానో
ఎంత దుఖాన్ని నీకు కలిగించానో
ఊహ తెలిసిన నాటి నుండి
నిన్ను బాధిస్తూనే ఉన్నాను
ఎన్ని నొప్పులు ఎన్నికోతలు
ఎంతలా భరించావు నా కోసం
నే తీసుకున్న ఏ నిర్ణయానికైనా  తల ఒగ్గి
ఒదిగి ఒక్క మాటైనా ఎదురు చెప్పక
పంటి బిగువున అదిరిపడే బాధని అణచిపెట్టుకున్నావు
నువ్వు బాధతో మెలికలు తిరిగి పోతున్నా
నిర్దాక్షిణ్యంగా నిన్ను ఉపయోగించుకున్న
నా నిర్దయకి ఏమి శిక్ష వేస్తావో వెయ్యి
కానీ ఇప్పటికీ నీ నమ్రత చూస్తేనే 
నా కళ్ళలో చెమరింపు
నిన్ను వ్యధా భరితను చేస్తున్నాననే
నా మదిలోని చిత్రవధ
నిజానికి "నువ్వు" లేకుండా 
"నేను" అనేది ఉందా 
అయినా నా మేధో నిర్ణయాలకు
నా ఉద్విగ్నతలకు 
నా విషాదాలకూ
నిన్ను బానిసను చేసే  హక్కెవరిచ్చారు?
మనసు గాయాలే గోప్పవనుకున్నా  గానీ
నువ్వు భరిస్తోన్న
నన్ను క్షమించకు...!!!!
వ్యధను పట్టించుకోలేదు నేను  
ఈరోజు అలసి సొలసి
వాలిపోతున్న నిన్ను 
ఎలా రక్షించుకోను?
చేయిదాటి పోయిన ఆ ఆ సమయాన్ని మరల ఎలా రప్పించను ?
అన్నీ ప్రశ్నలే 
నిన్ను వేధించి బాధించిన 
నన్ను ఇంకా ప్రేమిస్తూ
ఎందుకిలా నాతోనే ఉంటావో
పిచ్చి  ప్రేమ నీది
ఒక్క మాట మాత్రం చెప్తా విను
నిన్ను నేనెన్ని బాధలు పెట్టినా
కిమ్మనకుండా భరించినందుకు 
నేను వెళ్ళాక నిన్ను మాత్రం
సకల లాంఛనాలతో 
సాగనంపమని నా మరణ
వాంగ్మూలం రాస్తాను
అంతకు మించి 
నిన్ను ఎలా గౌరవించాలో 
తెలియని ఆశక్తురాలిని
నా నిస్సహాయతను 
మన్నించకు
నన్ను మాత్రం ఈ జన్మలో
క్షమించకు ....క్షమించకు ........
...నా దేహానికి ................................ప్రేమతో ....జగతి 
             8.15am july 6th 2011 wednesday 
















Wednesday, June 22, 2011

అతను....

అక్షరాంజలి .....!!!!!



ఆత్మీయంగా  పలకరించాడు 
ఆప్యాయంగా జవాబిచ్చాను 

అరమరికలు లేకుండా మాట్లాడాడు 
అభిమానంగా ఆహ్వానించాడు
కుసలాలు కౌశలాల నుండీ 
జీవన పధాల వరకూ
సాగింది మాటల పయనం
కన్నీటి పొరతో మసకబారుతోన్న
కళ్ళను నవ్వుల నందివర్ధనాలతో ఒత్తి 
సజీవ చిత్రాలెన్నో చూపాడు 
అనురాగపు అంచుల నుండి జరిపడినా
అనుభవాల చేదును మింగినా
అహరహమూ వేధించే ఒంటరితనాన్ని
తపస్సు చేసుకుని 
శిధిల అనుభూతులను 
సిద్ధాన్నంగా భుజించి 
జీవన పోరును జయించి 
తాను కల్ప వృక్షమై
ఎందరికో జీవిక నిచ్చాడు
ఏకాంత సాధన లో
హిమ శిఖరమై ఎదిగాడు
మన్ననలు పొందాడు 
మనసు నిండుగా అతని మాటలే
ఈరోజు వ్యధ శిల అయిన నా మనసును
ఆశల ఉలితో జీవకళా రూపంగా
దిద్ది తీర్చాడు
ఎవరితను? ఎక్కడివాడు?
నా మది వెతలను మరిపించి
మాటలతో ప్రాణం పోసి
నిర్లిప్తమైన హృదయాన్ని
ఉద్దీప్తం చేసాడు
పరిచయలెన్నో ఉంటాయి
ప్రత్యేకమైనవి కొన్నే
జ్ఞాపకాలెన్నో ఉంటాయి 
మధురమైనవి కొన్ని మాత్రమే
ముఖపరిచయాలెన్నో ఉన్నా
బతుకును పరిమళింప జేసేదీ 
సరి బాటను నడిపేదీ
ఇలాంటి ఓ మహద్భాగ్యం 
ఈ రోజు నన్ను కరుణించింది
ఇప్పుడు లోకమంతా
ఆశల వెన్నెల పూలే 
అగుపిస్తున్నాయి......ఆతని మాటలై
సప్త స్వరాలు వినవస్తున్నాయి
ఆతని ఆకాంక్షా గీతంలో.....
నవ నాడులూ 
ఆశా నాదం నినదిస్తున్నాయి
అతని కై కృతజ్ఞతతో 
కైమోడ్పుగా కనులు వాలి పోతున్నాయి....  
వసివాడిన ఆశా లతలు 
పసిడి చివురులు వేస్తున్నాయి....
అన్యమనస్కంగా  ఉన్న మనసుని 
ఆహ్లాద గీతం చేసిన అతనికే 
ఈ అక్షరాంజలి  



