Tuesday, June 19, 2012

అలలు (20) 9




1)నిజానికి జీవితం దాని పంధాలో
అది సాగుతుంది 
గెలుపు ఓటమి 
మనం ఆపాదించుకున్న 
అహంకార  భావాలు...

2) ఆలోచనా స్పష్టత 
లేని మానసం 
అద్భుత భావాలనే కాదు
అతి సామాన్య విషయాలను
కూడా  ఆవిష్కరించలేదు .....

3) భక్తి కి ఆధ్యాత్మికతకీ
తేడా తెలియరు కొందరు 
భక్తి ప్రశ్ని౦చని  విశ్వాసం 
ఆధ్యాత్మికత 
ఆత్మ పరిశోధనాత్మక 
ప్రక్రియ .....


4)ఉత్కృష్ట ప్రేమ భావన 
ఒక వ్యక్తి పైన అయితే 
వైయుక్తికం..
దేశం గూర్చి అయిన 
దేశ భక్తి 
ఆదర్శం గూర్చి అయితే 
సిద్ధాంతం 
దేనికైనా ముడి పదార్ధం 
మాత్రం ప్రేమ ...

5)భక్తి ప్రేమ 
రెండు వేరు భావనలు కావు 
ప్రతి భక్తుడూ ప్రేమికుడే
ప్రతి ప్రేమికుడూ
తన ప్రియతమ భక్తుడే 

6)అష్టైశ్వర్యాలు ఉన్నా 
ఇసుమంత  అనురాగం 
ఆస్వాదించే 
హృదయ నిర్మల్యం లేని వాడు 
డొక్కలెండిన పేద వాని కన్న 
మనసెండిన కటిక పేద 

7)ప్రేమ తత్వాన్ని 
బోధిస్తున్నామంటారు
తత్వాలలోని  తార్కికతకు 
గతి తార్కిక వాదాలకు 
అందనిదే ప్రేమ 

8)సంద్రం నీరు ఉప్పన 
వేల కోట్ల వత్సరాల 
మానవ వేదనల 
కన్నీళ్లు 
ఎన్ని నిమాజ్జనమయ్యాయో 
అందులో  మరి 

9)ఒడ్డునే కెరటాలు 
విరుచుకుపడేది 
నట్ట నడి సంద్రం లో 
అంతా ప్రశాంతమే 
అహాల కెరటాలను 
దాటి వెళ్ళిన వానికే 
అంతః శాంతి ఎరుక గలుగుతుంది 

10)మతం నీ అభిమతం 
అది వ్యక్తిగతం 
దాన్ని సామాన్యీకరించలేము 
భక్తి వైయుక్తికం 
అందుకే ఎవరికి వారే 
తటస్థంగా ఉండాలి 
విశ్వ ప్రేమ తో ఎదగాలి 

11)మనో దేహాత్మలను 
అర్పించుకునేదే ప్రేమ 
దానికి నియమ  నిబంధనలు 
లేవు 
గుణ దోషాలు అంటవు

12)పుణ్యం , పాపం 
వేరు వేరు కావు 
నీవు చేసిన పుణ్యం మరొకరికి 
పాపకార్యం కావచ్చును 
అందుకే ఎవరి పుణ్య ఫలం వారిది 
ఎవరి పాప ఫలం వారిదే 

13)ప్రేమ బాధనిస్తుంది 
ఆ బాధను ఓర్చుకునే
ఒరిమినీ ఇస్తుందీ
అంటే ప్రేమ బాధనివ్వదన్నారు కొందరు 
నిరీక్షణ , విరహం 
మధుర బాధను 
ప్రేమ లో అనుభూతించని 
వారున్నారా చెప్పండి? 

14)ఎంతటి సింధువైనా
ఒక బిందువుతోనే ఆరంభం 
అంటారు నిజమే 
ప్రేమ అంతే 
వ్యక్తిగతంగా మొదలై 
విశ్వ ప్రేమ సాగరంగా 
విస్తరిస్తుంది

15)అష్ట కష్టాలు 
పడుతోన్నా 
ఇంకా జీవితం సాగించేవారు 
నిజమయిన  జీవన 
ప్రేమికులు 
జీవన మర్యాదను  
ఎరిగిన  వారు 

16)సహజంగా జీవించలేని వారు 
అసహజత్వపు 
మాస్కులు తొడుక్కుని 
బతుకంతా 
దుర్భారంగానే గడుపుతారు
కడకు మరణమూ దుర్భరమే  వారికి  

17)ప్రేమను జీవించలేని వారు 
ఆత్మీయతను పంచలేని వారు 
తమకు తామే 
ఆత్మ ద్రోహం చేసుకుంటూ
చుట్టు పక్కల వారిని  
కూడా సుఖపడనివ్వరు

18)కన్నీళ్లను ద్వేషిస్తారు 
కొందరు ...
ఆనందమైనా , 
ఆక్రోశ మయినా 
అశ్రువులకంటే వ్యక్తీకరించగల 
భాషా శక్తీ మరి 
దేనికీ లేవు 
సృష్టిలో ఇక రావు 

19)విరహం లో వేగుతోన్న 
మనసుకు 
హరివిల్లూ శూన్యంగానే  
అగుపిస్తుంది 
ప్రియతముడు దరి
జేరిన క్షణాన కళ్ళు మండే 
కట్టెల పొగలోనే
హరివిల్లు విరుస్తుంది 

20)దారీ తెన్నూ 
లేని జీవితం అంటాము 
మనకు మనమే 
దారులు వేసుకున్నంత 
అహం మనలో 
మనం నడవాల్సిన  దారి 
ఎప్పుడో వేసి ఉందని 
దాన్ని కన్నుక్కోవడమే 
మన లక్ష్యమని ఎప్పుడు 
తెలుసుకుంటామో? 
.....................................ప్రేమతో ...జగతి 12.45 pm 19th june Tuesday 2012 








































No comments:

Post a Comment