Wednesday, June 22, 2011

అతను....

అక్షరాంజలి .....!!!!!



ఆత్మీయంగా  పలకరించాడు 
ఆప్యాయంగా జవాబిచ్చాను 

అరమరికలు లేకుండా మాట్లాడాడు 
అభిమానంగా ఆహ్వానించాడు
కుసలాలు కౌశలాల నుండీ 
జీవన పధాల వరకూ
సాగింది మాటల పయనం
కన్నీటి పొరతో మసకబారుతోన్న
కళ్ళను నవ్వుల నందివర్ధనాలతో ఒత్తి 
సజీవ చిత్రాలెన్నో చూపాడు 
అనురాగపు అంచుల నుండి జరిపడినా
అనుభవాల చేదును మింగినా
అహరహమూ వేధించే ఒంటరితనాన్ని
తపస్సు చేసుకుని 
శిధిల అనుభూతులను 
సిద్ధాన్నంగా భుజించి 
జీవన పోరును జయించి 
తాను కల్ప వృక్షమై
ఎందరికో జీవిక నిచ్చాడు
ఏకాంత సాధన లో
హిమ శిఖరమై ఎదిగాడు
మన్ననలు పొందాడు 
మనసు నిండుగా అతని మాటలే
ఈరోజు వ్యధ శిల అయిన నా మనసును
ఆశల ఉలితో జీవకళా రూపంగా
దిద్ది తీర్చాడు
ఎవరితను? ఎక్కడివాడు?
నా మది వెతలను మరిపించి
మాటలతో ప్రాణం పోసి
నిర్లిప్తమైన హృదయాన్ని
ఉద్దీప్తం చేసాడు
పరిచయలెన్నో ఉంటాయి
ప్రత్యేకమైనవి కొన్నే
జ్ఞాపకాలెన్నో ఉంటాయి 
మధురమైనవి కొన్ని మాత్రమే
ముఖపరిచయాలెన్నో ఉన్నా
బతుకును పరిమళింప జేసేదీ 
సరి బాటను నడిపేదీ
ఇలాంటి ఓ మహద్భాగ్యం 
ఈ రోజు నన్ను కరుణించింది
ఇప్పుడు లోకమంతా
ఆశల వెన్నెల పూలే 
అగుపిస్తున్నాయి......ఆతని మాటలై
సప్త స్వరాలు వినవస్తున్నాయి
ఆతని ఆకాంక్షా గీతంలో.....
నవ నాడులూ 
ఆశా నాదం నినదిస్తున్నాయి
అతని కై కృతజ్ఞతతో 
కైమోడ్పుగా కనులు వాలి పోతున్నాయి....  
వసివాడిన ఆశా లతలు 
పసిడి చివురులు వేస్తున్నాయి....
అన్యమనస్కంగా  ఉన్న మనసుని 
ఆహ్లాద గీతం చేసిన అతనికే 
ఈ అక్షరాంజలి  



 ఈనాడే కనుగొన్న ఓ అరుదైన వ్యక్తికి "మిమిక్రీ  శ్రీనివాస్" కి 

.................................ప్రేమతో....జగతి 4.25pm wednesday 22-06-2011















1 comment:

  1. జగతి
    చాల బావున్నాయి
    నీ పోస్ట్లు అన్ని . ఇప్పుడు అందరు
    బాగా ఇంటర్నెట్ సావి లు అయ్యారు. నాలాంటి
    వాళ్ళు
    వున్నారు
    మీలాంటి వారి రచనలు చదవడానికి. ఆందు చేత నీ ఆశ తప్పకుండా నెరవేరుతుంది

    ReplyDelete