 ఈనాడే కనుగొన్న ఓ అరుదైన వ్యక్తికి "మిమిక్రీ  శ్రీనివాస్" కి 

.................................ప్రేమతో....జగతి 4.25pm wednesday 22-06-2011















Saturday, June 18, 2011

ఆరాధన ..


అద్వైతం ......


జీవితం చొచ్చుకు వచ్చిన వారు 
కొంత కాలముంటారు 
మనసు చొచ్చుకు వచ్చిన వారు 
మరువని జ్ఞాపకాలై 
ఎదలో మిగిలి పోతారు 
ఆత్మ చొచ్చుకు వచ్చిన వాడివి
ప్రభూ!.అనవరతం నాలోనే నీవు 
....అద్వైతం మనం ......ప్రేమతో...జగతి  

Wednesday, June 8, 2011

కారాగారంలో శాంతి ....


కారాగారంలో శాంతి ...చెదరని చిరునవ్వు ....
కామేరాల తళుకులు ముప్పిరిగోనలేదు.... 

టీవీ చానెళ్ళు ముట్టడించలేదు
అంతా సవ్యంగానే జరిగింది 
అంతర్జాతీయ శాంతి బహుమతి బహూకరింప బడింది
దశాబ్దాల కృషి ఫలితంగా 
ఎన్నో అడ్డంకులు, నిరసనల నడుమ
శాంతి స్వర్ణ పతకం
ఒక ఖాళీ కుర్చీలో ఉంచబడింది
అవ్వడానికి అది ఖాళీ కుర్చీయే అయినా
అది ఒక శాంతి కాముకుని
మానవ హక్కుల అపర భగీరథుని స్థానం 
శతాబ్ద కాలంలో ఒక ఆసియా దేశానికీ ఇవ్వబడిన 
ఒక శాంతి పురస్కారం 
గ్రహీత గాని అతని తరపు ఎవరు గానీ లేకుండా 
ప్రదానం చెయ్యబడిన చారిత్రాత్మక క్షణమది 
తైన్మేన్ స్క్వేరులో తన శాంతి పోరాటాన్ని 
మొదలిడిన అక్షర యోధునికి
కాలాన్ని కత్తిగా కవాతు చేయించిన 
వాక్ స్వాతంత్ర్య పోరాట సైనికునికి 
ఎందరి అభినందనలో
చీకట్లో తన జైలు గదిలోనికి 
గాలి తెరలు మోసుకోచ్చాయి 
మనిషికి కారాగారం కానీ 
మాటలకు కారాగార శిక్ష లేదని
ప్రజా స్వామిక భావ స్వాతంత్ర్యంతో 
తన దేశం మున్ముందుకు నడవాలని
ఓ రండు చేతులు ఆకాశం వైపు సాచి ప్రార్ధించాయి

సంబరాల తేలి యాడ వలసిన ఆ రోజు
ఉడికించిన కాయ గూరలతో 
మరొక రొట్టెముక్క, మాంసం ముక్క అదనంగా
భార్య  జియా తో కలసి కాపలా వాళ్ళ మధ్య 
విందు భోజనం చేసాడీ అపర సిద్ధార్థుడు 

"శాంతి" వినడానికి  ఎంత చిన్న మాట 
సాధనలో ఎన్నెన్ని యోజనాల దూరం
అయినా ఎన్నటికీ
ఆగనిదీ శాంతి పథమని నిలిచిన
ఒంటరి బాటసారిని చూసి పుడమి పులకరించింది
ఇనుప ఊచలు జేజేలు పలికాయి
మసిబారిన జైలు గోడలు
తప్పక గెలుస్తామన్న భరోసానిచ్చాయి 
చిరునవ్వుతూ వాటితో కరచాలనం చేసాడీ అభిమన్యుడు
తన "విల్లు" సార్ధకం అయిందని 
"నోబెల్" ఆత్మ శాంతించింది
......................................ప్రేమతో.. ...జగతి 

8.50pm.12-12-2010 sunday 


మిత్రులారా లిఉ షీ బో కేవలం మనవ హక్కుల పోరాట వీరుడే కాదు మంచి కవి కూడా ఇతని ఒక కవిత ను కౌముది లో కూడా నా అనువాదాన్ని వేసుకున్నారు కిరణ్ ప్రభ గారు. అతాని కవిత్వం పూర్తిహా ఆంగ్లంలోకి అనువదిస్తున్నారు ఇప్పుడు. అది త్వరలో వస్తుంది. ఇది ఆ రోజు రాసిన నా కవిత మీతో పంచుకుందామని .....ప్రేమతో...జగతి